Thursday, June 30, 2011

కబుర్లు - 61

అవీ, ఇవీ, అన్నీ

చాలా కాలం తరవాత మన ప్రథాని నోరు విప్పాడు--పిచ్చి 'దంబరం' కూడా ఆయన తరచూ నోరు విప్పితే బాగానేవుంటుంది అన్న తరవాత.
 
నలుగురో ఐదుగురో హేమాహేమీల్లాంటి పత్రికా యెడిటర్లు ఆయన మనసులో వున్నది బయటపెట్టించలేకపోయారు. (ఓ మార్క్ టుల్లీ లాంటివాళ్లెవరైనా ప్రయత్నిస్తే బాగుండును). ఆయన యెప్పుడూ చెప్పేవే చెప్పారు. యెవరో మీడియాకి తప్పుడు ఆరోపణలతో సమాచారం ఇస్తున్నారు అనీ, మీడియా తానే ఫిర్యాదుదారూ, దర్యాప్తు సంస్థా, న్యాయ మూర్తీ పాత్రలని పోషిస్తోంది అనీ అన్నారు.

ఆ ప్రముఖ మీడియా ఎడిటర్లకీ సిగ్గు లేదేమో! సరిగ్గా నిలదీసిన దాఖలాలు లేవు. జూనియర్ విలేఖరులే మెరుగనిపించారు.
 
లోక్ పాల్ పరిధిలోకి తనను చేర్చడానికి అభ్యంతరం లేదు కానీ, తన మంత్రివర్గ సహచరులే వొద్దంటున్నారు అన్నాడట. మంత్రివర్గ సహచరుల మీద తనకి నియంత్రణలేదు అనడానికి ఇంతకన్నా ఋజువు యేమి కావాలి? మళ్లీ, నల్లధనం, ద్రవ్యోల్బణం ఆందోళనకరమే గానీ, తనదగ్గర 'మంత్రదండం' యేమీ లేదు అనీ, పెట్రో ధరల విషయంలో కూడా 'అద్భుత దీపం' లేదు అనీ, అన్నాడట. ఇలాంటి పిచ్చి మాటలు వినీవినీ చెవులు తడకలు కట్టలేదూ? రేప్పొద్దున ఆ పిల్లరాజు చేత 'నాదగ్గర మంత్రడం, అద్భుత దీపం ఇంకా చాలావున్నాయి' అని ప్రకటింపచేసేస్తారేమో! దేశ ప్రజలకి దేవుడే దిక్కేమో!
 
కొత్త విషయం ప్రణబ్ ఆఫీసు బగ్గింగ్ గురించి, మొన్న సెప్టెంబరులో ఆయన అనుమానం వ్యక్తం చేశారు, ఐ బీ చేత దర్యాప్తు చేయించాము, వాళ్లు అదేమీ లేదన్నారు. అయినా ప్రణబ్ మంత్రిత్వ శాఖ నుంచి యేదైనా వస్తే, హోం శాఖనుంచి 'లూప్' చెయ్యకుండా నాకే చెప్పమన్నాను! అన్నారట. ఇంక మేడం గారి గురించి అడిగితే, 'కిసుక్కున నవ్వి', నా ప్రభుత్వం చేసిన మంచిపనులు అన్నీ ఆవిడవల్ల జరిగినవే, చేతకాని పనులు అన్నీ నేనే చేసినవే! అన్నారట. మరి డిగ్గీ రాహుల్ ప్రథాని అవ్వాలంటున్నాడు కదా? అంటే, నాకు ఈ వుద్యోగం ఇచ్చారు. వుద్యోగం వున్నన్నాళ్లూ నేనే చేస్తాను. యువతరం ఆ వుద్యోగానికి రావలసిందే. మేడం ఇప్పటివరకూ నీ వుద్యోగం పీకేస్తానని అనలేదు. ఒకవేళ అంటే, నిక్షేపంగా పదవీ విరమణ చేస్తాను. అని వినయం వొలకబోశాడు. ఆయన "నికమ్మా"త్వానికి ఇంతకంటే నిదర్శనాలు యేమి కావాలి? పైగా మళ్లీ పదిహేనురోజులకోసారి నోరు విప్పుతారట--యెంపిక చెయ్యబడ్డ మీడియా ప్రతినిధుల ముందు! యెందుకూ? ఖర్చులూ, సమయం దండగ! ఆయన చెప్పిన, చెపుతున్న, చెప్పబోయే విషయాలు యెవరికి తెలియవని???!!!

ప్రణబ్ మంత్రివర్గం చేతిలో వుండే ఆదాయపన్ను శాఖ క్రిందవుండే 'ఎన్‌ఫొర్స్ మెంట్ డైరక్టరేట్' లాంటి ఐదో ఆరో దర్యాప్తు సంస్థలకి తగిన 'మౌలిక వసతులు' లేకపోవడంతోనే, ఓ ప్రైవేటు సంస్థని వినియోగించాము అనీ, ఆ సంస్థ 16 చోట్ల "మెత్తటి పదార్థాన్ని" కనుగొంది అనీ, అది బబుల్ గమ్ ఖచ్చితంగా కాదు అనీ, ఆ విషయంలో ఆ కార్యాలయాల్లో పారిశుధ్యం నిర్వహించే అధికారినీ, పనివాళ్లనీ సస్పెండు చేశాము అనీ, ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ప్రతినిధి అదేదో "గుప్తా" అనేవాడు ప్రకటించాడట! మన ఆదాయ పన్ను శాఖా దానిక్రింద దర్యాప్తు సంస్థలూ కూడా "నికమ్మా"లేనన్నమాట! మరి బాధ్యులైనవాళ్లని ప్రశ్నించి, ఆ పదార్థాన్ని యెవరు పెట్టమన్నారు, ఆ పెట్టమన్నవాళ్లని ప్రశ్నించి, ఆ పదార్థంలోని నొక్కులూ వగైరా గుర్తులవల్ల అక్కడేమి అతికించారు, యెన్నాళ్లు, యేమి సమాచారం సేకరించారు, యెవరికి ఇచ్చారు--ఇలాంటివేమీ కనుక్కోవాలని కూడా ఆ నికమ్మాలకి తోచడం లేదు! ఆ పనులు చేయించినవాడినీ, అలాంటి వెధవల్నీ ఓ పట్టు పడితే, మంత్రదండాలూ, అద్భుతదీపాల అవసరం వుంటుందంటారా?

తెలంగాణాకి 'గూర్ఖా లేండ్' తరహా......అని యెవరో (పిచ్చి 'దంబరమే' అంటున్నారు) పిత్తితే, మళ్లీ కేసీఆర్, తన 'రాజకీయ పార్టీల తో చర్చలలో' భాగంగా మళ్లీ తెలంగాణా కాంగ్రెస్ నేతలతో, జానారెడ్డి ఇంటికివెళ్లి మంతనాలు సాగించాడట. అందరూ రాజీనామాలు చేస్తే, 'రాజ్యాంగ సంక్షోభం' వస్తుంది అనీ, అప్పుడు తెలంగాణాని వొడిసిపట్టుకోవడం చాలా వీజీ అనీ, ఒకవేళ అలాంటి సంక్షోభమేమీ రాకపోయినా, వాళ్లందరూ తెరాస టిక్కెట్లమీదో, స్వతంత్రులుగానో పోటీచేస్తే, ఇతరులెవరూ బరిలో నిలవరు అనీ, మళ్లీ వాళ్లనందరినీ నెగ్గించే బాధ్య తాను చూసుకుంటాను అనీ (పనిలో పనిగా జానారెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాను అనీ) హామీలిచ్చేశాడట. జానారెడ్డి యెగిరిగంతేసినా, మిగిలినవాళ్లు 'విస్తృత సమావేశం' నిర్వహించి, అప్పుడు చెపుతాం అన్నారట. వాడిమాటలు నమ్మెయ్యడానికి--పోటికి నిలవకుండా వుండడానికి తెరాస, ఐకాస నాయకులూ, కుక్కతోకపట్టుకొని గోదారి ఈదగలము అనుకోడానికి కాంగీ నేతలూ 'వెర్రిపప్పలు' లా కనిపిస్తున్నారేమో వాడికి! అప్పుడే కొంతమంది ఎంపీలూ, రాజ్యసభ సభ్యులూ--మేము రాజీనామాలు చెయ్యం, మీరూ మీరూ చూసుకోండి అనికూడా అనేశారట. తననీ, కోదండరాం నీ, వేదికపైనున్న నేతలనందరినీ "జైళ్లలో" పెట్టినా భయపడం అని జయశంకర్ సంస్మరణసభలో ప్రకటించాడట. దొంగాడా చెయ్యి కొరుకుతావన్నట్టు, కి కు రె అలాంటి పిచ్చిపని చేస్తే, మళ్లీ తెలంగాణాని అగ్నిగుండం చేసేసి, సామాన్యులకీ, విద్యార్థులకీ బొందలుపెట్టి, ఆనందిద్దామనుకుంటున్నాడు పాపం! ఈ సారి సంక్షోభం రాదు అనీ, 356 అని పెద్ద పెద్ద అంకెలు హైరరాబాదంతా ఆకాశంలో కనిపిస్తున్నాయి అనీ అంటున్నారు రాజకీయ నిపుణులు. మరి వాడికి యెందుకు కనపడడంలేదో?

"నేనింక సినిమాలలో ముఖ్యమంత్రిగా నటించను. నిజం ముఖ్యమంత్రిగానే చూడాలని ప్రజలు ఆశగా యెదురుచూస్తున్నారు" అని ప్రకటించిన చిరంజీవి, అందాకా, వచ్చే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో యే నౌకాశ్రయాలశాఖో కేటాయిస్తే ప్రస్తుతానికి అడ్జస్ట్ అయిపోతానన్నా, "మాలో మేమే కొట్టుకు ఛస్తున్నాం! క్యూలో చివర నిలబడితే, అక్టోబరు నెలాఖరుకి యేమైనా ఫలితం వుండొచ్చు" అన్నారట అసలువాళ్లు. మరేమి చేస్తాడో?

హోదా, పరపతి గల నేరస్తులమీద దర్యాప్తూ, విచారణా యేమాత్రం జరగకపోవడంతో, దేశంలో చట్టబధ్ధ పాలన చట్టుబండలు అవుతోంది అంటూ ఆయనెవరో సుప్రీం కోర్టులో 'పిల్' దాఖలు చేస్తే, కోర్టుకూడా 'విచారిస్తూ', లా కమిషన్ వారూ, ప్రభుత్వమూ 'సమగ్ర నివేదిక' ఇవ్వాలని ఆదేశించిందట. బాగానే వుంది. సదరు కమిషన్ వగైరాలు యేమి నివేదిక ఇస్తారో మళ్లీ వాయిదానాటికి చూడాలి.

(ఈ న్యాయాలయాలూ, అక్కడనడిచే 'తతంగాలూ' సామాన్యులెవరికీ అర్థం కాని చిదంబర రహస్యాలు. వాటి విషయంలో ఇంకో టపా వ్రాస్తాను.)

అమరనాథ యాత్ర మొదలయ్యిందట. కొన్ని సార్లు, సంవత్సరానికోసారి యేర్పడే ఆ మంచులింగం చిన్నదిగానే వుండడం, త్వరగా కరిగిపోతూండడం లాంటి కారణాలతో, ఆ ప్రదేశంలో ఓ రాతి లింగాన్ని ప్రతిష్టిస్తే, మంచు కరిగిపోయినా దేవుడున్నట్టు వుంటుందని వో ప్రతిపాదన వచ్చిందట--ఆ ప్రభుత్వంలో పెద్దలనుంచే అనుకుంటా. (హిమాలయాలని కూడా వదలకుండా, బంగారు తాపడాలూ అవీ చేశేసి, నిత్యాన్నదానాలూ అవీ ప్రవేశపెట్టీసి, బాగా డబ్బుచేసుకోవచ్చని గొప్ప ప్లానే వేశారు కానీ, అక్కడి ఆలయ పూజారులూ, మతపెద్దలూ "ససేమిరా" అన్నారట. ఆ లింగుడు అంతవరకూ అదృష్టవంతుడే!

ఇంకో గొప్పవిషయం యేమిటంటే, కేరళ పద్మనాభస్వామి ఆలయం నేలమాళిగలో, ఇన్నాళ్లూ తెరవకుండా వుంచిన ఆరు అరల్లో, ఓ మూడింటిని తెరిపిస్తే, సుమారు 700 కోట్ల విలువైన బంగారు, రత్నాల ఆభరణాలూ, అలంకరణ వస్తువులూ లభించాయట. అలా తెరవాలని చెప్పి, సుప్రీంకోర్టే పుణ్యం కట్టుకొంది. ఆ లెఖ్ఖంతా పారదర్శకంగానే జరిగిందంటున్నారు. బృందంలో యేడుగురు సభ్యులూ, అందులో ఇద్దరు కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తులూ వున్నారట. మరి అది నిజమైన పారదర్శకతేనా, సత్యసాయి ట్రస్టు లాంటిదా? యేమో--సుప్రీంవారే తేల్చాలి.  

   

Sunday, June 26, 2011

కబుర్లు - 60

అవీ, ఇవీ, అన్నీ





డీజల్ ఓ 3 రూపాయలూ, వంట గ్యాస్ ఓ 50 రూపాయలూ, కిరోసిన్ ఓ 2 రూపాయలూ మాత్రమే పెంచడంతో సరిపెట్టారు సర్కారువారు. అంతేకాక, తమ రాబడిలో ఓ 49,000 కోట్లు మాత్రమే వుదారంగా కోత పెట్టుకొని సంతృప్తి పడ్డారు. యేమాత్రం సంతృప్తి లేని, ఇనుకుడు కుండీల్లాంటి పొట్టలుగల ఆయిల్ కంపెనీలు మాత్రం, ఇంకా ఓ లక్షా ఇరవైవేలో యెన్నో కోట్లు నష్టాలు మూటగట్టుకుంటూనే వున్నాయట. అదీ అంతర్జాతీయ చమురు ధరలు బ్యారల్ 100 డాలర్లకన్నా తగ్గిన సమయంలో! రాష్ట్రాలు కూడా వుదారంగా తమ రాబడుల్లో కోతపెట్టుకోవచ్చని సలహా కూడా ఇచ్చారు. మమతాదీ అప్పుడే కోత పెట్టేసుకొంది గానీ, మహారాష్ట్ర, ఆంధ్ర లాంటివాళ్లు 'ససేమిరా' అంటున్నారు. ఇంక ద్రవ్యోల్బణం మాట దేవుడెరుగు!



డిగ్గీ సింగ్ "రాహుల్ ప్రథాని పదవికి అర్హుడు" అని మాత్రమే అన్నాను. అయినా ఇప్పుడు ఆ పదవి ఖాళీ లేదుగా?! అన్నాట్ట. అంటే, ఖాళీ చేయించే పని చూడండ్రా అని తన తోటి భజంత్రీగాళ్లకి పురమాయిస్తున్నాడా? పిచ్చి 'దంబరం' పేపర్లో చూసేవరకూ సీబీఐ ప్రణబ్ ఆఫీసుల బగ్గింగ్ విషయంలో దర్యాప్తు జరుపుతోంది అని నాకు తెలీదు--అన్నాడట. అదేమి హోమో! అదేమి మంత్రో! నిజంగా సీబీఐ దర్యాప్తు సాగిస్తోందా? మరి ప్రైవేటు సంస్థ దర్యాప్తు సంగతేమిటి? అంతా "అంధేర్ నగరీ, అన్ భుజ్ రాజా" వ్యవహరం లా వుంది! మోక్షానికి 2014 దాకా ఆగాలా?



మంత్రివర్గానికీ, పార్లమెంటుకీ సమర్పించబోయే "లోక్ పాల్" బిల్లులో, పౌరసమాజం సూచనలని పొందు పరిచే అవకాశం యెంతమాత్రం లేదు అనీ, అది ప్రభుత్వం ప్రతిపాదించిన పాత బిల్లు కూడా కాదు అనీ, దేశానికి యేది మంచిది అనుకుంటే అది చేసే స్వేచ్చ అన్నా హజారేకి యెప్పుడూ వుంటుంది అనీ--ప్రకటించేశాడు క 'పిల్సి 'బల్! పౌర సమాజం, ప్రజా సమూహం "ఈజిప్టు" తరహాలో వీళ్లకి గట్టిగా బుధ్ధి వచ్చేట్టు చెయ్యవలసిన సమయం ఆసన్నమైంది. ఇంకా ఓ ఇరవై రోజులు సమయం వుంది కాబట్టి, ఆ దిశలో విజృంభించాలని బ్లాగర్లకి నా విఙ్ఞప్తి!



నేనన్నట్టే చాలామంది నల్లధనాన్ని "స్విస్" బ్యాంకుల్లో వెతకనఖ్ఖరలేదు, దేశంలో వెతికితే చాలు అంటున్నారు. నిజానికి, స్విస్ బ్యాంకులు ఖాతాల్లో దాచుకున్న సొమ్ముకి నూటికి సంవత్సరానికి 1% మాత్రమే వడ్డీ చెల్లిస్తాయి! వాములు మేసే స్వాములకి ఇవి తిన్నాక పళ్లలో చిక్కుకున్నంత కూడా కాదు! అందుకనే వాళ్లు ఆ ఖాతాలని "ఫండ్స్ పార్కింగ్" కోసమే తాత్కాలికంగా వాడుకొని, అక్కడనుంచి విదేశాలలోని తమ దొంగ ఖాతాల ద్వారా మన దేశానికి తరలించి, తెల్లధనం గా చెలామణి చేస్తూ, భారతీయ కుబేరులుగా "ఫోర్బ్స్" మేగజైన్ కి యెక్కుతున్నారు. కోరలు లేని "ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్" లాంటి చట్టాలూ, అవగాహన లేని దర్యాప్తు సంస్థల వుద్యోగులూ, ఒకవేళ వున్నా, పైవాడి అదేశాలకి యెదురుచూడ్డానికి అలవాటు పడడం--ఇలాంటి వాటివల్ల అవి నిష్ప్రయోజనంగా మారాయి. అలాంటివాళ్ల భరతం బట్టడానికి పౌర సమాజం యేమి చెయ్యగలదు? జన లోక్ పాల్ బిల్లు చట్టం అయ్యాక, ఈ పని మొదలెడదాం. బారాందే! నువ్వుకూడా వెయిటూ!



ఓ పాతిక సంవత్సరాల క్రితం, బ్యాంకులు "వుత్పత్తి రంగానికే ఋణాలు" (ప్రొడక్టివ్ క్రెడిట్) ఇచ్చేవి. ఆ రోజుల్లో, పెరుగుతున్న జనాభాకి సరిపోయే "మకాన్"ల ఆవశ్యకత గ్రహించిన ప్రభుత్వం, నేషనల్ హౌసింగ్ బ్యాంకుని స్థాపించి, గృహ నిర్మాణ రంగాన్ని ప్రాథాన్యతా రంగం లో చేర్చి, బ్యాంకులని కూడా ధారాళంగా ఆ రంగానికి అప్పులు ఇవ్వమంది. తరవాత, సంస్కరణల పుణ్యమా అని, "మౌలిక వసతుల రంగం" (రోడ్లూ, పవర్ ప్లాంటులూ, విమానాశ్రయాలూ వగైరా) ప్రాధాన్యత గుర్తించి, పెట్టుబడులని ఆ వైపు మళ్లించారు. సందట్లో సడేమియాగా బ్యాంకులు ప్రాధాన్యత అసలు ఇవ్వకూడని రంగాలు (మద్యం తయారీదారులూ, వాటి హోల్ సేల్, రిటెయిల్ వ్యాపారులూ, మోటర్ సైకిళ్లూ, కార్లూ తయారుచేసే ఫ్యాక్టరీలూ, ప్రైవేటు విమాన యాన సంస్థలూ--ఒకటేమిటి--సిగరెట్లూ, బీడీలూ, గుట్కాలూ తో సహా అందరికీ ఋణాలు ఇచ్చేశాయి). ఇప్పుడు "వృధ్ధి రేటు" లో భాగంగా అవన్నీ లెక్కించబడుతున్నాయి! ఇప్పుడు ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేస్తే, "వాటి" వృధ్ధి రేటు తగ్గిపోతుందికదా? అదీ మన పాలకుల బెంగ! నరసాపురం లాంటి చిన్న వూళ్లలో కూడా, ఇళ్లు కట్టించుకుంటూ, తమకి ఓ పోర్షన్, అద్దెకివ్వడానికి ఓ పోర్షన్ నిర్మించేసి, పార్కింగుల ప్రసక్తి లేకుండా ప్రహరీ గోడలు నిర్మించేసుకొని, ఇప్పుడు కార్లు కొనేసి, పదిహేనడుగుల సిమెంటురోడ్డులో కూడా, ఇళ్లముందు అగ్గిపెట్టెల్లా రోడ్డుమీదే పార్కింగ్ చేసేస్తున్నారు! అదీ మన వృధ్ధి! విమానాశ్రయాల్లో మౌలిక వసతులు పెంచకుండా, ప్రైవేటు విమాన సంస్థలని ప్రోత్సహించి, వాళ్లు చేస్తున్న సర్కస్ ఫీట్లూ, జిమ్మిక్ లూ వినోదంగా చూస్తూంది ప్రభుత్వం. ప్రభుత్వ విమానయాన సంస్థ "ఎయిర్ ఇండియా" (దాంట్లో ఇండియన్ ఏయిర్ లైన్స్ ని విలీనం చేసి) తో ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు, ఆడుకుంటున్నాడు ప్రఫుల్ పటేల్. ఇది 2జీ స్కాము కన్నా పెద్దది! మరి ఈ వృధ్ధి రేట్లకోసం యేడుద్దామా? ద్రవ్యోల్బణం గురించి యేడుద్దామా? దువ్వూరివారూ! యేమంటారు?



1980 లలో, చైనాలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీ ఈ వో లు సైతం, సైకిళ్లపై తమ కార్యస్థానాలకి వెళ్లేవారు. నగరాల్లో పీక్ అవర్ ట్రాఫిక్ అంతా సైకిళ్లదే! అవన్నీ న్యూస్ రీళ్లుగా మనదేశంలో సినిమాలలో చూపించేవాళ్లు. ఆశ్చర్యపోవడం మావంతు! ఇప్పుడు అదే చైనాలో, సైకిళ్లు కనుమరుగయ్యాయి! బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, చెన్నై, బెంగుళూరు లోలా, ఐదారు లేన్లలో కార్లు వెళుతూండడం, ట్రాఫిక్ జాములూ--షరా మామూలే చైనాలో కూడా. ఇప్పుడు బెంగుళూరు లాంటి నగరాల్లో, ముఖ్యమైన రహదారుల్లో, సైకిళ్లని ప్రోత్సహించాలని కంకణం కట్టుకున్నారట కొంతమంది అత్యుత్సాహులు! వుదాహరణకి, జయానగర్ లాంటి "జీ బీ లింగప్పలు" వుండే ప్రాంతంలో, "ప్రత్యేక సైకిలు ట్రాక్ లు" యెర్ర రంగులో యేర్పాటు చేస్తారట. బాగుంది. "ఫైవ్ స్టార్ హోటళ్లకి కారుల్లోనే వెళ్లాలా? సైకిళ్లమీద రాకూడదా?" అని ప్రశ్నిస్తున్నారట కొంతమంది. అనేక రెస్టారెంట్లముందూ, ఫుడ్ కోర్టుల ముందూ, ప్రస్తుతానికి ఓ "ఐదు" సైకిళ్లు పార్కింగ్ చేసుకొనే సదుపాయం కల్పిస్తారట. త్వరలో పార్కింగ్ సౌకర్యాన్ని వందా, వెయ్యీకి పెంచుతారట! "పెళ్లి కుదిరితేగానీ పిచ్చి తగ్గదూ, పిచ్చి కుదిరితేగానీ పెళ్లి అవదూ"; "పిచ్చి ముదిరింది, తలకి రోకలి చుట్టండి!" అనీ ఇలాంటి సామెతలు గుర్తుకు రావడంలేదూ? మన దేశ వృధ్ధి రేటేమయిపోను? సైకిలు ప్రమోషన్ లాబీలేమైనా యాక్టివేట్ అయ్యాయా? సీబీఐ దర్యాప్తుకి ఆదేశించాలా? అయితే యెవరూ? ఇవన్నీ శేష ప్రశ్నలు.

Friday, June 24, 2011

కబుర్లు - 59

అవీ, ఇవీ, అన్నీ


(యేమిటో--ఈ మధ్య యెంత సీరియస్ విషయాలు యెంతగా సణిగినా, తెలుగు బ్లాగర్లెవరూ సీరియస్ అవడంలేదు యెందుకో మరి!)



కాంగీ కార్యదర్శి డిగ్గీ సింగ్, "రాందేవ్ కి పట్టిన గతే అన్నాకీ పడుతుంది" అని హెచ్చరించాడట! మళ్లీ "థూ నా బొడ్డు" అని, "రాం దేవ్ నేమి చేసినా, అన్నానేమి చేసినా, మా పార్టీకి సంబంధం లేదు. స్థానిక వ్యవస్థే చూసుకుంటుంది అన్నానంతే" అన్నాడట. అంటే షీలా, నువ్వు చూసుకో అని చెప్పడమా? (మొన్నోరోజు వీడే, "రాహుల్ ఇంక పెళ్లి చేసుకొని (వాడికి 41 యేళ్లిప్పుడు!), ప్రథానమంత్రి అయిపోవలసిన రోజు దగ్గరకి వచ్చేసింది" అని, మళ్లీ నేనలా అనలేదు అనేశాడు!) అన్నా దీక్ష అంటే ఓ సారి రుచి చూశాడుగా! అందుకే, ఆయనకాకుండా, ప్రశాంత్ భూషణ్ గానీ, కేజ్రివాల్ గానీ దీక్ష చేస్తే బాగుంటుంది అని కూడా అన్నాడట! వాడికి దీటుగా, "అన్నా చేస్తున్నాడా, ఇంకొకరా అన్నది కాదు ప్రశ్న. యెవరు చేసినా 'దేశ ప్రజానీకం యవత్తూ' దాని వెనక వుందని మరచిపోవద్దు!" అని జవాబిచ్చాడు అన్నా. బుధ్ధి తెచ్చుకుంటారా?



చిత్రమైన విషయమేమిటంటే, ప్రభుత్వం ప్రవేశపెట్టదలుచుకున్న లోక్ పాల్ బిల్లు లో, అవినీతి చేసినవాడికంటే, వాడిమీద ఫిర్యాదు చేసినవాడికి యెక్కువ శిక్ష విధించవచ్చట! ప్రభుత్వ కర్మచారులందరినీ లోక్ పాల్ పరిధిలోకి తెస్తే, ఓ 40 లక్షలమంది కేంద్ర వుద్యోగులూ, 80 లక్షల మంది రాష్ట్ర వుద్యోగులమీదా మొత్తం 1 లక్షా 20 వేల ఫిర్యాదులు వస్తే, లోక్ పాల్ వుక్కిరిబిక్కిరి అయిపోతాడట! (అంటే, లోక్ పాల్ బిల్లు రాగానే ఖచ్చితంగా "అందరు" కర్మచారులపైనా ఫిర్యాదులు వస్తాయని గట్టి నమ్మకం అన్నమాట ప్రభుత్వానికి!). అసలు ఆ గొడవెందుకు? ఓ సారి లోక్ పాల్ యేర్పడ్డాక, వాడే చూసుకుంటాడు కదా--యే ఫిర్యాదుని, యెన్ని ఫిర్యాదులని యేమి చెయ్యాలో? ఇంక శిక్షల విషయానికొస్తే, ఓ స్పెషల్ కోర్టు ఫిర్యాదు పనికిమాలినది అని తలిస్తే, ఫిర్యాదీకి 'కనీసం ' 2 సంవత్సరాల శిక్ష విధించవచ్చట. వుదాహరణకి ఓ వూళ్లో యువజన సంఘం వాళ్లు, స. హ. చట్టం క్రింద దరఖాస్తుచేసి, మా సర్పంచ్ ఇంత తినేశాడు అని ఫిర్యాదు చేస్తే, స్పెషల్ కోర్టు వాళ్లు "ఠాట్! అది బోగస్ ఫిర్యాదు" అని సంఘం లో అందరికీ తలా రెండేళ్లూ శిక్ష వేసెయ్యచ్చట. సర్పంచ్ ఆ పరిధిలోకి రాడు కాబట్టి, వాడికి శిక్ష వుండదట! యెంత బాగుందో కదూ!



యజుర్వేద మందిరం లో వున్న నగదూ, బంగారం వగైరా లెఖ్ఖించేశారు. కానీ, ఆ మందిరం తెరిచిన వెంటనే, ఓ ముఫ్ఫై ఐదున్నర లక్షలు, ఓ ట్రస్ట్ మెంబరు, ఓ కారులో బెంగుళూరు తరలిస్తూండగా, చెక్ పోస్ట్ లో పట్టేశారు! అవి ఓ 12 మంది భక్తులకి చెందినవి అనీ, వాళ్లు పోలీసు స్టేషన్ కి వెళ్లి, ఋజువులు చూపించి, తీసుకెళతారనీ, బాబా వారసుడు రత్నాకర్ ప్రకటించాడట. ఇంతవరకూ వాటిని యెవరూ తీసుకెళ్లలేదు. పోలీసులు విచారిస్తున్నారు! ఇంకా, రెండు గోనె సంచుల్లో 5 కోట్లో, 10 కోట్లో కుక్కేసి, ఓ వోల్వో బస్సులో తరలిస్తూంటే, పట్టుకున్నారట. దాని సంగతి యేమయిందో మరి పత్రికలలో కుడా రావడంలేదు. మధ్యలో, జగన్, తన అనుచరులూ, వారి పాద రక్షలూ సహా, సాయి మందిరంలో రత్నాకర్ ని కలిసాడట. యేమి చర్చించారో రహస్యం!



ఓ తొమ్మిది నెలల క్రితం, ప్రణబ్ గారి ఆఫీసులో, ఓ 16 చోట్ల దొంగ కెమేరాలూ, టేపులూ పెట్టిన వైనం ఆయనే గమనించి, వెంటనే ఆ విషయం దర్యాప్తు చెయ్యమని ఓ ప్రైవేట్ సంస్థకి అప్పగించారట! ఆ దొంగ కెమేరాలు హోం మంత్రిగారే పెట్టించాడు అని చెవులు కొరుక్కొంటున్నారట. లేకపోతే, దర్యాప్తు సీబీఐ కే అప్పగించేవారుకదా? అని క్రొశ్నిస్తున్నారు. నిజమే కదా? తొమ్మిది నెలల తరవాత, ఆ పదహారుచోట్లా వున్నది "బబుల్ గం" మాత్రమే అనీ, దాంట్లో పెద్ద విచారించవలసిన అగత్యం లేదనీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయట! (బబుల్ గం నవిలేసి, దాంతో యేమేమి చెయ్యచ్చో "జెఫ్ఫ్రీ ఆర్చర్" కథలూ, నవలలూ చదవండి). ఆర్థిక మంత్రే టాయిలెట్ లో యేమి చేస్తున్నాడో బయటివాళ్లు వీడియోలు చూస్తున్నారంటే, సామాన్యులకి దిక్కెవరు?



మొన్నోరోజు అదేదో "దాస్ గుప్తా" అనే ఆర్థిక నిపుణుడి వ్యాసం వొకటి చదివాను. ఆర్థిక సంస్కరణల తరువాయి భాగం అమలు చెయ్యడంలో ప్రభుత్వం అనవసరంగా ఆలస్యం చేస్తూంది అనీ, కైర్న్-వేదాంత మీద యేడాది పైగా నాంచుతోంది అనీ, పోస్కో వ్యవహారంలో రాజకీయాలకి ఆస్కారం ఇచ్చి, ప్రాజెక్టుని అలస్యం చేస్తోంది అనీ, చిల్లర వ్యాపార రంగంలోకి విదేశీ ప్రతక్ష పెట్టుబడులని యెంత తొందరగా ఆహ్వానిస్తే అంత త్వరగా ద్రవ్యోల్బణం తగ్గి, వృధ్ధి రేటు పెరిగిపోతుంది అనీ--ఇలా అమూల్యాభిప్రాయాలని వెలిబుచ్చాడు. ఈయన యెవరి కొమ్ము కాస్తున్నాడో తెలుస్తూనే వుంది కదా? ఇంకా, ఈయనే అనుకుంటా, రతన్ టాటా గత సంవత్సరంలో 16 దేశాల్లో కోట్లాది పెట్టుబడులు పెట్టాడనీ, మనదేశంలో ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు అనీ, అది దేశం లోంచి పెట్టుబడి 'యెగిరిపోవడంతో' (ఫ్లైట్ ఆఫ్ కేపిటల్) సమానమనీ అన్నాడు. మరి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీవాళ్లు ఓ నాలుగువందలేళ్లక్రితం మనదేశం లో పెట్టుబడులు పెట్టడం పెట్టుబడి 'యెగిరిపోవడమే' అనుకున్నారా? సంపద తమ దేశానికి "యెగిరి రావడం" అనుకున్నారా?! యేమిటో ఈ ఆర్థిక నిపుణులు!



కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్డి ఊరప్ప (తన పేరు "యెడ్యూరప్ప" అని మాత్రమే ప్రచురించాలని ఆయన యెన్నికవగానే మీడియా వాళ్లకి ఆఙ్ఞ జారీ చేశాడు) తనతో 'సఖ్యంగా' వుండమని చెప్పడానికి యెవరినో తనదగ్గరకి పంపించాడని కుమార స్వామి అన్నాడు. వెంటనే, మర్నాటి పేపర్లో, యెడ్యూరప్ప ఓ ప్రకటన ఇచ్చాడు--కుమార స్వామి అదే ఆరోపణ, ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయంలో "ఆన" పెట్టాలనీ, తానుకూడా ఆ ఆరోపణ అబధ్ధమని "ఆన" పెడతాననీ, డేటూ టైమూ చెప్పమనీ! మొత్తానికి రేపు 27 న ఇద్దరూ అక్కడ ఆనలు పెట్టడానికి యేర్పాట్లు చేస్తున్నారు! జనాలు పిచ్చోళ్లు అనుకోబట్టిగానీ, మంజునాథుడిమీద అంత భయమూ, భక్తీ, నమ్మకమూ వుంటే, అసలు యెవడైనా గడ్డి యెందుకు కరుస్తాడు? ఇదో రకం రాజకీయం మరి!

Saturday, June 18, 2011

కబుర్లు - 58

అవీ, ఇవీ, అన్నీ


ప్రపంచ ప్రఖ్యాత భారతీయ ఇంగ్లీషు రచయితా, కవీ "ప్రీతీష్ నందీ" మొన్న ఓ ఆర్టికల్ వ్రాస్తూ, ప్రపంచ ప్రఖ్యాత కార్టూనిస్ట్, "పీనట్స్" ఫేం "ఛార్లీ షూల్జ్" యొక్క "కామన్ ప్లేస్" కాన్సెప్ట్ గురించి వివరిస్తూ, "ఇది క్విజ్ కాదు" అంటూ ముందు కొన్ని ప్రశ్నలూ, తరవాత కొన్ని ప్రశ్నలూ సంధించాడు. మొదటివి, నిజంగా క్విజ్ మాస్టర్ల ఫేవరిట్, క్విజ్ లో పాల్గొనేవాళ్ల "ప్రైజ్ క్వేశ్చన్సే". ఉదా:- ప్రపంచంలోని 5గురు గొప్ప ధనవంతుల పేర్లూ; గత ఐదు సంవత్సరాల్లో, యేడాదికి ముగ్గురు చొప్పున యెన్నికైన "మిస్ ఇండియా"ల్లో, ఓ ఐదుగురి పేర్లూ; ఓ ఐదుగురు భారత రత్నాలూ; ఐదుగురు గొప్ప "బ్యాట్స్ మెన్" పేర్లూ; ఓ ఐదుగురు "నోబెల్ విజేతల" పేర్లూ--ఇలాంటి చక్కని ప్రశ్నలు! (ఇలాంటి వాళ్లందరినీ మెజారిటీ ప్రజలు వాళ్ల జీవితకాలం లోనే మరచిపోతూంటారు. వాళ్లు కొంతకాలం మాత్రమే "మెరిసి" తరువాత "ఫేడ్" అయిపోతారు.) ఇంక, రెండో విభాగం ప్రశ్నల్లో, మనలో యెవరికి వారికి మాత్రమే సమాధానాలు తెలిసేవి. ఉదా:- మీ చదువుకి దోహదం చేసిన కొంతమంది వుపాధ్యాయుల పేర్లు; మిమ్మల్ని కష్ట కాలం లో ఆదుకొన్న కొంతమంది స్నేహితుల పేర్లు; మిరు ప్రేమించిన/మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తుల పేర్లు (వాళ్లిప్పుడెక్కడున్నారో సైతం మీకు తెలియక పోయినా); మిమ్మల్ని అభినందించిన, ప్రత్యేకంగా గుర్తించినవాళ్ల పేర్లు; మీరు సంతోషంగా గడపగల ఓ ఐదుగురి స్నేహితుల పేర్లు--ఇవీ! వీటిలో అన్నింటికీ చాలా మంది ఓ ఐదుగురి పేర్లైనా చెపుతారు. యెంత, సమయానికి గుర్తుకు రాని నాలాంటి వాళ్లయినా, కనీసం ఇద్దరి ముగ్గురి పేర్లు చెప్పగలం! యేతా వాతా తేలేదేమిటంటే, మొదటి విభాగంలోని ప్రశ్నలకి సమాధానంగా వచ్చే వాళ్లని, వాళ్ల జీవితాలనీ, మనం ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకొంటాం. స్పూర్తి పొందుతాం. కానీ, వాళ్లకి మన జీవితాంతం కృతఙ్ఞులుగా వుండేంత సీను వుండదు! అయితే, రెండో విభాగం వాళ్లని అస్తమానూ తలచుకుంటాం, వారికి కృతఙ్ఞులుగా వుంటాం, వుండాలి! అదీ "కామన్ ప్లేస్" మహాత్మ్యం! బాగుంది కదూ?



"యజుర్వేద మందిరం"--సత్యసాయి నివాస, వ్యక్తిగత కార్యాలయ సముదాయం. ఆయనని ఆసుపత్రికి తరలించగానే, ఆ గదికి తాళం వేశారట (సత్యజిత్ యేమో!). మొన్న గురువారం ఆ తాళం తెరిచి, 36 గంటలసేపు మదింపు చేశాక, అందులో 11.50 కోట్లకి పైగా నగదూ, 98 కేజీల బంగారం, 307 కేజీల వెండీ లెఖ్ఖతేలాయట. ఇంకా కొన్ని పత్రాలూ వగైరా కూడా వున్నాయట. ఆ మందిర వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం, ఆ మందిరానికి వచ్చిన నగదు, మిషన్లతో లెక్కించి, ప్రతి గంట గంటకీ ఓ బ్యాంకులో జమ చేసేవారట! అలా మొత్తం ఖజానాని ఎస్బీఐ, ప్రశాంతినిలయం శాఖలో జమ చేశారట. బాగుంది. మరి యెంతటి ధనవంతుడైనా, రేపు యెంత నగదు అవసరం అనుకుంటే అంతకు మించి, అదీ తప్పదంటేనే, ఓ లక్షో, రెండు లక్షలో ఇంట్లో వుంచుకుంటాడు. అలాంటిది, అన్ని కోట్ల నగదుని ఆయన తన గదిలో యెందుకు వుంచుకున్నట్టు? అంత బంగారం, వెండీ యెందుకు వుంచుకున్నట్టు? ఆయన ఆసుపత్రిలో వున్నప్పుడు ఆ మందిరంలోంచి కొన్ని విలువైన వస్తువులనీ వగైరా బయటికి తరలించేశారని వార్తలు వచ్చాయి. ఆలా పోయినవి పోగా మిగిలినవే ఇంత మొత్తంలో వున్నాయా? అలాంట్ "హోర్డర్", అది ట్రస్ట్ అయినా సరే, మీద ప్రభుత్వం యేమి చర్యలు తీసుకోవాలి?



ఈ సందర్భంగా రాందేవ్ డిమాండ్లలో వొకటైన "వెయ్యి, ఐదువందల రూపాయల నోట్లని రద్దు చెయ్యాలి" అనే దాని రిలవెన్స్ అందరికీ బోధపడుతుంది అనుకుంటా--ముఖ్యంగా అంతంత నగదు నిల్వ చేసుకొనేవాళ్ల మీద ఆ ప్రభావం తీవ్రంగా వుంటుంది--మన స్థూల దృష్టికి. కానీ.....ఇదివరకోసారి అగ్రరాజ్యాల వొత్తిడికి లోబడి, అప్పటికి చలామణిలోవున్న అతి పెద్ద కరెన్సీ నోటు (రూ.1,000/-) లని "అన్నింటినీ" రద్దు చేశారు ఇందిరా గాంధీ టైములో! కాని, దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మీద పడిన ప్రభావం దాదాపు మృగ్యం అనే చెప్పాలి. కారణం--ఆ రద్దు ఫలానా రోజునించీ అమల్లోకి వస్తుందని ప్రకటించి, హోర్డర్లు కానివారికి అసౌకర్యం కలుగకుండా--వారిదగ్గరవున్న నోట్లని ఓ ధృవపత్రం సాయంతో బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించడమే! దాంతో అనేక నోట్లు వలలోనుంచి తప్పించుకున్నాయి! అలా తప్పించుకోగా మిగిలిన నోట్లతో మా వూళ్లో మార్వాడీల్లాంటివారు సిగరెట్లూ, చుట్టలూ వెలిగించుకొంటూ, పేపర్లకి కూడా యెక్కారు! బ్యాంకులవాళ్లు మాత్రం--యెవరు చెల్లించారు, వాళ్ల చిరునామా యేమిటి, వాళ్లకి ఆ నోట్లు యెక్కడనుంచి వచ్చాయి, ఆ నోట్ల నెంబర్లూ, వగైరా అనేక వివరాలతో రికార్డులు నిర్వహించలేక చచ్చారు! తరవాతైనా ఆ వివరాలని వుపయోగించుకున్నారా అంటే, అదీ లేదు! అందుకే అదో ప్రహసనం. అందుకే ప్రభుత్వం వాటిని రద్దు చెయ్యడానికి తటపటాయిస్తోంది--కాదు--ససేమిరా అంటున్నారు!



ఇలా వ్యవస్థలోని నగదుని డీ మానెటైజ్ చేసి, నల్లధనాన్ని ప్రభావశీలంగా రద్దు చెయ్యాలంటే ఒక చక్కని మార్గం వుంది. అదేమిటంటే--రిజర్వ్ బ్యాంక్, 0 నుంచి 9 లోపల ర్యాన్‌డమ్‌గా ఒక అంకెని యెన్నుకొని, (వుదాహరణకి 5) ఆ అంకె నోటుమీదుండే నెంబరు చివరలో వుంటే యే డినామినేషన్ నోటైనా, ఫలానా రోజు (4, 5 రోజుల సమయం ఇవ్వచ్చు) నుంచీ చెల్లవు అని ప్రకటించాలి. సామాన్యులకి ఇబ్బంది కలుగకుండా, తమ దగ్గరవున్న ఆ నెంబరు నోట్లని తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకొనే సౌకర్యం కలిగించాలి. మరే ప్రశ్నలూ, వివరాల నమోదూ అఖ్ఖర్లేదు. యేరోజు నుంచీ అవి చెల్లవన్నారో, ఆ రోజుకి బ్యాంకుల్లో జమ అయిన మొత్తం నోట్ల విలువకి సమానంగా కొత్త సిరీస్ లో, కొత్తనోట్లు ముద్రించవచ్చు. వాటిని సమయానుకూలంగా విడుదల చెయ్యవచ్చు. ఇక్కడ వుద్దేశ్యం యేమిటంటే, ఆ ప్రకటించిన తేదీకల్లా దేశంలోని మొత్తం కరెన్సీ లో 10% రద్దయిపోతుంది! అలా నెలకి ఓ అంకె చొప్పున యెన్నుకొని, వాటిని రద్దుచేసుకొంటూ పోతే, పది నెలల్లో మొత్తం కరెన్సీ అంతా బ్యాంకులకి చేరి, కొత్త కరెన్సీ చలామణిలోకి వస్తుంది! దానికయ్యే ఖర్చు ఇంక యే స్కీముక్రింద చేసే ఖర్చుకన్నా చాలా తక్కువగానే వుంటుంది! ప్రయోజనం యేమిటంటే, సాయి ట్రస్ట్ లాంటివాళ్లు గడువు తేదీలోగా చాలా తక్కువనోట్లు మాత్రమే మార్చుకోగలరు! ఇంకా కొంతమంది అయితే, మీలాంటి, నాలాంటి వాళ్ల దగ్గర ఆ నోట్లు కొంత డిస్కవుంట్ తో మార్చుకోగలరు! అంతేగానీ, పెద్దమొత్తాల్లో ప్రభుత్వాన్ని దగా చెయ్యలేరు! బంగారం, వెండీ, రియల్ ఎస్టేట్ వగైరాల మాటేమిటి అని అడగొచ్చు మీరు.....కానీ, వచ్చేనెల ఒకటో తారీఖునుంచీ, నెలాఖరువరకూ చివర 5 అంకెగల యేనోటూ చెల్లదు అనేటప్పటికి, దాని ప్రభావం వాటన్నింటిమీదా కూడా వుంటుంది. చాలా మంది ఆ బాధపడలేక, బ్యాంకు చెక్కులనీ, ఇతరమార్గాలనీ అనుసరిస్తారు....నగదు చెల్లింపులకి బదులుగా! పైగా, మళ్లీ ఆ తరువాత నెల యే నెంబరు నోట్లు రద్దు చెయ్యబడతాయో తెలీదాయె! దెబ్బతో నగదు చలామణీ రంగం పూర్తిగా ప్రభుత్వ/ఆర్బీఐ అధీనంలోకి వచ్చేస్తుంది. 75% పైగా నల్లధనం రద్దు అయిపోతుంది! దమ్ముంటే, ఈ పధ్ధతి అనుసరించమనండి ముందు. ఆ తరువాత విదేశాల్లో నల్లధనం గురించి ఆలోచిద్దాము. (యెలాగూ ఆ ప్రయత్నాలు కొనసా.......గుతూనే వుంటాయి కదా!)



మన ఆర్బీఐ వారు మరోసారి రెపో/రివర్స్ రెపో రేట్లని ఓ పావలా శాతం పెంచారు--ద్రవ్యోల్బణాన్ని నిరోధించడానికి! అయినా ద్రవ్యోల్బణం ఇంకో ఆర్నెల్లపాటు రెండంకెలలోనే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. పైగా రంగరాజన్ లాంటివాళ్లు సైతం, పెట్రో వుత్పత్తులమీద ప్రభుత్వ అజమాయిషీ పూర్తిగా తొలగించాలంటున్నారు! ఆ మాటెలా వున్నా, నేడో రేపో డీజెల్, వంటగ్యాస్, కిరోసిన్ల రేట్లూ, మరోసారి పెట్రోలు రేట్లూ తప్పక పెంచబడతాయి! మరి ద్రవ్యోల్బణం యెలా నియంత్రింపబడుతుంది? తాటాకు చప్పుళ్లకి కుందేళ్లు బెదరవు! కాబట్టే, ఒకేసారి రెండో మూడో శాతం రెపో/రివర్స్ రెపో రేట్లే కాకుండా, బ్యాంకుల ఎస్ ఎల్ ఆర్, సీ ఆర్ ఆర్ లని కూడా పెంచేసి, వ్యవస్థకి ఓ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది! వృధ్ధి రేటుమాటంటారా? ప్రతీనెలా దాన్ని గణించుకొంటూ తృప్తి పడఖ్ఖర్లేదు! ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికంలో మళ్లీ ఆ రేట్లని పెంచినంతమేరా తగ్గిస్తే, వృధ్ధి రేటు నిలబడడానికి యేమీ లోటు వుండదు. ఒకవేళ కొంచెం తగ్గినా అది ఆరోగ్య సూచకమేగానీ, అనవసర "వాపు" ని చూపించి, బలుపనుకోమనే దౌర్భాగ్యం తప్పుతుంది! ఇంక పెట్రో ధరలకి విరుగుడు "ఆయిల్ పూల్" మాత్రమే!

వింటారా?

Friday, June 17, 2011

(యమర్జంటు) కబుర్లు - 57


అవీ, ఇవీ, అన్నీ


తాటిపట్టెల్లాంటి తమ నాలుకలని కూడా యెన్ని మెలికలు తిప్పగలవో--మన గుంట నక్కలు--అని అస్తమానూ అశ్చర్యపోవడం మనవంతు!

మొన్న 15-06-2011న జన లోక్ పాల్ విషయంలో, ప్రభుత్వ, పౌరసమాజ ప్రతినిధుల చర్చలు ఫలించలేదు కానీ, మళ్లీ 20, 21 తారీఖుల్లో మళ్లీ చర్చించాలని మాత్రం వొప్పుకున్నారట. "అప్పటికీ యేకాభిప్రాయం రాకపోతే, 'ఇరుపక్షాల వాదనలతో' 'ఒక ' చిత్తు ప్రతి (డ్రాఫ్ట్) కేబినెట్ కి సమర్పిస్తాం" అన్నాడు క 'పిల్సి 'బల్. ఇంకా వివరిస్తూ, "మా ఆశప్రకారం, పౌర సమాజం వాళ్లు తీవ్ర విభేదాలున్న ఆంశాలపై 'ఒక' ప్రతిని మాకిస్తారు. విభేదాలు వున్నాయని 'మేమనుకుంటున్న' అంశాలపై 'ఒక' ప్రతిని తయారుచేసి, అప్పుడు 'యేకాభిప్రాయానికి రావడానికి ' ప్రయత్నిస్తాము" అన్నాడు. (ప్రశాంతి భూషణ్ మాత్రం, "మౌలిక విభేదాలు చాలా వున్నాయి కాబట్టి, ఇంక మంత్రివర్గమే నిర్ణయం తీసుకోవాలి" అన్నాడు.)


ఓ నక్క "వూళ" పెట్టగానే, మర్నాటికల్లా మిగిలినవి యేమన్నాయో చూడండి! ప్రభుత్వం 'మీ డిమాండ్లు అన్నీ తీరుస్తాం' అని చెప్పింది కాబట్టి, ఇదివరకు నా దీక్ష విరమించాను, ఇప్పుడు ఆ వాగ్దానాలపై మళ్లీ వెనక్కి పోతోంది కాబట్టి, మళ్లీ ఆగష్ట్ 16 నుంచీ దీక్ష చేస్తాను" అని హజారే ప్రకటించడం పాపమట. "ప్రభుత్వం, దేశానికి ఓ మంచి చట్టం చేసివ్వడం అనే ఒక గొప్ప అవకాశాన్ని చేతులారా పాడుచేసుకోడమే కాకుండా, నాటకం ఆడుతూంది. ప్రభుత్వ బిల్లు 'జోక్ పాల్ ' బిల్లు మాత్రమే!" అని కేజ్రీవాల్ అనడం మహా పాపమట! ప్రభుత్వం మాత్రం, జూన్ 30లోగా బిల్లు ప్రతిని 'ఆశించినప్రకారం, పౌరసమాజం సహకారంతో' సిధ్ధం చేయడానికి దృఢ సంకల్పంతో వున్నాము" అని ప్రకటించిందట! (దీని నోరు యేదో?)

గుంటనక్కలు మూడు, త్రిగళగీతం ఆలాపించాయట! (పిచ్చి 'దంబ 'రం; క 'పిల్సి 'బల్; సల్మాంకుర్ 'షిద్ ' లు!). ఈ చివరినక్క, "ప్రభుత్వం 'మేము ' నడిపిస్తూంటే, నిర్ణయాలు 'బయట ' జరిగితే, ఇంక ప్రభుత్వం యెందుకు?" అందట! (ఆ అహంకారమే వద్దంటూంది పౌర సమాజం!). రెండో నక్క, "ప్రభుత్వానికి సమాంతరంగా వేరే నిర్మాణాన్ని సృష్టించలేము. ప్రభుత్వం తనంతటతాను తన 'అధికారాన్ని ' యెందుకు వదులుకోవాలి?" అందట! (అధికారం తలకెక్కి, దిగకపోతేనే పౌరసమాజం కళ్లెర్రజేస్తోందిరా మూర్ఖా!). "ఓ ప్రక్క బెదిరిస్తూ, చర్చలు జరపడం కుదరదు" అని కూడా అందట. "ప్రపంచంలో యెక్కడా ఓ ప్రతిని తయారు చెయ్యడానికి 'వుపవాసం ' ఓ మార్గమని నేననుకోను!" అందట మొదటి నక్క, తన తాటిపట్టెని వెకిలిగా వ్రేళ్లాడేస్తూ! (మీచేత మూడు చెరువుల నీళ్లు త్రాగించడానికి 'వుపవాసమే' సరైన మార్గం కదరా? 'పళ్లన్నీ'యప్ప!)

ఈ మూడూ కాకుండా, వేరేప్రక్కనుంచి, ఓ మీసాలు వ్రేళ్లాడేసుకునే నక్క వీ'రప్ప ' "అదొక్కటే పౌరసమాజమా? ఇంకాకొన్ని పౌరసమాజాలున్నాయి! ప్రభుత్వం 'జాతీయ యేకాభిప్రాయం ' కోరుతోంది" అని తన గణిత, సాంఘిక శాస్త్రాల పరిఙ్ఞాన్ని బయటపెట్టుకొంది! పైగా, "మొత్తం 40 అంశాల్లో, 34 అంశాలపై యేకాభిప్రాయం వుంది. అయినాసరే, చర్చించకుండా దీక్ష చేస్తాను అంటే, ఆయన ముందే నిర్ణయించుకున్నట్టు!" అని తెలివిని ప్రదర్శించింది! (పౌరసమాజం వొకటేననీ, దాని ప్రతినిధులు వేరువేరుగా వుండొచ్చనీ కనీస ఙ్ఞానం లేదా? పౌర సమాజం చెప్పేది జాతీయ యేకాభిప్రాయం కాదా? అసలైన ఆ "ఆరు" అంశాలపై చర్చించే ప్రసక్తే లేదని భీష్మించిందెవరురా దరిద్రుడా?).

అసలు ప్రభుత్వం తరఫున "మీ డిమాండ్లకి ప్రభుత్వం అంగీకరిస్తోంది" అని చెప్పి, "అన్నా" చేత దీక్ష విరమింపచేసింది ఇవే గుంటనక్కలు కాదూ? వీళ్లందరికీ రాజైన "నీలిరంగు నక్క" వూళపెడితే యెక్కడ ఛస్తానో అని నోరు విప్పదు! ఆ నక్కని అడవికి రాజుని చేసిన ఇటలీ దేవత "చివరికి"గానీ నోరు విప్పదు--అటో ఇటో తేలేదాకా!

అతి ప్రమాదకర విషయం యేమిటంటే, కేపిటలిస్ట్ సమాజ ప్రతినిధి--టైమ్‌స్ ఆఫ్ ఇండియా--"అన్నా హజారే నేతృత్వంలోని ఒక ఫ్యాక్షన్" అని మొయిలీ అన్నాడని రిపోర్టు చేసింది! ఆయన అన్నాడో, వీళ్లే వాడినోట్లో ఆ మాటలు కుక్కారో! ఫ్యాక్షనిష్టులూ.....జాగ్రత్త!

నా విఙ్ఞప్తి--ఈజిప్టు తరహా అంటూ అయ్యవారిని చెయ్యబోయి కోతులని చెయ్యక, ఈ గుంటనక్కల మెలికలు తిరిగే తాటిపట్టెల వ్యవహారాలని మీ శాయశక్తులా ప్రచారం చెయ్యండి! "అన్నా" ముందు వీళ్లందరూ యెందుకు మోకరిల్లరో చూద్దాం!

జై భారత్!

Tuesday, June 14, 2011

కబుర్లు - 56

అవీ, ఇవీ, అన్నీ


అయ్యింది.....'బారాందే' దీక్ష యెనిమిదోరోజున గుంటకట్టి గంటవాయించేసింది. ఆయనకన్నా సీ'నియరూ', 'జీవన కళా' గురువూ, సూడో శ్రీ శ్రీ, ఆయన్ని ఆఙ్ఞాపించి మరీ దీక్ష విరమింపచెయ్యవలసి వచ్చింది. చిరంజీవి రాజకీయ బాలుడు అనుకుంటే, ఈయన రాజకీయ పసిబాలుడు అని ముందే చెప్పాను! ("మేడం గారు మీ డిమాండ్లకి వొప్పుకుంటే, మీరు దీక్ష విరమిస్తారని నమ్మకం కలిగేందుకు ఓ వుత్తరం రాసి ఇవ్వండి" అన్న గుంటనక్కల మాటలని నమ్మేసి, విరమణ వుత్తరం ఇచ్చేసి, తీరా అది వాళ్లు బయటపెట్టేసేసరికి, "మోసం చేశారు" అని మొత్తుకొంటే యేమి లాభం?) ఇంకా కొమ్ములే మొలవని పొట్టేలు, యేకంగా మేరుపర్వతాన్నే ఢీకొంటే, యేమవుతుంది?

ఆయన గాలి తినైనా బతికేస్తాడు కానీ, కనీసం నాలుగురోజులు యెంతమంది నిలబడగలరు అని కూడా సణిగానిదివరకే! ఆయనేదో 'సాయుధ దళాలు' అన్నాడనే వంకతో, ఐదోరోజే మిగిలిన సెంటర్లలో "దీక్షాపరులు" దుకాణాలు సర్దేశారు! రవి శంకర్ కూడా, ప్రభుత్వ ప్రతినిధులని ఆయన తో చర్చించేలా చేద్దామని ప్రయత్నించి, ఛీ కొట్టించుకొన్నాడు!

కొసమెరుపేమిటంటే, రాజకీయపార్టీలవాళ్లు "హమ్మయ్య! మళ్లీ ఇప్పుడప్పుడే అవినీతిమీద పోరాటం చేసే సాహసం చెయ్యరెవరూ!" అని సంబర పడుతున్నారట. అందుకే దేనికైనా సమయం సందర్భం వుండాలన్నది.

వృధ్ధ జంబుకం, ప్రణబ్ "యెన్నికైన ప్రజా ప్రతినిధులని 'పౌరులు' ఆఙ్ఞాపించజాలరు!" అంటున్నాడు. అసలు కీలకం అంతా "యెన్నికైన" లోనే వుంది, ఆ సన్నాసులు 24 గంటలూ అవినీతిలో మునిగి తేలుతూ, నేర చరిత్రని పేజీలకి పేజీలు పెంచుకుంటూపోతూ, తమ అవినీతికి వ్యతిరేకంగా తమనే చట్టం చేసుకోమంటే వెధవ నాటకాలు ఆడుతున్నారు అనేకదా పౌరసమాజం మొత్తుకుంటున్నది? అందుకే కదా "జనలోక్ పాల్" కావాలంటున్నది? మొన్నటి వరకూ (మార్చ్ నెల వరకూ) ప్రథాని కూడా జనలోక్ పాల్ పరిథిలోకి రావాలన్న ఈ జంబుకం, మిగిలిన గుంటనక్కలూ, ఇప్పుడు 'ససేమిరా' అని యెందుకంటున్నట్టు? మరోసారి "అన్నా హజారే" వుద్యమించినా, బారాందే బాటలోనే ఆ వుద్యమాన్ని యెదుర్కోవచ్చు అని ఓ ధీమా యేర్పడిపోయినట్టుంది వీళ్లకి! "దేన్‌దార్దాన్‌దే" అని వాళ్లకి తెలీదనుకోను! ఇక్కడ మేరుపర్వతం "అన్నా" అని మరిచిపోవద్దు అని నా హెచ్చరిక వాళ్లకి. అసలు ఈ జంబుకాల దరిద్రం మన దేశానికి యెప్పుడు వదులుతుందో మరి! (అందుకే "అన్నా" తన తరువాతి వుద్యమంలో భాగంగా యెన్నికల సంస్కరణలని కూడా యెన్నుకున్నాడు!)



జైపాల్ రెడ్డి "మా పార్టీ ప్రాంతీయ, వుప ప్రాంతీయ తత్వానికి వ్యతిరేకం" అని వక్కాణించేశాడట. ఐదురాష్ట్రాలో యెన్నో యెన్నికలైపోయాయి, బారాందే దీక్ష భగ్నం అయిపోయింది, జనలోక్ పాల్ విషయం లో ఇంక అధిష్టానం మాటలని వల్లించడం తప్పితే వాళ్లు చేసే పనేమీ లేదు, చిదంబరం, మొయిలీల్లాంటివాళ్లకి చేతినిండా పని లేదు--ఇంకేం చెయ్యాలి? ఆంధ్ర దేశం గొడవల్లేకుండా వుంది! అందుకని, తెలంగాణా వారికి "గూర్ఖా లేండ్" తరహా ప్యాకేజీ ఇస్తాము, రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచుతాము, శ్రీ కృష్ణ కమిటీ కూడా అదే చెప్పింది" అని ప్రకటించి, మళ్లీ అగ్గి రాజేస్తారట! (వీళ్లిలాంటి ప్రకటనేమీ చెయ్యకపోతే కొంపేమైనా మునుగుతుందా ఇప్పుడు?) బాగుందికదూ రాజకీయం?



"డీ ఎం కే వాళ్ల అవినీతికి వ్యతిరేకంగా తమిళ ప్రజలు ఇచ్చిన తీర్పు" అని జయలలితా డబ్బా కొట్టేసుకొంటోంది. కాంగీ వాళ్లు వంతపాడుతున్నారు. రాజా, కనిమొళి, దయానిధి వంటివాళ్లకి శిక్షలు పడతాయని నమ్మకం వచ్చేసింది ఆవిడకి. అందుకని, తన వంతుగా ప్రభుత్వానికి యేమేమి షరతులు పెట్టాలో ఓ పెద్ద లిస్టే తయారు చేసుకొందట! అసలు పెద్ద గీత ప్రక్కన చిన్న గీతే కానీ, ఆవిడమాత్రం యేమి తక్కువ తింది? ఆ రోజుల్లో అవినీతి కొన్ని లక్షలకే పరిమితం అయ్యేది కాబట్టి ఆవిడ లక్షల్లోనే చేసేది. అదే కరుణానిధి టైములో ఆవిడే ముఖ్య మంత్రి అయ్యుంటే, కోట్ల కోట్ల లోకి పాకిపోయేది కాదూ? యెందుకొచ్చిన గురివెంద రాజకీయాలు!? కట్ట కట్టి వీళ్లందరినీ బంగాళాఖాతం లో పారేసే రోజు వస్తుందేమో--2014 లోగానే!



ఇంక మన రాష్ట్రం లో "కి కు రె" కి రోజులో, నెలలో దగ్గరపడ్డట్టున్నాయి.....బొచ్చె ని పీ సీ సీ అధ్యక్షుణ్ని చేయ్యగానే, ఒకటే గోల.....మొత్తం పదవుల్లో రెడ్లు యెంతమంది, కాపులెంతమంది, (కమ్మోళ్లందరూ టీ డీ పీ అని లెఖ్ఖ కాబట్టి వీళ్ల గొడవ లేదు), ఇంకొంతమందికి పదవులిస్తే అప్పుడు కాపులెంతమంది, రెడ్లెంతమంది, (బీసీ, ఏస్ సీ ల మాటేమిటి?) అందులో మళ్లీ కోస్తాకెన్ని, రాయల కెన్ని, తలంగాణాకెన్ని.....చిరంజీవి వస్తే యెలాగ? రాకపోతే యెలాగ?......ఇలా వొకటే గొడవ! రేపు గూర్ఖా లేండ్ ప్రకటన వస్తే, అప్పుడు చూడాలి వీళ్ల లెఖ్ఖలు!



రాక్షసీ! నీపేరు రాజకీయమా? అన్నరెవరో ఇదివరకే!

Monday, June 6, 2011

(యమర్జెంటు) కబుర్లు - 55

అవీ, ఇవీ, అన్నీ

"అడుక్కుంటున్న ఆంధ్రా యూనివర్సిటీ"
"మణిశంకర్ అయ్యర్....."
"దయానిధి మారన్....."
"డీజల్ ధరలు......"
"రాం జేఠ్మలానీ.....కాశ్మీర్...."
"యూనిఫారాలూ, ఎన్ సీ సీ,......"
"స్పీకర్ల యెన్నికా"
"జగన్ వర్గం పిల్లాటలూ....."
"రాం దేవ్ దీక్షా"

....అబ్బో! యెన్ని వున్నాయో సణుక్కోడానికి! 24 గంటలూ సరిపోవు! ఈ సణుగుళ్లతో నాబుర్రే కాదు, అవి విన్నవాళ్ల బుర్రలు కూడా ఖరాబయిపోతాయేమో! అయినా సింపుల్ గా సణిగెయ్యాలి.....అలవాటయిన ప్రాణం కదా మరి?!

ఒకమ్మాయి, ఎం సీ యే లో 2008-09 లో యూనివర్సిటీ స్థాయిలో "బంగారు పతకం" విజేతగా నిలిస్తే, "మాదగ్గర రూ.3,240/- యే వున్నాయి. మిగతా రూ.7,760/- నువ్విస్తే, బంగారు పతకం చేయించి, నీకు 'బహూకరిస్తాం '. లేకపోతే లేదు" అని వ్రాసిందట--ప్రత్యేక రిజిస్ట్రార్, డాక్టర్ 'సో అండ్ సో'!

సిగ్గూ యెగ్గూ లేని రా నా లని మించిపోతున్నారీ "కర్మచారులు"! అదే నేనైతే, నా జీతంలోంచి ఆ డబ్బు ఖర్చుపెట్టి, గుట్టుగా ఆ పతకం చేయించేసేవాణ్ని. లేదా, ఓ రోల్డు గోల్డు పతకం కొనేసి, ఆ అమ్మాయి కాళ్లా వేళ్లా పడి, ఇప్పటికి ఇది తీసుకో అమ్మా.....రేపెప్పుడైనా వర్సిటీ కి డబ్బు వున్నప్పుడు, నిజం పతకం చేయించి, గుట్టుగా మీకు అందజేస్తాను....మా పరువు తీయొద్దు! అని బతిమాలేవాణ్ని.

మహామహులు కట్టమంచి రామలింగా రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, బుల్లెయ్య లాంటి వాళ్ల ఆధ్వర్యంలో వెలిగిన యూనివర్సిటీకి ఇప్పుడు యెంత దౌర్భాగ్యం!

దీనికి బాధ్యులెవరో!

కామన్వెల్త్ క్రీడల గురించి 2006లోనే మార్చిలో మొదలెట్టి, అప్పటి కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ ప్రథానికి, అనేక సందేహాలు లేవనెత్తుతూ వరుసబెట్టి లేఖలు వ్రాశారట!!! ("నికమ్మా" గారు మాట్లాడలేదట!). స హ చట్టంక్రింద అడిగితే, ఈ సమాచారం బయటపెట్టిందట--ప్ర. మం. కార్యాలయం.

యెంత దు. పో. మీద వానో!

కేంద్ర జౌళి శాఖ మంత్రి దయానిధి మారన్, "నేను టెలికాం మంత్రిగా రాజీనామా ఇచ్చినప్పుడే దర్యాప్తు చేసుకోవాల్సింది. ఇప్పుడైనా, దర్యాప్తు చేసుకొంటే, చేసుకోండి. (నన్నేమీ పీకలేరు)" అన్నట్టుగా మాట్లాడుతున్నాడు.

అన్నట్టు, వీడికింకా చిప్పకూడు అరేంజ్ చేశారో లేదో!

సోకాల్డు (తింగర) ఆర్థిక శస్త్రవేత్త (ముం. కొ.) ల బ్రెయిన్ కంట్రోలు, యూపీయే చేతిలో పెట్టేసినట్టున్నారు.

పీఎమీఏసీ--ప్ర. మం. ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ రంగరాజన్--ద్రవ్యలోటుని పరిమితం చెయ్యాలంటే, డీజల్ ధరలపై నియంత్రణ 'పూర్తిగా' యెత్తివేయాలంటున్నాడు! మరి ద్రవ్యోల్బణం మాటేమిటి? అది ఆందోళన కలిగిస్తోంది (ట.). డీజల్ రేట్ల నియంత్రణ తొలగిస్తే, వ్యవసాయరంగం యేమంత వృధ్ధి చెందకపోయినా, సేవల రంగం, పారిశ్రామిక రంగం, ఆ లోటుని తీర్చేసి, వృధ్ధి రేటు పెరిగిపోతుందట! ఓ సారి చేసి చూడండి.....యేమవుతుందో!!!

రాం జేఠ్మలానీ.....2002లో అప్పటి ప్రథాని వాజపేయీ యేర్పాటుచేసిన "కాశ్మీర్ కమీటీ" అధ్యక్షుడూ, శాంతిభూషణ్, మధుకేశ్వర్, ఎం జె అక్బర్ (ఆఖరి యిద్దరూ పాత్రికేయులూ, ఆ ముందటివాడు, అందరికీ తెలిసిన లాయరూ) సభ్యులూనట.

మరి వీళ్లు తొమ్మిదేళ్లనుంచీ యేమి పొడిచారోగానీ, మొన్న హురియత్ కాన్ ఫరెన్సు అతివాదనాయకుడు సయ్యద్ ఆలీషా గిలానీ 'మర్యాద ' చూశాక, కాశ్మీర్ సమస్య పరిష్కారం 'యెంతో దూరం లో లేదు!' అన్నారట.

పోనీలెండి.....బెటర్ లేట్ దేన్ నెవర్ అన్నారుకదా?

ఓ వారంలో పాఠశాలలు తెరుస్తారనగా, ఇంకా పుస్తకాలూ, దుస్తులూ సిధ్ధం కాలేదట. పుస్తకాలు జెరాక్సులు తీయడం మొదలెట్టారట. దుస్తులు, ఆప్కోవాళ్లు నిధులకొరత కారణంగా ఒకజత మాత్రమే అందించగలుగుతుంటే, మిగతా గుత్తేదారులు అదీ లేదట!

స్పీకర్ల యెన్నిక "సవ్యంగా" జరిగిపోయింది. ప్రో టెమ్ స్పీకర్, మనోహర్ స్పీకరుగా, 'మూజువాణీ' గా నెగ్గినట్టు ప్రకటించేశాక, చంద్రబాబు--నేనూ వున్నాను--అంటే, సరే, వోట్లు లెఖ్ఖెడదాం అన్నారట. జగన్ వర్గం వాళ్లు "సీక్రెట్ బ్యాలట్"లో, ఆత్మ ప్రబోధం ప్రకారం వోటు చేద్దామనుకొంటే, కాంగీ రాజకీయపండితులు, అంతకుముందెప్పుడో మ్యానేజ్ చేసుకొన్న కోర్టు తీర్పుల నేపధ్యంలో, "చేతులెత్తే వోటు" కూడా చెల్లుబాటవుతుందని యెన్నికపధ్ధతిని మార్చేయడంతో, చచ్చినట్టు మనోహర్ కే వోటు వెయ్యవలసి వచ్చింది (ట).

ఇంక "అవిశ్వాసం" ప్రసక్తేరాలేదని చంద్రబాబు వెళ్లి గవర్నరు దగ్గర మొరపెట్టుకొంటే, ఆయన ప్రశాంతంగా విని, ఇంకెవరైనా మాట్లాడినా వింటాను అని సంసిధ్ధతని ప్రకటిస్తే, ఇంకెవరూ మాట్లాడం అని వచ్చేశారు!

భలే రాజకీయం! కదా?

ఇంక రామ్ దేవ్ మొత్తం ఆస్థి 8000 కోట్లేనట. లక్షకోట్ల జగనే, వెనకా ముందూ ఆలోచిస్తుంటే, వీడేం పీకుతాడు? మహా అయితే, తనవెనకున్నవాళ్లని మేపలేక, కుదేలయిపోయి, మహాసముద్రంలో కాకిరెట్టగా మారిన ఇంకో చిరంజీవి అవుతాడేమో!......కాకపోతే, ఓ గ్రద్దో, రాబందో రెట్ట అవ్వచ్చు!

స్టేజ్ మేనేజ్ చేసిన (ఆడవాళ్ల సల్వార్ కమీజు దుస్తుల్లో తప్పించుకోడానికి ప్రయత్నం చేశాడంటే, ముందు వుప్పు అందినట్టే కదా? యెవరి చెవుల్లో పువ్వులు పెడతాడు?) పోలీసు చర్యతో ఆ కాస్త దీక్షా భగ్నమే చేసేశారట ఢిల్లీలో! (బలై పోయింది ఓ యాభై, అరవైమంది సామాన్యులే! ఆడవాళ్లతో సహా!)

ఇంకేం మిగిలింది? హళ్లికి హళ్లి, సున్నకి సున్న!

రేపటి సంగతి వెండి తెరపై!

Thursday, June 2, 2011

(యమర్జెంటు) కబుర్లు - 54

అవీ, ఇవీ, అన్నీ

రాజకీయ యెత్తులూ, పైయెత్తులూ!

రాజకీయ క్రీడ అనేది చాలామందికి తెలీదు. అందుకనే చాలామంది బలయిపోతూంటారు. నాలుగు వోట్లు పడి, ఒకటో రెండో పదవులురాగానే, తమకి యెదురు లేదు అనుకుంటారు! కానీ రాజకీయంలో యేదైనా "తాత్కాలికమే".....చిత్త శుధ్ధి వుంటే తప్ప.

రాజకీయ కురువృధ్ధుడు "కరుణా నిధి" ధృతరాష్ ట్రుడిలా నల్లకళ్లద్దాలు పెట్టుకొన్నందుకు, వాడి వంశం అంతా ఇవాళ రాజకీయాలకే బలి అయిపోతూంది.....దయానిధి, కళానిధి మారన్ లతో సహా! 

ఇప్పుడు, కొంతం'మం'దిలీపు ల్లాంటివాళ్లు ఓ ముఫ్ఫై యెనిమిదేళ్లక్రితం మేము వున్న స్థాయిలోనే వున్నారంటే, వాళ్లకి అర్థం అవడంలేదు.

నా'గంజ 'నార్దనరెడ్డికి కళ్లముందు మునిసిపల్ ఎలక్షన్లే కనిపిస్తున్నాయి....తెదేపా నుంచి బహిష్కరింపబడి, తనపాట్లు తాను పడుతూన్నాడు. క్రితం యెన్నికలముందు తెలంగాణా కోసం బయటికి వెళ్లిన దేవేందర్ గౌడు యేమి బావుకున్నాడు? 

ఇంక, బా'బారాందే'వ్......తన యోగాయేదో చేసుకోక, రాజకీయాలెందుకు వీడికి? ఫేస్ బుక్ లోనూ, ట్విట్టర్లోనూ ఎస్మ్మెస్ లని చూసుకొని, అదంతా తన బలుపు అనుకుంటున్నాడు. బాగానే వుంది. కానీ దేనికైనా సమయం సందర్భం వుండక్కర్లా?

వో ప్రక్క అన్నా హజారే నిరాహారదీక్షతో వుద్యమం చేస్తుంటే, వీడి అనవసర గొరిగింపులు కొన్ని. కాంగీ/యూపీయే తైనాతీ మీడియావాళ్లు వీడి నోట్లో తమ మాటలని కుక్కేసి, కక్కించేస్తున్నారు! ఇదే మొదటిసారికాదు.....నిన్న, "ప్రథాని ని లోక్ పాల్ పరిథి నుంచి తప్పించాల్సిందే" అని అన్నాడని ప్రచురించేశారు. ఇవాళ తాను అలా అనలేదు అంటున్నాడు ఈ రాజకీయ బాలుడు!

వాడు "ప్రైవేటు విమానం"లో ఢిల్లీలో దిగగానే, (తానే ప్రణవ్ ఇంటికి వెళ్లాల్సిన ప్రోగ్రాము! కానీ, ప్రణవే, కొన్నిగంటలముందు వచ్చి వీడిరాక గురించి పడిగాపులు పడ్డాట్ట!--పైనుంచొచ్చిన ఆదేశాల ప్రకారం!) నలుగురైదుగురు "ప్రముఖ" కేంద్ర మంత్రులు వాడిని కలుసుకొని, చర్చలు జరిపారట! మధ్యమధ్యలో మన్మోహన్ విఙ్ఞప్తులట! 

"స్పష్టమైన హామీ లభించేవరకూ" లక్షమందితో దీక్షను విరమించేదిలేదని వీడి ప్రకటన!

చెట్టు ముందా, విత్తు ముందా అన్నట్టు, "జనలోక్ పాల్ ముందా? నల్లధనం ముందా?" అంటే, బుధ్ధున్నవాడెవడైనా, 'కొంత ముందుకు వెళ్లిన ' జనలోక్ పాలే ముందు అంటాడు

ఈ రాజకీయ చంటిపిల్లాడు మాత్రం, "తనకి" మీడియాలోనూ, ప్రభుత్వంలోనూ అంత ప్రాముఖ్యత వచ్చేసినందుకు, మురిసి ముప్పందుమైపోతున్నాడు! తనకు తెలియకుండానే, "రాజకీయ" యెత్తుగడలకి బలైపోడానికి సిధ్ధమౌతున్నాడు!

పౌర సమాజం ఇలాంటివాళ్లని వెలివెయ్యాలి! ఫేస్ బుక్, ట్విట్టర్ మెంబర్లూ! మీ బుధ్ధి వెర్రితలలు వెయ్యకుండా, యెవరూ అలాంటి "ఆమరణ" నిరహారదీక్షలలో పాల్గొన వద్దు!

దయచేసి వినండి......ఇది నా విఙ్ఞప్తి మీకు!

తరవాత మీ యిష్టం!

Wednesday, June 1, 2011

కబుర్లు - 53

అవీ, ఇవీ, అన్నీ

జనలోక్ పాల్ బిల్లు విషయంలో, కాంగీ/యూపీయే భభ్రాజిమానాలు, పౌరసమాజ సభ్యులపై బురదజల్లడానికి ప్రయత్నించి, జనాలు "ఛీ" కొట్టగానే, ఇలా లాభం లేదు అని, ఇంక "డైరెక్టు"గా వ్రేళ్లకీ, కాళ్లకీ మారాముళ్లు వెయ్యడం మొదలెట్టారు!

యేమైనాసరే, పౌరసమాజం వాళ్లచేత, "మహాప్రభో! మీరు ఇదివరకు తేదలుచుకున్నారన్న బిల్లే 'సర్వోత్తమం!' దాన్నే ప్రవేశపెట్టండి" అనిపించాలని వీళ్లు కంకణం కట్టుకొన్నారేమో!

లేకపోతే, ప్రక్కనపెట్టిన ఆ బిల్లులో "ప్రథాని"ని కూడా ఆ బిల్లు పరిథిలోకి తెస్తే,  ఇప్పుడు "అలా కుదరదు" అనడమే కాకుండా, న్యాయమూర్తులూ, ఓ స్థాయి కన్నా చిన్న అధికారులూ వగైరాలని కూడా బిల్లు పరిధిలోంచి తప్పించాలని అంటున్నారంటే యేమిటీ అర్థం?    

"అన్నన్నా హజారె!" అనీ, "ఈజిప్టు తరహా" అనీ మురిసిపోయిన వాళ్లు ఇప్పుడేమి చేస్తారూ?

"సామాన్య వోటరులూ"! ఆలోచించండి!

2014 లోనో, ఇంకో రెండేళ్లు ముందో, ఈ "ఇటాలిబాన్" కాంగీ/యూపీయే వాళ్లని "మీ వోట్లతో" కత్తికొక కండగా నరికి (మొన్న బంగ్లా సోదరులు "యెరుపు" పార్టీలని చేసినట్టు) బంగాళాఖాతంలో సొరచేపలకీ, తిమింగలాలకీ ఆహారంగా కలిపెయ్యవలసిన సమయం దగ్గరకొస్తూందా?

ప్రణాళికలు వెయ్యండి! విజృంభించండి! మీకు పోయేదేమీ లేదు!

(మహా అయితే, మళ్లీ ఇంకో "నిద్దరమొహమోడు" ప్రథాని అవ్వచ్చు......దేశం ఓ పెదేళ్లో యెంతో వెనక్కి పోవచ్చు!.....మళ్లీ ప్రత్యామ్నాయం వెదుక్కుందాం.....ఓ వెలుగు వెలుగుదాం!)

"భలే మామా భలే.....అదే మన తక్షణ కర్తవ్యం" అంటున్నారెవరో!

మరదే కదా?

దబ్బనం యెర్రగాకాల్చి, పొట్టమీద వాతలు పెట్టేస్తే, "బాల పాప చిన్నెలు" (గుక్క తిప్పుకోలేక బిగిసిపోవడం వగైరా) తగ్గిపోతాయనీ, చుట్ట యెర్రగా కాల్చి, నుదుటిమీద "బొట్టు" పెట్టేస్తే, మెదడుకి సంబంధించిన మూర్చ వంటి రోగాలు నివారణ అవుతాయి అనీ, నమ్మి ఆచరించేవారు ఓ యాభై, అరవై యేళ్ల క్రితం!

(ధన్వంతరీ, చఱకుడూ, శుశ్రుతుడూ వగైరాలు ఇలాంటి వైద్యాలగురించి యే గ్రంధాలలోనైనా వ్రాశారో లేదో తెలీదు!)

ఇప్పుడు "ఆందు నిమిత్తం" యేర్పడ్డ మంత్రివర్గ వుపసంఘం వారు, "బహుళ బ్రాండ్--రీటెయిల్ దుకాణాల" లో, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి (ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్) అనుమతి ఇవ్వడమే ప్రస్తుత "ద్రవ్యోల్బణానికి" "సరైన" మందు అంటూన్నారట!

అంటే, మ్యాగ్నాలూ, మోర్ లూ, రిలయన్సులూ, బిగ్ బజార్లూ వంటివి "షేర్ మార్కెట్" లోకి వెళ్లిపోయి, వాటి షేర్లని విదేశీ పెట్టుబడిదారులు కొనేస్తే, ద్రవ్యోల్బణం చచ్చినట్టు దిగివస్తుందన్నమాట!

యెవరి చెవుల్లో పువ్వులు పెడతారో? పై చికిత్సలకీ, తుంటిమీదకొడితే పళ్లు రాలతాయనడానికీ దాఖలాలు ఇలాంటివే మరి!

యేమంటారు?

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నగ్మేల్ వాంగ్ ఛుక్....పెళ్లి చేసుకోబోతున్నాడట. యువకులందరికీ తప్పని శిక్షే అయినా, ఆమె "తన ఆలోచనలు అర్థం చేసుకొని, వెంట నడవగల హృదయం వున్న అమ్మాయి" అని పొంగిపోతున్నాడట.

ఈయన కొంచెం "డిఫరెంట్" రాజుగారట! సాదాసీదాగా వుంటూ, దేశంలోని 20 జిల్లాలనీ చుట్టొచ్చి, పొలాల్లోకి వెళ్లి రైతులని పలకరిస్తూ, వుపాధ్యాయుల, వైద్యుల సలహాలు స్వీకరిస్తూ పరిపాలిస్తున్నాడట.

తన అధికారాలకి తానే కోతపెట్టుకొని, ప్రజాస్వామ్య పధ్ధతిలో యెన్నికలు జరిపించి, భూసంస్కరణలు అమలు చేశాడట.

ఇంకా, పారిశ్రామికంగా, ఆర్థికంగా "దూసుకెళ్లడం" ముఖ్యం కాదు....నా దేశ ప్రజలు యెంత సంతోషంగా వున్నారనేదే ప్రధానం! అంటూ, "గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్" సిధ్ధాంతాన్ని అమలు పరుస్తున్నాడట ఈ యువకుడైన రాజు!

అలాంటి రాజుని నిజంగా "దైవాంశ సంభూతుడిగా" కొలవరూ ప్రజలు?