Thursday, April 7, 2011

కబుర్లు - 38

అవీ, ఇవీ, అన్నీ

పాఠశాలల్లో వుత్తీర్ణతా శాతం పెరగాల్సిందే అని ప్రభుత్వం వారు వక్కాణిస్తే, పదో తరగతి పరీక్షల్లో గైడ్లు దగ్గర పెట్టించీ, కాపీలు అందించీ, బహిరంగంగా సమాధానాలు చెప్పేసీ.....ఇలా నానా పాట్లూ పడుతున్నారట వుపాధ్యాయులు.

మన పిచ్చిగానీ, గుళ్లలో మహాసరస్వతీ యాగాలు చేసి, "మంత్రోపదేశం" చేసిన పెన్నులూ, పుస్తకలూ విద్యార్థులకి
'వుచితంగా' ఇస్తే, అందరూ పేసయిపోతారా? ఇలాంటి పధ్ధతులవల్ల పేసవుతారుగానీ!

ఇంకా జూ కా లవాళ్లు అంతకు తెగించలేదుగానీ, రేపు వీళ్లందరూ ఇంటర్లూ, అవేవో "సెట్"లూ అలాగే వ్రాసేసి, బీటెక్కులూ అవీ అయిపోయి, ఇంజనీర్లూ డాక్టర్లూ వగైరా అయిపోయి, మన జీడీపీ ని అమాంతం పెంచేస్తారేమో! యెవరు చూడొచ్చారు?

అన్నా హజారేకి నా విఙ్ఞప్తి--బాబూ వెంటనే మీ నిరాహార దీక్ష విరమించండి. బుధ్ధీ, ఙ్ఞానం, సిగ్గూ, లజ్జా, బిడియం లేని ఈ రా నా లమీద లోక్ పాల్ గురించి వొత్తిడి తేవడానికి మీరు బలి కావద్దు.

భారతదేశానికీ, రాలేగావ్ సిధ్ధి లాంటి పల్లెలకీ, మీలాంటివాళ్ల అవసరం చాలా వుంది. జనాలందరికీ ఈ విషయంలో 'కొదమ సింగాల్లా' గర్జించమని పిలుపు ఇస్తున్నాయి--పత్రికలు. గర్జించలేకపోయినా, కనీసం నాలా 'మ్యావ్, మ్యావ్' అనైనా అంటారేమో చూద్దాం!

అన్నట్టు మన సత్యసాయి ఆరోగ్యం బాగుండలేదు పది రోజులుగా. ఆయన లాంటి వాళ్ల అవసరం కూడా దేశానికి యెంతో వుంది. కానీ ఇక్కడ విషయమేమిటంటే--ప్రభుత్వ జోక్యం! ప్రశాంతి నిలయంలో "సూపర్ స్పెషలిటీ" ఆసుపత్రి వుంది. ఆ వైద్యులే ఆయనకి శస్త్ర చికిత్సలూ వగైరాలు చేశారు. 

హైదరాబాదునించి వెళ్లిన "ప్రభుత్వ" వైద్యులు మాత్రం వాళ్లతో గొడవ పెట్టుకొని, మేం చెప్పినట్టు చెయ్యండి అంటున్నారట! పైగా, మొదటి రెండురోజులకన్నా, మేము వచ్చాక ఆయన ఆరోగ్యం బాగుపడింది అంటున్నారట!

ప్రభుత్వమేమో, ఇద్దరు మంత్రులనీ అక్కడే వుంచింది. ఇప్పుడు ముగ్గురో యెంతమందో "సెక్రెటరీ"లని కూడా "అక్కడే వుండి పర్యవేక్షించండి" అని పంపించిందట! మరి వాళ్లు యేమి చేస్తారో?!

ఈ లోపల మళ్లీ మణిపాల్ నుంచీ, ఢిల్లీ నుంచీ, అమెరికా నుంచీ కూడా "స్పెషలిస్టు"లని రప్పించారట! మొత్తానికి ఆయన ఆరోగ్యం "చాలా"మేరకు బాగుపడింది అనే చెపుతున్నారు.

యేమిటో ఈ ప్రభుత్వాలు--మనుషులని వాళ్లిష్టం వచ్చినట్టు బ్రతకనివ్వవు, చావనివ్వవు!

సర్వే జనాస్సుఖినో భవంతు!

