Wednesday, October 13, 2010

కబుర్లు
అవీ, ఇవీ, అన్నీ


"మమతాదీ చెప్పిందీ......"--యెదురెదురుగా వస్తున్న రైళ్లు 'ఒకే పట్టాలపై' రాకుండా నిరోధించే పరికరం 'సిధ్ధం' అయిందనీ, దీంతోపాటు 'అత్యాధునిక ' సిగ్నలింగ్ వ్యవస్థని త్వరలో ప్రవేశ పెట్టబోతున్నాము అనీ!

(ఇంతకు ముందు మంత్రులు వీటి పై దృష్టి పెట్టక పోవడం వల్లనే పాత 'మౌలిక వసతులతో' అయినా 'సమర్థవంతం గా' నెట్టుకు వస్తున్నాము--అని కూడా అందట! ఇంకా, వచ్చే రెండేళ్లలో రైల్వేలు 'స్వయం సమృధ్ధిని ' సాధిస్తాయట! ఈ లోపల యెలక్షన్లేమీ లేవే?)

ఓ ముఫై మూడేళ్ల క్రితం, మధు దండావతే గారు 'సామాన్యుల సీట్లకి ' కూడా, కుషన్లు వేయించి పుణ్యం కట్టుకున్న తరవాత, రైల్వేలలో యేమైనా 'అభివృధ్ధి ' జరిగిందా? అప్పటినించీ యెన్ని "యాంటీ కోలిజన్ డివైసెస్" గురించీ, "అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థల" గురించీ యెన్ని ప్రకటనలు వెలువడలేదు? యెన్ని కోట్లు ఖర్చు పెట్టారు? 

అంతకు ముందు క్రిందికి వాలే సిగ్నల్ "రెక్కలని" దుండగులు బలవంతం గా క్రిందికి వాల్చేస్తున్నారనీ, అందుకని రెక్కలని "పైకి" లేపే వ్యవస్థని ప్రవేశపెట్టామనీ, సిబ్బంది అందరికీ "వాకీ టాకీ" లని ఇచ్చామనీ, ఓ లైన్లో యేదైనా రైలు ఆగి వుంటే, వచ్చే రైలు "ఆటోమేటిగ్గా" లూపు లైన్లోకి వెళ్ళే వ్యవస్థని ప్రవేశపెట్టామనీ--ఇలా యెన్ని చూడలేదు?
  
ఇదివరకు, విజయవాడ స్టేషన్ లో 5, 6 & 7 ప్లాట్ ఫారాలమీదకే ముఖ్యమైన "పెద్ద" రైళ్లన్నీ వచ్చేవి--20 నిమిషాల నుంచీ 30 నిమిషాల వరకూ ఆగేవి! ఇంక 1, 2, 3, 4 ప్లాట్ ఫారారాలమీద ఆగే చిన్నా చితకా ఎక్స్ ప్రెస్ లూ, ప్యాసింజరులూ ఆగే టైము దైవాధీనం! 

అందరూ 5, 6 ప్లాట్ ఫారాలమీదున్న క్యాంటీన్ కి వెళ్ళి, పొగలు కక్కుతున్న ఇడ్లీ, వడా, దోశా, వుప్మా, వెజిటబుల్ పలావ్ వగైరా లని తృప్తి తీరా తిని, పార్సెళ్లు కట్టించుకొని తమవాళ్లకి తీసుకెళ్లే వారు! ప్రయాణం ఆలస్యమయ్యిందని యెవరూ యేడిచేవారు కాదు! (నాన్-వెజ్ రెస్టారెంటు కూడా వుండేది)

ఇప్పుడు 5, 6 ల్లో ఆ క్యాంటీను వుందో లేదో గానీ, తినడానికీ, పార్సెళ్లకీ అంత టైము వుండటం లేదు--'దురంతో' లు వగైరా పుణ్యమా అని. ఇక 1 నుంచి 4 లో, అర్థ రాత్రి కూడా, యెప్పుడో మధ్యాహ్నం వేసిన ఇడ్లీలూ, దోశలూ, వడలతో సరిపెట్టుకోవలసి వస్తోంది--అది కూడా తక్కువ టైములో 'సాహసం' చెయ్యగల వాళ్లకే!

మమతాదీ! మరింకేం? 22వ శతాబ్దం లోకి వెళ్లిపోదామా?

"మన దేశం.......విప్లవంలో.....ముందడుగు....! (ట)"

రాష్ట్రం లో 6 వేల పంచాయితీలు వచ్చే 6 నెలల్లో "ఈ-పంచాయితీ"లుగా మారబోతున్నాయట! ప్రతీ పంచాయతీనీ "ఆన్ లైన్" చేసి, "ఇంటర్ నెట్" సౌకర్యం కల్పిస్తారట! కేంద్రం ఇందుకు ముందుకు వచ్చిందట!

మరింకేం? ప్రభుత్వమూ--గుత్తేదారులూ--సలహాదారులూ--టెండర్లూ--కోట్ల కోట్లూ--మమూలే!

ఇంతకీ "బొచ్చె" వారూ--మనకేటి?

రాష్ట్రం లో మొత్తం 3800 జూనియర్ కళాశాలలు వుంటే, అందులో ప్రభుత్వ జూనియర్ కళాశాల (ప్ర జూ క) లు 804 ట. వీటికి బోధనా సిబ్బంది 12 వేల మంది వుండాల్సి వస్తే, వున్నది 5,700 మందేనుట.

అందుకేనేమో--వాటిల్లో ఈ యేడాది "ఒక్క విద్యార్థీ చేరని" సెక్షన్లు 321 అయితే, పది మంది లోపు చేరినవి 100 సెక్షన్లట!

మరి లెఖ్ఖలెలా సరిపెడతారో!

No comments: