Tuesday, October 19, 2010

కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

వుత్తమ చిత్రం గా నంది అవార్డు తెచ్చుకున్న "సొంత ఊరు", వుత్తమ నటి తీర్థ, వుత్తమ సహయనటుడూ వుత్తమ మాటల రచయితా ఎల్ బీ శ్రీరాం--చదువుతుంటే ఈ సినిమా యెప్పుడు చూస్తానో అనిపించింది. తీర్థ కొత్త అమ్మాయి, ఎల్ బీ శ్రీరాం పాతవాడే అయినా, గెటప్ బాగుంది--పాత్రే కనబడేలా--వుచ్చారణా పధ్ధతి మార్చాడో లేదో. ప్రక్కనే తనికెళ్ల భరణిని చూస్తే మాత్రం, ఇలాంటి గుర్తు పట్టే ముఖాలని ఇలాంటి చిత్రాల్లో కూడా యెందుకు నటింపచేస్తున్నారో? అనిపించింది. అందరూ కొత్తవారితో తీస్తేనే ఇలాంటి చిత్రాలు బాగుంటాయి. తగిన నటులు దొరక్కపోరు....డబ్బులు యెలాగూ రావు అని ముందే తెలుసుగా? అదృష్టం కొద్దీ వస్తే ఇంకా మంచిది కదా?

దేశం లోని యేడు మెట్రో నగరాల్లో ఫ్లాట్ల అమ్మకాల్లో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలం లో 40% క్షీణత కలిగినట్టు ఆసోచాం సర్వే నివేదిక చెప్పిందట. దీనిక్కారణం వుక్కూ, సిమెంటూ వగైరాల పెరుగుదల వల్ల రెండు పడకగదుల ఫ్లాట్లు 30 నించి 45 లక్షల 'మేర' పెరగడమేనట.

వీళ్లు బయటపెట్టిన ఇంకో రహస్యం యేమిటంటే, స్పెక్యులేటర్లు భవిష్యత్ లాభార్జన వుద్దేశ్యం తో ముందస్తుగా వీటిని కొనేసి (బ్యాంకు అప్పులతోనేకదా!), కృత్రిమ కొరతలు సృష్టించి, రేట్లు పెంచి అమ్ముకుంటున్నారట!

స్థిరాస్థి రంగం లో అదే కాలం లో పెట్టుబడులు 37% పెరిగాయట. బ్యాంకులు 'టీజర్ రేట్లు ' కొనసాగించడం తో విక్రయాలు జోరందుకోవచ్చని ఆశాభావం వ్యక్త పరచిందట ఆ నివేదిక!

రాష్ట్రం లో 450 కోట్ల ఆథార్ వ్యవహారం లో "కుక్కతోక" ప్రజా పంపిణీ విభాగం లో ఓ పౌర సరఫరా అధికారి ఇష్టా రాజ్యం నడుస్తోందనీ, అప్పుడే కళ్లు బైర్లు కమ్మే అవినీతి జాడలు బయటపడుతున్నాయి అనీ వార్తలొచ్చాయి.

1993 ముంబాయి బాంబు ప్రేలుళ్ల కేసులో నిందితుడు ఇమ్రాన్ అనబడే సయ్యద్ ముసద్దీన్ ఖాద్రీ "యేడేళ్ల క్రితమే తాను హత్యచెయ్యబడ్డాను" అని పోలీసులని నమ్మిoచి, 2003 నించీ హైదరాబాదులోనే మకాం చేసి అనేక రకాల అత్తరు వ్యాపారాలు చేస్తున్నాడట! మళ్లీ ముంబాయి వుగ్రవాద నిరోధక దళం పోలీసులు వచ్చి సోదాలు చేసి, పట్టుకుంటే గానీ దొరకలేదుట! మన నిఘా వ్యవస్త యెంత బాగుందో!

తృటిలో తప్పిన......లు (రైళ్లు) :

13-10-2010 న కొచ్చి వ్యాలీ నుంచి హైదరాబాదు వెళ్తున్న 'శబరి' ఎక్స్ ప్రెస్ గుంటూరు జిల్లా బాపట్ల స్టేషను కి కిలో మీటరు ముందు "రెడ్" సిగ్నలు వేసివున్నప్పటికీ, డ్రైవర్లు పట్టించుకోకుండా బండిని స్టేషన్లోకి విజయవంతంగా తీసుకొచ్చేశారట! ఈ డ్రైవర్లని అక్కడ దింపేసి, తెనాలినుంచి వేరే డ్రైవర్లని రప్పించి, యెప్పుడో తీరికగా బండిని పంపించారట. ఈ డ్రైవర్లకి వైద్యపరీక్షలు నిర్వహింపచేసి, మద్యం మత్తులో వున్నారని తెలుసుకొని, సస్పెండు చేసి, అనంతరం "విచారిస్తున్నారు"ట.

18-10-2010 న విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రత్నాచల్ సూపార్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఏ సీ బోగీ క్రింద మంటలు వ్యాపిస్తే, తాడేపల్లిగూడెం లో 3 గంటలపాటు ఆపేసి, ఈ బోగీకి ప్రక్కనే వున్న సాధారణ బోగీలోంచి జనాలు దూకేసి, తొక్కిసలాడి, ఒకరు స్వల్పంగా గాయపడి, రైలు ఆగడం తో మంటలు ఆరిపోగా, యాక్సిల్ బాక్స్ పూర్తిగా కాలిపోయి, యేదో తంటాలు పడి, మళ్లీ ఆ.........లస్యంగా రైలుని పంపించారట. 

4 comments:

జేబి - JB said...

కబుర్లు బాగున్నాయండి. కొన్ని ప్రాంతీయవార్తలు తెలిసాయి.

అవార్డులొచ్చాక సొంతవూరు నెట్లోవెతికి పట్టుకొని చూశా. నచ్చింది, మంచి ప్రయత్నం. ఎల్బీగారు రెండు నందులకీ అర్హులు. నటన బాగుంది, ఉచ్ఛారణ అమ్మో ఒకటో తారీకులోలాగా అనిపించింది. ఒకరిద్దరు పెద్దనటులని పెట్టుకుంటే తీసేటప్పుడు మిగతావారిని నెట్టుకొస్తారు, ప్రచారానికి ఉపయోగపడతారు.

స్పెక్యులేటర్లు - ఇది నిజం. ఇండియా వెనక్కేళ్ళే ఉద్దేశంలేకున్నా లాభంకోసం, ఒక పెట్టుబడిగా కొనేవారిని ప్రవాస భారతీయులని స్వయంగా చాలామందిని చూస్తున్నా

A K Sastry said...

డియర్ JB - జేబి!

చాలా సంతోషం.

మీరన్నది నిజమే. కానీ, ఒకరిద్దరు పెద్దనటులలో కూడా, నటులు కనిపించకూడదు అంటాను నేను. ఒక ఫోటో లో ఎల్ బీ ని గుర్తుపట్టడానికి నాకు కొంత సమయం పడితే, అంతకు ముందే, ఫోటో చూడగానే తనికెళ్లని గుర్తుపట్టేశాను.

మన కళాతపస్వులు సైతం చేస్తున్న పొరపాటు అదే! ఓ సినిమాలో, సాక్షి రంగారావు, "అబ్బా! ఛీ" అంటూ అనేక సార్లు మరుగుదొడ్డికి వెళ్లి వస్తున్నట్టు చూపిస్తుంటే, యెంత చిరాకు వస్తుంది? అమాత్రం పాత్రకి ఆయనే కావాలా? (వాళ్ల నిర్మాతలకీ, వాళ్లకీ పరిమితులు వుండడం సహజమే అనుకోండి)

అన్నట్టు, దయచేసి నాకు ఆ లింకు (సొంత ఊరు కి) ఇవ్వరూ?

ఇక ప్రవాసభారతీయులు తమ స్వంత డబ్బుని పెట్టుబడి పెడతారు--వృధ్ధి కోసం. బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొనేవాళ్లు దేశీయ స్పెక్యులేటర్లు మాత్రమే కదా?

అనేక ధన్యవాదాలు.

జేబి - JB said...

మీరుదహరించినటువంటి అనామక పాత్రలయితే కరెక్టేలేండి.

ప్రవాసులయినా అలా పెట్టుబడి పెట్టడం కృతిమకొరతకీ, ధరలు పెరగడానికీ కారణమే కదండీ. వాళ్ళని తప్పు పట్టడంలా, ఎవరి తిప్పలు వారివి.

http://www.manatelugumovies.net/2009/04/sontha-ooru-2009.html

~జేబి

A K Sastry said...

డియర్ JB - జేబి!

అందుకే నేనూ అంటూ వుంటాను "యెవరి వ్యాపారాలు వారివి--యెవరి పొట్ట తిప్పలు వారివి" అని.

లింకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. వెంటనే చూడడానికి ప్రయత్నిస్తాను.