Monday, June 6, 2011

(యమర్జెంటు) కబుర్లు - 55

అవీ, ఇవీ, అన్నీ

"అడుక్కుంటున్న ఆంధ్రా యూనివర్సిటీ"
"మణిశంకర్ అయ్యర్....."
"దయానిధి మారన్....."
"డీజల్ ధరలు......"
"రాం జేఠ్మలానీ.....కాశ్మీర్...."
"యూనిఫారాలూ, ఎన్ సీ సీ,......"
"స్పీకర్ల యెన్నికా"
"జగన్ వర్గం పిల్లాటలూ....."
"రాం దేవ్ దీక్షా"

....అబ్బో! యెన్ని వున్నాయో సణుక్కోడానికి! 24 గంటలూ సరిపోవు! ఈ సణుగుళ్లతో నాబుర్రే కాదు, అవి విన్నవాళ్ల బుర్రలు కూడా ఖరాబయిపోతాయేమో! అయినా సింపుల్ గా సణిగెయ్యాలి.....అలవాటయిన ప్రాణం కదా మరి?!

ఒకమ్మాయి, ఎం సీ యే లో 2008-09 లో యూనివర్సిటీ స్థాయిలో "బంగారు పతకం" విజేతగా నిలిస్తే, "మాదగ్గర రూ.3,240/- యే వున్నాయి. మిగతా రూ.7,760/- నువ్విస్తే, బంగారు పతకం చేయించి, నీకు 'బహూకరిస్తాం '. లేకపోతే లేదు" అని వ్రాసిందట--ప్రత్యేక రిజిస్ట్రార్, డాక్టర్ 'సో అండ్ సో'!

సిగ్గూ యెగ్గూ లేని రా నా లని మించిపోతున్నారీ "కర్మచారులు"! అదే నేనైతే, నా జీతంలోంచి ఆ డబ్బు ఖర్చుపెట్టి, గుట్టుగా ఆ పతకం చేయించేసేవాణ్ని. లేదా, ఓ రోల్డు గోల్డు పతకం కొనేసి, ఆ అమ్మాయి కాళ్లా వేళ్లా పడి, ఇప్పటికి ఇది తీసుకో అమ్మా.....రేపెప్పుడైనా వర్సిటీ కి డబ్బు వున్నప్పుడు, నిజం పతకం చేయించి, గుట్టుగా మీకు అందజేస్తాను....మా పరువు తీయొద్దు! అని బతిమాలేవాణ్ని.

మహామహులు కట్టమంచి రామలింగా రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, బుల్లెయ్య లాంటి వాళ్ల ఆధ్వర్యంలో వెలిగిన యూనివర్సిటీకి ఇప్పుడు యెంత దౌర్భాగ్యం!

దీనికి బాధ్యులెవరో!

కామన్వెల్త్ క్రీడల గురించి 2006లోనే మార్చిలో మొదలెట్టి, అప్పటి కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ ప్రథానికి, అనేక సందేహాలు లేవనెత్తుతూ వరుసబెట్టి లేఖలు వ్రాశారట!!! ("నికమ్మా" గారు మాట్లాడలేదట!). స హ చట్టంక్రింద అడిగితే, ఈ సమాచారం బయటపెట్టిందట--ప్ర. మం. కార్యాలయం.

యెంత దు. పో. మీద వానో!

కేంద్ర జౌళి శాఖ మంత్రి దయానిధి మారన్, "నేను టెలికాం మంత్రిగా రాజీనామా ఇచ్చినప్పుడే దర్యాప్తు చేసుకోవాల్సింది. ఇప్పుడైనా, దర్యాప్తు చేసుకొంటే, చేసుకోండి. (నన్నేమీ పీకలేరు)" అన్నట్టుగా మాట్లాడుతున్నాడు.

అన్నట్టు, వీడికింకా చిప్పకూడు అరేంజ్ చేశారో లేదో!

సోకాల్డు (తింగర) ఆర్థిక శస్త్రవేత్త (ముం. కొ.) ల బ్రెయిన్ కంట్రోలు, యూపీయే చేతిలో పెట్టేసినట్టున్నారు.

పీఎమీఏసీ--ప్ర. మం. ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ రంగరాజన్--ద్రవ్యలోటుని పరిమితం చెయ్యాలంటే, డీజల్ ధరలపై నియంత్రణ 'పూర్తిగా' యెత్తివేయాలంటున్నాడు! మరి ద్రవ్యోల్బణం మాటేమిటి? అది ఆందోళన కలిగిస్తోంది (ట.). డీజల్ రేట్ల నియంత్రణ తొలగిస్తే, వ్యవసాయరంగం యేమంత వృధ్ధి చెందకపోయినా, సేవల రంగం, పారిశ్రామిక రంగం, ఆ లోటుని తీర్చేసి, వృధ్ధి రేటు పెరిగిపోతుందట! ఓ సారి చేసి చూడండి.....యేమవుతుందో!!!

రాం జేఠ్మలానీ.....2002లో అప్పటి ప్రథాని వాజపేయీ యేర్పాటుచేసిన "కాశ్మీర్ కమీటీ" అధ్యక్షుడూ, శాంతిభూషణ్, మధుకేశ్వర్, ఎం జె అక్బర్ (ఆఖరి యిద్దరూ పాత్రికేయులూ, ఆ ముందటివాడు, అందరికీ తెలిసిన లాయరూ) సభ్యులూనట.

మరి వీళ్లు తొమ్మిదేళ్లనుంచీ యేమి పొడిచారోగానీ, మొన్న హురియత్ కాన్ ఫరెన్సు అతివాదనాయకుడు సయ్యద్ ఆలీషా గిలానీ 'మర్యాద ' చూశాక, కాశ్మీర్ సమస్య పరిష్కారం 'యెంతో దూరం లో లేదు!' అన్నారట.

పోనీలెండి.....బెటర్ లేట్ దేన్ నెవర్ అన్నారుకదా?

ఓ వారంలో పాఠశాలలు తెరుస్తారనగా, ఇంకా పుస్తకాలూ, దుస్తులూ సిధ్ధం కాలేదట. పుస్తకాలు జెరాక్సులు తీయడం మొదలెట్టారట. దుస్తులు, ఆప్కోవాళ్లు నిధులకొరత కారణంగా ఒకజత మాత్రమే అందించగలుగుతుంటే, మిగతా గుత్తేదారులు అదీ లేదట!

స్పీకర్ల యెన్నిక "సవ్యంగా" జరిగిపోయింది. ప్రో టెమ్ స్పీకర్, మనోహర్ స్పీకరుగా, 'మూజువాణీ' గా నెగ్గినట్టు ప్రకటించేశాక, చంద్రబాబు--నేనూ వున్నాను--అంటే, సరే, వోట్లు లెఖ్ఖెడదాం అన్నారట. జగన్ వర్గం వాళ్లు "సీక్రెట్ బ్యాలట్"లో, ఆత్మ ప్రబోధం ప్రకారం వోటు చేద్దామనుకొంటే, కాంగీ రాజకీయపండితులు, అంతకుముందెప్పుడో మ్యానేజ్ చేసుకొన్న కోర్టు తీర్పుల నేపధ్యంలో, "చేతులెత్తే వోటు" కూడా చెల్లుబాటవుతుందని యెన్నికపధ్ధతిని మార్చేయడంతో, చచ్చినట్టు మనోహర్ కే వోటు వెయ్యవలసి వచ్చింది (ట).

ఇంక "అవిశ్వాసం" ప్రసక్తేరాలేదని చంద్రబాబు వెళ్లి గవర్నరు దగ్గర మొరపెట్టుకొంటే, ఆయన ప్రశాంతంగా విని, ఇంకెవరైనా మాట్లాడినా వింటాను అని సంసిధ్ధతని ప్రకటిస్తే, ఇంకెవరూ మాట్లాడం అని వచ్చేశారు!

భలే రాజకీయం! కదా?

ఇంక రామ్ దేవ్ మొత్తం ఆస్థి 8000 కోట్లేనట. లక్షకోట్ల జగనే, వెనకా ముందూ ఆలోచిస్తుంటే, వీడేం పీకుతాడు? మహా అయితే, తనవెనకున్నవాళ్లని మేపలేక, కుదేలయిపోయి, మహాసముద్రంలో కాకిరెట్టగా మారిన ఇంకో చిరంజీవి అవుతాడేమో!......కాకపోతే, ఓ గ్రద్దో, రాబందో రెట్ట అవ్వచ్చు!

స్టేజ్ మేనేజ్ చేసిన (ఆడవాళ్ల సల్వార్ కమీజు దుస్తుల్లో తప్పించుకోడానికి ప్రయత్నం చేశాడంటే, ముందు వుప్పు అందినట్టే కదా? యెవరి చెవుల్లో పువ్వులు పెడతాడు?) పోలీసు చర్యతో ఆ కాస్త దీక్షా భగ్నమే చేసేశారట ఢిల్లీలో! (బలై పోయింది ఓ యాభై, అరవైమంది సామాన్యులే! ఆడవాళ్లతో సహా!)

ఇంకేం మిగిలింది? హళ్లికి హళ్లి, సున్నకి సున్న!

రేపటి సంగతి వెండి తెరపై!

6 comments:

Anonymous said...

ఏయూలో బుల్లయ్య గారంటే ఎవరు? వివరాలు చెప్పగలరా? రాజమండ్రిలో గురుకులం అనే స్కూలు పెట్టిన తన్నీరు బుల్లయ్య గారు ఏయూలో ఏదో మెంబర్ గా చేసేవారు. మీరు ప్రస్తావిస్తున్నది ఆయన్నేనా, ఇంకెవరైనానా?

ఫణీంద్ర పి, ఈటీవీ2

Rajendra Devarapalli said...

ఫణీంద్ర గారు,బుల్లయ్య గారి గురించిన ప్రాథమిక సమాచారం ఇక్కడ లభ్యం
http://en.wikipedia.org/wiki/Lankapalli_Bullayya

A K Sastry said...

పై అన్నోన్ (ఫణీంద్ర పి.)!

నిజంగా నాకు ఆయన పేరు ఎల్.బుల్లెయ్య అనే ఙ్ఞాపకం. ఇంటిపేరు గుర్తులేదు. తన్నీరువారు వేరు.

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ రాజేంద్ర కుమార్ దేవరపల్లి!

చాల కాలం తరవాత మీ వ్యాఖ్య!

మేము కాలేజీలో చదువుతున్నప్పుడు ఆయన వైస్ ఛాన్సెలర్!

అప్పట్లో, "మోడిఫైడ్ న్యూ రెగులేషన్స్"--డిగ్రీ 1st యియర్లో పరీక్షలు వుండవు. 2nd యియర్లో, లాంగ్వేజెస్, మెయిన్స్ కి ఒకేసారి 2 సంవత్సరాల సిలబస్ మీదా పరీక్షలు! 3rd యియర్, పూర్తిగా గ్రూప్ సబ్జెక్టులన్నింటిలోనూ పరీక్షలు--విధానానికి వ్యతిరేకంగా సమ్మెచేసి, ఆయనకి "డౌన్ డౌన్"లు కొట్టాము! (తరవాత మేము చదువుకున్నది ఆ పధ్ధతిలోనే!)

తరువాత ఆయన మా కాలేజిలో ఓ బిల్డింగ్ బ్లాక్ ప్రారంభానికి వస్తే, విద్య విషయంలో ఆయన తపన చూసి, ముగ్ధులమయ్యాం!

మీ లింక్ ద్వారా మళ్లీ ఓసారి ఆయన గురించి సమగ్రంగా చదివి, మనసులోనే నివాళులర్పించాను!

చాలా సంతోషం. ధన్యవాదాలు!

Anonymous said...

రాజేంద్ర గారూ... ఓ గొప్ప విద్యావేత్త గురించి తెలియజేశారు. ధన్యవాదాలు. కృష్ణశ్రీ గారూ... కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కలిగించారు. మీకూ ధన్యవాదాలు.

ఫణీంద్ర పి, ఈటీవీ 2

A K Sastry said...

డియర్ ఫణీంద్ర!

చదివేవాళ్లుండాలిగానీ వ్రాయడానికి నేనెప్పుడూ సిధ్ధమే!

నా మిగతా బ్లాగులుకూడా చదవండి. ఈ తరం వాళ్లకి తెలియని చాలా విషయాలు ప్రస్తావించాను/స్తున్నాను.

సందేహాలుంటే మాత్రం, తప్పక వ్రాయండి. నా పొరపాట్లేమైనా వున్నా యెత్తిచూపండి.

ధన్యవాదాలు.