Friday, October 15, 2010

కబుర్లు

అవీ, ఇవీ.........!


కామన్వెల్త్ క్రీడలు ముగిశాయి. మనవాళ్లు పతకాలు శతకం దాటించి, రెండో స్థానం లోకి రావడం అత్యంత ముదావహం!

సమాప్తి వుత్సవాలు కూడా చాలా బాగున్నాయి. కానీ నాకు 2010 మంది పిల్లల చేత విన్యాసాలు చేయించి, వాళ్ల నెత్తిమీదనించి రంగులు గుమ్మరించి, మధ్యలో అశోక చక్రాన్ని వుంచి, దాని చుట్టూ "అక్కడక్కడా" కాషాయ, ఆకుపచ్చ రంగులని చల్లించడం--నచ్చలేదు.

వీటిని ఇంత విజయవంతం చెయ్యడానికి శ్రమించిన వారందరికీ "హ్యాట్స్ ఆఫ్!"

1986 లో, ఓ పోర్టబుల్ బ్లాక్ & వైట్ టీవీ కొనుక్కున్న తరవాత, ఒలింపిక్సేననుకుంటా--బ్యాంకుకి సెలవుపెట్టి మరీ చూశాను. మళ్లీ ఇన్నేళ్ల తరవాత (వుద్యోగం వదిలెయ్యడం వల్ల) అప్పట్లో లేని కొత్త కొత్త క్రీడలతోసహా చాలా వాటిని చూడగలిగాను. 

1982 లో రంగులతో ఆవిర్భవించిన మన దూరదర్శన్, అప్పటి నించీ పరిణతి చెందుతూ, ఇప్పుడు చక్కగా క్రీడలని 
చూపించగలగడం కూడా--చెప్పుకోతగ్గది. వారికి కూడా నా జోహార్లు! 

జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (JNNURM) క్రింద గుజరాత్ కి 7,998 కోట్లు ఇస్తే, ఆ రాష్త్రం కేంద్రప్రభుత్వం (అంటే.....తన) పేరు తలుచుకోడం గానీ, కనీసం ఆ పథకం గుర్తునైనా కనపడనివ్వడం లేదు అని భోరుమన్నాడట--ఓ యెలక్షను మీటింగులో మన జైపాల్ రెడ్డి!

అంటే--కృతఙ్ఞతా పూర్వకం గా యే రాష్ ట్రమైనా, 'కాంగ్రెస్ ని గెలిపించండి ' అని చెప్పాలా? అలా చెపుతారని ఆశించే నిధులిస్తోందా కేంద్రం? యేమో!

ఈ సంగతి విన్నారా

మన కలకత్తా హైకోర్టు ఇప్పటికీ "బ్రిటిష్ రాణి" అధీనం లోనే వుందట!

నిజమా?.......మనకు స్వతంత్రం వచ్చి.......? అని అడగకండి.

ఈ హైకోర్టుని--భారత ప్రభుత్వం యేర్పాటు చెయ్యలేదు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం కూడా యేర్పడలేదు.....బ్రిటిష్ రాణి వ్రాసిన "అధికారిక లేఖ" ప్రకారమే యేర్పడింది!

అందుకని, తాము కేంద్రీయ సమాచార సంఘం పరిధిలోకి రాము--అని ఆ కోర్టు ప్రజా సమాచార అధికరి ఇమ్రాన్ హఫీజ్ అనే ఆయన ఓ గొప్ప "లా పాయింటు" లేవనెత్తాడట.

అప్పటి ప్రథాన సమచార కమీషనర్ వజహత్ హబీబుల్లా, "మరి మీకు జీతాలు ఆ రాణి ఇవ్వడంలేదు కదా? భారత సంచిత నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది కదా?" అంటే, చచ్చినట్టు అంగీకరించారుట!

రైళ్లు--

09-10-2010 న ఈస్టుకోస్టు డివిజన్ నించి కొండపల్లి కి బొగ్గును తీసుకెళుతున్న గూడ్స్ రైలు యేలూరులో ఆగి వుండగా, బ్రేకు నించి 6వ వ్యాగన్ లో పొగలు వచ్చాయట. గమనించకుండా రైలు వెళ్లిపోయి వుంటే, గాలికి మంటలు చెలరేగి, బొగ్గు అంతా దగ్ధం అయ్యేదేమో అని గార్డు చెప్పారట.

అదే రోజున--బీహారులోని ఖతియార్ జిల్లలో ఖైరా లో ఓ ఆటో రైల్వేగేటు దాటుతూండగా, 100 కి మీ స్పీడులో వస్తున్న గౌహతి-న్యూ ఢిల్లీ రాజధాని ఢీకొట్టడం తో, ఓ చిన్నారి, ఇద్దరు మహిళలతో సహా 8 మంది మృతి చెంది, దేహాలు చెల్లా చెదరుగా ట్రాక్ పై పడ్డాయట. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయట. మమతాదీ బాధిత 'కుటుంబాలకి ' 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారట! 

No comments: