Thursday, January 30, 2014

కబుర్లు - 104అవీ, ఇవీ, అన్నీ

అమెరికాలోని "మహర్షి మహేష్ యోగి వేద విద్యా సంస్థలు" నుంచి "వేద పండితులు" అదృశ్యం అయిపోతున్నారట! ఇండియా నుంచి రప్పించినవారికి సరైన వసతులులేక, తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాన్ని గడపలేక పారిపోతున్నారని షికాగో కేంద్రంగా ప్రచురితమయ్యే ఓ పత్రిక పరిశోధనాత్మక వ్యాసం వ్రాసిందిట.

వారి ఆరోపణలకన్నా, సంస్థలవారు ఇచ్చిన వివరణలు ఇంకా దారుణంగా ఉన్నాయి. కొన్నేళ్లుగా, 2600 మంది యువకులని తీసుకురాగా, కేవలం 5% అంటే 130 మంది మాత్రమే ఆచూకీ లేకుండా పోయారనీ, యెప్పటికప్పుడు అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్ స్ ఎంఫోర్స్ మెంట్ కు తెలియపరుస్తున్నాము అనీ, వాళ్లకి కనీసవేతన నిబంధనలు వర్తించవు అనీ, వాళ్లు సాధువులు లాంటివారు కావడంతో కార్మిక చట్టాలు వర్తించవు అనీ, ఇంకెవరో వారికి యెక్కువవేతనాలూ, వసతులూ కల్పిస్తామని ఆశపెడుతుంటేనే వాళ్లు వెళ్లిపోతున్నారు అనీ సెలవిచ్చారట!

(ఓ పదేళ్లుగా అని మనం అనుకున్నా, యేడాదికి 13 మంది మాయం అయిపోతున్నా వాళ్లకి చీమకుట్టినట్టు లేకుండా మాట్లాడడం యెంత బాగుందో చూడండి!)

మరి సదరు అమెరికా అధికారులు, మన దేవయాని మీద--వీసా చట్టాలు వుల్లంఘించింది అనీ, కనీస వేతనాలు ఇవ్వలేదనీ వగైరా ఆరోపణలతో తమ ప్రతాపం చూపించారుగానీ, వీళ్లమీద యెందుకు చూపలేదో? (బహుశా వాళ్ల జీడీపీ వృధ్ధి రేటు పడిపోతుందని భయపడ్డారేమో--వాళ్లవి కొన్ని కోట్ల డాలర్ల వ్యాపార సంస్థలు కదా!)

మహేష్ యోగే ఓ ఫ్రాడ్. ఇదివరకే నాటపాల్లో వ్రాశాను--ఓసారి ఒకాయన "ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ గురించి మీకేమి తెలుసు? పీపుల్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ది ఎయిర్!" అంటే, నేను "ఓరి పిచ్చోడా, అదే నిజమైతే, మహేష్ యోగికి జెట్ విమానాలతోనూ, రోల్స్ రాయిస్ కార్లతోనూ యేమిపని!" అని నోరు మూయించాను.

యేదో అన్నట్టు, ".........పురిటి కంపు పోలేదు" అంటే ఇవేనేమో!

పశ్చిమ బెంగాల్లోని బీర్ భమ్ జిల్లాలో, సంథాల్ తెగ గిరిజన యువతి, ఆ గ్రామ పెద్ద కంగారూ కోర్టు ద్వారా విధించిన జరిమానా రూ.25,000/- చెల్లించలేనన్నందుకు, 13 మంది తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకి చెపితే, వాళ్లు కోర్టు ద్వారా విచారణ జరిపిస్తున్నారట.

ఈలోగా, ఆతెగ నేతలు, తమ 'సలిషి సభ' ని మీడియా తప్పుగా చిత్రిస్తోందనీ, గ్రామస్తులు ఆ యువతినీ, ఆమె ప్రియుణ్నీ "ఈడ్చుకొచ్చిన" మాట వాస్తవమేగానీ, గ్రామపెద్ద అత్యాచారం చెయ్యమని ఆదేశించలేదు--అని నిరసన వ్యక్తం చేస్తూ, అవసరమైతే ఆ గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారట!

హర్యాణాలోనూ అక్కడా "ఖాప్ పంచాయితీలూ", ఇక్కడ సలిషి సభలూ........న్యాయ వ్యవస్థ యెక్కడికి పోతోందో!

మా జిల్లాలో రేషన్ కార్డుల వివరాలను "ఆన్ లైన్" చేసి, ప్రజా పంపిణీ విధానాన్ని పారదర్శకంగా నిర్వహించడానికి ప్రణాళిక అమలు చేస్తున్నారట. ప్రతీ తాసిల్దార్ కార్యాలయంలో ఓ కంప్యూటరు పెట్టి, తాత్కాలిక పధ్ధతిపై ఓ ఆపరేటరు ని నియమించుకోడానికి అనుమతి ఇచ్చి, రేషన్ కార్డుదారుల వివరాలన్నీ కంప్యూటర్లో పొందుపరచాలని ఆదేశించారట. అందరూ "విధిగా" ఆథార్ సీడింగ్ చేయించుకొని, ప్రభుత్వ సబ్సిడీలు పొందాలట.

మరి ఇప్పటికే, ఆథార్ నెంబరూ బ్యాంక్ ఎకవుంటూ లేని కార్డుదారులకి గత నాలుగు ఐదు నెలలుగా సరుకులు ఇవ్వడం లేదంటున్నారు. 

మొత్తం 11,95,437 తెల్ల కార్డులకీ వాటిలో వున్న 36,53,093 మందికీ, 26,70,032 మంది మాత్రమే ఆథార్ సీడింగ్ చేయించుకున్నారట. మిగిలిన 10 లక్షలమంది సంగతీ పైవాడికే యెరుక.

ఇంక ఆన్ లైన్ చేసి, నగదు బదిలీ మొదలుపెడితే, ముందు పెట్టుబడిపెట్టి (గ్యాస్ సిలిండర్లలా), సబ్సిడి తరవాత అందుతుంది అంటే--నిజంగా యెంతమంది లభ్యపడతారో! (వాళ్లందరూ ఒచ్చే యెలక్షన్లలో యెవరికి వోట్లు వేస్తారో? లేక ఈలోపలే, యువనేత "ఛీ--నాన్ సెన్స్! ఆథార్ రద్దు చెయ్యండి!" అంటాడేమో! అప్పుడు కొన్ని వేల కోట్లకి యెవరు బాధ్యులౌతారో!)

ఇప్పుడే వార్తల్లో చెపుతున్నారు--ప్రభుత్వం సబ్సిడీ సిలిండర్ల సంఖ్యని 12 కి పెంచాలనీ, వాటికి ఆథార్ అనుసంథానం రద్దు చెయ్యాలనీ నిర్ణయించారు--అని).

మరి అర్థంలేని ఆథార్ స్కీమ్ కోసం 1,50,000 కోట్ల కేటాయింపుతో ప్రారంభించారట! (అప్పటికే 50 వేల కోట్లు ఖర్చు చేశామని సుప్రీం కోర్టుకే చెప్పారు.) ఈ కోట్లన్నీ యెలా గంగలో పోసినా, రేప్పొద్దున్న--ప్రజాపంపిణీ వ్యవస్థనీ, లెవీ స్వీకరణలనీ వాటికి సంబంధించిన వ్యవస్థలనీ రద్దుచేసి, "నగదు బదిలీ" ద్వారా కొన్ని వేల కోట్లు మిగుల్చుకోవాలని చూస్తున్న ప్రభుత్వం, యెంతవరకు సఫలీకృతమౌతుందో చూడాలి.

భగవంతుడా! వీరికి మంచి బుధ్ధి ప్రసాదించు అని ప్రార్థిస్తున్నారు సామాన్యులు.


No comments: