Saturday, April 23, 2011

కబుర్లు - 41

అవీ, ఇవీ, అన్నీ

పశ్చిమ బెంగాల్ లో యెన్నికలు ప్రకటించినప్పటినుంచీ 21-04-2011 వరకూ "కోటి" రూపాయల "నల్లధనం" యెన్నికల సంఘం వారు స్వాధీనం చేసుకున్నారట! 

ఐదు రాష్ట్రాల్లో పన్ను యెగవేతకి సంబంధించి రూ. 85 కోట్లు గుర్తించినట్టు ఆదాయం పన్ను శాఖ ప్రకటించిందట.

లెఖ్ఖా పత్రాలు లేని రూ. 28 కోట్లు వారు స్వాధీనం కూడా చేసుకున్నారట!

ఇంక కడపలో రూ.1.74 కోట్లు మాత్రమే స్వాధీనం చేసుకొని, 21 కేసులు పెట్టారట.

అక్కడ యువనేత, దీర్ఘకాల ప్రణాళికతో చోటా మోటా నాయకులకి టాటా సుమోలూ వగైరాలు కొన్ని వందల సంఖ్యలో ముందే బుక్ చేసి, కొని, పంచిపెట్టాడట!

ఈ దేశానికి యెంతమంది అన్నా హజారేలు కావాలో!!!

ప.గో.జి. కలెక్టరు 53 రోజులపాటు శిక్షణకోసం ముస్సోరీ వెళ్లవలసి వచ్చినందున, క్రొత్త కలెక్టరుని నియమించారు. 

మళ్లీ మామూలే....పేపరునిండా జిల్లాలోని ప్రముఖ అధికారులూ, వుద్యోగులూ, ఇతరులూ ఆవిడకి "పదవీ స్వీకరణ" శుభాకాంక్షల ప్రకటనలే! 

ఇదివరకోసారి వ్రాశాను--ఇది మంచి వొరవడి కాదు అని. ఈనాడువారు వేరేవిధంగా వ్యాపారం చేసుకొంటే బాగుంటుంది గానీ, ఇలాంటివి మానేస్తే బాగుంటుంది.

దేవరపల్లి గ్రామంలో ఓ ఆవు ఇప్పుడు ఒక ఈతలో 3 దూడలని (రెండు గిత్తలూ, ఒక పెయ్యా) ఈనిందట! అంతేకాదు--ఇంతకు ముందుగాకూడా ఇలాగే, ఒకదానికన్నా యెక్కువగానే దూడలని ఈనిందట. ఇప్పటివరకూ మొత్తం 7 ఈతలలో, 11 దూడలని ఈనిందట! దూడలకి పాలు సరిపోకపోవడంతో సీసాలతో, పోతపాలు పట్టిస్తున్నారట! 

ఈనాడు వార్త ప్రకారం, కొన్ని ఆవులు రెండు దూడలని ఈనడం "తరచూ" జరుగుతుందట! ఇలా మూడు దూడలని ఈనడం మాత్రం "చాలా అరుదు"ట.

"ఫృఏమతో మీ లఛ్మీ"--నాకు తెలుగు ప్రాబ్లెం అంటే నాకన్నా ఈయనకి యెక్కువ తెలుగు ప్రాబ్లెం--అంటూ, హాలీవుడ్ నించి బాలీ వుడ్ కి వచ్చిందట. తెలుగులోని అచ్చులూ, హల్లులూ చలా కష్టపడి స్పష్టంగా పలుకుతున్నట్టు "ఎ"...క్కడ; "ఎ"...లాగ; "మ్మీ"...రు; "న్నే"...ను అంటూ, ద్విత్వాక్షరాలూ, సమ్యుక్తాక్షరాలూ వచ్చేసరికి......చూశారుగా పైన! అదీ! అంతేకాదు.....తనకి కాస్త ఆవేశం వస్తే......"చెయ్లేక్పాత్నారు"; "అడగ్లేక్పాత్నారు" అంటూ తన సహజ శైలిలోకి వచ్చేస్తుంది!

నాకెందుకో ఓ సామెత గుర్తుకి వచ్చింది.... అదే.....

"అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మాయింటికొచ్చింది, తైతక్కలాడింది...." అనీ!

మన టీవీలకి యాంకర్ల కొరత యెప్పుడు తీరేనో!

No comments: