Sunday, February 23, 2014

కబుర్లు - 109


అవీ, ఇవీ, అన్నీ

నందన్ నీలేకణి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించేశాడు. కాంగ్రెస్ అభ్యార్ధిగా లోక్ సభకి పోటీ చేస్తానని కూడా చెప్పేశాడు. శుభం! 

ఇంక యూ ఐ డీ ఏ ఐ ని యెవరైనా ముందుకు తీసుకెళ్లగలరు అని కూడా సెలవిచ్చారు. 2015 కల్లా (అంటే యెన్నేళ్లో?) 90 కోట్ల ఆథార్ కార్డుల జారీ పూర్తవుతుందనీ, ఇప్పటివరకూ 58.7 కోట్ల సంఖ్యల జారీ పూర్తి అయిందని కూడా సెలవిచ్చారు. (మన దేశ జనాభా యెంతో?). 

నేనైతే, వచ్చే ప్రభుత్వం ఆథార్ ని యెప్పుడు కుంభకోణం గా ప్రకటిస్తుందా, యెప్పుడు భారత ప్రజలకి మాత్రమే అని ప్రకటిస్తుందో, సంబంధీకులని జైళ్లకి యెప్పుడు పంపిస్తుందో అని యెదురు చూస్తాను.

చిత్తూరు నగరం గంగపల్లె లోని క్యాన్‌ఫర్డ్ పాఠశాలలో మగ-మగ, ఆడ-ఆడ, మగ-ఆడ, ఇలా 26 జతల కవల పిల్లలు ఉండడం, అంతర్జాతీయ కవల దినోత్సవం నాడు ఫోటో తీయించుకొని ప్రచురించడం బాగుంది.

కవలగురించి కొన్ని విచిత్రాలు........మన పురాణాల్లో ఆడ, మగ కవలలు జన్మిస్తే, వాళ్లని మిథునం అన్నారు. వాళ్లిద్దరూ పెద్దయ్యాక పెళ్లి చేసుకోవచ్చట!

కవలల్లో యెవరు పెద్ద? అనేది ఓ పెద్ద ధర్మ సందేహం. పాశ్చాత్య దేశాల్లో, గర్భం నుంచి యెవరు ముందు బయటపడితే, వాళ్లే పెద్ద అని గుర్తించేవారు.  అలా పెద్ద పెద్ద ఎస్టేట్లనీ, టైటిళ్లనీ కొద్ది సెకన్ల తేడాతో కోల్పోయిన వాళ్లున్నారు. ప్రఖ్యాత బ్రిటిష్ ప్రథాని విన్‌స్టన్ చర్చిల్ తన అన్నగారికన్నా కొన్ని క్షణాలు ముందు పుట్టి వుంటే, "9 వ డ్యూక్ ఆఫ్ మార్ల్ బరో" గా కొన్ని వందల యెకరాల ఎస్టేట్ యజమాని అయి వుండేవాడు. (కానీ అలా అయితే చరిత్రలో నిలిచిపోయేవాడు కాదు కదా?) ప్రపంచాన్ని 3 దశాబ్దాలపాటు శాసించి, తన గొప్ప దేశం ఇస్తానన్న బిరుదులన్నీ అఖ్ఖర్లేదని, చివరికి "డ్యూక్ ఆఫ్ లండన్" ని కూడా తిరస్కరించేవాడుకాదుకదా?

మన దేశ పధ్ధతి ప్రకారం, వెనుక పుట్టినవాడి "పిండమే" ముందు యేర్పడుతుంది కాబట్టి, తరవాత (ఆలస్యంగా) పుట్టినవాడే పెద్దవాడు! ఈ న్యాయం ప్రకారం మన తెలుగు సామ్రాజ్యాల చరిత్రలే మారిపోయాయి! (అడవి బాపిరాజుగారి నవలలు చదవండి). ఇవీ విచిత్రాలు. 

మొన్న మొగల్తూరు లోని రామాలయం నుంచి నరసాపురం మండలం కొప్పర్రు వరకూ రహదారి పనులకి షార్ డైరెక్టర్, "పద్మశ్రీ" డాక్టర్ ఎం వై ఎస్ ప్రసాద్ భూమి పూజ చేశారట. బాగుంది. కానీ, పేరు ముందు పద్మశ్రీ పెట్టుకొనే కదా మోహన్ బాబు చీవాట్లు తిని, ప్రభుత్వం వారు దాన్ని వెనక్కి తీసుకోవాలని కోర్టు చెప్పింది? పద్మశ్రీ తరవాత గ్రహీత అని వ్రాస్తే పత్రికల వాళ్ల  సొమ్మేం పోయింది?

మొన్ననే భీమవారం బైపాస్ రోడ్డుప్రక్కన గుట్టలు గుట్టలుగా 2012 లో తయారై 2012 మార్చి దాకా పనికొచ్చే నిరోధ్ ప్యాకెట్లని పారేశారని ఫోటో కూడా వేశారు ఈనాడులో. ఇదివరకు ఇవి జనాభా నియంత్రణ కోసం ఉపయోగిస్తే, ఇప్పుడు ఎయిడ్స్ వ్యాప్తి నిరోధానికి వాడుతున్నారట. ఇంకెక్కడి నియంత్రణా, నిరోధం?

మా చిన్నప్పుడు నిరోధ్ లు కొత్తగా వచ్చినప్పుడు, ప్రతీ చిల్లర కొట్లోనూ 5 పైసలకే 3 నిరోధ్ లు అమ్మే యేర్పాట్లు చేశారు ప్రభుత్వం వారు. మామూలు బెలూన్లు 2 పైసలకి ఒకటి. అయినా అవి చాలా చిన్నవి. నిరోధ్ లని వూదితే, దాదాపు 2 అడుగుల పొడవూ, ఓ అడుగు వెడల్పూ తో పెద్ద బెలూన్లు వచ్చేవి! వాటిని దారంతో కట్టేసి, చివరి రింగులో ఓ పదిపైసల నాణెం దోపితే అది లేచి నిలబడేది! నాణెం సరిపోకపోతే పుల్లలు పెట్టేవాళ్లం. అలా పిల్లలు ఆడుకోడానికి ఇచ్చేసినా పరమార్థం నెరవేరేదికదా? అలా పారబొయ్యడమెందుకో?

ఆర్టాఫ్ లివింగ్ గురూ మొన్న ఓ ప్రత్యేక రైలులో వచ్చి కొవ్వూరు, తణుకు, భీమవరం, ఆకివీడు రైల్వేస్టేషన్లలో భక్తులని ఉద్దేశించి ప్రసంగించారట. విదేశాల్లోని స్విస్ బ్యాంకుల్లో మనవారిది రూ.1.45 బిలియన్స్ నల్లధనం ఉందనీ, దానిని బయటికి తీసుకు వస్తేనే దేశం లోని పరిస్తితిలో మార్పు తథ్యమనీ, ఇంకా చాలా విషయాలు చెప్పి, సమాజం లో ప్రతిఒక్కరూ ఆత్మ విశ్వాసంతో ఈశ్వరునిపై నమ్మకం కలిగి ఉండాలని బోధించారట. ఆఫ్టరాల్--హి నోస్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్!

ప్రఖ్యాత వీణ విద్వాంసుడు చిట్టిబాబు కచేరీ చేస్తుంటే, యెవరైనా ఈలలు వేస్తె, నిర్మొహమాటంగా ఈలలు వేసుకునేవాళ్లు ప్రక్కవీధి లోకి వెళ్లి వేసుకోండి అనేవారు. ఆ కార్యక్రమం యెంతో పవిత్రమైనది అని ఆయన భావించడమే కాకుండా, ఆ వాతావరణమే సభలో వుండేలా చేసేవారు. కీర్తన ఇంకా క్లైమాక్స్ కి రాకుండానే ఓ సంగతి నచ్చి యెవరైనా చప్పట్లు కొడితే, మిగిలినవాళ్లు అనుసరించేవారు. కీర్తన పూర్తయ్యాక, ఇప్పుడు కొట్టండి చప్పట్లు అనేవారు. (మధ్యలో చప్పట్లు కొడితే ఆయన యేకాగ్రత దెబ్బతినే అవకాశం వుండచ్చు కదా). అక్కణ్ణుంచీ కీర్తన పూర్తయ్యే వరకూ యెవరూ చప్పట్లు కొడితే ఒట్టు. అంత బాగా జరిగేవి ఆ కచేరీలు. 

బొంబాయి సినిమాలో విదియా, తదియా అని ఉన్న ఓ పాట సెన్‌సార్ వారి దృష్టి నుంచి తప్పించుకొంది అన్నారోసారి బాల సుబ్రహ్మణ్యం. అమెరికాలో రాగసాగరిక క్రింద పాడుతా తీయగా కార్యక్రమం లో గాయని సుజాతతో ఆయన ఓ పాట పాడిన విధానం, మధ్య మధ్యలో ఒకళ్లనొకళ్లు ఉద్దేశించినట్టుగా పాటలు పాడడం నాకు నచ్చలేదు. ఇంత కంటే యేమీ అనలేను. యెందుకంటే అందరూ దీన్నో గాసిప్ కాలం అనుకొనే ప్రమాదం వుంటుంది అని. యెవరి మనో భావాలనైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ని.


2 comments:

TVS SASTRY said...

చాలా బాగుంది శాస్త్రి గారు!అభినందనలు!!

A K Sastry said...

డియర్ శాస్త్రిగారూ!

చాలా సంతోషం.

ధన్యవాదాలు.