మొన్నటిదాకా, "ఆంగన్ వాడీ" వర్కర్లకి జీతాలు ఇవ్వలేదు, వాళ్లు ఆందోళన చేసి, తన్నులుతిన్నాక జీతాలు పెంచి ఇచ్చారు. ఇంక ఇప్పుడు ఆ కేంద్రాలకి "అంకోపరులు" (ల్యాప్ టాప్ లు) ఇచ్చేస్తారట! 

"కేర్" స్వచ్చంద సంస్థ "ప్రోత్సాహంతో" ప్రయోగాత్మకంగా, యెంపికచేసిన జిల్లాల్లో, ప్రతి 17 కేంద్రాలకి ఒకటి చొప్పున ఇచ్చారట. వాటి వినియోగం పై సీడీవోలు, పర్యవేక్షకులకీ శిక్షణ ఇస్తారట. ఆరు నెలల క్రితమే ఆయా జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లకి అవి అందజేశారట. ఫలితాలనిబట్టి, మిగిలిన జిల్లాలకీ విస్తరిస్తారట. 

వాటిలో సమాచారం దగ్గరకొస్తే, ఆర్డీడీ లు, పీ డీ లు, సీ డీ పీ వో లు ప్రతీరోజూ తమ పర్యటన వివరాలు తెలపాలట. వాళ్లు "ఆరోజు" యేయే కేంద్రాలకు వెళ్లనున్నారు; అక్కడి పరిస్థితి; ఫిర్యాదులేమైనా వచ్చాయా? పరిస్థితులని యెలా చక్కదిద్దారు; కార్యకర్తలు, ఆయాలు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తున్నారా; కేంద్రాల్లోని విద్యార్థుల సంఖ్య; నిర్దేశిత ప్రాంతాల్లోని జనాభా వివరాలు; గర్భిణులు, బాలెంతల సంఖ్యా; ఆహార నిల్వల సమాచారం--ఇలా ప్రపంచమంతా యేరోజుకారోజు "ఆన్ లైన్లో" ప్రభుత్వానికి పంపించాలట. దానిమీద తగు చర్యలు తీసుకుంటారట--అధికారులు!

"ఆయనే వుంటే......" అన్నట్టు......!

రాష్ట్రంలో "రిజిస్ట్రేషన్లు" కోసం జిల్లా వ్యాప్తంగా 27 కార్యాలయాల్లో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన "బయోమెట్రిక్" విధానం పడకేసి, కెమేరాలూ, స్కానర్లూ అటకెక్కి, "అక్రమ రిజిస్ట్రేషన్లు" యధేచ్చగా సాగుతున్నాయట! 2007 లో ఇచ్చిన కంప్యూటర్లు మొరాయించడం, వెబ్ కెమేరాలూ, బయోమెట్రిక్ పరికరాలూ మూలన పడడంతో "పాతపధ్ధతిలోనే" రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయట. ఇతర కార్యాలయాలతో అనుసంథానమే జరగడంలేదట!

"త్వరలో" ఈ సౌకర్యాలన్నీ పునరుధ్ధరిస్తామనీ, క్రొత్త కంప్యూటర్లూ వగైరా "వచ్చేస్తున్నాయి" అనీ అనేకమంది "రిజిస్ట్రార్లు" చెపుతున్నారట.

కొన్ని వందలో యెన్నో కోట్లు ఖర్చుపెట్టి నిర్వహించిన "జన గణన" అంతా తప్పుల తడకేనట! వుదాహరణకి కొవ్వూరు మండలం లో గత పదేళ్లలో పెరిగిన జనాభా "ముగ్గురే"నట!

ఈ లెఖ్ఖలకోసం అప్పుడెప్పుడో మా యింటికి వచ్చి, ఓ చిన్న స్లిప్ ఇచ్చి వెళ్లారు యెవరో. తరవాత ఇప్పటివరకూ "జనాభా లెఖ్ఖలవాళ్లు" యెవరూ మా యింటికి రాలేదు! ఇప్పటికీ జనాభా లెఖ్ఖల్లో నేను లేను అని నా అనుమానం. ఇంతకన్నా ఋజువేమి కవాలి.......అవి తప్పుడు తడకలని చెప్పడానికి?

2 comments:

Indian Minerva said...

కొవ్వూరు మండలం లో గత పదేళ్లలో పెరిగిన జనాభా "ముగ్గురే"నట!
:D

కృష్ణశ్రీ said...

డియర్ Indian Minerva!

నిజమేనట! పత్రికల్లో ప్రచురించబడ్డవాటిలో ఇది మచ్చుకి "ఒకటి" మాత్రమే! ఇంకా చాలా--అంకెలతో సహా వున్నాయి.

ధన్యవాదాలు.