Friday, April 29, 2011

కబుర్లు - 42

అవీ, ఇవీ, అన్నీ

మొన్న "గుడ్ ఫ్రైడే" తో, శనివారం సెలవుపెట్టుకుంటే 3 రోజుల లాంగ్ వీకెండ్ కి ప్రణాళిక వేసుకున్న ముగ్గురో యెందరో ప్రభుత్వ వైద్యులు అక్కడెక్కడో గురువారం నాడు యేకంగా 21 మందికి సిజేరియన్ ఆపరేషన్లు చేసేశారట. ఆ గర్భిణుల్లో సోమవారం పురుడు వచ్చే అవకాశం వున్నవాళ్లు కూడా వున్నారట. ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లకి పాతికవేలదాకా పుచ్చుకుంటున్నారనుకుంటా. మరి అంత ఖర్చులేకుండా వుచితంగా చేసినందుకు యెవరూ సంతోషించలేదట. పైగా ఆ వైద్యులని సస్పెండు చేశారట! (వాళ్లుకూడా డబ్బులు నొక్కేసే ఆపరేషన్లు చేసి వుంటారంటారా?! యేమో. తెలీదు.)

"విత్తు కొద్దీ పంట" అనీ, "పిండికొద్దీ రొట్టె" అనీ అంటారు.....కానీ ఇది మోసగాళ్లకి కూడా వర్తిస్తుందా? మెదక్ జిల్లా తూప్రాన్ లో, ఆరు నెలల క్రితం ఒకాయన, ఓ నగల దుకాణం ప్రారంభించి, "తులం" (అంటే 11 చిల్లర గ్రాములు) బంగారాన్ని రూ.15-17 వేలకీ, (అప్పటి రేటు గ్రాము రూ.2 వేలు అనుకున్నా, 22 వేలకి పైనే) పది తులాల బిస్కెట్ రూ.1.5-1.70 లక్షలకే ఇస్తాననీ నమ్మించి, కొన్ని లక్షల పెట్టుబడితో, కొందరికి అలాగే అమ్మి, తరవాత, నాకు ఏప్రిల్ లో విదేశాలనించి వోడనిండా బంగారం రాబోతూంది అనీ, ముందుగా డబ్బు చెల్లిస్తే, ఈ నెల 24, 25 తేదీల్లో బిస్కెట్లు ఇచ్చేస్తాను అనీ చెప్పి, ఓ 60 మంది పైగా ఇవ్వగా, ఓ పది కోట్లు వసూలు చేసుకొని, ముందుగా తన భార్యా పిల్లలని వూరు దాటించి, బంగారం తేవడానికి వెళుతున్నాను అని అందరికీ చెప్పి, మాయం అయ్యాడట. ఈ వ్యాపారం తో పాటు కొన్ని "సేవా కార్యక్రమాలు" కూడా చేసేవాడట. కొసమెరుపేమిటంటే, ఓ పోలీసు అధికారి సైతం ఆయన దగ్గరనించి పెద్ద మొత్తంలో బంగారం 'కొనుగోలు' చేశారట!

యెలా వుంది "ఠోకరా?" (దురాశ దుఃఖమునకు చేటు!)

కల్యాణమస్తు కార్యక్రమంలో ప్రోత్సాహకాలకోసం ఇదివరకు చేసుకున్నవాళ్లే మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారట! ఇలాంటి వాళ్లని పట్టుకొనే బాధ్యత తహసీల్దార్లకి అప్పగించారట. మే 20న జిల్లాలో జరగబోయే కల్యాణమస్తులో ఓ 5 వేల వివాహాలైనా జరిపించాలని, అందుకోసం 15 మంది అధికారులని నియమించారట.

జిల్లాలో దేవాలయాలకీ, సత్రాలకీ సంబంధించిన భూములూ, ఆస్తులూ చాలామటుకు యేవి యెక్కడ వున్నయో దేవాలయ అధికారులే పోల్చుకోలేకపోతున్నారట. కొన్ని దేవాలయాలకైతే, అధికారులనే నియమించలేదట. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వారు ముమ్మరంగా చేస్తున్న దర్యాప్తులో అలాంటి స్థలాల్లో అనేక వాణిజ్య సముదాయాలూ, హోటళ్లూ వగైరాలు నిర్మించేశారట. కొన్నింటికి రెవెన్యూ వారు పట్టాలు కూడా ఇచ్చేశారట!

సత్యసాయిబాబా మృతికి ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటిస్తే, మంత్రి పితాని భూమి పూజలూ, ప్రారంభోత్సవాలు నిర్వహించడమేమిటి అని పలువురు భక్తులు విస్మయం వ్యక్తం చేశారట. (అందుకేగా అన్నది యెవడిగోలవాడిది అనీ, యెవరిపాట్లు వారివి అనీ!)

సమగ్ర శిశు అభివృధ్ధి పథకం (ఐసీడీఎస్) క్రింద చంద్రబాబు ఓ మంచి పథకాన్ని ప్రవేశపెట్టాడు--ఆడపిల్ల పుట్టగానే ఆ తల్లిదండ్రులూ, కూతురి పేర కొంత మొత్తానికి బ్యాంకులొ "కేష్ సర్టిఫికెట్ " రూపం లో డిపాజిట్ చేసి, పాఠశాల లో చేరినప్పటి నుంచీ సంవత్సరానికి రూ.500/-; రూ.1,000/-, ఇలా ఇస్తూ, పెళ్లినాటికి మొత్తం డిపాజిట్ సొమ్ము వాళ్లకి అందేలా యేర్పాటు వుండేది. (దీన్నే ఇప్పుడు ఆయన నగదు బదిలీ అంటున్నాడు).

తరవాత ఆ పథకానికి అనేక మార్పులు చేసి, ఇంకా బాగా అభివృధ్ధి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని నీళ్లుగార్చి, ఇప్పుడు అసలు ఆ మాటే లేకుండా చేసింది! 

ఇప్పుడు నాబార్డ్ సహాయంతో ఆంగన్‌వాడీలకి "భవన నిర్మాణాలు" చేపడతారట! వేల సంఖ్యలో కార్యకర్తలూ, సహాయకుల ఖాళీల్ని, వందల సంఖ్యలో నియోజకవర్గ స్థాయి అధికారుల్నీ భర్తీ చెయ్యడం గురించీ, యేళ్లతరబడీ పనిచేస్తూ ఇప్పటికి అమ్మమ్మలైనా తమ వుద్యోగాలని క్రమబధ్ధీకరించడం లేదు అంటున్న వాళ్ల మొత్తుకోళ్లనీ మాత్రం పట్టించుకోవడం లేదు ప్రభుత్వం! 

నాకేటి?.....అనేదానికి సమాధానం వస్తేనే పథకాలు నెరవేరే పరిస్థితి మరి!

2 comments:

Anonymous said...

@ఈ వ్యాపారం తో పాటు కొన్ని "సేవా కార్యక్రమాలు" కూడా చేసేవాడట. కొసమెరుపేమిటంటే, ఓ పోలీసు అధికారి సైతం ఆయన దగ్గరనించి

"సేవా కార్యక్రమాలు" :D

A K Sastry said...

పై అన్నోన్!

ఆ "వార్త"లో అలాగే వ్రాశారు మరి.

అయినా, గుళ్లలో భజనలు చేయించి, చేసేవాళ్లకి టీలూ అవీ సప్లై చేసి ఆ ఖర్చూ, అయిపోయాక చుట్టుప్రక్కలవాళ్లకి ప్రసాదాలు పంచిపెట్టి, ఆ ఖర్చూ భరించడం లాంటివే అయ్యుంటాయి ఈ సోకాల్డ్ "కార్యక్రమాలు". అంతకన్నా యేముంటాయి!

ధన్యవాదాలు.