అవీ, ఇవీ, అన్నీ
ఈ మణి శంకర్ అయ్యరొకడు--కేంద్ర ప్రభుత్వానికీ, కాంగ్రెస్ కీ విలన్ అయిపోయాడు. (ఇదివరకు సుబ్రహ్మణ్యం స్వామి అని ఓ ఐరన్ లెగ్గుండేవాడు--ఇప్పుడూ వున్నాడేమో తెలీదు--ఈయన కూడా అలాంటి ప్రణాళికలేమైనా వేసుకున్నాడేమో తెలియదు).
"స్టాక్ మార్కెట్లు బాగుంటే, అంతా బాగున్నట్టేనా?" అని ప్రశ్నించాడు మొన్న. ఇంకా, వీటికి ప్రభుత్వ సంపూర్ణ మద్దతు లభిస్తోందనీ, వాటి బాగే సామాన్యుడి బాగు అన్నట్టు ప్రవర్తిస్తోంది అనీ, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం లేని సొమ్ముని మార్కెట్లో పెట్టేందుకు అనుమతిస్తున్నారనీ, మన స్టాక్ మార్కెట్లో 44 శాతం ఇలా "మారిషస్" నించి వచ్చినవే అని కూడా అన్నారు.
సత్వర వృధ్ధి ఫలాలన్నీ "ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చెయ్యడానికే" అనీ, వీటివల్ల ఆదాయం పెరగబోవడం లేదు అని కూడా అన్నారు.
మరి ప్రభుత్వమేమీ మాట్లాడడం లేదు--సెన్సెక్స్ 20 వేల పాయింట్ల చుట్టూనే తిరుగుతోంది!
నమ్ముతారా? మన 77 మంది కేంద్ర మంత్రుల్లో 26 మందికి స్వంత వాహనాలే లేవుట!
స.హ. దరఖాస్తుతో, సుభాష్ చంద్ర అగర్వాల్ అనే ఆయన ప్రథాని కార్యాలయం నించి ఈ వివరాలు రాబట్టాడట.
కార్లు వున్నవారిలో కూడా కొంతమందివి పాత డొక్కు కార్లేనట!
సుశీల్ షిండే 37 యేళ్ల వయసున్న పాత ఫియెట్ లోనే తిరుగుతున్నారట! (15 యేళ్లు దాటితే మళ్లీ లైఫ్ టాక్స్ కట్టాలనీ, 20 యేళ్లు దాటిన కార్లు ఇక తిరగకూడదు అనీ వినిపిస్తున్న రూల్స్ ఈయనకి వర్తించవేమో).
ఎం ఎస్ గిల్ పాతికేళ్ల నాటి ఓక్స్ వాగన్ జెట్టానీ; కమల్ నాథ్ పాత అంబాసిడర్నీ; సీ పీ జోషీ పదిహేనేళ్ల పాతదైన ప్రీమియర్ పద్మిని నీ; వయలార్ రవి 18 యేళ్ల వయసున్న ఫియట్ నీ; ప్రకాశ్ జైస్వాల్ 14 యేళ్లనాటి మారుతీ ఎస్టీం నీ మాత్రమే వాడుతున్నారట. నమోనారాయణ్ మీనా పేరున ఒక్క ద్విచక్ర వాహనం మాత్రమే వుందట.
కోటీశ్వరులూ, రాజకీయాల్లో చక్రాలూ, మలుపులూ తిప్పేవాళ్లూ, శరద్ పవార్, ఆనంద్ శర్మ, ఎ రాజా, విలాస్ రావ్ దేశ్ముఖ్ లకి అసలు వాహనాలే లేవట!
పాపం మన వోట్లమీదే బతుకుతున్నారుగా మరి!
మొన్ననే రోశయ్య రాష్ట్ర కొత్త పర్యాటక విధానాన్ని ప్రకటించారట.
సాగర్ వద్ద "అతి పెద్దదయిన" ఆధునిక వుద్యాన వనాన్ని నిర్మిస్తారట! ఇది మైసూరులోని బృందావన్ గార్డెన్స్, బెంగళూరు లాల్ బాగ్ తరహాలో వుంటుందట!
అయ్యా! యెవరైనా ఆ రెండు గార్డెన్లనీ ఒక్కసారైనా పూర్తిగా చూశారా? రెండోసారి యెప్పుడైనా వెళ్లారా?
భార్యా, పిల్లలూ, బంధువులతో అంతదూరాలు నడవలేక, అవన్నీ చూడకుండా వుండలేక, ఒకవేళ యెవరికైనా చూపించాల్సి వస్తే, మీరు అలా వెళ్లి రండి, మేమిక్కడే వుంటాము అని గేటు ప్రక్కనే సెటిలయ్యే లోకల్ వాళ్లలా, మీరెప్పుడూ అనుభవించలేదా?
పర్యాటకానికి అవసరమనుకుంటే, ఇప్పుడు వున్నవాటికి పరిసరాలు కాస్త శుభ్రం గా వుంచి, మూత్రశాలలూ అవీ కట్టిస్తే చాలు--పర్యాటకం వర్థిల్లుతుంది! యెందుకీ అనవసర ఖర్చులు? (రోశయ్యగారూ....చక్రం అడ్డు వెయ్యండి మరి)
మంగళంపల్లి బాలమురళీ కృష్ణకి " భారత రత్న" ఇవ్వాలి అనీ, దాని కోసం తాను ఇప్పటికే మాట్లాడుతున్నాను అనీ సుబ్బురామి రెడ్డి ప్రకటించాడు మొన్నో సభలో! నేనే మంగళంపల్లి అయితే......థూ!
అన్నట్టు, మొన్న రాష్ట్రపతి విమానం 3 నిమిషాలపాటు రాడార్ లో కనపడలేదనుకున్నాం కదా--'సంబంధాలు తెగిపోలేదు ' అని విమానయాన శాఖ ప్రకటించింది ఆ మర్నాడే. ఒక మానిటర్ పనిచెయ్యకుండా ఆగిపోవడంతో వేరే మానిటర్ కి అనుసంధానం చేశాము అనీ, 3 నిమిషాల్లో మొదటి మానిటర్ బాగుకూడా అయ్యింది అనీ వెల్లడించారు! (వూహించుకోండి యేమి జరిగిందో)
24-09-2010 న ప.బెంగాల్, మిడ్నపూర్ జిల్లాలో ఓ మిగ్ 27 విమానం మంటల్లో చిక్కుకొని కూలిపోయిందట. పైలట్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడట. 1962 చైనా యుధ్ధం సమయంలో మనం అడిగితే, 1965 పాకిస్థాన్ యుధ్ధం నాటికనుకుంటా, రష్యా మనకి సరఫరా చేసిందీ మిగ్ లని. పాక్ వాళ్ల అమెరికన్ Gnat లకీ, మన మిగ్ లకీ ఘోర యుధ్ధాలు జరిగాయి 1965 లో.
మనం ఇప్పటికీ ఆ మిగ్ లని శిక్షణ వగైరాలకోసం వాడుతున్నాము. కొన్ని విధిలిఖితాలు తప్పవు మరి--ప్రస్తుత ముసలి బ్రహ్మని వదిలించుకొని, కొత్తవాణ్ని తెచ్చుకొనేవరకూ!
యేమంటారు?
No comments:
Post a Comment