అవీ, ఇవీ, అన్నీ
విన్నారా?
చిలుకూరు బాలాజీని "సాఫ్ట్ వేర్" బాలాజీ అనీ, "వీసా" బాలాజీ అని అంటున్నారు.
ఈ ఆలయ ధర్మకర్త దీన్ని దేవాదాయ శాఖకి ఛస్తే అప్పగించనని కచ్చేరీ (కోర్ట్) లలో దెబ్బలాడుతున్నాడు. యెందుకివ్వాలి? డాలర్ల పంట పండుతుంటే--అని కొంతమంది అంటారు.
ఒకవేళ అప్పగిస్తే, స్వామి మహిమలన్నీ గల్లంతవుతాయని ఆయన నమ్మకమేమో--అని కొంతమంది అంటారు.
చెన్నైలో అన్నానగర్ లో "క్రికెట్ " గణేశుడి గుడి వుందట. క్రికెట్ పాడ్లూ గట్రా కట్టుకున్న 10 తలల వినాయకుడి విగ్రహానికి చెరో వైపూ, బౌలర్ వినాయకుడూ, బ్యాటర్ వినాయకుడూ వున్న విగ్రహాన్ని పూజిస్తారట--క్రికెట్ లో భారత్ విజయం కోసం!
కర్ణాటక లోని వుత్తర కన్నడ జిల్లాలో రెండు వందలేళ్లనాటి "ఖప్రీ " ఆలయం లో అదే పేరుతో వున్న దేవుడికి, 'నాలుగు పెగ్గుల నాటు సారా, సిగరెట్లూ' నైవేద్యం పెడితే చాలు--అంతా ఆయనే చూసుకుంటాడట.
జం షెడ్ పూర్ లోని కల్లూ బాగన్ లో ఓ దర్గాలో "మిస్కిన్ షా" కి ఓ దరఖాస్తిచ్చేస్తే, అంతా ఆయనే చూసుకుంటాడని 1930 నించీ నమ్మకమట. అక్కడున్న రావి, మర్రి చెట్లకి అర్జీలు వ్రేళ్లాడుతుంటాయట.
అరుణాచల్ ప్రదేశ్ లోని సేల పాస్ దగ్గర ఒకప్పటి సైనికుడూ, 1962 చైనా యుధ్ధం లో వీరోచితం గా పోరాడిన "జస్వంత్ సింగ్ రావత్" కి జస్వంత్ బాబా పేరుతో గుడి కట్టారట. ఈ బాబాకి "సమోసా" నైవేద్యం పెట్టి, యుధ్ధానికి వెళితే విజయం వరిస్తుందట!
(పైవన్నీ ఈనాడు ఆదివారం లో వచ్చినవే!--అన్నట్టు ఈనాడు వారు తమ నమూనా ప్రకటన--5వ వివాహ....నుంచి "5వ" ని తొలగించారు! సంతోషం)
మొన్న 03-10-2010 న యేలూరులో నిర్వహించిన ఎస్ కే డీ ఆర్ అర్థ శహస్రాబ్ది పట్టాభిషేకాల్లో, ఆచార్య కొలకలూరి ఇనాక్ "తెలుగంటే, తేనెజల్లులు కురిపించే మేఘం" అన్నారట.
సహస్రావధాని కడిమెళ్లవారు మాట్లాడుతూ--రాజ రాజ నరేంద్రుడి పట్టాభిషేకమై 1000 యేళ్లు అయిన సందర్భం లో ప్రభుత్వం మహోత్సవాలు నిర్వహించాలి--అన్నారట!
గీతా రెడ్డి కి వినిపించిందో, లేదో?
నేనిదివరకే అన్నాను--ఇక్ష్వాకుల దగ్గరనించీ, శాతవాహనుల దగ్గరనించీ, చేర, చోళ, పాండ్య, పల్లవ రాజులందరికీ ఇలాంటి (చివర సున్నాలు వచ్చే 'అబ్దుల ') వుత్సవాలు నిర్వహిస్తారా? అని.
చేస్తే మంచిదే కదా--జనాలకి కోట్లే కోట్లు!
"తృటిలో తప్పిన"......లు
రైళ్లు :
మొన్న 05-10-2010 న సికింద్రాబాద్-గుంటూరుల మధ్య నడిచే "గోల్కొండ" ఎక్స్ ప్రెస్ లో, బ్రేక్ బైండింగ్ జామ్ కావడం వల్ల పొగలొచ్చి, వరంగల్-చింతపల్లి ల మధ్య కాసేపు ఆగిపోతే, భీతిల్లిన ప్రయాణీకులు దిగిపోయి, పరుగులు పెట్టారట. మరమ్మత్తులయ్యాక, ఓ పావుగంట తరవాత మళ్లీ బయలుదేరిందట.
చింతపల్లి స్టేషన్ ఇంకా రాకుండానే, యే సీ బోగీ క్రింద వుండే డైనమో బెల్ట్ తెగిపోవడం తో, మరోసారి నిలిచిపోయిందట. మరెప్పుడు బయలుదేరిందో తెలీదు.
విమానాలు :
మొన్న 02-10-2010 న ఎయిరిండియా కి చెందిన కొచ్చి-కొజికోడ్-రియాధ్ విమానం కొజికోడ్ నించి బయలుదేరిన అరగంట తరవాత కేబిన్ లోంచి పొగరావడం గమనించిన పైలట్ అప్రమత్తమై, కొచ్చిలో దింపి, అందులో వున్న 197 మంది ప్రయాణికులనీ, 12 మంది సిబ్బందినీ క్షేమం గా ఖాళీ చేయించి, మరో విమానం లో వాళ్లని రియాధ్ పంపించారట.
No comments:
Post a Comment