Saturday, September 17, 2011

కబుర్లు - 72

అవీ, ఇవీ, అన్నీ

ఇంక పేర్లమార్పు గురించి మొన్న (11-09-2011) ఈనాడు ఆదివారంలో ఓ వ్యాసం వచ్చింది. 

పోర్చుగీసువాళ్లు వాళ్ల భాషలో, "బోం బహియా" (మంచి తీరం) అని పిలిస్తే, అది "బోంబే" గా మారిందనీ, స్థానికులు పూజించే "ముంబాదేవి" పేరుమీద దాన్ని 1996లో "ముంబాయిగా" మార్చారు అనీ వ్రాశారు. (మొదటిదానికి ఆథారాలేమిటో నాకు తెలీదు).

మద్రాసు అసలుపేరు "మదరాసు" అనీ, ఈస్ట్ ఇండియా కంపెనీవాళ్లు అక్కడికి వచ్చాక, సమీపంలో స్థానికులు "చెన్నపట్టణం" యేర్పాటు చేసుకున్నారు అనీ, దాన్నే తమిళులు "చెన్నై" అనేవారనీ, తరవాత, ఆ రెంటినీ కలిపి, మద్రాసు అనే వ్యవహరించేవారు అనీ, తరవాత తమిళతంబిలు దాన్ని "చెన్నై" గా మార్చారు అనీ వ్రాశారు. 

"కాళీకా తా" అంటే కాళీమాత అని అర్థంట. ఆ పేరుమీదే కోల్కతా అని పిలిచేవారట. బ్రిటిష్ వాళ్లు దాని క్యాల్కట్టా అని పలికితే అదే స్థిరపడింది. 2001 లో దాన్ని "కోల్కత్తా" అని మార్చారు మన బంగబంధులు. (వీళ్లకి అనవసరంగా "ఓకారాలు పెట్టడం" ఓ ఆనవాయితీ). దీనికి సంబంధించి ఓ తెలుగు జోకు:

కట్టమంచి రామలింగారెడ్డిగారు ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ గా వున్న రోజుల్లో, ఓ బంగాయన ఇన్స్ పెక్షన్ కో దేనికో వచ్చి, రెడ్డిగారు ఆయన గదిలో లేకపోవడంతో, "వేరీజ్ రోమలింగారెడ్డి?" అని చిందులు తొక్కుతూంటే, అప్పుడే అక్కడికి వచ్చిన రెడ్డిగారు, "రోమలింగారెడ్డి, యోనివర్సిటీని వదిలి వెళ్లడులెండి!" అని సముదాయించాడట!

అలాగే, మన మంగళంపల్లివారు, దశాబ్దాలుగా మెడ్రాసులో వుంటూ, బాగా సాంబారు తాగడంవల్లేమో, నోరు బాగా సాగదీసుకొని, "పెలుకే బెంగారమాయెరా.....అందాల రేమ...." అని పాడతారు. పాపం అది ఆయన పధ్ధతి!

(ఇదంతా రోమాయణంలో పెడకలవేటలెండి!)

ఇక, బెండకళూరు--అంటే వుడికించిన బీన్స్ (దొరికే ప్రాంతం) కాబట్టి 14వ శతాబ్దంలో ఆ పేరు వచ్చిందిట. అప్పట్లో, హొయసల రాజు "బళ్లాలుడు" ఈ ప్రాంతంలో వేటకు వచ్చి, ఆకలితో అలమటిస్తుంటే, ఒకామె, ఆ బీన్స్ పెట్టిందట. అందుకాయన ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టాడట. (దీనికాథారాలు యేమిటో, తరువాత అది బెంకళూరుగాకాక, బెంగుళూరుగా యెందుకు మారిందో నాకు తెలీదు). దాన్నే ఇప్పుడు బెంగళూరు అని మార్చారు కన్నడ కస్తూరివారు.

నాకయితే, అటు టిప్పు సుల్తాన్ కీ, ఇటు బహమనీ సుల్తానులకీ, ఇటు బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీసు వాళ్లకీ అనేక "బెంగలు" కలిగించినందుకే దాన్ని "బెంగల వూరు" అన్నారనీ, అదే బెంగళూరుగా మారిందనీ ఓ నమ్మకం.

ఇంకా ఆ బళ్లాలుడి అరి అంటే శత్రువు స్థాపించిందే నేటి వార్తల్లో వున్న "బళ్లారి" అనీ, అక్కడ వున్న కోట నిన్నో, మొన్నో కట్టినంత క్రొత్తగా వుంటుంది అనీ నా వుద్దేశ్యం.

మిగతా........మరోసారి! 

1 comment:

Indian Minerva said...

అదంతా తెలీదుగానీ bahía అంటే మాత్రం bay అని అర్ధం.