Saturday, February 1, 2014

కబుర్లు - 105


అవీ, ఇవీ, అన్నీ

గాంధీగారి వర్ధంతి సందర్భంగా మళ్లీ అందరూ "రాజ్ ఘాట్" సందర్శించారు. నాకో చిన్న సందేహం. బ్రిటిష్ వాళ్ల రాజ్యాన్ని "రాజ్" అని వ్యవహరిస్తారు. వాళ్ల కాలంలో ఆ ప్రాంతాన్ని రాజ్ ఘాట్ అనే వారేమో. ఆ పేరు ఇంకా మన బానిసత్వానికి గుర్తుగా అలాగే వుండాలా? కనీసం ఇన్నేళ్ల తరవాతైనా, యే "మహాత్మా ఘాట్" అనో పేరు మార్చచ్చు కదా?

పటేల్ మా పార్టీవాడు, నేతాజీ మా పార్టీవాడు అనడమే గానీ, వీళ్లకి కనీస స్వతంత్ర అలోచనలు వుండవెందుకో? (పాపం ప్రథాని "పటేల్ గొప్ప సెక్యులరిస్ట్" అంటే, మోడీ వెంటనే "అందుకే ఆయన ముందు సోమనాథ దేవాలయాన్ని పునరుధ్ధరించాడు!" అన్నాడు. మరి కాంగీలు కుయిక్కుమంటే ఒట్టు!)

మళ్లీ ఈసారి భారత రత్నలూ అవీ వాల్మీకికీ, వ్యాసుడికీ, బుధ్ధుడికీ వగైరాలకి ఇచ్చేస్తారేమో అనుకున్నాను. నిజం చెప్పొద్దూ, నాక్కూడా ఇచ్చేస్తారేమో అని భయపడ్డాను. యెందుకంటే, నా పేరున "అకాడమీలు" యేమీ లేవుకదా? (హాకీ వీరుడు ధ్యాన్ చంద్ పేరున చాలా అకాడమీలు వున్నాయి కాబట్టే ఆయనకివ్వకుండా సచ్చిన టెండూల్కర్ కి ఇచ్చామన్నాడో మంత్రి!). యేదోలెండి, ఈసారికిలా సరిపెట్టుకున్నాం.

'అవినీతి పెరిగిపోతోందంటూ జనాలు ఆక్రోశించడానికి (కాగ్ లాంటి) "రాజ్యాంగ వ్యవస్థలే" కారణం తప్ప, యూపీయే లో అవినీతి చాల తక్కువ' అన్నాడట పిచ్చిదంబరం. ఇంకా అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ అన్నట్టు, అవినీతి "గ్లోబల్ ఫినామినన్" అనికూడా అన్నాట్ట! మనం పేపర్లలో చదువుతున్న వివిధ దేశాల్లో జరుగుతున్న అవినీతి తో పోలిస్తే, మనది (సముద్రంలో కాకిరెట్టే అనలేదుగానీ) చాలా తక్కువ అని కూడా అన్నాట్ట. 

మొన్నామధ్య ప్రథాని, "ప్రథాని మీద ఆరోపణలు యెక్కడైనా చేస్తారా?" అంటూ ఆక్రోశించాడు.

మరి విదేశాల్లో అధ్యక్షులనీ, ప్రథానులనీ, రాజకుటుంబాలవారినీ కూడా అవినీతి ఆరోపణలపై యావజ్జీవ శిక్షలూ, ఉరిశిక్షలూ విధించారని కూడా మనం ఆ పేపర్లలోనే చదివాము. మనకెంత సిగ్గులేదో మరి!

ఒకప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ (ఇప్పుడు ఐజీ ట లెండి--చెయ్యడానికి ఉద్యోగమే లేదు!) రకరకాల మీటింగులకి ముఖ్య అతిథిగా వెళుతూ, ఉపాధ్యాయులనీ, విద్యార్థులనీ పొగుడుతూ, పాఠశాల స్థాపిస్తాను అంటూ, గడిపేస్తున్నాడు. మీడియా వాళ్లు మాత్రం, నిజాయితీ పరులకి అంతేనేమో అంటున్నారు.

అన్నట్టు, ఆయన ఒక్కో కేసులోనూ కనీసం రెండు మూడు మినీలారీల్లో కోర్టులకి అప్పజెప్పిన "పత్రాలు" అన్నీ యెక్కడ యెలా వున్నాయో. (నేను ముందే చెప్పాను, ఓవరాక్షన్ వల్ల వుపయోగం వుండదు అని. వింటేనా!)

మనలోమన మాట--కంప్యూటర్లు వచ్చాక-- మన మిల్లులు మూసేసుకోవలసిందే అని దాదాపు ఓ నిశ్చయానికి వొచ్చేసిన పేపరు మిల్లువాళ్లు, ఈ మధ్య వాళ్ల కాగితం డిమాండ్ రెట్టింపయ్యేటప్పటికి ఆశ్చర్యపోయి, మళ్లీ యేడాదికి మళ్లీ రెట్టింపు కావచ్చు అని సంతోషించేస్తున్నారట! ఆహా! యేమి ప్రభుత్వ లీలలు!

నిన్న అందరూ "గ్యాస్ ఊరట" అని సంతోషించేశారు గానీ, ఇవాళ "అథార్ అనుసంధానం రద్దు చెయ్యలేదు. కేవలం కొన్నాళ్లు ప్రక్కన పెట్టామంతే" అంటున్నాడు మంత్రి నారాయణ స్వామి! అసలు ఆయన మానవ వనరుల శాఖకీ, గ్యాస్ సిలిండర్లకీ యేమిటి సంబంధమో! రాహుల్ ని యెన్నుకోకపోతే, మళ్లీ ఆథార్ తో కక్ష తీర్చుకుంటాము అని బెదిరిస్తున్నట్టున్నాడు. ఇలాంటి బెదిరింపులతో మొదటికే మోసం వస్తుందని వాళ్లకి తట్టడంలేదు యెందుకో!


No comments: