Friday, February 21, 2014

కబుర్లు - 108


అవీ, ఇవీ, అన్నీ

మొన్న మన బడ్జెట్లో చిదంబరం కార్ల పరిశ్రమకి ఉద్దీపనలు ప్రకటించగానే, కార్ల రేట్లు తగ్గుతున్నాయి. మరి సామాన్యులకి ఆమాత్రం వెసులుబాటు కలిగించొ్ద్దూ ఎలక్షన్ల ముందు? సామాన్యులకి యేమి ఒరిగింది అంటారా? పాపం బైక్ లు 2.65 లక్షల నుంచి 58 లక్షల వరకూ (హార్లే డేవిడ్ సన్ బైక్ ల ధరలు చూడండి), కార్లు 5.56 కోట్ల నుంచి 46 కోట్లవరకూ (లాంబోర్గినీ వాడు ఇప్పటికే 200 కార్లు అమ్మి, సం వత్సరాంతం లోపల ఇంకో 400 అమ్మేస్తానని మొన్నెప్పుడో చెప్పాడు) చెల్లించి కొనేసి కష్టపడుతున్నారు కదా మరి?

2 వేల రూపాయల లోపు సెల్ ఫోన్ల రేట్లు యెందుకు పెంచాడంటారా? మరి ప్రతీ తమిళ తంబీ ఆయన సెల్ నంబరు సంపాదించేసి, ఇరవైనాలుగు గంటలూ ఆయన్ని విషయించేస్తున్నారట! (మనవాళ్లకి అంత సీను లేదు లెండి.)

అదీ సంగతి.

అన్నట్టు తిండి విషయం లో మాత్రం అరవ్వాళ్లనే ఆదర్శంగా తీసుకోవాలి అందరూ. "అమ్మ" హోటెళ్లలో చాలా చవకగా భోజనాలూ, టిఫిన్లూ పెట్టేస్తున్నారు. ఇప్పుడొకాయన ఒక కిలో ఇడ్లీలు 35 రూపాయలకి అమ్మేస్తున్నాడట! కిలోకి 24 ఇడ్లీలు తూగుతున్నాయట. సాంబారు విడిగా కొనుక్కోవాలటలెండి. ఓ 50 రూపాయలు పెడితే, 5 గురికి కడుపు నిండుతోందట. ఆయన ఆధునిక యంత్రాలతో వాయికి నాలుగువందలో యెన్నో తయారు చేసేస్తున్నాడట. మరి మనవాళ్లు యేమైనా ప్రయత్నిస్తారేమో చూడాలి. (యెవరైనా ప్రయత్నించినా యేమౌతుందో అందరికీ తెలుసు).

రైళ్లు "దురంతం" చెందడానికి బ్రహ్మాండంగా దోహదం చేసిన మమతాదీ ప్రభుత్వ బంగళా లో వుండడం లేదట, రూపాయే జీతం తీసుకుంటోందట. ఇంకా ఇరవైమూడో యెన్నో ఉన్న ఆయన కార్యక్రమాలన్నీ అమలు చేస్తానందట. అందుకని అన్నా హజారే ఆమెకి పూర్తి మద్దతు ప్రకటించడమే కాకుండా, రేపు ప్రచారం కూడా చేస్తానన్నాడట.

నాకో విషయం గుర్తుకు వస్తోంది. సంజయ్ గాంధీ తన విపరీత ధోరణులతో జనాగ్రహం చవిచూస్తున్న రోజుల్లో ఓ సారి ఇందిర తో వెళ్లి, ఆచార్య వినోబాభావే ని కలిశాడట. ' నా కొడుకు, పేరు సంజయ్ ' అని చెప్పగానే, ఆయన ' చాలా మంచి పేరు. భగవద్గీతలో 32 సార్లు ఆ పేరు వస్తుంది ' అన్నాట్ట సంతోషంగా! (ముఫ్ఫైరెండో యెన్నో నాకు సరిగ్గా గుర్తులేదు.) అలాగ, వీళ్లు పూర్తిగా సన్యాసుల్లా వున్నా బాగుండును--అనవసరంగా రాజకీయాల్లో కలగజేసుకోకుండా. అబ్బే!

రాజీవ్ హంతకులుగా శిక్ష పడ్డవారిని విడుదల చేస్తామని జయలలితా ప్రకటించగానే, సుప్రీం కోర్టుకి పరుగెత్తి, స్టే తెచ్చుకొని, పరువు కాపాడు కున్నారు ప్రభుత్వo వారు. ఈ సందర్భం లో, ఓ ప్రబుధ్దుడు ' బీజేపీ వాళ్లు కసబ్ ని ఉరి తీసేవరకూ ఊరుకోలేదు, ఇప్పుడు మాట్లాడటం లేదు ' అన్నాడట! ఈ రెండు సందర్భాలనీ ఒకే గాట కట్టడం లోనే తెలియడం లేదూ వాడి తెలివి? వీళ్లకి ఉరి శిక్ష పడినా అమలు చెయ్యకుండా 23 యేళ్లుగా మగ్గబెడుతుంటే, సుప్రీం కోర్టు ఆ శిక్షని యావజ్జీవ శిక్షగా మార్చాక కదా, మానవతా దృక్పథం అనే రాజకీయ ఆలోచనతో ఈ పాచిక వేసింది ఆవిడ? రాహుల్ చెల్లెలు ప్రత్యేకంగా జైలుకి వెళ్లి, నళిని కలిసి, ఆవిడ చిన్న పిల్లతో వుంది కనక ఉరిశిక్ష వెయ్యకూడదు అంటే, ఆ తరవాత కదా ఆవిడ శిక్షని తగ్గించింది ప్రభుత్వం?

మా జిల్లాలో ఈ నెలాఖరులోపల రేషం కార్డులని ఆథార్ తో అనుసంధానం చేసుకోకపోతే ఒచ్చే నెల నుంచి సరుకులు ఇవ్వబోమని ప్రకటించేశారు. రాహుల్! వింటున్నావా? నారాయణ స్వామి యేం చెప్పాడో గమనించావా? మళ్లీ ఓ సారి ' ప్రథాన్ మంత్రీజీ ' అంటావా?



2 comments:

TVS SASTRY said...

సా'మాన్యులకు'అనుకూలమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టిన శ్రీ మాన్ చిదంబరంగారి రహస్యాన్ని త్వరలోనే ప్రజలు బట్టబయలు చేస్తారు . బాగా వ్రాసారు శాస్త్రి గారు!యదార్ధవాది లోక హితుడు ,విరోధి కాదు!

A K Sastry said...

చాలా సంతోషం శాస్త్రిగారూ!

ధన్యవాదాలు.