Tuesday, April 19, 2011

ఈనాడు వారి తెగులు

పదాడంబరం

ఒక టైములో ఈనాడువారు వార్తలకి శీర్షికలు వుంచడం లో, వార్తలు వ్రాయడం లో మంచి వొరవడి సృష్టించారు.

రాను రాను తలకి రోకలి చుట్టుకున్నట్టు తయారవుతోంది.

వుదాహరణకి ఈ క్రింది పేరాలు చూడండి.

"శ్రీరామ నవమి సందర్భంగా......రామాలయాల్లో గురువారం "ప్రత్యేక" పూజలు నిర్వహించారు. ఉదయం సీతారామచంద్రమూర్తికి "ప్రత్యేక" పుష్పాలంకరణ చేసి, "విశేషార్చనలు" చేశారు. రాత్రి "సుందరంగా" అలంకరించిన పూలరథంపై స్వామివార్లను ఉంచి "వైభవంగా" పొన్న ఉత్సవం నిర్వహించారు. ఉత్సవంలో ప్రదర్శించిన "వివిధ రకాల" నృత్యాలు, ధూం ధడాకా, తీన్‌మార్, బిందుల నృత్యం, కాళికా నృత్య గీతాలు, కోయ నృత్యాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆలపించిన సినీ గేయాలు పురజనులను అలరించాయి. "భారీ" ఎత్తున భక్తులు ఊరేగింపులో "ఉత్సాహంగా" పాల్గొన్నారు."

"....షిర్డీసాయి మందిరంలో గురువారం "ప్రత్యేక" పూజలు నిర్వహించారు. ఉదయం బాబాకు పంచామృతాభిషేకం జరిపి "ప్రత్యేక" పుష్పాలంకరణ చేశారు. ....రోడ్డులోని....బాబాకు విబూదార్చనలు నిర్వహించి హారతులిచ్చారు.......లోని కుక్కలవారితోటలోని చెట్టుకింద ముత్యాలమ్మ ఉత్సవాల ముగింపు సందర్భంగా "పలువురు" హాజరై అన్నప్రసాదాలు స్వీకరించారు."

"విశాఖ రైలుకు అదనపు "భోగీలపై" ఎంపీ హామీ"

"పేరుపాలెం నార్తు పంచాయతీ పరిథి అంగజాలపాలెం లోని ఆంధ్రా బ్యాంకులో......"

(ఆంధ్రా బ్యాంకువారి ఆ బ్రాంచిని "పేరుపాలెం బ్రాంచ్" అని ప్రపంచ వ్యాప్తంగా వ్యవహరిస్తారు. అలాంటిది, అసలు బ్రాంచి పేరు వ్రాయకుండా, "ఫలనా పంచాయితీ, ఫలనా స్థలం" అని వ్రాయడం అవసరమా?)

"......శివునికి భక్తులు "ప్రత్యేక" పూజలు నిర్వహించారు. గ్రామంలోని "50 మంది దంపతులు"(??!!) (ఆవూళ్లో వున్నది మొత్తం 50 మంది దంపతులేనా? దంపతులు అంటే 25 జంటలనా? 50 జంటలనా?)......కాశీ యాత్ర పూర్తిచేసుకుని వచ్చారు. ......శివునికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం లక్ష రుద్రాక్షలతో పూజలు జరిపించారు."

".....అభిషేక పండితులు....పర్యవేక్షణలో....కళ్యాణ క్రతువు నిర్వహించారు."

"సాదాసీదాగా....పట్టిసీమలోని....భూనీల సమేతభావన్నారాయణ స్వామి కళ్యాణం....అర్చకులు, అలయ సిబ్బంది, భజంత్రీల సమక్షంలోనే....ఇటీవల శ్రీరామనవమికి అలంకరించిన మందిరంలోనే, ఎండిపోయిన పువ్వులు, మామిడి తోరణాల మధ్యనే.....నిర్వహించడం "శోచనీయం".....వచ్చే ఏడాదినుంచైనా...."ఘనంగా".....నిర్వహిస్తారని ఆశిద్దాం." 

(ముందురోజే, ఆ అలయ అధికారి వొకరు "ఇంతకు ముందు వొకసారి వైభవంగా కళ్యాణం జరిపిస్తూంటే యేదో అపచారం జరిగింది అనీ, అప్పటినించీ వూరికి అరిష్టాన్ని అరికట్టడానికి నిరాడంబరంగా క్షేత్రపాలకుని కళ్యాణం జరిపిస్తున్నాము అని చెప్పిన వార్త ప్రముఖంగా ప్రచురించారు!)

యెలా వున్నాయి ఈనాడువారు మన భాషకి అలంకరిస్తున్న "గిల్టు నగలూ", చదువరులకి వేస్తున్న "పంటిక్రింద రాళ్లు"?
     
అసలు ఆ విలేఖరులు వార్త వ్రాశాక ఓసారి దాన్ని చదువుకుంటారా? సబ్ ఎడిటర్లు కాపీ తయారయ్యాకన్నా ఓ సారి చదువుతారా? అలాంటివాటికి "సమయం లేనంత" బిజీగా వుద్యోగ విధులు నిర్వహిస్తున్నారా? అని నా సందేహాలు. (నేనైతే వాళ్లని వెంటనే ఇంకో వుద్యోగం వెతుక్కోమనేవాణ్ణి.)

8 comments:

Anonymous said...

మీరు పదవి విరమణ చేసి తీరికగా ఈనాడు పేపర్ ని భూతద్దం వేసుకొని చదివి ఇలా రాస్తారా? ఇక అంతా మీలా సీరియస్గా చదివి రాసేపనైతే ఆపేపర్ పని గోవిందా. ఆ విలేఖర్లు కాపి పేస్ట్ వేస్తారు అంతే కాని ప్రతి పండగకు కొత్తగా ఎమీ రాయారు. ఆదేవుళ్ళ పేర్లు మార్చటం, ఘుడి పేరుమార్చటం మొద|| అదే మేటర్ని మళ్లీ మళ్ళీ ముద్రిస్తారంతే!
-----------------------------------------------
మీరు కావాలంటే పల్లే టూరిలో స్రీ ల మీద జరిగే అత్యాచార విషయాన్ని ఒకసారి చదవండి. ఆమేని గుర్తు తెలీని వ్యక్తి బహిర్భూమిదగ్గ ... చేయబోయాడని ఆమే కేకలు వేసిందని ఊరి వారు రావటం తో వాడు పారి పోయాడు అని స్టాండర్డ్ విషయం రాస్తాడు. మీరు బాగా పరిశిలిస్తే వారు రోజు ప్రచూరించే దానిలో 75% కాపి పేస్ట్. మిగతావి ఎదైన యువనేత మీద రాయాలంటె కొంచెం ప్రత్యేక శ్రద్ద వహించి రాస్తారు. కొంచెం ఎడిటొరియల్ పేపర్ భిన్నం గా ఉంట్టుంది అంతే.

జయ

Anonymous said...

నా తెలుగు జ్ఞానం కొంచం తక్కువే. వాళ్లు వ్రాసినవి, మీరు తప్పు అని చెబుతున్నవి నా వరకు కరక్టే అనిపిస్తున్నాయి. కొంచం ఆ వార్తని సరిగ్గా ఎలా వ్రాయాలో కూడా (తప్పు పదాలు, సరి అయిన పదాలు) వ్రాస్తే నాబోటి గాళ్లకు ఉపయోగపడేదేమోనండి

Anonymous said...

> మీరు బాగా పరిశిలిస్తే వారు రోజు ప్రచూరించే దానిలో 75% కాపి పేస్ట్. మిగతావి ఎదైన యువనేత మీద రాయాలంటె కొంచెం ప్రత్యేక శ్రద్ద వహించి రాస్తారు
:-))

Anonymous said...

ఒకే పోస్ట్ రెండు బ్లాగుల్లో ... అవసరమా సార్?
-Yadagiri

కృష్ణశ్రీ said...

మొదటి అన్నోన్ (జయ)!

పదవీ విరమణ ముందైనా, తరవాతైనా నేను పూర్తిగా "చదివే" పేపరు ఈనాడు ఒక్కటే. పంటిక్రింద రాళ్లకి భూతద్దం కావాలా! యెంత కాపీ పేస్టులు చేసినా అంత ఘోరమా! ఆంధ్రా బ్యాంకు పేరుపాలెం శాఖ గురించీ, పట్టిసీమ క్షేత్రపాలకుడి కళ్యాణం గురించీ కూడా కాపీ పేస్టులకి అవకాశం వుందా?

పూల రథంపై పొన్న ఉత్సవాలూ; బిందుల నృత్యాలూ, సినీ గేయాలూ, విబూదార్చనలూ, భోగీలూ, అభిషేక పండితులూ, కళ్యాణ క్రతువులూ--ఇవన్నీ కాపీ పేస్టులేనంటారా?

వాళ్ల వుద్యోగ విధి యేమిటంటారు?

ఇన్నాళ్లూ యేదోలే అని వూరుకున్నా, ఇప్పుడు మరీ ప్రతీపేజీలోనూ ఇలాగే వుంటుంటే వుండబట్టలేక వ్రాశాను. వాళ్లు మారితే సంతోషం.

కృష్ణశ్రీ said...

పై రెండో అన్నోన్!

తప్పు అని కాదు--అనవసర పదాలూ, ఆడంబర పదలూ అని. ఒక్క వార్తలో అన్ని ప్రత్యేకలూ, విశేషలూ, భారీలూ అవీ అవసరమా? నేను అండర్ లైన్ చేసిన పదాలని యెలా వ్రాయచ్చో మీరే ఆలోచించండి.

కృష్ణశ్రీ said...

పై మూడో అన్నోన్!

మొదటి అన్నోన్ కి ఇచ్చిన జవాబు చదవండి.

కృష్ణశ్రీ said...

నాలుగో అన్నోన్ (Yadagiri)!

"ఒకే పోస్ట్ రెండు బ్లాగుల్లో"నా? హారంలోనో యెక్కడో అలా కనపడ్డాయా యేమిటి? నాకైతే ఒకటే కనిపిస్తోందే!