Sunday, September 19, 2010

కబుర్లు


అవీ, ఇవీ, అన్నీ

శ్రావణ భాద్రపద మాసములు వర్షర్తువు--వర్షములు (వానలు) బాగుగా కురియును..........

యెక్కాలపుస్తకం లో యే ఋతువులో యేమిజరుగుతుందో వివరించే భాగంలోది ఇది.

ఈ కాలం లో బుధ్ధున్నవాడెవడూ ఇల్లు కట్టడం మొదలు పెట్టడు.

ఓ ప్రక్కన సిమెంటు కంపనీలు వారం క్రితం బస్తాకి ఓ ముఫ్ఫై రూపాయలూ, ఇప్పుడు మళ్లీ ఓ నలభై రూపాయలూ పెంచి, 200 దాటించాయి.

మన సోకాల్డ్ బ్యాంకింగ్ నిపుణులు మాత్రం, మొన్న రిజర్వ్ బ్యాంక్ రెపో/రివర్స్ రేట్లు ఓ పావలా, అర్థ పెంచగానే, "నెలాఖరు దాకా ఋణాలమీద వడ్డీలు పెరిగే ఛాన్స్ లేదు--ఇప్పుడే ఇళ్లు కట్టేసుకోండి!" అని సలహా ఇస్తున్నారు.

అసలు ఇళ్లు కట్టాలనుకొనేవాళ్లు (కొనుక్కునేవాళ్ళు) యెన్ని చూసుకోవాలి?

వీళ్ల దృష్టిలో వాళ్లందరూ అన్నీ సిధ్ధం చేసేసుకొని, బ్యాంకులు వడ్డీ రేట్లు ఓ పావలా యెప్పుడు తగ్గిస్తాయా అని గోతికాడ నక్కల్లా యెదురుచూస్తూ వుంటరన్నమాట. (ఈ లోపల పుణ్యకాలం కాస్తా కుక్కెత్తుకుపోదూ!)

దటీజ్ అవర్ ఎక్స్ పర్ టైజ్!

ఇక బ్యాంకులు, ఈ పండగల సీజన్ పూర్తయ్యేవరకూ, గృహ వగైరా ఋణాలమీద "టీజర్" రేట్లు కొనసాగుతాయంటున్నారు. (అంటే సామాన్యులందరూ పండగలు మానేసుకొని బ్యాంకుల చుట్టూ, కడుతున్న ఇళ్ల చుట్టూ తిరగాలనా?)

నిజానికి ఈ విధానాలవల్ల బాగుపడుతున్నది రియల్ ఎస్టేట్ వాళ్లు మాత్రమే!

ఇక ప్రణబ్ ముఖర్జీగారు, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి 'యెలాంటి చర్యలైనా సరే' తీసుకోవాలని సలహా ఇస్తే, మన దువ్వూరివారు, పెంచింది ఓ పావలా, అర్థా!

అయినా ద్రవ్యోల్బణం దిగొస్తున్న దాఖలాల్లేవు. అహార ద్రవ్యోల్బణం 11-12 నించి దిగడం లేదు. ఇక ఇప్పుడు ఈ పండుగల రూపం లో కాయగూరలూ, పప్పులూ, నూనెలూ, బియ్యం మొదలైనవాటిలో జరిగే వృధా వల్లా, ఈ వర్షాల వల్లా, ఇప్పుడప్పుడే పెరగడం మానుతుందనుకోవఖ్ఖర్లేదు.

వృధ్ధి రేటు మాత్రం, 9 వరకూ, 8.5 వరకూ, కనీసం 7.50 వరకూ వుంటుందని అంచనాలు!

పండగరోజుల్లో, రైళ్లలో, బస్సుల్లో రద్దీ గురించి చెప్పఖ్ఖర్లేదు. 295/- రూపాయల స్లీపర్ టిక్కెట్టుని 900/- కీ, 499/- రూపాయల థర్డ్ ఏ సీ టిక్కెట్ కి 1800/- నించి 2000/- రూపాయలూ పెట్టి తీసుకొన్నారట--మొన్న పండగకి.

వోల్వో బస్సుల్లో 800/- నించి 850/- టిక్కెట్టుకి 1200/- నించి 1500/- వరకూ చెల్లించారట.

ఈ-టిక్కెట్లని సరిగ్గా చెక్ చెయ్యకపోవడం తో, దళారులు ఒకే టిక్కెట్టు మీద ఆరుగురికి బుక్ చేసి, అందరికీ జిరాక్సులు ఇచ్చి, తమకు తోచిన ధర వసూలు చేస్తున్నారట!

ప్రత్యేక రైళ్లలోకూడా, ప్రకటించిన గంటలోపే అన్ని టిక్కెట్లూ 'హూష్....కాకీ' అయిపోతున్నాయట!

వచ్చే పండగల్లో యెలా వుంటుందో?

మన రైల్వేలు ఇక బాగుపడతాయంటారా?

రజనీకాంత్ సినిమాకి తమిళ పేరు వుంటే గానీ కుదరదు అని "యందిరన్" అనే పేరుతో విడుదల చేస్తున్నారట. తెలుగులో "రోబో" పేరుతోనే విడుదల అవుతుందట.

కమ్ముల శేఖర్ మాత్రం, "నాకు తెలుగు పేరు తట్టలేదు అందుకనే నా సినిమా పేరు ఇంగ్లీషులో పెట్టాను" అంటున్నాడు.

యెంత భాషాభిమానమో (వాడికీ మనకీ కూడా)!

No comments: