Thursday, October 16, 2014

కబుర్లు - 117


అవీ, ఇవీ, అన్నీ

(వీటిలో కొన్ని పాతవి......అంటే ఇదివరకే వ్రాసి, ప్రచురించకుండా వున్నవి)

చందమామ వెన్నెలలు కురిపిస్తూ వుంటే......రకరకాల పరవశాలు. పూర్తి వెలుగూ కాదు, చీకటీ కాదు. కొన్ని స్పష్టంగా కనబడతాయి, కొన్ని స్పష్టంగా కనబడవు. 

అలా కాకుండా, పగలంత వుండే వేడి లేకుండా, వెలుగు ఇంకా యెక్కువ వుంటే యెంత బాగుంటుంది? అన్నది ఓ తుంటరి ఆలోచన. 

ఆ ఆలోచన కి కార్య రూపం యెలా? అంటే, చంద్రుడి మీద సూర్య కాంతి పడే ప్రదేశాన్ని అంతటినీ నున్నగా, అద్దం లా చెక్కేస్తే?...... అంతా అఖ్ఖ్రరలేదు, ఓ ఎనిమిదో వంతు చాలు అంటే?.......అవును కదూ!

ఇప్పుడు అలాంటి ఆలోచనే చేస్తున్నారట స్వీడన్‌ లోని ఫోరియో అనే సౌందర్య సాధనాల సంస్థ వారు. ఆ పరిశోధన కోసం 5.2 కోట్ల డాలర్లను సమకూర్చుకున్నారట కూడా. అలా చెయ్యడం వల్ల రాత్రివేళ వీధి దీపాలూ వగైరాల ఖర్చులు మిగిలి, పర్యావరణానికి కూడా మంచిది అని వాదిస్తున్నారట.

ప్రకృతివాదులేమో, "అలాచేస్తే ఇంకేమైనా వుందా? ప్రకృతి సమతౌల్యత దెబ్బతిని, విపరీత పరిణామాలకి దారి తియ్యదూ" అంటున్నారట.

నవరాత్రులూ గడిచి, అన్నిచోట్లా నిమజ్జనాలుకూడా పూర్తయ్యాక, మా పాలకొల్లు లో 52 అడుగుల భారీ మట్టి వినాయకుణ్ని--నాలుగు ట్రాక్టర్ల బంకమట్టీ, టన్ను ఇనుమూ, మూడు టన్నుల సరివీ కర్రలూ, 5 టన్నుల కొబ్బరి పీచూ, ఓ ట్రాక్టర్ యెండుగడ్డీ, 20 బొండల డొక్క తాడూ--తో తయారైన దాన్ని, తరలించడం కష్ట సాధ్యం అని తర్జన భర్జన పడి, 23 రోజుల తరవాత నిమజ్జనం చేశారు. యెలా అనుకున్నారు? 

ప్రక్కనున్న ప్రథాన సాగునీటికాలువ నుంచి ఇంజన్ల ద్వారా నీళ్లు తోడి, వేగంగా విగ్రహమ్మీద జిమ్ముతూ, 30 మంది యువకులు, మట్టిని యెక్కీ, తొక్కీ తొలగిస్తూ, ఆ మట్టిని కాలవలోకలుపుతూ, భారీ విద్యుత్ దీపాలు యేర్పాటు చేసి మరీ మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకూ కొనసాగించారట! (మరి ఇనుమూ, కర్రలూ అవీ యేమి చేశారో తెలీదు.)

యేమైతే యేం? ఇదోరకం నిమజ్జనం!

మొన్న దసరాలకి దుర్గాదేవి విగ్రహాలని కూడా నిమజ్జనం చేశారు కొన్ని చోట్ల!

మొన్న ఓ మిత్రుడు అన్నట్టు, మన సంస్కృతీ, సంప్రదాయం అంటూ, మీరూ నేనూ హరిదాసుల వేషాలూ, గంగిరెద్దుల వాళ్ల వేషాలూ వేసీ, కార్యాలయాల మొజాయిక్ నేలలమీద పేడతో అలికేసి, ముగ్గులు పెట్టెయ్యడం యేమిటో? బహుశా వీటినే అంటారేమో....వెర్రి తలలు వేయడం అని!

అన్నట్టు, దసరా అంటే ముఖ్యంగా జరిగేవి యేనుగు సంబరాలు.....జమ్మి కొట్టడం! ఇప్పటి వాళ్లకి ఇవేమైనా తెలుస్తున్నాయా? మా వూళ్లో కొన్నేళ్ల క్రితం వరకూ 3 యేనుగులు బయలుదేరేవి.....ఒకటి రెవెన్యూ ఉద్యోగులదీ, ఒకటి కోర్టు వారిదీ, ఇంకొకటి మునిసిపల్ ఉద్యోగులదీ. కొన్నేళ్లుగా రెండు యేనుగులు లోపిస్తూ, ఇప్పుడు మునిసిపాలిటీ వారిది మాత్రం ఒక్కటీ ఊరేగుతోంది.

అలాగే, అట్లతద్ది అంటే, మాలలు గొంతెమ్మ పండగ ఘనంగా నిర్వహించి, అనేక పేటలనుంచీ "మందిరాల" లో ఊరేగిస్తూ, గోదావరిలో నిమజ్జనం చేసేవారు! ఇప్పుడెక్కడ ఆ సంప్రదాయాలు?

ఇంక, మన బుర్రోవాదుల (బ్యూరోక్రాట్ల) "ఆథార్" పిచ్చి కూడా వెర్రితలలు వేస్తోంది. "అనర్హుల"ని తొలగించడం వల్ల కొన్ని కోట్లు మిగిలిపోతాయంటూ, యెవరో అన్నట్టు--పాతవాళ్లని తొలగిస్తూ, కొత్త "అనర్హుల"ని చేరుస్తూ--యెన్ని వేషాలు వెయ్యాలో అన్నీ వేస్తున్నారు!

అల్లప్పుడేమో, ముసలివాళ్లకి ఐరిస్ లు సరిగ్గా రావడం లేదు అంటే, లేదా వేలి ముద్రలు సరిగ్గా రావడం లేదు అంటే, అవిలేకుండా వివరాల నిక్షిప్తం ముందుకు జరగదు కాబట్టి, అక్కడి రెవెన్యూ ఉద్యోగుల ఐరిస్ లూ, వేలి ముద్రలూ వేసెయ్యమన్నారు! ఇప్పుడేమో, అవన్నీ "చెల్లవు" అంటున్నారు! వేలి ముద్రలు "అరిగిపోయాయి" అంటున్నారు! 

ఇంకా, జనం అందరూ ఫలానా చోటుకి వచ్చి, పరిశీలన చేయించుకోకుంటే, రద్దు చేస్తామంటున్నారుట. యెండల్లో, వానల్లో వృధ్ధులూ, వికలాంగులూ పడుతున్న అవస్థలు పగవాడికి కూడా వద్దు అనిపిస్తున్నాయి. 

మళ్లీ తట్టెడు ధృవీకరణ పత్రాలూ, అవీ దాఖలు చేయమనడం తో జెరాక్స్ షాపుల వాళ్లు లక్షల్లో సంపాదించుకుంటున్నారు! (ఆథార్ కార్డ్ అంటే, క్రింద వుండే చిన్న ముక్క ని కత్తిరించుకుంటే సరిపోతుంది. కానీ, మొత్తం కార్డుని పెద్దకాయితం మీద తీయించేస్తున్నారు....యెందుకైనా మంచిది అని. అలాగే మిగతా కార్దులూ, పట్టాదారు పాస్ బుక్కులూ వగైరాలు. మరి "పేపర్ లెస్" వ్యవస్థ యెప్పటికి వస్తుందో?)

Sunday, April 13, 2014

కబుర్లు - 116


అవీ, ఇవీ, అన్నీ


జైరామ్‌ రమేష్ అంటాడూ......యెన్నికల్లో ప్రజలు ఎం పీ లని మాత్రమే యెన్నుకుంటారు...ప్రథానిని కాదు అని. అవును కదా? ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ఎం పీ లు మాత్రం యే అభిప్రాయం ప్రకటించకుండా సీల్డు కవర్లో వచ్చిన పేరు గల వ్యక్తిని ప్రథానిగా యెన్నేసుకుంటారు!

రాహువు అయితే, కాంగ్రెస్ ఒక పార్టీనే కాదు....అది పెద్దల ఆలోచనా విధానం....దాన్నెవరూ తుడిచెయ్యలేరు. అంటాడు. అంటే అది వాళ్ల పెద్దల ఆలోచనా విధానం అయితే, దాన్ని యెవరూ తుడిచెయ్యలేరు అన్నది కరెక్టే కదా? (యెంత పెద్ద చీపురుతో అయినా, పార్టీ తుడిచిపెట్టుకు పోయినా ఫర్వాలేదు.)

వీరప్ప "టేపుల" మొయిలీ కూడా కాంగ్రెస్ ని యెవరూ చెరిపెయ్యలేరు అంటున్నాడు. అంత పెద్ద రబ్బరులు యెవరూ వుపయోగించలేరు అని భావమనుకుంటా. 

ఇప్పుడు వీళ్లు ఇలా మాట్లాడుతున్నారు అంటే, యేదో మూల అది తుడిచిపెట్టుకు పోతుంది అనీ, చెరిగి పోతుంది అనీ భయం కలగడం వల్లే కదా?

మునిసిపల్ యెన్నికల ఫలితాల ప్రకటన వాయిదా పడడంతో, అభ్యర్థులు టెన్‌షన్‌, బీపీ, తలనెప్పీ వగైరాలతో హాస్పిటళ్లలో జేరుతున్నారట. పదిలక్షలవరకూ తెచ్చి, నెలకి లక్షకి ఇరవైవేలు వడ్డీలు యెలా కట్టాల్రా భగవంతుడా అనిట అసలు టెన్‌షన్‌!

ఇంక పందాలు కట్టిన వాళ్లు కూడా, మధ్యవర్తుల దగ్గర డబ్బు బ్లాక్ అయిపోవడంతో, తరువాత పందాలకి పెట్టుబళ్లు యెలాగా అని తలలు పట్టుకుంటున్నారట. 

చండీగఢ్ మున్‌సిపల్ కార్పొరేషన్ లో 319 స్వీపర్ పోస్టులకి 14 వేలమంది దరఖాస్తు చేసుకున్నారట. వాళ్లలో....జీతం 14,000/- వచ్చే ఈ వుద్యోగానికి 210 మంది పట్టభద్రులూ, 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లూ, నలుగురు బీ టెక్ లూ, 70 మంది డిప్లొమా వున్నవాళ్లూ, వున్నారట. 

2011 లో బరేలీలో, ఇండో టిబెటన్‌ బోర్డర్ పోలీసులో, ఖాళీ ప్రకటించిన 416 క్షురక, ధోబీ  వుద్యోగాలకోసం రెండు లక్షలమంది పోగు పడ్డారట. ఆ పోస్టుకి జీతం రూ. 5,200/-. రైళ్లలో క్రిక్కిరిసి, టాపుమీదకూడా ప్రయాణాలు చే్సిన అభ్యర్థులు, ఓ పొట్టి బ్రిడ్జ్ క్రింద నుంచి వెళుతూండగా, 18 మంది అక్కడికక్కడే మరణించి, అనేకమంది తీవ్ర గాయాలపాలైన విషయం మరచిపోలేము

వచ్చే ఐదేళ్లలో ఇన్ని కోట్ల వుద్యోగాలు అంటూ ప్రకటించి, అది మరచిపోయి, మళ్లీ ఇప్పుడు అదే ప్రకటిస్తున్న పార్టీని భూస్థాపితం చెయ్యద్దూ?

మొన్న ఏప్రిల్ 9 న, పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో భారీ బాంబు పేలి, 23 మంది దుర్మరణం, ఓ వందమంది కి పైగా తీవ్రంగా క్షతగాత్రులూ అయ్యారట. ప్రభుత్వం, నిషేధిత తాలిబన్‌ ఉగ్రవాదులతో, శాంతి చర్చలు జరుగుతున్నప్పుడు ఈ పేలుడు జరిగిందట. ఈ విధ్వంసాన్ని పాక్ తెహ్రిక్-ఇ-తాలిబన్‌ అధికార ప్రతినిథి తీవ్రంగా ఖండించారట! మరి తాము అలాంటివి చేసి, అనేకచోట్ల అనేకమందిని పొట్టనపెట్టుకొన్నప్పుడో?

Monday, April 7, 2014

కబుర్లు - 115


అవీ, ఇవీ, అన్నీ

సందట్లో సడేమియా లా వాడెవడో ఓ "శూలశోధన" (యెప్పుడు చేశాడో, శూలం యక్కడ గుచ్చాడో, యెవరు యేమి వాగారో చెప్పలేదు) చేసి, బాబ్రీ మసీదు కూల్చివేత క్షణికావేశాలతో జరిగింది కాదు అనీ, ఖచ్చితంగా కుట్ర పన్ని పడగొట్టారు అని తేలింది అనీ ప్రకటించాడు. పైగా ఇప్పుడు దీన్ని ప్రకటించడానికి యెన్నికలతో యేమీ సంబంధం లేదు అనీ, యెప్పుడో జరిగిన పరిశోధన ఇప్పటికి తెమిలింది అనీ కూడా చెప్పాడు. 

దీన్నిబట్టే తెలుస్తోంది కదా--అందులో నిజమెంతో?

అదేదో కుంభకోణం లో దొరికిన డైరీల వల్ల, ముడుపులు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ కి కూడా ముట్టాయి అని తేలిందట. క్రొత్తగా ఆశ్చర్యపోవడానికి యేం వుంది ఇందులో!?

అప్పుడెప్పుడో, ఓ కలెక్టరు బ్యాంకు వుద్యోగులకి కూడా యెన్నికల విధులు అప్పగిస్తే, అలా వీల్లేదని కోర్టుకెళ్ళారు. తదుపరి కోర్టు అలా అప్పగించచ్చు అని తీర్పు ఇచ్చింది. తరువాత మామూలే.....అందరితో పాటూ వీళ్లకీ విధులు అప్పగించడం మామూలైపోయింది. 

బ్యాంకు బ్రాంచి మేనేజర్లకి ఓ శ్రీముఖం అందుతుంది యెన్నికల అధికారి నుంచి ఫలానా సెక్షన్‌ ప్రకారం మీ ఆఫీసులో పనిచేస్తున్న వుద్యోగులందరి పేర్లూ మాకు సమర్పించవల్సింది అంటూ. (ఫలానా సెక్షన్‌ ప్రకారం అంటే, యెన్నికల విధులు అప్పగించడానికి అందుబాటులో వుండే వుద్యోగులు అని. ఆ విషయం 1977 లో చదివి తెలుసుకున్నాను. అప్పుడు మా బ్రాంచి లో ముగ్గురు మాత్రమే వున్న సిబ్బందికి డ్యూటీలు వెయ్యలేదు.) 

2006 లో ఇలాగే మా రాయదుర్గం బ్రాంచి లో తాఖీదు అందుకున్న మేనేజరు, స్వీపరు తో సహా సిబ్బంది అందరి పేర్లూ వ్రాసి పంపించేశాడు. మాకు ఆ విషయం చెప్పలేదు. తీరా చూస్తే అందరికి ఫలనారోజున శిక్షణ తరగతులకి హాజరవండి అని హుకుమ్‌! 

మేనేజరు తలపట్టుకున్నాడు. మరి అందరి పేర్లూ యెందుకిచ్చావు అంటే, "ఇవ్వకపోతే, నాన్‌బెయిలబుల్ వారంటిస్తాడు నాకు" అన్నాడు. "అయితే సరే, బ్యాంకు తాళం వేసెయ్యి, తరగతులకి వెళ్దాం" అంటే "మరి నా వుద్యోగమో?" అన్నవాడికి బాగా తలంటు పోసి, బాధ్యత నానెత్తిన వేసుకొని, మా సబ్‌మేనేజరు తో తరగతులకి హాజరై, నిర్వాహకుడు ఎం ఆర్ వో (ఇప్పటి తాసీల్దారు) కి విషయం వివరిస్తే, "అలా యెందుకిచ్చాడయ్యా మీ మేనేజరు?" అంటూ కోప్పడి, "ఓ ఉత్తరం పంపించండి, కలెక్టరుతో మాట్లాడి చూస్తాను. కనీసం ఇద్దరినైనా పంపాలి తప్పదు" అన్నాడు. హమ్మయ్య అనుకొని, మిగిలిన వాళ్ళందరూ బ్యాంకులో తప్పకుండా చేయవలసిన డ్యూటీలు వ్రాసి, మా మేనేజరు పేరూ, ఉత్సాహం చూపించిన మా కేషియరు పేరూ యెలక్షన్‌ డ్యూటీకి సూచించి, బయటపడ్డాము.

ఇప్పుడు మా జిల్లాలో, బ్యాంకుల సిబ్బందిని ఏప్రిల్ 6 న విధులకోసం హాజరవ్వమని తాఖీదులు వచ్చాయి. ఒక మేనేజరూ, ఒక గుమాస్తా మాత్రమే వుండే బ్రాంచిలకికూడా తాఖీదులు రావడంతో బ్యాంకులన్నీ ఓ రెండు మూడు రోజులు మూసెయ్యవలసిన పరిస్థితి. యేవో తిప్పలు పడతారనుకోండి. 

అజ్ఞానం వల్ల వచ్చే తిప్పలు ఇవి.

మొన్న "స్త్రీల సంక్షేమం" కోసం అంటూ కేవలం "అరకేజీ బరువే" తూగే, హేండ్ బ్యాగ్ లో పట్టే "హేండ్ గన్‌" విడుదల చేశారు ఓ కంపెనీ వారు. దాని ధర కేవలం రూ.1,32,000/- మాత్రమేనట! "ధర యెక్కువని ఆలోచించనఖ్ఖర్లేదు..... అందరూ కొనేస్తారు.....ఇప్పటికే ఓ 200 గన్‌ లకి ఆర్డర్లు వున్నాయి" అని కూడా వారు చెప్పారట.

ఒక లోక్ సభ అభ్యర్థి యెన్నికల సభలో ఆయన భార్య మీఅందరి కీ తుపాకీ లైసెన్‌స్ ఇప్పిస్తాం, నాదీ బాధ్యత అందట. స్టేజి పైనున్నవాళ్లే ఆశ్చర్య పోతూంటే, నిజమే, నాదీ బాధ్యత అని మళ్ళీ చెప్పిందట. 

పై రెండిటికీ సంబంధం లేకపోవచ్చు. రెండూ చాలా దూరంగా, వేరు వేరు ప్రదేశాల్లో జరిగివుండొచ్చు. కానీ తేలుతున్నది యేమిటంటే, ప్రభుత్వం గన్‌ లాబీ తో కుమ్మక్కు అయ్యింది అనీ, మళ్ళీ యూపీయే గవర్నమెంట్ వస్తే మటుకు, విచ్చలవిడిగా గన్‌ లైసెన్‌స్ లు ఇచ్చి, గన్‌ సంస్కృతిని ప్రోత్సహిస్తారు అనీ. 

తస్మాత్ జాగ్రత జాగ్రత!.

"ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్‌" అనేది క్రీస్తుని సిలువ వేశాక ఖననం చేసేముందు ఆయనకి చుట్టిన వస్త్రం అని నమ్మేవారు చాలా మంది చాలా దేశాల్లో. దాని మీద అనేక పరిశోధనలు జరిపాయి అనేక సంస్థలు. 

కొంతమంది ఆ చిత్రం ఆకారం లోని మరకలు క్రీస్తువేననీ, మిగిలిన కొలతలన్నీ సరిపోయాయి అనీ...ఇలా ప్రకటించారు. కొంతమంది, ఆ వస్త్రానికీ క్రీస్తుకీ సంబంధమేలేదు అని ప్రకటించారు. కార్బన్‌ డేటింగ్ చేసిన సంస్థ కూడా అలాగే ప్రకటించింది. 

ఇప్పుడు లివర్‌పూల్ లో ఓ విశ్వవిద్యాలయం తాలూకు "బోరినీ" అనే ఆయన, ఆ వస్త్రాన్ని పరిశోధించి, క్రీస్తుని చేతులు రెండు వైపులా చాపి మేకులు కొట్టలేదు అనీ, పైకి పెట్టి రెండిటికీ ఒకే మేకుకొట్టారనీ, నగ్నంగా ఉండే పురుషుడి రూపం ముద్రించినట్టున్న ఆ వస్త్రం పై అంటుకున్న రక్తపు మరకల జాడలని బట్టి, ఆయన్ని సిలువ వేశాక, మరణానంతరం ఆయనని ఆ వస్త్రం లో చుట్టి సమాధి చేసి వుంటారని కూడా ఆయన ప్రకటించాడు. 

Sunday, March 23, 2014

కబుర్లు - 114


అవీ, ఇవీ, అన్నీ

పాత "గులేబకావళి కథ" సినిమాలో, "దాని మొగుడు" అనేవాడు, "వాడి పెళ్లం" అనే ఆవిడతో లేచిపోయాడు అని, ఎన్‌ టీ ఆర్ మారువేషం లో వుండగా, "దానిమొగుడు, వాడి పెళ్లాంతో లేచిపోతే......." ఆంటూ ఓ  డైలాగు వస్తుంది.

ఇప్పుడంతా---వాడి పెళ్లాం, దాని మొగుడు, వాడి కొడుకు, దాని కొడుకు, వాడి తమ్ముడు, వాడి మేనల్లుడు, వాడి మనవడు, వాడి బావమరిది, ఇలాగే......రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ కూడా.

(ఎలక్షన్ల గురించీ, రాజకీయాల గురించీ సణగడం శుధ్ధ వేస్ట్ అనుకునేవాణ్ని......వస్తున్న మార్పులు చూసి మళ్లీ సణగబుధ్ధేసింది మరి.)

తాజాగా పిచ్చిదంబరం, (తన కొడుకు కార్తి కి టికెట్ ఇచ్చినందువల్ల) యెన్నికల్లో పోటీ చేయబోను అని ప్రకటించేశాడు. ఎనిమిది సార్లు నెగ్గాను, పదిహేడేళ్లు గొప్ప గొప్ప శాఖలు మంత్రిగా వెలగబెట్టాను, 68 యేళ్లు వచ్చేశాయి, యువతకి అవకాశం అంటూ భగవద్గీతలు చెపుతున్నాడు. రాజకీయాల నుంచి తప్పుకొని, గాంధీ మార్గం (యే గాంధీ యో?!--మరి ఇన్నాళ్లూ ఆ మార్గం లో లేనట్టేనా?) పడతానని కూడా అన్నాడు. రాజకీయాల్లో 98 యేళ్లు వచ్చినా రిటైర్ మెంట్ ఉండదు అనీ, కనీసం 88 వచ్చేవరకూ అయినా గవర్నర్ పదవులూ అవీ గ్యారంటీ అనీ, దొడ్డిదారిని అధికారం చేపట్టే మార్గాలు చాలానే వున్నాయి అనీ చెప్పకనే చెపుతున్నట్టు లేవూ ఈ మాటలు?

ఇంకా యెన్నాళ్లు మన చెవుల్లో పువ్వులు పెడతాడో!

నందన్‌ నీలేకణి ఆస్థి రూ.7,700 కోట్ల పైమాటేనట, ఆయన అఫిడవిట్ ప్రకారం. (అందులో సింహ భాగం 'ఊరివెలుపల పాడు కోనేటి చెంత......'దాచిన బంగారం లాంటివేననుకోండి). జేబులోని రూ.200/- తో జీవితాన్ని ప్రారంభించి, ఇతరులతో కలిసి రూ.10,000/- తో ఇన్‌ఫోసిస్ స్థాపించి, ఈ స్థితికి వచ్చాడంటే, 'ఇండియా వెలుగుతోంది' కి మంచి ఉదాహరణ కదూ! (మన పిచ్చాళ్ళేమో అది నమ్మక తింగరాళ్లనందరినీ గెలిపించి, దేశాన్ని ఈ స్థితికి తెచ్చారు.) తనకి ఓ పదవి ఇచ్చినందుకే కాంగ్రెస్ తరఫున పోటీ చేసి కృతజ్ఞత  చాటుకుంటున్నారు. ఈయనకి ఓ 10 కోట్లో, 100 కోట్లో పారేసి నెగ్గడం కష్టం కాకపోవచ్చు. కానీ ఓటర్లు ఆలోచించ వలసింది--ఈయన చిల్లర డబ్బులకోసం కక్కుర్తి పడడు 'కాబట్టి సేవ చేస్తాడా' లేక ఆ కోట్లని 'లక్ష కోట్లు' చేసేలా 'దండుకుంటాడా' అని.

ఓ ప్రక్క బర్దన్‌ మూడో కూటమి విషయం లో చింతిస్తున్నా, కారత్ మాత్రం, ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వం స్థాపిస్తాం అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు! ప్రాప్త కాలజ్ఞత కూడా లేదు సీ పీ ఎం వాళ్లకి.

మన తెలుగు తేజం డా. ఆర్. సత్యనారాయణ "గీతమ్‌" లో పరిశోధనలు చేసి, కృత్రిమ కోడి మాంసం తయారు చేసే విధానం కనిపెట్టాడట. ఓ కోడి కండ సేకరిస్తే, టన్నులకి టన్నులు మాంసం తయారు చేసేసుకోవచ్చుట. కోళ్ల కి శుభవార్తే. జీవహింస తగ్గే ఛాన్‌స్ వుంది కాబట్టి, ప్రపంచానికీ శుభవార్తే.

కానీ, కండల సేకరణ యెలా చేస్తారో అని ఓ సందేహం.

చికెన్‌ అనగానే మన నారాయణ గుర్తొస్తాడు. తెలంగాణాలో కాంగ్రెస్, తెరాస, సీపీఐ కలిసి పోటీ చేస్తేనే ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి అనీ, అలా నెరవేరకపోతే ఆరు నెలల్లోనే ఉద్యమాలు మొదలవుతాయి అనీ హెచ్చరించారు. (పాపం ఈయన జీవితం లో సగభాగం చికెన్‌ తిని నిద్రపోవడానికీ, మిగతా సగం ఉద్యమాలకే అంకితం అయిపోయాయి. ధన్యజీవి.)

ఓ ప్రక్క ఎం జే అక్బర్ లాంటివాళ్లు బీజేపీ లో చేరిపోతుంటే, అసదుద్దీన్‌ 'పవన్‌ కళ్యాణ్ సినిమాలు హైదరాబాదులో యెలా రిలీజ్ అవుతాయో చూస్తాం' అంటున్నాడు. పాపం హైదరాబాదు వాళ్ళందరూ చిన్నపిల్లలు కదా? వాళ్లకి ఓటు హక్కే లేదేమో!

ఇంక, పిల్ల నాయకుడు రాహుల్ పై, మృత్యు చుంబనం విషయం లో (ఓ ఆవిడని ముద్దుపెట్టుకొన్నందుకు ఆవిడ భర్త ఆవిడని హత్య చెయ్యడం పై) కేసు నమోదుచేశారట. మరి యెప్పటికి, యే శిక్ష పడుతుందో!



Friday, March 21, 2014

కబుర్లు - 113



అవీ, ఇవీ, అన్నీ

రాజకీయాల్లో సునామీ సృష్టిస్తాడని చాలా మంది అనుకొన్న చిరంజీవి, సముద్రం లో కాకిరెట్ట అయిపోయాడు. 
మిగిలిన రెట్టలన్నింటితో ఓ కొండ కడతానంటున్నాడు.

అసలు తిరుపతి మీటింగులో అంత ఆవేశం ప్రదర్శించిన తరువాత, "అభిమానులూ, యెక్కడ యే అవినీతి, అక్రమం కనిపించినా, యెవరికి అన్యాయం జరుగుతోందన్నా నా ఫలానా నెంబరుకి ఫోను చెయ్యండి. నేను చూసుకుంటా" అని హామీ ప్రకటించి వుంటే, ఈ రోజు చరిత్ర మరోలా వుండేది.

ఇప్పుడు పవన్‌ వచ్చాడు. తగిన, తగ్గని ఆవేశం తోనే మాట్లాడాడు. నాకున్న "నా అభిమానులు చాలు" అన్నాడు. అన్న చేసిన పొరపాట్లు చెయ్యకుండా వుంటే, మంచి భవిష్యత్తు కనిపిస్తోంది........అతనికీ మనకీ కూడా. ఈ ముసలాళ్లు మూడు పెళ్లిళ్లూ, స్త్రీజాతి కి అవమానం లాంటి చౌకబారు విమర్శలు మానుకోకపోతే, గుడ్డలూడ గొడతాడనిపిస్తోంది. చూద్దాం!

చారిత్రక తప్పిదం జరిగిందని తరవాత యెప్పుడో ఒప్పుకొనే బాధ లేకుండా ఇప్పుడే ఒప్పేసుకొన్నారు "మూడో కూటమి కోసం యెన్నికలకి ముందే ప్రయత్నం చెయ్యడం తప్పిదమే" అంటూ సీ పీ ఐ నాయకుడు బర్దన్‌.

బొక్కబోర్లా పడ్డాక, ఇప్పుడు లోక్ సభ యెన్నికలకు ముందే మూడో కూటమి యేర్పాటుకు ప్రయత్నించడం తప్పేనని పార్టీ అంగీకరించిందని చెప్పాడు. ప్రాంతీయ పార్టీలు యెక్కువ అనీ, వాటితో కూటమి కట్టడానికి ప్రయత్నించి, విఫలమయ్యామని చెప్పారు. (యెవరికి వారే ఆ కూటమి నాయకులుగా భావించుకొని, ప్రథానమంత్రి అయిపోవచ్చని సంబర పడితే, ఇంకెక్కడి కూటమి?) 

అయినా, యెన్నికల అనంతరం మూడో కూటమి యేర్పడుతుందని జోస్యం చెప్పారు. అయినా వాళ్లు కాంగ్రెసేతర, భాజపాయేతర, వామపక్షేతర, అవినీతి నాయకేతర, కుల సమీకరణేతర.......ఇలాంటి అనేకేతర కూటమి కావాలంటుంటే...........!

ప్రథాని నేతృత్వం లో 2008 లో, పిల్లల్లో పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న 200 జిల్లాల స్థితిగతులని అంచనా వేసి మెరుగు పరచడానికి యేర్పాటు చేసిన సంఘం ఇప్పటివరకూ కేవలం ఒకేసారి నవంబర్ 2010 లో మాత్రమే సమావేశం అయిందట. ఈ విషయం స హ దరఖాస్తు చేస్తే, ప్రథాని కార్యాలయం చెప్పిందట! ఆ ఒక్కరోజైనా ఆయన మౌన వ్రతం వదిలాడో లేదో?

కోట్లాది నిరుద్యోగులకి ఉపాధి మార్గాల అన్వేషణకి  జులై 2008 లో మన్మోహన్‌ నాయకత్వం లోనే మరో సంఘం వేశారట. అది కూడా 2012 జనవరి తరవాత మళ్లీ సమావేశం కాలేదట. ఆయనే నాయకుడిగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి విధానాల రూపకల్పనకి సెప్తెంబర్ 2009 లో వేసిన సంఘం ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదట. వాతావరణ మార్పుల అధ్యయనం కోసం జూన్‌ 2008 లో యేర్పాటైన సంఘం, నాలుగేళ్ల క్రితం ఒక్కసారి మాత్రమే సమావేశమయిందట. 

ఇవీ స హ దరఖాస్తులకి సమాధానం గానే బయటికి వచ్చాయట. 

పాపం ఆయనకి ప్రజా సేవకి సమయం యెక్కడుంది? మౌనం వీడడానికి అనుమతి యెక్కడ వుంది? 

ఒక స్వచ్చంద సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, భారత ప్రజానీకం ఒక సంవత్సరం లో 6 లక్షల 30 వేల కోట్లు వివిధ స్థాయుల్లో "లంచాలు" ఇచ్చుకొంటోందట!

భారత ప్రభుత్వం వ్యవసాయానికి కేటాయించిన 37,330 కోట్లు, విద్యా రంగానికి చేసిన 65,869 కోట్లు, రక్షణ రంగానికి చేసిన 3 లక్షల 3 వేల కోట్లూ కేటాయింపులకన్నా ఎన్నో రెట్లు యెక్కువ! 

మరి యెన్ని వేలమంది అవినీతి వ్యతిరేక సిబ్బందీ, నాయకులూ కావాలో వీటిని నిర్మూలించడానికి.

ఉత్తర ప్రదేశ్ లోని వృందావన్‌ లో ఇస్కాన్‌ వాళ్లు 300 కోట్ల ఖర్చుతో, 70 అంతస్తుల శ్రీకృష్ణ దేవాలయం కడతారట. మొన్న హోళీ రోజున శంకుస్థాపన చేశారు. 

ఆ సంస్థ యెంత ఒళ్లు బలిసి వుందో! అసలు ఇలాంటి వాటి ద్వారా వాళ్లు యేమి సాధించదలుచుకున్నారో ఆ సంస్థకి సంబంధించిన వాళ్లు యెవరైనా చెప్పగలరా?

దాన్ని ఓ టూరిస్ట్ అట్రాక్షన్‌ గా ప్లాన్‌ చేసి, ఓ ఐదేళ్లలో పెట్టుబడి రాబట్టుకొని, వదిలేయడం తప్ప, యెవరికి యేమి ఒరుగుతుందో? (ఇప్పటికే అనేక నగరాల్లో వున్న ఇస్కాన్‌ టెంపుళ్ల గతి యెలా వుందో!--చచ్చినాడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు తప్ప.) 

పాశ్చాత్య దేశాల్లో 1940 ల్లోనో యెప్పుడో ప్రారంభమై, 60 లు 70 లలో మనదేశానికి కూడా వ్యాపించిన హిప్పీ కల్చర్--జుట్టు గొరిచించుకోకపోవడం, నెలలతరబడి స్నానం చేయకపోవడం, భంగు త్రాగుతూ, గొట్టాలు పీలుస్తూ, పాడు కుంటూ గడపడం--కీ, జుట్టు గొరిగించుకొని, పిలక మాత్రమే వుంచుకొని, లుంగీలు కట్టుకొని, గురూ షర్టులు వేసుకొని, రుద్రాక్షలు ధరించి, గంతులువేస్తూ పాటలు పాడుకొనీ ఈ ఇస్కాన్‌ వాళ్లకీ, తేడా యేమీ కనిపించదు నాకు.

ఆం.ప్ర.ప్ర. ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, పరిశోధనాలయం డైరెక్టర్ ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం నరసాపురం వచ్చారు మొన్న. 

రాష్ట్ర ప్రభుత్వం 1967 లో ప్రాచ్యలిఖిత గ్రంథాలయం యేర్పాటు చేసింది. 1975 లో దానికి పరిశోధనాలయం జోడించింది. డైరెక్టర్ కాకుండా 30 మంది సిబ్బందితో, యేటా రూ.1.90 కోట్ల ఖర్చు చేస్తోందిట. 

తెలుగు, సంస్కృతం, ఉర్దూ, అరబిక్, పర్షియన్‌ వంటి 16 భాషల్లో సుమారు 24 వేల తాళపత్ర ప్రతులని డిజిటలైజేషన్‌ చేసి భద్రం చేశారట ఇప్పటివరకూ. వాటిలో కేవలం 78 గ్రంథాలని మాత్రం ముద్రించి పాఠకులకి అందుబాటులోకి తెచ్చారట. (ఆ గ్రంథాలయం లో మాత్రమే వాటిని చదువుకోవచ్చేమో). మరికొన్ని మాత్రం ఆన్‌లైన్‌ లో పొందుపరిచారట. వేమన పద్యాలు కొన్ని వేలు సేకరించి, ఓ మూడు వేలు ఎంపిక చేసి, వెబ్సైట్ లో ఉంచారట. 

పురావస్తు రంగాచార్యులు (1822-1900)  "ఒంటిచేత్తో" కూర్పు చేసిన లఘు శబ్దార్థ సర్వస్వం లోని 4 లక్షల పేజీలను (అనేక చేతులతో) డిజిటలైజ్ చేసి, వెబ్సైట్ లో వుంచారట. ఇంకా చాలా చేశారని ప్రస్తుత డైరెక్టర్ గారు చెప్పారు. చాలా సంతోషం.

కంప్యూటర్లు వచ్చింది 1990 ల్లో, డిజిటలైజేషన్‌ వచ్చింది 2000 ల్లో. మరి అంతకు ముందు వారు తాళ పత్రాలతో బాగానే ఆడుకున్నారన్నమాట. బాగుందికదూ.

Wednesday, March 5, 2014

కబుర్లు - 112


అవీ, ఇవీ, అన్నీ

మొన్న తిరుమలలో జగన్‌ వ్యవహారం పై గవర్నర్ తి తి దే వాళ్ల నుంచి నివేదికలు కోరారట. మరి యేమి చర్యలు తీసుకుంటారో చూడాలి. రాజకీయ నాయకులెవరూ దానిగురించి మాట్లాడినట్టు లేదు. లేక అవన్నీ ప్రచురించవద్దని మీడియావాళ్లని యెవరైనా కోరారా?

యెట్టకేలకి ఎన్‌ డీ తివారీ--రోహిత్ తన కొడుకే అనీ, తనకీ ఉజ్వలా శర్మకే పుట్టాడనీ ఒప్పుకొని, గర్వంగా ప్రకటించేశాడు. పైగా, వారసుడిగా అతనికి అప్పగించడానికి తనదగ్గర యేమీ లేదు అని కూడా అన్నాట్ట. మరి ఇన్నాళ్లూ అన్ని వెధవ్వేషాలు వెయ్యడం యెందుకు, కోర్టులదీ, ప్రభుత్వాలదీ, ప్రజలదీ సమయమూ, ధనమూ వృధా యెందుకు చేశాడు అని అడక్కండి. ఇంకా ఆ వయసులో కూడా ఓట్లు దండుకొని, పదవుల్ని అంటిపెట్టుకొని, ప్రజా సేవ చేయద్దూ? ఒప్పేసుకొంటే ఓట్లు రావు కదా.  

వీడు మన గవర్నర్ గా రాజ్ భవన్లో రాసలీలలు కొనసాగిస్తూంటే పదవి పీకేశారనుకుంటా. చింత చచ్చినా పులుపు చావదు కదా?

కేంద్ర హోం మంత్రి చిండా, సారీ షిండే ఓ యేడాది క్రితం రాజ్యసభలో మహారాష్ట్ర లోని భండారాలో జరిగిన అత్యాచారం గురించి ప్రకటనచేస్తూ, ముగ్గురు మైనర్ బాధితురాళ్ల పేర్లూ ప్రకటించేశారట. తరువాత నాలిక్కొరుక్కొని, ఆ ప్రకటన వ్రాసిన రూపొందించిన అధికారులమీద దర్యాప్తు చెయ్యమని ఆదేశించారట. (అప్పటికి జరగవలసిన నష్టం యెలాగూ జరిగిపోయింది). 

ఇప్పుడు ఆ విచారణ సంగతి యేమయిందో చెప్పమని స హ దరఖాస్తు చేస్తే, బదులే లేదట. అప్పీళ్ల తరువాత సీ ఐ సీ విచారణ నిర్వహిస్తే, ఆ దర్యాప్తు తాలూకు దస్త్రమే కనపడ్డం లేదు పొమమ్మన్నారట సీ ఐ సీ వారిని! ఆయనక్కోపం వచ్చి, సంబంధించిన అధికారులకు షో కాజ్ నోటీసులు ఇప్పించారట. ఆ దస్త్రాలు యేమౌతాయో.....మళ్లీ స హ దరఖాస్తు చెయ్యాలేమో!

మొన్న ఓ అరవాయన ఇడ్లీలు కిలోల్లెక్కన అమ్ముతున్నాడని తెలిసింది కదా. ఇప్పుడు బెంగుళూరులో ఒకాయన (మయ్యాస్ సంస్థ అధిపతి సదానందమయ్య) ప్రపంచం లో మొదటిసారి చక్కిలాల తయారీ యంత్రం రూపకల్పన చేసి, గంటకి 4,500 చక్కిలాలు, తక్కువ నూనెతో తయారు చేసేస్తున్నాడట. ఇంకా చిత్రం యేమిటంటే, బియ్యాన్ని పిండి ఆడడం దగ్గరనుంచీ అన్నీ యంత్రమే చేసి, చక్కిలాలు బయటికి వచ్చేస్తున్నాయట. మిక్కిలి చక్కిలంగా లేదూ!

2005 కి ముందు వెలువడిన 500, 1000 రూపాయల నోట్లు ఈ సంవత్సరం  డిసెంబర్ నెలాఖరు వరకూ యే ఆంక్షలూ లేకుండా చెల్లుబాటు అవుతాయని ప్రకటించారు. ఈమధ్య ఒకాయన తన డబ్బు బ్యాంకుఖాతాలోడెపాజిట్ చేద్దామని వెళ్లి, చలాన్‌ వ్రాస్తూండగా, ఇంకొకతను వచ్చి, ఓ 500 నోటిచ్చి, వంద నోట్లు ఇవ్వండి, మీరు యెలాగూ బ్యాంకులో కట్టేసేవే కదా అనడిగితే, పోనీ పాపం అని ఇచ్చాడట. తీరా ఆ నోటు క్యాషియర్ కి ఇస్తే, మిషన్‌ లో వేసి, అది దొంగనోటు అని తేల్చారట! ఇచ్చినవాడు యెప్పుడో గాయబ్! ఇంతకీ్ ఆ నోటు మీదున్న సంవత్సరం 2012! మరి 2012 వరకూ వెలువడిన నోట్లని యెప్పుడు రద్దు చేస్తారో?

Monday, March 3, 2014

కబుర్లు - 111


అవీ, ఇవీ, అన్నీ

111 వ టపా సందర్భంగా, వెంకన్న బాబు గుడి మీద యేమైనా సణగాలనుకున్నాను. కానీ పెద్ద ముఖ్యమైనవేవీ లేవు. ఇదివరకే అన్నీ సణిగేసినవే మరి. ఒకప్పటి ఈవో ఐ వై ఆర్ కృష్ణారావు ప్రాభుత్వ ముఖ్య కార్యదర్శి పదవి వస్తుందనుకొంటే  పాతాయన్నే పదవి లో కొనసాగించడంతో మనస్తాపం చెందారట.

ఆ మధ్య ఒకాయనో ఆవిడో, ఇంకో ఆయన్ని "మృత్యు బేహారి" అన్నారట. ఇప్పుడు పిల్లకాకి ని ముద్దు పెట్టుకోడానికి యెగబడి, ఒకావిడ సజీవ దహనం అయిందట. మరి వాణ్ని యేమనాలో?

ఫిబ్రవరి 26 న అస్సాం లోని జోర్హాట్ లో 600 మంది మహిళా స్వయం సంఘాల సభ్యులతో సమావేశం సందర్భం లో మహిళలు తమ అభిమానం చాటుకోడానికి ఆయన్ని కౌగిలిoచుకొని, ముద్దు పెట్టుకోడానికి యెగబడ్డారట. (బహుశా ప్రథాని పత్ని అయ్యే ఛాన్‌స్ యేమైనా వుండచ్చు అని భ్రమ పడ్డారేమో!). ఇంకేం, మీడియావాళ్లు పదే పదే టివీల్లో ఆ సీన్లు చూపిస్తుంటే, ఓ భర్త తన భార్య ఆయన్ని అన్ని సార్లు ముద్దుపెట్టుకోవడం--అదే వాళ్లు అలా చూపించడం తో మనస్తాపం చెంది, ఇంట్లో తన భార్యని గదిలో బంధించి, కిరోసిన్‌ పోసి నిప్పు అంటించాడట. ఆవిడ అక్కడికక్కడే మరణించగా, ఆవిడతో పెనుగులాటలో అతనికి కూడా గాయాలై, చికిత్స పొందుతున్నాడట.

అసలు సంగతి యెలా వున్నా, పార్టీ నేతలూ, పోలీసులూ అసలు ఆవిడ ముద్దే పెట్టుకోలేదు అనీ, పెట్టుకున్నా టీవీలో అది చూపించనేలేదనీ, ముద్దు పెట్టుకోడానికి అనుమతి పొందినవారి జాబితాలో ఆవిడ పేరే లేదనీ, ఆవిడ దగ్గరకి వచ్చే అవకాశమే లేదనీ, భర్తతో గొడవలవల్లే ఆవిడని ఆవిడే అంటించేసుకొందనీ కవరింగులు మొదలు పెట్టారట.

వేలం వెర్రుల్ని ప్రోత్సహించడం యెందుకు, నాటకాలాడ్డం యెందుకు!

పాకిస్థాన్‌ వాయవ్య ప్రాంతం లో ఖైబర్ గిరిజన ప్రాంతం లోని, పెషావర్ కి కేవలం 30 కి. మీ. దూరం లో జామృద్ ప్రాంతం లో పసిపాపలకి పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ధ్వంసం చేస్తూ, తాలిబాన్లు బాంబు దాడి చేసి, ఓ పసిగుడ్డునీ, 12 మంది సిబ్బందినీ చంపేశారట! పోలియో చుక్కల కార్యక్రమాలని వాళ్లు నిషేధించారట--అమెరికాకి వ్యతిరేకంగా! ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పదుల్లో ఆరోగ్య కార్యకర్తలూ, భద్రతా సిబ్బందీ చనిపోయారట.

తమ పిల్లలనే చంపుకునే ఇలాంటి రాక్షసులు ఇంకా భూమ్మీద తిరుగాడడానికి దేవుడు యెందుకు అవకాశం ఇస్తున్నాడో! (బహుశా వాళ్ల పాపం ఇంకా పండలేదు అంటారేమో ఆధ్యాత్మ వాదులు.)

మొన్న మహాశివరాత్రి సందర్భంగా రష్యన్‌ వనితలు పాలకొల్లు లో, పాలకొల్లుకే చెంది, రష్యాలో తమకి శిక్షణ ఇస్తున్న తమ గురువైన ఇంకో వనితతో వచ్చి, తమ కూచిపూడి నృత్య ప్రావీణ్యాన్ని ప్రదర్శించారట. వాళ్లు రష్యాలో చదువుకుంటూ, వుద్యోగాలు చేసుకుంటూ, కఠోర దీక్షతో నృత్యాన్ని అభ్యసించి, మనదేశం లో ప్రదర్శించడం యెంత గొప్ప విషయం! ఒళ్లు పులకించింది.

వాళ్ల పేర్లు చదువుతుంటే, నేరెళ్ల వేణుమాధవ్ మిమిక్రీ లో ఓ జోక్ గుర్తొచ్చింది. ఓ తెలుగువాడు మాస్కోలో రోడ్డుమీద కాలుజారి పడిపోతూ, "అయ్యోవ్! బాబోవ్! చచ్చాన్రోవ్!" అని అరిస్తే, మూడు ప్రక్కలనించి ముగ్గురు వచ్చి, "యెందుకు పిలిచావ్?" అనడిగారట. మనవాడు "నేను యెవర్నీపిలవలేదే!" అన్నాడట.

వాళ్ల ముగ్గురి పేర్లూ అవే మరి!  

Thursday, February 27, 2014

కబుర్లు - 110



అవీ, ఇవీ, అన్నీ

సౌదీ అరేబియా లో ఓ 30 యేళ్ల కుమారుడు తల్లితో కలిసి కారులో వెళ్తూండగా ఒక విషయం లో ఇద్దరికీ గొడవ వచ్చి, తల్లి ముఖం పై కొట్టడంతో ఆమె ఒక పంటిని కోల్పోయిందట. ఆవిడ పోలీసులకి ఫిర్యాదు చేస్తే, న్యాయస్థానం కొడుకు పన్నొకటి పీకెయ్యవలసిందిగా శిక్ష వేయడమే కాకుండా, 2400 కొరడా దెబ్బలు, (ఇంకా బతికి వుంటే) అయిదేళ్లు జైలు శిక్ష విధించాలని న్యాయ మూర్తి ఆదేశించారట.

"నేను విధి నిర్వహణలో కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నా. అసత్య ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల దృష్టి మరల్చాలని ప్రతిపక్షాలు చూశాయి. నేను బలహీనుణ్ణి కాను" అన్నాడట మొన్న  సుశీల్ షిండే. చూస్తే మన పాత తెలుగు సినిమాల అరవ విలన్‌  "కొట్టార్కఱ" లా వుంటాడు. అంత లావు లేడుగానీ "నెల్లూరు కాంతారావు" లా కూడా వుంటాడు. బలహీనుడు అని యెవరన్నారో మరి.

నిన్నేమో, "ఓ టీవీ ఛానెల్ వాళ్లు యేదేదో మాట్లాడుతున్నారు.......వాళ్లని అణిచేస్తాము" అన్నాడట. ఇంకా యెవరైనా అంటారా బల హీనుడు అని?

మొన్న ఒక ఉపాధ్యాయురాలు ఫరీదాబాద్ లో, హెడ్ ఫోన్‌స్ తో, మొబైల్ లో మ్యూజిక్ వింటూ పట్టాలు దాటుతుంటే, ఓ రైలు వచ్చి గుద్దేసి, వెంటనే తునాతునకలై చచ్చిపోయిందట.  ఆమెకి గతేడాదే వివాహం అయిందట. హెడ్ ఫోన్లు లేకుండావుంటే ఆ ప్రమాదమే జరిగేదికాదు అంటున్నారట పోలీసులు. చూశారా యెంత ఘోరమో! సంగీతం అంటే యెంత ఇష్టం అయినా వుండొచ్చు. అలా అని వేళా పాళా లేకుండా ఇలా చెయ్యడం యెందుకు?

రైళ్లలో కూడా చూస్తూ వుంటాం. అందరూ నిద్ర పోయే సమయం లో మొబైల్ లో పాటలు గట్టిగా పెట్టేస్తూ వుంటారు. అవి యెంత గొప్ప పాటలైనా అవ్వచ్చు, శాస్త్రీయ సంగీతం అయ్యుండవచ్చు, అందరూ మామూలుగా చాలా ఇష్టపడే పాటలే కావచ్చు. కానీ సమయం, సందర్భం ఉండొద్దూ? అంతకీ వినాలని వుంటే హెడ్ ఫోన్లు పెట్టుకొని వినొచ్చుగా? ఈ పిచ్చి మధ్యాహ్నం పూటకూడా వుంటుంది కొంతమందికి. ఏసీల్లోనూ, స్లీపర్లలోనూ ప్రయాణించేది విశ్రాంతిగా గమ్యాన్ని చేరడం కోసమే కదా? ఆలోచించండి.

Sunday, February 23, 2014

కబుర్లు - 109


అవీ, ఇవీ, అన్నీ

నందన్ నీలేకణి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించేశాడు. కాంగ్రెస్ అభ్యార్ధిగా లోక్ సభకి పోటీ చేస్తానని కూడా చెప్పేశాడు. శుభం! 

ఇంక యూ ఐ డీ ఏ ఐ ని యెవరైనా ముందుకు తీసుకెళ్లగలరు అని కూడా సెలవిచ్చారు. 2015 కల్లా (అంటే యెన్నేళ్లో?) 90 కోట్ల ఆథార్ కార్డుల జారీ పూర్తవుతుందనీ, ఇప్పటివరకూ 58.7 కోట్ల సంఖ్యల జారీ పూర్తి అయిందని కూడా సెలవిచ్చారు. (మన దేశ జనాభా యెంతో?). 

నేనైతే, వచ్చే ప్రభుత్వం ఆథార్ ని యెప్పుడు కుంభకోణం గా ప్రకటిస్తుందా, యెప్పుడు భారత ప్రజలకి మాత్రమే అని ప్రకటిస్తుందో, సంబంధీకులని జైళ్లకి యెప్పుడు పంపిస్తుందో అని యెదురు చూస్తాను.

చిత్తూరు నగరం గంగపల్లె లోని క్యాన్‌ఫర్డ్ పాఠశాలలో మగ-మగ, ఆడ-ఆడ, మగ-ఆడ, ఇలా 26 జతల కవల పిల్లలు ఉండడం, అంతర్జాతీయ కవల దినోత్సవం నాడు ఫోటో తీయించుకొని ప్రచురించడం బాగుంది.

కవలగురించి కొన్ని విచిత్రాలు........మన పురాణాల్లో ఆడ, మగ కవలలు జన్మిస్తే, వాళ్లని మిథునం అన్నారు. వాళ్లిద్దరూ పెద్దయ్యాక పెళ్లి చేసుకోవచ్చట!

కవలల్లో యెవరు పెద్ద? అనేది ఓ పెద్ద ధర్మ సందేహం. పాశ్చాత్య దేశాల్లో, గర్భం నుంచి యెవరు ముందు బయటపడితే, వాళ్లే పెద్ద అని గుర్తించేవారు.  అలా పెద్ద పెద్ద ఎస్టేట్లనీ, టైటిళ్లనీ కొద్ది సెకన్ల తేడాతో కోల్పోయిన వాళ్లున్నారు. ప్రఖ్యాత బ్రిటిష్ ప్రథాని విన్‌స్టన్ చర్చిల్ తన అన్నగారికన్నా కొన్ని క్షణాలు ముందు పుట్టి వుంటే, "9 వ డ్యూక్ ఆఫ్ మార్ల్ బరో" గా కొన్ని వందల యెకరాల ఎస్టేట్ యజమాని అయి వుండేవాడు. (కానీ అలా అయితే చరిత్రలో నిలిచిపోయేవాడు కాదు కదా?) ప్రపంచాన్ని 3 దశాబ్దాలపాటు శాసించి, తన గొప్ప దేశం ఇస్తానన్న బిరుదులన్నీ అఖ్ఖర్లేదని, చివరికి "డ్యూక్ ఆఫ్ లండన్" ని కూడా తిరస్కరించేవాడుకాదుకదా?

మన దేశ పధ్ధతి ప్రకారం, వెనుక పుట్టినవాడి "పిండమే" ముందు యేర్పడుతుంది కాబట్టి, తరవాత (ఆలస్యంగా) పుట్టినవాడే పెద్దవాడు! ఈ న్యాయం ప్రకారం మన తెలుగు సామ్రాజ్యాల చరిత్రలే మారిపోయాయి! (అడవి బాపిరాజుగారి నవలలు చదవండి). ఇవీ విచిత్రాలు. 

మొన్న మొగల్తూరు లోని రామాలయం నుంచి నరసాపురం మండలం కొప్పర్రు వరకూ రహదారి పనులకి షార్ డైరెక్టర్, "పద్మశ్రీ" డాక్టర్ ఎం వై ఎస్ ప్రసాద్ భూమి పూజ చేశారట. బాగుంది. కానీ, పేరు ముందు పద్మశ్రీ పెట్టుకొనే కదా మోహన్ బాబు చీవాట్లు తిని, ప్రభుత్వం వారు దాన్ని వెనక్కి తీసుకోవాలని కోర్టు చెప్పింది? పద్మశ్రీ తరవాత గ్రహీత అని వ్రాస్తే పత్రికల వాళ్ల  సొమ్మేం పోయింది?

మొన్ననే భీమవారం బైపాస్ రోడ్డుప్రక్కన గుట్టలు గుట్టలుగా 2012 లో తయారై 2012 మార్చి దాకా పనికొచ్చే నిరోధ్ ప్యాకెట్లని పారేశారని ఫోటో కూడా వేశారు ఈనాడులో. ఇదివరకు ఇవి జనాభా నియంత్రణ కోసం ఉపయోగిస్తే, ఇప్పుడు ఎయిడ్స్ వ్యాప్తి నిరోధానికి వాడుతున్నారట. ఇంకెక్కడి నియంత్రణా, నిరోధం?

మా చిన్నప్పుడు నిరోధ్ లు కొత్తగా వచ్చినప్పుడు, ప్రతీ చిల్లర కొట్లోనూ 5 పైసలకే 3 నిరోధ్ లు అమ్మే యేర్పాట్లు చేశారు ప్రభుత్వం వారు. మామూలు బెలూన్లు 2 పైసలకి ఒకటి. అయినా అవి చాలా చిన్నవి. నిరోధ్ లని వూదితే, దాదాపు 2 అడుగుల పొడవూ, ఓ అడుగు వెడల్పూ తో పెద్ద బెలూన్లు వచ్చేవి! వాటిని దారంతో కట్టేసి, చివరి రింగులో ఓ పదిపైసల నాణెం దోపితే అది లేచి నిలబడేది! నాణెం సరిపోకపోతే పుల్లలు పెట్టేవాళ్లం. అలా పిల్లలు ఆడుకోడానికి ఇచ్చేసినా పరమార్థం నెరవేరేదికదా? అలా పారబొయ్యడమెందుకో?

ఆర్టాఫ్ లివింగ్ గురూ మొన్న ఓ ప్రత్యేక రైలులో వచ్చి కొవ్వూరు, తణుకు, భీమవరం, ఆకివీడు రైల్వేస్టేషన్లలో భక్తులని ఉద్దేశించి ప్రసంగించారట. విదేశాల్లోని స్విస్ బ్యాంకుల్లో మనవారిది రూ.1.45 బిలియన్స్ నల్లధనం ఉందనీ, దానిని బయటికి తీసుకు వస్తేనే దేశం లోని పరిస్తితిలో మార్పు తథ్యమనీ, ఇంకా చాలా విషయాలు చెప్పి, సమాజం లో ప్రతిఒక్కరూ ఆత్మ విశ్వాసంతో ఈశ్వరునిపై నమ్మకం కలిగి ఉండాలని బోధించారట. ఆఫ్టరాల్--హి నోస్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్!

ప్రఖ్యాత వీణ విద్వాంసుడు చిట్టిబాబు కచేరీ చేస్తుంటే, యెవరైనా ఈలలు వేస్తె, నిర్మొహమాటంగా ఈలలు వేసుకునేవాళ్లు ప్రక్కవీధి లోకి వెళ్లి వేసుకోండి అనేవారు. ఆ కార్యక్రమం యెంతో పవిత్రమైనది అని ఆయన భావించడమే కాకుండా, ఆ వాతావరణమే సభలో వుండేలా చేసేవారు. కీర్తన ఇంకా క్లైమాక్స్ కి రాకుండానే ఓ సంగతి నచ్చి యెవరైనా చప్పట్లు కొడితే, మిగిలినవాళ్లు అనుసరించేవారు. కీర్తన పూర్తయ్యాక, ఇప్పుడు కొట్టండి చప్పట్లు అనేవారు. (మధ్యలో చప్పట్లు కొడితే ఆయన యేకాగ్రత దెబ్బతినే అవకాశం వుండచ్చు కదా). అక్కణ్ణుంచీ కీర్తన పూర్తయ్యే వరకూ యెవరూ చప్పట్లు కొడితే ఒట్టు. అంత బాగా జరిగేవి ఆ కచేరీలు. 

బొంబాయి సినిమాలో విదియా, తదియా అని ఉన్న ఓ పాట సెన్‌సార్ వారి దృష్టి నుంచి తప్పించుకొంది అన్నారోసారి బాల సుబ్రహ్మణ్యం. అమెరికాలో రాగసాగరిక క్రింద పాడుతా తీయగా కార్యక్రమం లో గాయని సుజాతతో ఆయన ఓ పాట పాడిన విధానం, మధ్య మధ్యలో ఒకళ్లనొకళ్లు ఉద్దేశించినట్టుగా పాటలు పాడడం నాకు నచ్చలేదు. ఇంత కంటే యేమీ అనలేను. యెందుకంటే అందరూ దీన్నో గాసిప్ కాలం అనుకొనే ప్రమాదం వుంటుంది అని. యెవరి మనో భావాలనైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ని.


Friday, February 21, 2014

కబుర్లు - 108


అవీ, ఇవీ, అన్నీ

మొన్న మన బడ్జెట్లో చిదంబరం కార్ల పరిశ్రమకి ఉద్దీపనలు ప్రకటించగానే, కార్ల రేట్లు తగ్గుతున్నాయి. మరి సామాన్యులకి ఆమాత్రం వెసులుబాటు కలిగించొ్ద్దూ ఎలక్షన్ల ముందు? సామాన్యులకి యేమి ఒరిగింది అంటారా? పాపం బైక్ లు 2.65 లక్షల నుంచి 58 లక్షల వరకూ (హార్లే డేవిడ్ సన్ బైక్ ల ధరలు చూడండి), కార్లు 5.56 కోట్ల నుంచి 46 కోట్లవరకూ (లాంబోర్గినీ వాడు ఇప్పటికే 200 కార్లు అమ్మి, సం వత్సరాంతం లోపల ఇంకో 400 అమ్మేస్తానని మొన్నెప్పుడో చెప్పాడు) చెల్లించి కొనేసి కష్టపడుతున్నారు కదా మరి?

2 వేల రూపాయల లోపు సెల్ ఫోన్ల రేట్లు యెందుకు పెంచాడంటారా? మరి ప్రతీ తమిళ తంబీ ఆయన సెల్ నంబరు సంపాదించేసి, ఇరవైనాలుగు గంటలూ ఆయన్ని విషయించేస్తున్నారట! (మనవాళ్లకి అంత సీను లేదు లెండి.)

అదీ సంగతి.

అన్నట్టు తిండి విషయం లో మాత్రం అరవ్వాళ్లనే ఆదర్శంగా తీసుకోవాలి అందరూ. "అమ్మ" హోటెళ్లలో చాలా చవకగా భోజనాలూ, టిఫిన్లూ పెట్టేస్తున్నారు. ఇప్పుడొకాయన ఒక కిలో ఇడ్లీలు 35 రూపాయలకి అమ్మేస్తున్నాడట! కిలోకి 24 ఇడ్లీలు తూగుతున్నాయట. సాంబారు విడిగా కొనుక్కోవాలటలెండి. ఓ 50 రూపాయలు పెడితే, 5 గురికి కడుపు నిండుతోందట. ఆయన ఆధునిక యంత్రాలతో వాయికి నాలుగువందలో యెన్నో తయారు చేసేస్తున్నాడట. మరి మనవాళ్లు యేమైనా ప్రయత్నిస్తారేమో చూడాలి. (యెవరైనా ప్రయత్నించినా యేమౌతుందో అందరికీ తెలుసు).

రైళ్లు "దురంతం" చెందడానికి బ్రహ్మాండంగా దోహదం చేసిన మమతాదీ ప్రభుత్వ బంగళా లో వుండడం లేదట, రూపాయే జీతం తీసుకుంటోందట. ఇంకా ఇరవైమూడో యెన్నో ఉన్న ఆయన కార్యక్రమాలన్నీ అమలు చేస్తానందట. అందుకని అన్నా హజారే ఆమెకి పూర్తి మద్దతు ప్రకటించడమే కాకుండా, రేపు ప్రచారం కూడా చేస్తానన్నాడట.

నాకో విషయం గుర్తుకు వస్తోంది. సంజయ్ గాంధీ తన విపరీత ధోరణులతో జనాగ్రహం చవిచూస్తున్న రోజుల్లో ఓ సారి ఇందిర తో వెళ్లి, ఆచార్య వినోబాభావే ని కలిశాడట. ' నా కొడుకు, పేరు సంజయ్ ' అని చెప్పగానే, ఆయన ' చాలా మంచి పేరు. భగవద్గీతలో 32 సార్లు ఆ పేరు వస్తుంది ' అన్నాట్ట సంతోషంగా! (ముఫ్ఫైరెండో యెన్నో నాకు సరిగ్గా గుర్తులేదు.) అలాగ, వీళ్లు పూర్తిగా సన్యాసుల్లా వున్నా బాగుండును--అనవసరంగా రాజకీయాల్లో కలగజేసుకోకుండా. అబ్బే!

రాజీవ్ హంతకులుగా శిక్ష పడ్డవారిని విడుదల చేస్తామని జయలలితా ప్రకటించగానే, సుప్రీం కోర్టుకి పరుగెత్తి, స్టే తెచ్చుకొని, పరువు కాపాడు కున్నారు ప్రభుత్వo వారు. ఈ సందర్భం లో, ఓ ప్రబుధ్దుడు ' బీజేపీ వాళ్లు కసబ్ ని ఉరి తీసేవరకూ ఊరుకోలేదు, ఇప్పుడు మాట్లాడటం లేదు ' అన్నాడట! ఈ రెండు సందర్భాలనీ ఒకే గాట కట్టడం లోనే తెలియడం లేదూ వాడి తెలివి? వీళ్లకి ఉరి శిక్ష పడినా అమలు చెయ్యకుండా 23 యేళ్లుగా మగ్గబెడుతుంటే, సుప్రీం కోర్టు ఆ శిక్షని యావజ్జీవ శిక్షగా మార్చాక కదా, మానవతా దృక్పథం అనే రాజకీయ ఆలోచనతో ఈ పాచిక వేసింది ఆవిడ? రాహుల్ చెల్లెలు ప్రత్యేకంగా జైలుకి వెళ్లి, నళిని కలిసి, ఆవిడ చిన్న పిల్లతో వుంది కనక ఉరిశిక్ష వెయ్యకూడదు అంటే, ఆ తరవాత కదా ఆవిడ శిక్షని తగ్గించింది ప్రభుత్వం?

మా జిల్లాలో ఈ నెలాఖరులోపల రేషం కార్డులని ఆథార్ తో అనుసంధానం చేసుకోకపోతే ఒచ్చే నెల నుంచి సరుకులు ఇవ్వబోమని ప్రకటించేశారు. రాహుల్! వింటున్నావా? నారాయణ స్వామి యేం చెప్పాడో గమనించావా? మళ్లీ ఓ సారి ' ప్రథాన్ మంత్రీజీ ' అంటావా?



Wednesday, February 19, 2014

కబుర్లు - 107


అవీ, ఇవీ, అన్నీ

మొన్న లోక్ సభలో ఒక ఎం పీ పెప్పర్ స్ప్రే జల్లాక, మన ప్రథాని "నా  హృదయం ముక్కలయింది" అన్నాడట! ఇలాంటివాళ్లనే పి నా కొ లంటారు. (ఒక్కో అబధ్ధం ఆడినప్పుడల్లా వాడి ముక్కు కొంచెం పొడుగు పెరుగుతుందట). ఈయన ముక్కు పెరగదులే అని ధైర్యం మరి. కనీసం ఆ స్ప్రే చల్లిన, వాళ్ల పార్టీ వాడే అయిన ఎం పీ ని 'అలా యెందుకు చేశావు' అని అడిగాడా? రాణీగారి కోటరీలోని కమల్ నాథ్ ని 'కత్తి తెచ్చాడన్నావు. యేమిటి నిజం?' అనైనా అడిగాడా? మొహాన చిరునవ్వు కూడాలేని ఆయన మౌనంతో్ యెంతమంది హృదయాలు యెన్నిసార్లు ముక్కలయ్యాయో యెప్పుడైనా పట్టించుకున్నాడా?

గడచిన 8 యేళ్ల యూ పీ ఏ పాలనలో (2005-13) దేశవ్యాప్తంగా 1,94,500 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు నేలపాలయ్యాయట. అందులో 84% (1,63,576 మె.ట) బియ్యం, 14% (26,543 మె.ట) గోధుమలు ట. ఇలా అని సాక్షాత్తూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా "సమాచార హక్కు చట్టం క్రింద" అడిగితే చెప్పిందట! సాక్షాత్తూ సుప్రీం కోర్టు వాటిని ఉచితంగా పంచి పెట్టమన్నా పెడచెవిని పెట్టి వాళ్లు వెలగబెట్టిన నిర్వాకమిది! ఇప్పటికీ, నిల్వ చేసే గోదాములు నిర్మించడం, ఉన్నవాటిలో అధ్వాన్న పరిస్థితులని చక్కదిద్దడం గురించి ఈ ప్రభుత్వాలకి పట్టడం లేదు. 

పిల్ల కాకేమో (పిల్ల రాబందు అనొచ్చేమో) "స. హ. చట్టం నేనే తెచ్చాను, అవినీతి బిల్లూ, అదేదో మత సామరస్యం బిల్లూ, ఇంకేవో అన్ని బిల్లులూ నేనే తెచ్చాను" అంటున్నాడు. అనేక రాష్ట్రాల్లో, అనేకమంది సాంఘిక కార్యకర్తలు చేసిన కృషి తో వచ్చిన చట్టాన్ని తానే తెచ్చానని యెవరి చెవుల్లో పువ్వులు పెడదామనుకుంటున్నాడో! (వాళ్లలో ముఖ్య కార్యకర్త జాతీయ సలహా సంఘం నుంచికూడా బయటికి వెళ్లిపోయారు)

లక్షలు పోయి కోట్లు వస్తాయని అప్పుడెప్పుడో సణిగాను. ఇప్పుడు 'లక్ష' స్థానం లో 'కోటి కుంకుమార్చనలు'  వచ్చాయి. అసలు ఈ కోటి యెలా లెక్కేస్తారో నాకు సందేహం. లక్ష రేణువులో, లక్ష చిటికెలో, లక్ష గుప్పెళ్లో, దోసెళ్లో అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా లక్ష కేజీలో, టన్నులో అన్నా అర్థం చేసుకోవచ్చు. మరి వీటినెలా లెక్కెయ్యాలో!

మొన్న ఈనాడు లో ఓ చిత్రమైన వార్త వచ్చింది. ఓ ఆధ్యాత్మిక పీఠం అధిపతి, డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు "వర్ధంతి సభలో" మాట్లాడుతూ ఇలా చెప్పారు అని. చెప్పినాయన పేరు ఉమర్ ఆలీషా సద్గురు అని వ్రాశారు. ఇదెలా సాధ్యమో మరి.

ఇంకో చోట ఇంకో స్వామీజీ "మారుతున్న సమాజం లో మానవ శరీరానికి, మనస్సుకు శాంతి అవసరం" అనీ, "తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నవారికి అతిథి సత్కారం చేయడం తెలియదు" అనీ అన్నారట. మరి విన్నవాళ్లు యేమి అర్థం చేసుకున్నారో!

మా వూరి ఇంజనీరింగ్ కాలేజీ యువ శాస్త్రవేత్తలు "గార్లెన్ డివైజ్" అనే ఓ పరికరం కనిపెట్టారట. దానితో యెంత యెత్తులో వున్న విగ్రహానికైనా పూల మాల వేసెయ్యచ్చుట. విగ్రహానికి మెట్లూ, నిచ్చెనలూ అవసరం వుండదట. మన అన్ని పార్టీల రా నా ల నుంచీ మంచి డిమాండ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా వుంటాయి కదూ?   



Tuesday, February 11, 2014

కబుర్లు - 106


అవీ, ఇవీ, అన్నీ

ఈ మధ్య దేవుళ్ల, దేవతల విగ్రహాల అలంకారాలలో వెరయిటీ ప్రవేశపెట్టారు. నవనీతం (అంటే వెన్న అనుకుంటా), చెర్రీ పళ్లూ, బాదం, పిస్తా, జీడిపప్పులూ వగైరాలతో అలంకారం చేస్తున్నారు. (ఆ వ్యాపారుల లాబీలు బాగానే పనిచేస్తున్నాయన్నమాట. ఇంక వాటికి కూడా ద్రవ్యోల్బణం దెబ్బ తగులుతుందన్నమాట).

అన్నట్టు, మొన్న రథసప్తమి సందర్భంగా, 06-02-2014 న శ్రీగిరి శ్రీవారి గరుడవాహనం వూరేగింపులో గరుడుడి చేతులు "ఖాళీ" గా వున్నాయి! అంటే స్వామికి కృత్రిమకాళ్లు తగిలించి, గరుడుడి చేతుల్లో పెట్టలేదన్నమాట. మరి హనుమంత వాహనం సంగతి తెలీదు. 

ఈ వచ్చిన బుధ్ధిని కొనసాగిస్తే బాగుంటుంది.

మన ఆచారాలగురించీ, సాంప్రదాయాలగురించీ, పండుగల గురించీ, ప్రతీమాసం, అందులో ప్రతి తిథీ వాటి గొప్పతనం గురించీ వ్రాసేవాళ్లు, చెప్పేవాళ్లు యెక్కువైపోయారీమధ్య. తప్పులేదు లెండి. యెవరి గొప్పతనం వారిది.

రథ సప్తమిరోజు తలమీద 7 జిల్లేడు ఆకులూ గానీ, రాగి ఆకులుగానీ (రావి ఆకులని కవి హృదయం అనుకుంటా) పెట్టుకొని స్నానం చేయడం సంప్రదాయం అంటాడొకడు. రేగు పండు సంగతి జ్ఞాపకం లేదు వాళ్లకి. పైగా ఒక్క ఆకు సరిపోతుందనీ తెలియదు.

సూర్యకాంతిలో యేడు రంగులనీ, అవే రథానికి 7 గుర్రాలు అనీ, ఒకే చక్రం--అదే కాల చక్రం అనీ చెపుతారు. ఇంకొకడు ఒకే గుర్రం అనీ, దాని పేరు "సప్త" అనీ, అందుకే "సప్తాశ్వుడు" అనీ అంటాడు.

ఈ మధ్య షణ్ముఖ శర్మ గారు (అదేదో సినిమాలో ఒకడి పేరడిగితే, తలుముక తెలమ అని పలుకుతాడు) "నల్లనువ్వులూ" "తెల్లనువ్వులూ" అన్నాడని వ్రాస్తున్నారు. ఆయన అలా అన్నాడో లేదో గానీ, "దుక్కి దున్నావా, విత్తుజల్లావా, పైరు కోశావా, నూనె తీశావా....." లాంటి డైలాగు వెయ్యాలనిపిస్తుంది. 

బ్యాంకాక్ లో ఆరువేలకోట్ల రూపాయల ఖర్చుతో, దమ్మకాయ సంస్థ ఓ బుధ్ధ స్థూపాన్ని నిర్మించారట. దాని మీద 3 లక్షల బుధ్ధ ప్రతిమలు ఒకే సైజు, ఆకారం లో నిర్మించారట. చూస్తుంటే, పైన చుక్కల చుక్కల డిజైన్ వేసినట్టు కనిపిస్తుందట. స్థూపం లోపల మరో 7 లక్షల విగ్రహాలని పెట్టే పనిలో వున్నారట. యెంత బుధ్ధ భక్తో!


Saturday, February 1, 2014

కబుర్లు - 105


అవీ, ఇవీ, అన్నీ

గాంధీగారి వర్ధంతి సందర్భంగా మళ్లీ అందరూ "రాజ్ ఘాట్" సందర్శించారు. నాకో చిన్న సందేహం. బ్రిటిష్ వాళ్ల రాజ్యాన్ని "రాజ్" అని వ్యవహరిస్తారు. వాళ్ల కాలంలో ఆ ప్రాంతాన్ని రాజ్ ఘాట్ అనే వారేమో. ఆ పేరు ఇంకా మన బానిసత్వానికి గుర్తుగా అలాగే వుండాలా? కనీసం ఇన్నేళ్ల తరవాతైనా, యే "మహాత్మా ఘాట్" అనో పేరు మార్చచ్చు కదా?

పటేల్ మా పార్టీవాడు, నేతాజీ మా పార్టీవాడు అనడమే గానీ, వీళ్లకి కనీస స్వతంత్ర అలోచనలు వుండవెందుకో? (పాపం ప్రథాని "పటేల్ గొప్ప సెక్యులరిస్ట్" అంటే, మోడీ వెంటనే "అందుకే ఆయన ముందు సోమనాథ దేవాలయాన్ని పునరుధ్ధరించాడు!" అన్నాడు. మరి కాంగీలు కుయిక్కుమంటే ఒట్టు!)

మళ్లీ ఈసారి భారత రత్నలూ అవీ వాల్మీకికీ, వ్యాసుడికీ, బుధ్ధుడికీ వగైరాలకి ఇచ్చేస్తారేమో అనుకున్నాను. నిజం చెప్పొద్దూ, నాక్కూడా ఇచ్చేస్తారేమో అని భయపడ్డాను. యెందుకంటే, నా పేరున "అకాడమీలు" యేమీ లేవుకదా? (హాకీ వీరుడు ధ్యాన్ చంద్ పేరున చాలా అకాడమీలు వున్నాయి కాబట్టే ఆయనకివ్వకుండా సచ్చిన టెండూల్కర్ కి ఇచ్చామన్నాడో మంత్రి!). యేదోలెండి, ఈసారికిలా సరిపెట్టుకున్నాం.

'అవినీతి పెరిగిపోతోందంటూ జనాలు ఆక్రోశించడానికి (కాగ్ లాంటి) "రాజ్యాంగ వ్యవస్థలే" కారణం తప్ప, యూపీయే లో అవినీతి చాల తక్కువ' అన్నాడట పిచ్చిదంబరం. ఇంకా అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ అన్నట్టు, అవినీతి "గ్లోబల్ ఫినామినన్" అనికూడా అన్నాట్ట! మనం పేపర్లలో చదువుతున్న వివిధ దేశాల్లో జరుగుతున్న అవినీతి తో పోలిస్తే, మనది (సముద్రంలో కాకిరెట్టే అనలేదుగానీ) చాలా తక్కువ అని కూడా అన్నాట్ట. 

మొన్నామధ్య ప్రథాని, "ప్రథాని మీద ఆరోపణలు యెక్కడైనా చేస్తారా?" అంటూ ఆక్రోశించాడు.

మరి విదేశాల్లో అధ్యక్షులనీ, ప్రథానులనీ, రాజకుటుంబాలవారినీ కూడా అవినీతి ఆరోపణలపై యావజ్జీవ శిక్షలూ, ఉరిశిక్షలూ విధించారని కూడా మనం ఆ పేపర్లలోనే చదివాము. మనకెంత సిగ్గులేదో మరి!

ఒకప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ (ఇప్పుడు ఐజీ ట లెండి--చెయ్యడానికి ఉద్యోగమే లేదు!) రకరకాల మీటింగులకి ముఖ్య అతిథిగా వెళుతూ, ఉపాధ్యాయులనీ, విద్యార్థులనీ పొగుడుతూ, పాఠశాల స్థాపిస్తాను అంటూ, గడిపేస్తున్నాడు. మీడియా వాళ్లు మాత్రం, నిజాయితీ పరులకి అంతేనేమో అంటున్నారు.

అన్నట్టు, ఆయన ఒక్కో కేసులోనూ కనీసం రెండు మూడు మినీలారీల్లో కోర్టులకి అప్పజెప్పిన "పత్రాలు" అన్నీ యెక్కడ యెలా వున్నాయో. (నేను ముందే చెప్పాను, ఓవరాక్షన్ వల్ల వుపయోగం వుండదు అని. వింటేనా!)

మనలోమన మాట--కంప్యూటర్లు వచ్చాక-- మన మిల్లులు మూసేసుకోవలసిందే అని దాదాపు ఓ నిశ్చయానికి వొచ్చేసిన పేపరు మిల్లువాళ్లు, ఈ మధ్య వాళ్ల కాగితం డిమాండ్ రెట్టింపయ్యేటప్పటికి ఆశ్చర్యపోయి, మళ్లీ యేడాదికి మళ్లీ రెట్టింపు కావచ్చు అని సంతోషించేస్తున్నారట! ఆహా! యేమి ప్రభుత్వ లీలలు!

నిన్న అందరూ "గ్యాస్ ఊరట" అని సంతోషించేశారు గానీ, ఇవాళ "అథార్ అనుసంధానం రద్దు చెయ్యలేదు. కేవలం కొన్నాళ్లు ప్రక్కన పెట్టామంతే" అంటున్నాడు మంత్రి నారాయణ స్వామి! అసలు ఆయన మానవ వనరుల శాఖకీ, గ్యాస్ సిలిండర్లకీ యేమిటి సంబంధమో! రాహుల్ ని యెన్నుకోకపోతే, మళ్లీ ఆథార్ తో కక్ష తీర్చుకుంటాము అని బెదిరిస్తున్నట్టున్నాడు. ఇలాంటి బెదిరింపులతో మొదటికే మోసం వస్తుందని వాళ్లకి తట్టడంలేదు యెందుకో!


Thursday, January 30, 2014

కబుర్లు - 104



అవీ, ఇవీ, అన్నీ

అమెరికాలోని "మహర్షి మహేష్ యోగి వేద విద్యా సంస్థలు" నుంచి "వేద పండితులు" అదృశ్యం అయిపోతున్నారట! ఇండియా నుంచి రప్పించినవారికి సరైన వసతులులేక, తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాన్ని గడపలేక పారిపోతున్నారని షికాగో కేంద్రంగా ప్రచురితమయ్యే ఓ పత్రిక పరిశోధనాత్మక వ్యాసం వ్రాసిందిట.

వారి ఆరోపణలకన్నా, సంస్థలవారు ఇచ్చిన వివరణలు ఇంకా దారుణంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా, 2600 మంది యువకులని తీసుకురాగా, కేవలం 5% అంటే 130 మంది మాత్రమే ఆచూకీ లేకుండా పోయారనీ, యెప్పటికప్పుడు అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్ స్ ఎంఫోర్స్ మెంట్ కు తెలియపరుస్తున్నాము అనీ, వాళ్లకి కనీసవేతన నిబంధనలు వర్తించవు అనీ, వాళ్లు సాధువులు లాంటివారు కావడంతో కార్మిక చట్టాలు వర్తించవు అనీ, ఇంకెవరో వారికి యెక్కువవేతనాలూ, వసతులూ కల్పిస్తామని ఆశపెడుతుంటేనే వాళ్లు వెళ్లిపోతున్నారు అనీ సెలవిచ్చారట!

(ఓ పదేళ్లుగా అని మనం అనుకున్నా, యేడాదికి 13 మంది మాయం అయిపోతున్నా వాళ్లకి చీమకుట్టినట్టు లేకుండా మాట్లాడడం యెంత బాగుందో చూడండి!)

మరి సదరు అమెరికా అధికారులు, మన దేవయాని మీద--వీసా చట్టాలు వుల్లంఘించింది అనీ, కనీస వేతనాలు ఇవ్వలేదనీ వగైరా ఆరోపణలతో తమ ప్రతాపం చూపించారుగానీ, వీళ్లమీద యెందుకు చూపలేదో? (బహుశా వాళ్ల జీడీపీ వృధ్ధి రేటు పడిపోతుందని భయపడ్డారేమో--వాళ్లవి కొన్ని కోట్ల డాలర్ల వ్యాపార సంస్థలు కదా!)

మహేష్ యోగే ఓ ఫ్రాడ్. ఇదివరకే నాటపాల్లో వ్రాశాను--ఓసారి ఒకాయన "ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ గురించి మీకేమి తెలుసు? పీపుల్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ది ఎయిర్!" అంటే, నేను "ఓరి పిచ్చోడా, అదే నిజమైతే, మహేష్ యోగికి జెట్ విమానాలతోనూ, రోల్స్ రాయిస్ కార్లతోనూ యేమిపని!" అని నోరు మూయించాను.

యేదో అన్నట్టు, ".........పురిటి కంపు పోలేదు" అంటే ఇవేనేమో!

పశ్చిమ బెంగాల్లోని బీర్ భమ్ జిల్లాలో, సంథాల్ తెగ గిరిజన యువతి, ఆ గ్రామ పెద్ద కంగారూ కోర్టు ద్వారా విధించిన జరిమానా రూ.25,000/- చెల్లించలేనన్నందుకు, 13 మంది తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకి చెపితే, వాళ్లు కోర్టు ద్వారా విచారణ జరిపిస్తున్నారట.

ఈలోగా, ఆతెగ నేతలు, తమ 'సలిషి సభ' ని మీడియా తప్పుగా చిత్రిస్తోందనీ, గ్రామస్తులు ఆ యువతినీ, ఆమె ప్రియుణ్నీ "ఈడ్చుకొచ్చిన" మాట వాస్తవమేగానీ, గ్రామపెద్ద అత్యాచారం చెయ్యమని ఆదేశించలేదు--అని నిరసన వ్యక్తం చేస్తూ, అవసరమైతే ఆ గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారట!

హర్యాణాలోనూ అక్కడా "ఖాప్ పంచాయితీలూ", ఇక్కడ సలిషి సభలూ........న్యాయ వ్యవస్థ యెక్కడికి పోతోందో!

మా జిల్లాలో రేషన్ కార్డుల వివరాలను "ఆన్ లైన్" చేసి, ప్రజా పంపిణీ విధానాన్ని పారదర్శకంగా నిర్వహించడానికి ప్రణాళిక అమలు చేస్తున్నారట. ప్రతీ తాసిల్దార్ కార్యాలయంలో ఓ కంప్యూటరు పెట్టి, తాత్కాలిక పధ్ధతిపై ఓ ఆపరేటరు ని నియమించుకోడానికి అనుమతి ఇచ్చి, రేషన్ కార్డుదారుల వివరాలన్నీ కంప్యూటర్లో పొందుపరచాలని ఆదేశించారట. అందరూ "విధిగా" ఆథార్ సీడింగ్ చేయించుకొని, ప్రభుత్వ సబ్సిడీలు పొందాలట.

మరి ఇప్పటికే, ఆథార్ నెంబరూ బ్యాంక్ ఎకవుంటూ లేని కార్డుదారులకి గత నాలుగు ఐదు నెలలుగా సరుకులు ఇవ్వడం లేదంటున్నారు. 

మొత్తం 11,95,437 తెల్ల కార్డులకీ వాటిలో వున్న 36,53,093 మందికీ, 26,70,032 మంది మాత్రమే ఆథార్ సీడింగ్ చేయించుకున్నారట. మిగిలిన 10 లక్షలమంది సంగతీ పైవాడికే యెరుక.

ఇంక ఆన్ లైన్ చేసి, నగదు బదిలీ మొదలుపెడితే, ముందు పెట్టుబడిపెట్టి (గ్యాస్ సిలిండర్లలా), సబ్సిడి తరవాత అందుతుంది అంటే--నిజంగా యెంతమంది లభ్యపడతారో! (వాళ్లందరూ ఒచ్చే యెలక్షన్లలో యెవరికి వోట్లు వేస్తారో? లేక ఈలోపలే, యువనేత "ఛీ--నాన్ సెన్స్! ఆథార్ రద్దు చెయ్యండి!" అంటాడేమో! అప్పుడు కొన్ని వేల కోట్లకి యెవరు బాధ్యులౌతారో!)

ఇప్పుడే వార్తల్లో చెపుతున్నారు--ప్రభుత్వం సబ్సిడీ సిలిండర్ల సంఖ్యని 12 కి పెంచాలనీ, వాటికి ఆథార్ అనుసంథానం రద్దు చెయ్యాలనీ నిర్ణయించారు--అని).

మరి అర్థంలేని ఆథార్ స్కీమ్ కోసం 1,50,000 కోట్ల కేటాయింపుతో ప్రారంభించారట! (అప్పటికే 50 వేల కోట్లు ఖర్చు చేశామని సుప్రీం కోర్టుకే చెప్పారు.) ఈ కోట్లన్నీ యెలా గంగలో పోసినా, రేప్పొద్దున్న--ప్రజాపంపిణీ వ్యవస్థనీ, లెవీ స్వీకరణలనీ వాటికి సంబంధించిన వ్యవస్థలనీ రద్దుచేసి, "నగదు బదిలీ" ద్వారా కొన్ని వేల కోట్లు మిగుల్చుకోవాలని చూస్తున్న ప్రభుత్వం, యెంతవరకు సఫలీకృతమౌతుందో చూడాలి.

భగవంతుడా! వీరికి మంచి బుధ్ధి ప్రసాదించు అని ప్రార్థిస్తున్నారు సామాన్యులు.


Saturday, January 18, 2014

కబుర్లు - 103



అవీ, ఇవీ, అన్నీ

సీ డబ్ల్యూ సీ సమావేశం అయిందట. మన తెలుగు అంజయ్యలని యెవర్నీ మాట్లాడనివ్వలేదట! యెన్నికల్లోపల ప్రథాని అభ్యర్థిని ప్రకటించడం వాళ్ల ఇంటావంటా లేదందట వాళ్లమ్మ. (క్రితం యెన్నికలముందు మన్మోహన్ పేరు ప్రకటించడం అప్పటి అవసరమే తప్ప, ఆచారం సృష్టించడానికి కాదట). నేను ఓ సైనికుణ్ని, అమ్మ యేమి చెయ్యమంటే అది చేస్తాను అన్నాడట పిల్లాడు.

అసలు అయితే గియితే రాబోయే యెన్నికల్లో వాళ్ల పార్టీ కి కొన్ని సీట్లయినా వస్తే, మిగిలిన చిన్నా చితకా పార్టీలతోనే సంకీర్ణం యేర్పాటు చేసే అవకాశం వస్తే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయితే, సీల్డ్ కవర్లోంచి వాడి పేరు బయటపడినప్పుడు కదా!

ఇంకా గొప్పగా--"మీ గిన్నెలో అన్నం అవుతా, మీ చేతుల్లో పుస్తకమవుతా, మీ నెత్తిమీద నీడనవుతా, ఆడపడుచులను ఆదుకొనే అన్ననవుతా, పార్టీని ముందుకు నడిపించే సేనాని అవుతా, మీరు చెప్పినట్టు వినే విధేయుడినవుతా.........." అంటూ డైలాగులు కొడుతుంటే, వాళ్లమ్మ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ, తెగ సంతోషించేసిందట! (ఇంకా నయం, మీనెత్తిమీద మారెమ్మనవుతా, మీ ప్రక్కలో పామునవుతా.....అనలేదు)

"మన్మోహన్ జీ! తొమ్మిది రాయితీ సిలిండర్లతో మేం వంట చెయ్యలేం. ఈ దేశ మహిళలు మరిన్ని కోరుకుంటున్నారు. ప్రతి కుటుంబానికి 12 సిలిండర్లు కావాలి. దయచేసి 'కోటా' పెంచండి!" అన్నాడట. (అసలు ఈ కోటా యెందుకు? రాహుల్ కీ, చిదంబరానికీ, షిండేకీ, అహ్మద్ పటేల్ కీ అందరికీ 12 సిలిండర్లు కావాలా? సామాన్యుడికి కావలసినది "ఆథార్" సంబంధంలేని సిలిండర్లు--ఆరైనా, తొమ్మిదైనా! సరిపోకపోతే, కట్టెలపొయ్యిలు యెలాగా వున్నాయి!)

"తెల్ల కార్డు వున్నవాళ్లకే రాయితీ సిలిండర్లు" అంటే, బంగ్లాదేశ్ వాళ్లకీ, పాకిస్థాన్ వాళ్లకీ అందరికీ ఇచ్చేసినా సబ్సిడీల్లో ఇంకా బోళ్లు మిగులుతుంది కదా? యెలాగూ ఆథార్ ఓ గుర్తింపు కార్డు మాత్రమే--పౌరసత్వ కార్డు కాదు అనేశారుగా!

అన్నట్టు, నందన్ నీలేకణి ఒచ్చే యెన్నికల్లో పోటీ చేస్తాడట!

వెనకటికొకాయన బాగా "డబ్బు చేసి" ఓ సొంత పార్టీ పెట్టి, యెన్నో సీట్లు గెలవలేక, డబ్బు ఖర్చైపోయి, కాటాకి వచ్చేసి, కాంగ్రెస్ ని "సామాజిక న్యాయం" మీరే చెయ్యాలని, ఓ మంత్రిపదవి సంపాదించి, మళ్లీ సంపాదించుకొంటున్నాడు.

ఇంక ఇప్పుడు, నీలేకణి ఆథార్ అంటూ ఓ 50 వేల కోట్లు ప్రభుత్వ ధనం విరజిమ్మి, మిగిలిన ప్రభుత్వాలచేత మరిన్ని వేల కోట్లు ఖర్చుపెట్టించి, ఇప్పుడు యెన్నికై యేమి సంపాదించుకోవాలనుకుంటున్నాడో!

వచ్చే యెన్నికల్లో యేపార్టీ అయినా "ఆథార్" కుంభకోణం మీద చర్య తీసుకుంటామని ప్రకటిస్తే, అధికారం లోకి రావడం చాలా వీజీ! పార్టీలు గమనిస్తున్నాయా?

ఢిల్లీలో అధికారంలోకి వచ్చాకగానీ అదేమిటో అనుభవంలోకి రాలేదు కేజ్రీ కి. అందరిలాగే "నాదగ్గరేమీ మంత్రదండం లేదు" అనేశాడు. మరి నువ్వేదో పొడిచేస్తావనే కదురా నీ చేతికి అధికారం అనే మంత్రదండం ఇచ్చాము "సార్లేక్" అని ఆమ్ ఆద్మీలు అడగద్దూ?

ప్రక్కలో పాముతో అధికారంలోకి వస్తున్నాము అని తెలిసీ, ప్రజా దర్బారు అంటూ బోర్లా పడి, గోడ యెక్కవలసి వచ్చింది! క్రొత్త అవినీతికేసులపై తప్ప, పాత కేసులని పట్టించుకోం అని ఓ సారి అన్నాడు. షీలా మీద యేవైనా ఆరోపణలు యెవరైనా చేస్తే, వాటి సంగతి ఆలోచిస్తాము అంటాడోసారి. 

బిన్నీ అయితే, కాంగ్రెస్ లోంచి వచ్చాడు, ఎం ఎల్ యే అయ్యాక యేవో కోరికలు తీరక యేదో మాట్లాడుతున్నాడు అంటున్నారు. మరి అనుపమ్ ఖేర్ యెందుకు మాట్లాడుతున్నట్టో!

మన సొంటికొమ్ము జేపీ వాళ్లతో చేరడానికి ఆరాటపడుతున్నాడు. వాళ్లేమో దూరం పెడుతున్నారు!

చూడాలి--యెన్నికల్లోపల మరెన్ని చిత్రాలు జరుగుతాయో!