Monday, September 27, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

వోక్స్ వేగన్ కుంభకోణంలో మంత్రుల, అధికారుల ప్రమేయం యేమీ లేదట--అలా అని సీబీఐ కేసు దాఖలు చేసిందట.

మన బొచ్చె చేపలోడు 11.87 కోట్లని పట్టుకెళ్లి వశిష్టవాహన్ ఖాతాకి చెల్లించి, తరవాత "సొమ్ములు పోనాయి....యేటి సేత్తాం!" అన్నాడు. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వానికి వోక్స్ వేగన్ తో గానీ, వశిష్టవాహన్ తో గానీ వొప్పందమేమీ లేదు.

దీనికి ముందే మరో పన్నెండు మంది తో జర్మనీ వెళ్లి వచ్చాడు. అప్పటికే కంపెనీ నించి తొలగించబడిన షూష్టర్ గురించి వీళ్లకి తెలీదుట!

ప్రత్యేకాధికారి రాఘవేందర్, ఏపీఐఐసీ ఎండీ ఎల్వీ సుబ్రహమణ్యం లని ప్రాసిక్యూట్ చెయ్యడానికి సిబీఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరితే, ఇవ్వకపోగా కనీసం జరిమానా విధించడానిక్కూడా నిరాకరించింది--వై ఎస్ సర్కారు! కానీసం శాఖాపరమైన విచారణకి కూడా అంగీకరించలేదు మరి!

ఇంకెందుకీ దర్యాప్తులూ, కేసులూ?

బ్యాంకింగు సంస్థలు వెర్రితలలు యెలావేస్తున్నాయి అనడానికి ఓ వుదాహరణ, హైదరాబాదులో ఎస్ బీ ఐ స్థాపించిన "కుబేరుల శాఖ"!

అంటే యేమీ లేదు--కనీసం కోటి రూపాయలతోనే అక్కడ ఖాతా మొదలు పెట్టాలట యెవరైనా. అది కూడా మనం వెళితే చెయ్యరు.....బ్యాంకువాళ్లే మనదగ్గరకి రావాలట.

ఖాతాదారులు వేచి వుండేందుకు రాచరిక హోదా వుట్టిపడేలా సోఫాలూ, ఫ్రిజ్, కూల్ డ్రింకులు, పళ్ల రసాలు, నీటి సీసాలు, టీ, కాఫీ, అన్నీ వుంటాయట. ప్రముఖ వాణిజ్య పత్రికలూ వుంటాయట. ఇంకా సెమినార్ హాలూ, ఇంటర్నెట్, ఫాక్స్, ఫోను, విడియో కాన్‌ఫరెన్స్ హాలూ, వున్నాయట.

ఇంకా, పదిహేను కాబిన్లలో లాకర్లు వుంటాయట--యేదైనా ఫంక్షన్ కి వెళ్లాలంటే, లాకర్లలోని ఆభరణాలు తీసుకొని, ముస్తాబవ్వడానికి డ్రెస్సింగ్ రూములు కూడా వుంటాయట!

........ఇంకా చాలా చాలా వున్నాయట.

బుధ్ధున్న కోటీశ్వరుడెవరైనా ఆ శాఖకి స్వయం గా వెళ్లి ఈ సౌకర్యాలన్నీ అనుభవిస్తాడా?

మామూలుగా యే బ్యాంకు శాఖలోనైనా, యెంత పెద్ద కంపెనీ ఖాతా వున్నా, లావాదేవీలకోసం తమ సంస్థ లోని అతి చిన్న గుమాస్తానే పంపిస్తాయి. వాడినే ఈ బ్యాంకులు ఆ సంస్థ జనరల్ మేనేజరో, సీ ఈ వో నో అన్న లెవల్లో ట్రీట్ చేస్తాయి. మరి ఈ భేషజాలెందుకు?

అమెరికాలో బ్యాంకు శాఖలకి వెళ్లేవాళ్లే తక్కువ. వెళ్లేవాళ్ల కోసం అక్కడ చక్కని యేర్పాట్లు వుంటాయి. పిల్లలకి ఫ్రీ గా చాక్లెట్లూ, వేఫర్లూ వగైరా వుంచుతారు!

మన బ్యాంకులు కూడా, తమ శాఖలనన్నింటినీ కనీసం ఏసీ చేయించి, పెన్షనర్ల/గంటలతరబడి వేచి వుండే వాళ్ల  కోసం కాస్త టీ నీళ్లు పొయ్యగలిగితే, యెంతబాగుంటుంది? 

బోగస్ సంస్థలు వెర్రి జనాలని మోసాలు చేస్తూనే వున్నాయి.

యేలూరు, నరసిం హారావుపేటలో, యేడాది క్రితం "తేజ మార్కెటింగ్ అండ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్" పేరుతో సంస్థ స్థాపించి, ప్రతీ వ్యక్తి దగ్గరా రూ.549/- వసూలు చేసి, సంవత్సరం తరవాత మీకు యేకం గా "లక్ష" రూపాయలు ఇస్తాము అనీ, ఒకవేళ ఆ వ్యక్తి మరణిస్తే తక్షణం లక్ష చెల్లిస్తామనీ చెపితే, జనం యెగబడ్డారట.

దాదాపు 3 వేల మంది నించి వసూళ్లు చేసి, 20 నించి 30 లక్షలదాకా అందరినీ ముంచి, బోర్డు తిప్పేశాడట నిర్వాహకుడు!

అసలు ఈ సంస్థ యే నిబంధనల క్రింద, యే లైసెన్సులతో వ్యాపారం ప్రారంభించింది అని పట్టించుకోని అధికారులూ, పోలీసులూ, ఇప్పుడు తీరిగ్గా, ఛీటింగ్ కేసు తో పాటు డిపాజిటర్స్ ఆక్ట్, ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారట!

సామాన్య వ్యక్తి యెవరైనా బంగారం తాకట్టు పెట్టుకొని, తెలుసున్నవాళ్లకి అప్పిస్తే, "పాన్ బ్రోకర్ లైసెన్స్" లేదు అని కేసులు పెట్టిన వుదంతాలు నాకు తెలుసు.

అలాంటిది, ముథూట్ ఫైనాన్స్, మణప్పురం గోల్డ్ సంస్థలు గత రెండేళ్లుగా తమ వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా యెలా పెంచుకోగలుగుతున్నాయి? వాటి నిర్వహణ మాటేమిటి? అవి బోర్డు తిప్పేస్తే జరిగే పరిణామాలేమిటి? అని యెవరైనా ఆలోచిస్తున్నారా?

No comments: