కలప అక్రమ రవాణా
ప గో జి లోని పోలవరం, కన్నాపురం రేంజి ల పరిధిలోని అడవులు కరిగిపోతున్నాయి. వేలాది రూపాయలు ఫారెస్టు అధికారుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి.
పుగాకు బేరన్లని మండించడం కోసం కలప అవసరం కావడంతో, విచ్చలవిడిగా ట్రాక్టర్లలో పట్టపగలే తరలిస్తున్నారు. అంతేకాదు. అడవులు లేకపోవడంతో పులులూ, చిరుతలూ వంటి వన్యప్రాణులు వూళ్లలోకి వచ్చేస్తున్నాయి. మామిడిగొంది సమీపాన జీడిమామిడితోటల్లో తిరుగుతున్న పులిని మొన్ననే గమనించారుట.
ఈ అక్రమ రవాణా యెలా జరుగుతుంది?
చిన్నా, చితకా, రాజకీయ నాయకులు (మూడొంతులమంది అధికార పార్టీ వారే) కాంట్రాక్టర్ల అవతారెమెత్తి, తమకి కావలసిన కలప దగ్గరలో యెక్కడ వుందీ అని చూసుకొని, ఫారెస్టు వాళ్లని సంప్రదిస్తారు.
అసలు ఫారెస్టు శాఖ వాళ్లు, యే యే అడవులు యెక్కడెక్కడ, బాగా పెరిగిపోయి, నరకడానికి సిధ్ధంగా వున్నాయి, నిర్ధారించి, వాటిని కాంట్రాక్టర్లు నరికి రవాణా చేసుకోవచ్చు అని ప్రకటించి, వేలం తేదీని, డిపాజిట్ మొత్తాన్నీ ప్రకటించాలి.
కానీ ఇక్కడ జరిగేదేమిటంటే, అంతా రివర్సు. కాంట్రాక్టరు ముందే ఆ శాఖ హెడ్ క్లర్కుని సంప్రదించి, తమక్కావలసిన కలప, యేరియా వాళ్లకి చెప్పి, ప్రకటన వెలువడేలా చూసుకొని, డిపాజిట్ (డీ ఎఫ్ వో & కాంట్రాక్టరు పేరున వుండాలి!) కూడా బ్యాంకులో చెల్లించేసి, తూతూమంత్రంగా వేలం జరిగినట్టూ, ఈ కాంట్రాక్టరు నెగ్గినట్టూ, డిపాజిట్ కూడా దాఖలు చేసినట్టూ వ్రాసేసి, "కట్టింగు ఆర్డరు" చేతిలో పెట్టేస్తారు.
ఇంక తిరుగేముంది?
అలాంటి కాంట్రాక్టర్లు మా బ్యాంకుకి వస్తే, వాళ్లకి అంతకు ముందునించే పరిచయం వున్న స్టాఫ్ తో చలాన్లు వ్రాయించుకొని, డబ్బు డిపాజిట్ చేసేసి, రసీదు ఇవ్వమంటే, నేను "అప్లికేషన్ మీద డీ ఎఫ్ వో సంతకం పెట్టించండి. లేదా, ఇలా డిపాజిట్ చెయ్యమని అధికారికంగా వుత్తరమైనా తీసుకురండి. లేకపోతే మీ డబ్బు వాపసు తీసుకోండి" అని ఖచ్చితంగా చెప్పేసేవాడిని.
మా 58 యేళ్ల మేనేజరు దగ్గరకి పోయి వాళ్లు మొరపెట్టుకొంటే, ఆయన "ఆయన అలా చెప్పాడంటే, అదే రూలు. నేనేమీ చెయ్యలేను" అనేస్తే, వాళ్లు డబ్బులు వాపసు తీసుకొని వెళ్లిపోయేవారు.
ఆ తరవాత వచ్చిన కొంచెం తక్కువ వయసు మేనేజరు, నన్ను పిలిచి, ఈ డిపాజిట్ తీసుకోవడానికి యెందుకు అభ్యంతరం? అనడిగితే, "నేను అవినీతిని ప్రోత్సహించను" అని ఖచ్చితంగా చెపితే, "ఇందులో అవినీతి యేమి వుంది?" అనడిగి, నేను వివరించగానే, "అలా కూడా జరుగుతుందా! అయితే మీరే కరెక్టు!" అని వాళ్లకి కూడా నిష్కర్షగా చెప్పేసేవాడు.
(వాళ్లు యే జంగారెడ్డిగూడెమో వెళ్లో, ఇంకో ప్రైవేటు బ్యాంకో, గ్రామీణ బ్యాంకో చూసుకొని తమ పని కానిచ్చేసుకునేవారన్న విషయం వేరేది!)
నా మటుకు నాకు తృప్తి--నేను సైతం.....అనుకొంటూ!
No comments:
Post a Comment