అవీ, ఇవీ, అన్నీ
MGF.....EMAAR.....APIIC.....కొన్ని వేల యెకరాలు.....కొన్నివేల కోట్ల కుంభకోణం.....ఇవన్నీ అందరూ రోజూ చదువుతున్న, వింటున్న మాటలే.
తాజాగా, భారత సొలిసిటర్ జనరల్ నుంచి, ఏపీఐఐసీ నియమించిన నిపుణుల కమిటీ వరకూ--ఇది నిజం గా దోపిడీయే అని ముక్తకంఠం తో చెపుతున్నారట. అయినా మన ప్రభుత్వం మీనమేషాలు యెందుకు లెక్కిస్తోందో--అంటున్నారు.
మన రాజకీయులు, "సభా సంఘాన్ని వేయాలి", "సీబీఐ చేత దర్యాప్తు చేయించాలి", "సిటింగ్ జడ్జ్ చేత విచారణ" వగైరా అంటారు.
ఇంకా విచారణలెందుకో! ప్రభుత్వం ఇప్పుడు కేసులు పెట్టకుండా, ఆనక తీరిగ్గా 'విచారిస్తూ' కూచుంటుందేమో! అదేకావాలి దోపిడి దొంగలకీ, వాళ్ల తైనాతీలకీ!
వై ఎస్ ఆర్, చంద్రబాబు, ఐశ్వర్యరాయ్, ఎన్ టీ ఆర్--వీళ్లంతా రెండేళ్ల క్రితం గ్రూప్-4 వుద్యోగాలకోసం ఆన్ లైన్ లో మన ఏపీపీఎస్సీకి దరఖాస్తు చేశారట!
ఇంకా అనేకమంది సినీతారలూ, రాజకీయ నాయకులూ, కొన్ని పువ్వులూ, ప్రకృతి దృశ్యాలూ కూడా దరఖాస్తు చేశారట. ఫీజు యెంత కట్టారు? అని అడిగిన చోట, "నీకూ బే....బే, నీ ఫీజుకీ బే....బే...." అని వ్రాశారట!
మొత్తం వచ్చిన 12 లక్షల దరఖాస్తుల్లో, 1,60,000 ఇలాంటి దరఖాస్తులేనట!
ఇంతకీ, యెవడో సాఫ్ట్ వేర్ అమ్మితే, మన పిచ్చి పుల్లయ్య-వేమవరం అధికారులు, దాన్ని పరిశీలించకుండానే కొనేసి, వాడేశారట! (అంతేనో--వాళ్లకి ముట్టాల్సింది ముట్టి, మనం పిచ్చి పుల్లయ్యలమో!)
దరఖాస్తులన్నీ సరిగ్గా క్రోడీకరించడానికి పాపం సిబ్బంది నిజంగా చమటోడ్చారట.
ఇప్పుడు, ఫీజుకి సంబంధించిన చలానా నెంబరు వుంటేనేగానీ, దరఖాస్తు సమర్పణ అవకుండా మార్చారుటలెండి. ఇక చూద్దాం.
మొన్న బిల్ గేట్స్ యేమన్నాడో విన్నారా?
ఇప్పటికే తమ ఫౌండేషన్ కి ఇచ్చిన 1,26,000 కోట్లు పోగా, మిగిలిన 2,38,000 కోట్ల ఆస్థిని కూడా నా పిల్లలకి ఇవ్వను--అన్నాట్ట. కొంచెం మొత్తం మాత్రమే ఇస్తాను--నా ఆస్థి అంతా ప్రజాసేవకే అనికూడా అన్నాట్ట.
అన్నట్టు, ఖైరతాబాద్ వినాయకుడి వెరయిటీ చూశారా? అసలు తలకి చెవుల వెనుక ఓ రెండుతలలూ, కిరీటం లోంచి చెరోప్రక్కా రెండుతలలూ మొలిచి, పంచ ముఖుడు అయ్యాడు!
నిడదవోలు, సమిశ్రగూడెం కాలువలో నిమజ్జనం సమయంలో గల్లంతయిన ఓ కుర్రాడి మృతదేహం 21-09-2010 న లభించిందట. స్కోరు ఒకటి పెరిగింది.
మన జిల్లాల్లో ఆథార్, రాజధాని లో ఆథార్--యేమయ్యాయో గానీ, తొలి ఆథార్ సంఖ్యని 29 న మహారాష్ట్రలోని నందూర్ బార్ జిల్లా, షహడా గ్రామ గిరిజనులకి కేటాయిస్తారట మన్మోహన్ సింగ్. సోనియా కూడా ఈ కార్యక్రమం లో పాల్గొంటారట. ఆ గ్రామ ప్రజలందరికీ ఆ రోజున 12 అంకెల గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డులు అందజేస్తారట.
....................................................................................................................................................................
23-09-2010 న హైదరాబాదు ఎక్స్ ప్రెస్ కి తప్పిన ముప్పు--చెన్నై హైదరాబాదు ఎక్స్ ప్రెస్ నాయుడుపేట చేరేసరికి, ఇంజన్ వెనుక రెండో బోగీ చక్రం బ్రేకు పట్టేసి మంటలు లేచాయట. చైన్ లాగి ఆపేస్తే, తరవాత గూడూరులో మరమ్మత్తులు చేసి పంపించారట. (ఆ మధ్యలో యేమిచేశారో పేపర్లో వ్రాయలేదు)
....................................................................................................................................................................
23-09-2010 నే, రాష్ట్రపతి కోల్కత్తా నించి ఐజ్వాల్ ప్రయాణిస్తున్న విమానం మూడు నిమిషాలపాటు యే రాడార్ లోనూ కనిపించలేదట. ప్రత్యామ్నాయ యేర్పాట్లు చేస్తూండగా తిరిగి కనిపించి, అధికారులు ఊపిరి పీల్చుకున్నారట!
No comments:
Post a Comment