Friday, April 29, 2011

కబుర్లు - 42

అవీ, ఇవీ, అన్నీ

మొన్న "గుడ్ ఫ్రైడే" తో, శనివారం సెలవుపెట్టుకుంటే 3 రోజుల లాంగ్ వీకెండ్ కి ప్రణాళిక వేసుకున్న ముగ్గురో యెందరో ప్రభుత్వ వైద్యులు అక్కడెక్కడో గురువారం నాడు యేకంగా 21 మందికి సిజేరియన్ ఆపరేషన్లు చేసేశారట. ఆ గర్భిణుల్లో సోమవారం పురుడు వచ్చే అవకాశం వున్నవాళ్లు కూడా వున్నారట. ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లకి పాతికవేలదాకా పుచ్చుకుంటున్నారనుకుంటా. మరి అంత ఖర్చులేకుండా వుచితంగా చేసినందుకు యెవరూ సంతోషించలేదట. పైగా ఆ వైద్యులని సస్పెండు చేశారట! (వాళ్లుకూడా డబ్బులు నొక్కేసే ఆపరేషన్లు చేసి వుంటారంటారా?! యేమో. తెలీదు.)

"విత్తు కొద్దీ పంట" అనీ, "పిండికొద్దీ రొట్టె" అనీ అంటారు.....కానీ ఇది మోసగాళ్లకి కూడా వర్తిస్తుందా? మెదక్ జిల్లా తూప్రాన్ లో, ఆరు నెలల క్రితం ఒకాయన, ఓ నగల దుకాణం ప్రారంభించి, "తులం" (అంటే 11 చిల్లర గ్రాములు) బంగారాన్ని రూ.15-17 వేలకీ, (అప్పటి రేటు గ్రాము రూ.2 వేలు అనుకున్నా, 22 వేలకి పైనే) పది తులాల బిస్కెట్ రూ.1.5-1.70 లక్షలకే ఇస్తాననీ నమ్మించి, కొన్ని లక్షల పెట్టుబడితో, కొందరికి అలాగే అమ్మి, తరవాత, నాకు ఏప్రిల్ లో విదేశాలనించి వోడనిండా బంగారం రాబోతూంది అనీ, ముందుగా డబ్బు చెల్లిస్తే, ఈ నెల 24, 25 తేదీల్లో బిస్కెట్లు ఇచ్చేస్తాను అనీ చెప్పి, ఓ 60 మంది పైగా ఇవ్వగా, ఓ పది కోట్లు వసూలు చేసుకొని, ముందుగా తన భార్యా పిల్లలని వూరు దాటించి, బంగారం తేవడానికి వెళుతున్నాను అని అందరికీ చెప్పి, మాయం అయ్యాడట. ఈ వ్యాపారం తో పాటు కొన్ని "సేవా కార్యక్రమాలు" కూడా చేసేవాడట. కొసమెరుపేమిటంటే, ఓ పోలీసు అధికారి సైతం ఆయన దగ్గరనించి పెద్ద మొత్తంలో బంగారం 'కొనుగోలు' చేశారట!

యెలా వుంది "ఠోకరా?" (దురాశ దుఃఖమునకు చేటు!)

కల్యాణమస్తు కార్యక్రమంలో ప్రోత్సాహకాలకోసం ఇదివరకు చేసుకున్నవాళ్లే మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారట! ఇలాంటి వాళ్లని పట్టుకొనే బాధ్యత తహసీల్దార్లకి అప్పగించారట. మే 20న జిల్లాలో జరగబోయే కల్యాణమస్తులో ఓ 5 వేల వివాహాలైనా జరిపించాలని, అందుకోసం 15 మంది అధికారులని నియమించారట.

జిల్లాలో దేవాలయాలకీ, సత్రాలకీ సంబంధించిన భూములూ, ఆస్తులూ చాలామటుకు యేవి యెక్కడ వున్నయో దేవాలయ అధికారులే పోల్చుకోలేకపోతున్నారట. కొన్ని దేవాలయాలకైతే, అధికారులనే నియమించలేదట. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వారు ముమ్మరంగా చేస్తున్న దర్యాప్తులో అలాంటి స్థలాల్లో అనేక వాణిజ్య సముదాయాలూ, హోటళ్లూ వగైరాలు నిర్మించేశారట. కొన్నింటికి రెవెన్యూ వారు పట్టాలు కూడా ఇచ్చేశారట!

సత్యసాయిబాబా మృతికి ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటిస్తే, మంత్రి పితాని భూమి పూజలూ, ప్రారంభోత్సవాలు నిర్వహించడమేమిటి అని పలువురు భక్తులు విస్మయం వ్యక్తం చేశారట. (అందుకేగా అన్నది యెవడిగోలవాడిది అనీ, యెవరిపాట్లు వారివి అనీ!)

సమగ్ర శిశు అభివృధ్ధి పథకం (ఐసీడీఎస్) క్రింద చంద్రబాబు ఓ మంచి పథకాన్ని ప్రవేశపెట్టాడు--ఆడపిల్ల పుట్టగానే ఆ తల్లిదండ్రులూ, కూతురి పేర కొంత మొత్తానికి బ్యాంకులొ "కేష్ సర్టిఫికెట్ " రూపం లో డిపాజిట్ చేసి, పాఠశాల లో చేరినప్పటి నుంచీ సంవత్సరానికి రూ.500/-; రూ.1,000/-, ఇలా ఇస్తూ, పెళ్లినాటికి మొత్తం డిపాజిట్ సొమ్ము వాళ్లకి అందేలా యేర్పాటు వుండేది. (దీన్నే ఇప్పుడు ఆయన నగదు బదిలీ అంటున్నాడు).

తరవాత ఆ పథకానికి అనేక మార్పులు చేసి, ఇంకా బాగా అభివృధ్ధి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని నీళ్లుగార్చి, ఇప్పుడు అసలు ఆ మాటే లేకుండా చేసింది! 

ఇప్పుడు నాబార్డ్ సహాయంతో ఆంగన్‌వాడీలకి "భవన నిర్మాణాలు" చేపడతారట! వేల సంఖ్యలో కార్యకర్తలూ, సహాయకుల ఖాళీల్ని, వందల సంఖ్యలో నియోజకవర్గ స్థాయి అధికారుల్నీ భర్తీ చెయ్యడం గురించీ, యేళ్లతరబడీ పనిచేస్తూ ఇప్పటికి అమ్మమ్మలైనా తమ వుద్యోగాలని క్రమబధ్ధీకరించడం లేదు అంటున్న వాళ్ల మొత్తుకోళ్లనీ మాత్రం పట్టించుకోవడం లేదు ప్రభుత్వం! 

నాకేటి?.....అనేదానికి సమాధానం వస్తేనే పథకాలు నెరవేరే పరిస్థితి మరి!

Saturday, April 23, 2011

కబుర్లు - 41

అవీ, ఇవీ, అన్నీ

పశ్చిమ బెంగాల్ లో యెన్నికలు ప్రకటించినప్పటినుంచీ 21-04-2011 వరకూ "కోటి" రూపాయల "నల్లధనం" యెన్నికల సంఘం వారు స్వాధీనం చేసుకున్నారట! 

ఐదు రాష్ట్రాల్లో పన్ను యెగవేతకి సంబంధించి రూ. 85 కోట్లు గుర్తించినట్టు ఆదాయం పన్ను శాఖ ప్రకటించిందట.

లెఖ్ఖా పత్రాలు లేని రూ. 28 కోట్లు వారు స్వాధీనం కూడా చేసుకున్నారట!

ఇంక కడపలో రూ.1.74 కోట్లు మాత్రమే స్వాధీనం చేసుకొని, 21 కేసులు పెట్టారట.

అక్కడ యువనేత, దీర్ఘకాల ప్రణాళికతో చోటా మోటా నాయకులకి టాటా సుమోలూ వగైరాలు కొన్ని వందల సంఖ్యలో ముందే బుక్ చేసి, కొని, పంచిపెట్టాడట!

ఈ దేశానికి యెంతమంది అన్నా హజారేలు కావాలో!!!

ప.గో.జి. కలెక్టరు 53 రోజులపాటు శిక్షణకోసం ముస్సోరీ వెళ్లవలసి వచ్చినందున, క్రొత్త కలెక్టరుని నియమించారు. 

మళ్లీ మామూలే....పేపరునిండా జిల్లాలోని ప్రముఖ అధికారులూ, వుద్యోగులూ, ఇతరులూ ఆవిడకి "పదవీ స్వీకరణ" శుభాకాంక్షల ప్రకటనలే! 

ఇదివరకోసారి వ్రాశాను--ఇది మంచి వొరవడి కాదు అని. ఈనాడువారు వేరేవిధంగా వ్యాపారం చేసుకొంటే బాగుంటుంది గానీ, ఇలాంటివి మానేస్తే బాగుంటుంది.

దేవరపల్లి గ్రామంలో ఓ ఆవు ఇప్పుడు ఒక ఈతలో 3 దూడలని (రెండు గిత్తలూ, ఒక పెయ్యా) ఈనిందట! అంతేకాదు--ఇంతకు ముందుగాకూడా ఇలాగే, ఒకదానికన్నా యెక్కువగానే దూడలని ఈనిందట. ఇప్పటివరకూ మొత్తం 7 ఈతలలో, 11 దూడలని ఈనిందట! దూడలకి పాలు సరిపోకపోవడంతో సీసాలతో, పోతపాలు పట్టిస్తున్నారట! 

ఈనాడు వార్త ప్రకారం, కొన్ని ఆవులు రెండు దూడలని ఈనడం "తరచూ" జరుగుతుందట! ఇలా మూడు దూడలని ఈనడం మాత్రం "చాలా అరుదు"ట.

"ఫృఏమతో మీ లఛ్మీ"--నాకు తెలుగు ప్రాబ్లెం అంటే నాకన్నా ఈయనకి యెక్కువ తెలుగు ప్రాబ్లెం--అంటూ, హాలీవుడ్ నించి బాలీ వుడ్ కి వచ్చిందట. తెలుగులోని అచ్చులూ, హల్లులూ చలా కష్టపడి స్పష్టంగా పలుకుతున్నట్టు "ఎ"...క్కడ; "ఎ"...లాగ; "మ్మీ"...రు; "న్నే"...ను అంటూ, ద్విత్వాక్షరాలూ, సమ్యుక్తాక్షరాలూ వచ్చేసరికి......చూశారుగా పైన! అదీ! అంతేకాదు.....తనకి కాస్త ఆవేశం వస్తే......"చెయ్లేక్పాత్నారు"; "అడగ్లేక్పాత్నారు" అంటూ తన సహజ శైలిలోకి వచ్చేస్తుంది!

నాకెందుకో ఓ సామెత గుర్తుకి వచ్చింది.... అదే.....

"అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మాయింటికొచ్చింది, తైతక్కలాడింది...." అనీ!

మన టీవీలకి యాంకర్ల కొరత యెప్పుడు తీరేనో!

Tuesday, April 19, 2011

ఈనాడు వారి తెగులు

పదాడంబరం

ఒక టైములో ఈనాడువారు వార్తలకి శీర్షికలు వుంచడం లో, వార్తలు వ్రాయడం లో మంచి వొరవడి సృష్టించారు.

రాను రాను తలకి రోకలి చుట్టుకున్నట్టు తయారవుతోంది.

వుదాహరణకి ఈ క్రింది పేరాలు చూడండి.

"శ్రీరామ నవమి సందర్భంగా......రామాలయాల్లో గురువారం "ప్రత్యేక" పూజలు నిర్వహించారు. ఉదయం సీతారామచంద్రమూర్తికి "ప్రత్యేక" పుష్పాలంకరణ చేసి, "విశేషార్చనలు" చేశారు. రాత్రి "సుందరంగా" అలంకరించిన పూలరథంపై స్వామివార్లను ఉంచి "వైభవంగా" పొన్న ఉత్సవం నిర్వహించారు. ఉత్సవంలో ప్రదర్శించిన "వివిధ రకాల" నృత్యాలు, ధూం ధడాకా, తీన్‌మార్, బిందుల నృత్యం, కాళికా నృత్య గీతాలు, కోయ నృత్యాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆలపించిన సినీ గేయాలు పురజనులను అలరించాయి. "భారీ" ఎత్తున భక్తులు ఊరేగింపులో "ఉత్సాహంగా" పాల్గొన్నారు."

"....షిర్డీసాయి మందిరంలో గురువారం "ప్రత్యేక" పూజలు నిర్వహించారు. ఉదయం బాబాకు పంచామృతాభిషేకం జరిపి "ప్రత్యేక" పుష్పాలంకరణ చేశారు. ....రోడ్డులోని....బాబాకు విబూదార్చనలు నిర్వహించి హారతులిచ్చారు.......లోని కుక్కలవారితోటలోని చెట్టుకింద ముత్యాలమ్మ ఉత్సవాల ముగింపు సందర్భంగా "పలువురు" హాజరై అన్నప్రసాదాలు స్వీకరించారు."

"విశాఖ రైలుకు అదనపు "భోగీలపై" ఎంపీ హామీ"

"పేరుపాలెం నార్తు పంచాయతీ పరిథి అంగజాలపాలెం లోని ఆంధ్రా బ్యాంకులో......"

(ఆంధ్రా బ్యాంకువారి ఆ బ్రాంచిని "పేరుపాలెం బ్రాంచ్" అని ప్రపంచ వ్యాప్తంగా వ్యవహరిస్తారు. అలాంటిది, అసలు బ్రాంచి పేరు వ్రాయకుండా, "ఫలనా పంచాయితీ, ఫలనా స్థలం" అని వ్రాయడం అవసరమా?)

"......శివునికి భక్తులు "ప్రత్యేక" పూజలు నిర్వహించారు. గ్రామంలోని "50 మంది దంపతులు"(??!!) (ఆవూళ్లో వున్నది మొత్తం 50 మంది దంపతులేనా? దంపతులు అంటే 25 జంటలనా? 50 జంటలనా?)......కాశీ యాత్ర పూర్తిచేసుకుని వచ్చారు. ......శివునికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం లక్ష రుద్రాక్షలతో పూజలు జరిపించారు."

".....అభిషేక పండితులు....పర్యవేక్షణలో....కళ్యాణ క్రతువు నిర్వహించారు."

"సాదాసీదాగా....పట్టిసీమలోని....భూనీల సమేతభావన్నారాయణ స్వామి కళ్యాణం....అర్చకులు, అలయ సిబ్బంది, భజంత్రీల సమక్షంలోనే....ఇటీవల శ్రీరామనవమికి అలంకరించిన మందిరంలోనే, ఎండిపోయిన పువ్వులు, మామిడి తోరణాల మధ్యనే.....నిర్వహించడం "శోచనీయం".....వచ్చే ఏడాదినుంచైనా...."ఘనంగా".....నిర్వహిస్తారని ఆశిద్దాం." 

(ముందురోజే, ఆ అలయ అధికారి వొకరు "ఇంతకు ముందు వొకసారి వైభవంగా కళ్యాణం జరిపిస్తూంటే యేదో అపచారం జరిగింది అనీ, అప్పటినించీ వూరికి అరిష్టాన్ని అరికట్టడానికి నిరాడంబరంగా క్షేత్రపాలకుని కళ్యాణం జరిపిస్తున్నాము అని చెప్పిన వార్త ప్రముఖంగా ప్రచురించారు!)

యెలా వున్నాయి ఈనాడువారు మన భాషకి అలంకరిస్తున్న "గిల్టు నగలూ", చదువరులకి వేస్తున్న "పంటిక్రింద రాళ్లు"?
     
అసలు ఆ విలేఖరులు వార్త వ్రాశాక ఓసారి దాన్ని చదువుకుంటారా? సబ్ ఎడిటర్లు కాపీ తయారయ్యాకన్నా ఓ సారి చదువుతారా? అలాంటివాటికి "సమయం లేనంత" బిజీగా వుద్యోగ విధులు నిర్వహిస్తున్నారా? అని నా సందేహాలు. (నేనైతే వాళ్లని వెంటనే ఇంకో వుద్యోగం వెతుక్కోమనేవాణ్ణి.)

Wednesday, April 13, 2011

కబుర్లు - 40

అవీ, ఇవీ, అన్నీ

కేవలం 'నికమ్మాలే' జనాలకి పిలుపులిస్తారు.....అంటే మీరొప్పుకోరని తెలుసు. 

పిలుపులిచ్చేవాళ్లందరూ "సకమ్మాలు" అనీ మీరొప్పుకోరని తెలుసు. మరి.......

మొన్న ఓ ప్రక్కన అన్నా హజారే నిరాహారదీక్షలో వుండి, దేశం అట్టుడుకుతున్నవేళ, మన గవర్నర్ నరసిం హం గారు, "అవినీతిని తరిమి కొట్టండి" అని పిలుపునిచ్చారు. 

అంతేకాదు. పోలీసులని "ఒక్కరు తప్పు చేసినా, అది శాఖలోని అందరితోపాటు, ప్రభుత్వానికీ 'చెడ్డపేరు' తెస్తుందనీ, అందుకు గురువారం (07-04-2011) 'ఆశా' వర్కర్లపై జరిగిన 'ఘటనే' వుదాహరణ అనీ పేర్కొన్నారట. 

(సస్పెండు చెయ్యడం తప్ప, ఆడవాళ్ల కటి స్థానాలనీ, యెముకలనీ చితక్కొట్టిన ఆ సీ ఐ ని ఇప్పటివరకూ యేమి చేశారు? అయినా వాడికంత 'సరదా' యేమిటో యెవరైనా కనుక్కున్నారా? వాడి పెళ్లాం యేమంటుంది?)

*   *   *

మళ్లీ అప్రాచ్యుడు చెపితేనే మనకు తెలుస్తూంది--యువతకి 'సాంకేతిక ' వ్యసనం వంట పడుతోందని. 

మొత్తం 10 దేశాల యువతీ యువకులపై అధ్యయనం చేస్తే, అందులో 79% ల్యాప్ టాప్ కీ, మొబైల్ ఫోన్ కీ, ఇంటర్నెట్ కీ 24 గంటలపాటు దూరం చేస్తే, "పిచ్చెక్కి కొట్టుకుంటున్నారట". 

కొందరు మాత్రం, అవి లేనప్పుడు తమ సహచరుల్తో "సుదీర్ఘ" చర్చలు చేస్తున్నాము అని చెప్పారట! యెంత బాగుందో కదా?!

*   *   *

"మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం!"

అన్నా హజారే దీక్ష ఫలప్రదం అయ్యింది(ట).

ఆయనే అన్నట్టు 'ముందుంది ముసళ్ల పండగ!' 

చూద్దాం! కపిల్ సిబాల్ యెన్నిసార్లు 'థూఛ్ అంటాడో, మిగిలినవాళ్లు ఇంకెన్నిసార్లు, యేమేమి అంటారో!

*   *   *

"ఈనాడు" వారికి బుధ్ధి వచ్చినట్టే వచ్చి, మళ్లీ పోతూంటుందేమో.

"మొదటి వివాహ", "63వ వివాహ"--లాంటి శుభాకాంక్షలు చెప్పడం మానటం లేదు!

మనం కూడా, ఆ "పెళ్లికొడుకులు" త్వరలో "రెండవ" వివాహ, "64వ వివాహ" శుభాకాంక్షలు అందుకోవాలని (ఆశీర్వదించేసి) ఆశిద్దామా???!!!

Saturday, April 9, 2011

కబుర్లు - 39

కలప అక్రమ రవాణా

ప గో జి లోని పోలవరం, కన్నాపురం రేంజి ల పరిధిలోని అడవులు కరిగిపోతున్నాయి. వేలాది రూపాయలు ఫారెస్టు అధికారుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. 

పుగాకు బేరన్లని మండించడం కోసం కలప అవసరం కావడంతో, విచ్చలవిడిగా ట్రాక్టర్లలో పట్టపగలే తరలిస్తున్నారు. అంతేకాదు. అడవులు లేకపోవడంతో పులులూ, చిరుతలూ వంటి వన్యప్రాణులు వూళ్లలోకి వచ్చేస్తున్నాయి. మామిడిగొంది సమీపాన జీడిమామిడితోటల్లో తిరుగుతున్న పులిని మొన్ననే గమనించారుట. 

ఈ అక్రమ రవాణా యెలా జరుగుతుంది?

చిన్నా, చితకా, రాజకీయ నాయకులు (మూడొంతులమంది అధికార పార్టీ వారే) కాంట్రాక్టర్ల అవతారెమెత్తి, తమకి కావలసిన కలప దగ్గరలో యెక్కడ వుందీ అని చూసుకొని, ఫారెస్టు వాళ్లని సంప్రదిస్తారు.

అసలు ఫారెస్టు శాఖ వాళ్లు, యే యే అడవులు యెక్కడెక్కడ, బాగా పెరిగిపోయి, నరకడానికి సిధ్ధంగా వున్నాయి, నిర్ధారించి, వాటిని కాంట్రాక్టర్లు నరికి రవాణా చేసుకోవచ్చు అని ప్రకటించి, వేలం తేదీని, డిపాజిట్ మొత్తాన్నీ ప్రకటించాలి. 

కానీ ఇక్కడ జరిగేదేమిటంటే, అంతా రివర్సు. కాంట్రాక్టరు ముందే ఆ శాఖ హెడ్ క్లర్కుని సంప్రదించి, తమక్కావలసిన కలప, యేరియా వాళ్లకి చెప్పి, ప్రకటన వెలువడేలా చూసుకొని, డిపాజిట్ (డీ ఎఫ్ వో & కాంట్రాక్టరు పేరున వుండాలి!) కూడా బ్యాంకులో చెల్లించేసి, తూతూమంత్రంగా వేలం జరిగినట్టూ, ఈ కాంట్రాక్టరు నెగ్గినట్టూ, డిపాజిట్ కూడా దాఖలు చేసినట్టూ వ్రాసేసి, "కట్టింగు ఆర్డరు" చేతిలో పెట్టేస్తారు.

ఇంక తిరుగేముంది?

అలాంటి కాంట్రాక్టర్లు మా బ్యాంకుకి వస్తే, వాళ్లకి అంతకు ముందునించే పరిచయం వున్న స్టాఫ్ తో చలాన్లు వ్రాయించుకొని, డబ్బు డిపాజిట్ చేసేసి, రసీదు ఇవ్వమంటే, నేను "అప్లికేషన్ మీద డీ ఎఫ్ వో సంతకం పెట్టించండి. లేదా, ఇలా డిపాజిట్ చెయ్యమని అధికారికంగా వుత్తరమైనా తీసుకురండి. లేకపోతే మీ డబ్బు వాపసు తీసుకోండి" అని ఖచ్చితంగా చెప్పేసేవాడిని.

మా 58 యేళ్ల మేనేజరు దగ్గరకి పోయి వాళ్లు మొరపెట్టుకొంటే, ఆయన "ఆయన అలా చెప్పాడంటే, అదే రూలు. నేనేమీ చెయ్యలేను" అనేస్తే, వాళ్లు డబ్బులు వాపసు తీసుకొని వెళ్లిపోయేవారు.

ఆ తరవాత వచ్చిన కొంచెం తక్కువ వయసు మేనేజరు, నన్ను పిలిచి, ఈ డిపాజిట్ తీసుకోవడానికి యెందుకు అభ్యంతరం? అనడిగితే, "నేను అవినీతిని ప్రోత్సహించను" అని ఖచ్చితంగా చెపితే, "ఇందులో అవినీతి యేమి వుంది?" అనడిగి, నేను వివరించగానే, "అలా కూడా జరుగుతుందా! అయితే మీరే కరెక్టు!" అని వాళ్లకి కూడా నిష్కర్షగా చెప్పేసేవాడు.

(వాళ్లు యే జంగారెడ్డిగూడెమో వెళ్లో, ఇంకో ప్రైవేటు బ్యాంకో, గ్రామీణ బ్యాంకో చూసుకొని తమ పని కానిచ్చేసుకునేవారన్న విషయం వేరేది!)

నా మటుకు నాకు తృప్తి--నేను సైతం.....అనుకొంటూ!

Thursday, April 7, 2011

కబుర్లు - 38

అవీ, ఇవీ, అన్నీ

పాఠశాలల్లో వుత్తీర్ణతా శాతం పెరగాల్సిందే అని ప్రభుత్వం వారు వక్కాణిస్తే, పదో తరగతి పరీక్షల్లో గైడ్లు దగ్గర పెట్టించీ, కాపీలు అందించీ, బహిరంగంగా సమాధానాలు చెప్పేసీ.....ఇలా నానా పాట్లూ పడుతున్నారట వుపాధ్యాయులు.

మన పిచ్చిగానీ, గుళ్లలో మహాసరస్వతీ యాగాలు చేసి, "మంత్రోపదేశం" చేసిన పెన్నులూ, పుస్తకలూ విద్యార్థులకి
'వుచితంగా' ఇస్తే, అందరూ పేసయిపోతారా? ఇలాంటి పధ్ధతులవల్ల పేసవుతారుగానీ!

ఇంకా జూ కా లవాళ్లు అంతకు తెగించలేదుగానీ, రేపు వీళ్లందరూ ఇంటర్లూ, అవేవో "సెట్"లూ అలాగే వ్రాసేసి, బీటెక్కులూ అవీ అయిపోయి, ఇంజనీర్లూ డాక్టర్లూ వగైరా అయిపోయి, మన జీడీపీ ని అమాంతం పెంచేస్తారేమో! యెవరు చూడొచ్చారు?

అన్నా హజారేకి నా విఙ్ఞప్తి--బాబూ వెంటనే మీ నిరాహార దీక్ష విరమించండి. బుధ్ధీ, ఙ్ఞానం, సిగ్గూ, లజ్జా, బిడియం లేని ఈ రా నా లమీద లోక్ పాల్ గురించి వొత్తిడి తేవడానికి మీరు బలి కావద్దు.

భారతదేశానికీ, రాలేగావ్ సిధ్ధి లాంటి పల్లెలకీ, మీలాంటివాళ్ల అవసరం చాలా వుంది. జనాలందరికీ ఈ విషయంలో 'కొదమ సింగాల్లా' గర్జించమని పిలుపు ఇస్తున్నాయి--పత్రికలు. గర్జించలేకపోయినా, కనీసం నాలా 'మ్యావ్, మ్యావ్' అనైనా అంటారేమో చూద్దాం!

అన్నట్టు మన సత్యసాయి ఆరోగ్యం బాగుండలేదు పది రోజులుగా. ఆయన లాంటి వాళ్ల అవసరం కూడా దేశానికి యెంతో వుంది. కానీ ఇక్కడ విషయమేమిటంటే--ప్రభుత్వ జోక్యం! ప్రశాంతి నిలయంలో "సూపర్ స్పెషలిటీ" ఆసుపత్రి వుంది. ఆ వైద్యులే ఆయనకి శస్త్ర చికిత్సలూ వగైరాలు చేశారు. 

హైదరాబాదునించి వెళ్లిన "ప్రభుత్వ" వైద్యులు మాత్రం వాళ్లతో గొడవ పెట్టుకొని, మేం చెప్పినట్టు చెయ్యండి అంటున్నారట! పైగా, మొదటి రెండురోజులకన్నా, మేము వచ్చాక ఆయన ఆరోగ్యం బాగుపడింది అంటున్నారట!

ప్రభుత్వమేమో, ఇద్దరు మంత్రులనీ అక్కడే వుంచింది. ఇప్పుడు ముగ్గురో యెంతమందో "సెక్రెటరీ"లని కూడా "అక్కడే వుండి పర్యవేక్షించండి" అని పంపించిందట! మరి వాళ్లు యేమి చేస్తారో?!

ఈ లోపల మళ్లీ మణిపాల్ నుంచీ, ఢిల్లీ నుంచీ, అమెరికా నుంచీ కూడా "స్పెషలిస్టు"లని రప్పించారట! మొత్తానికి ఆయన ఆరోగ్యం "చాలా"మేరకు బాగుపడింది అనే చెపుతున్నారు.

యేమిటో ఈ ప్రభుత్వాలు--మనుషులని వాళ్లిష్టం వచ్చినట్టు బ్రతకనివ్వవు, చావనివ్వవు!

సర్వే జనాస్సుఖినో భవంతు!

మొన్నటిదాకా, "ఆంగన్ వాడీ" వర్కర్లకి జీతాలు ఇవ్వలేదు, వాళ్లు ఆందోళన చేసి, తన్నులుతిన్నాక జీతాలు పెంచి ఇచ్చారు. ఇంక ఇప్పుడు ఆ కేంద్రాలకి "అంకోపరులు" (ల్యాప్ టాప్ లు) ఇచ్చేస్తారట! 

"కేర్" స్వచ్చంద సంస్థ "ప్రోత్సాహంతో" ప్రయోగాత్మకంగా, యెంపికచేసిన జిల్లాల్లో, ప్రతి 17 కేంద్రాలకి ఒకటి చొప్పున ఇచ్చారట. వాటి వినియోగం పై సీడీవోలు, పర్యవేక్షకులకీ శిక్షణ ఇస్తారట. ఆరు నెలల క్రితమే ఆయా జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లకి అవి అందజేశారట. ఫలితాలనిబట్టి, మిగిలిన జిల్లాలకీ విస్తరిస్తారట. 

వాటిలో సమాచారం దగ్గరకొస్తే, ఆర్డీడీ లు, పీ డీ లు, సీ డీ పీ వో లు ప్రతీరోజూ తమ పర్యటన వివరాలు తెలపాలట. వాళ్లు "ఆరోజు" యేయే కేంద్రాలకు వెళ్లనున్నారు; అక్కడి పరిస్థితి; ఫిర్యాదులేమైనా వచ్చాయా? పరిస్థితులని యెలా చక్కదిద్దారు; కార్యకర్తలు, ఆయాలు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తున్నారా; కేంద్రాల్లోని విద్యార్థుల సంఖ్య; నిర్దేశిత ప్రాంతాల్లోని జనాభా వివరాలు; గర్భిణులు, బాలెంతల సంఖ్యా; ఆహార నిల్వల సమాచారం--ఇలా ప్రపంచమంతా యేరోజుకారోజు "ఆన్ లైన్లో" ప్రభుత్వానికి పంపించాలట. దానిమీద తగు చర్యలు తీసుకుంటారట--అధికారులు!

"ఆయనే వుంటే......" అన్నట్టు......!

రాష్ట్రంలో "రిజిస్ట్రేషన్లు" కోసం జిల్లా వ్యాప్తంగా 27 కార్యాలయాల్లో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన "బయోమెట్రిక్" విధానం పడకేసి, కెమేరాలూ, స్కానర్లూ అటకెక్కి, "అక్రమ రిజిస్ట్రేషన్లు" యధేచ్చగా సాగుతున్నాయట! 2007 లో ఇచ్చిన కంప్యూటర్లు మొరాయించడం, వెబ్ కెమేరాలూ, బయోమెట్రిక్ పరికరాలూ మూలన పడడంతో "పాతపధ్ధతిలోనే" రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయట. ఇతర కార్యాలయాలతో అనుసంథానమే జరగడంలేదట!

"త్వరలో" ఈ సౌకర్యాలన్నీ పునరుధ్ధరిస్తామనీ, క్రొత్త కంప్యూటర్లూ వగైరా "వచ్చేస్తున్నాయి" అనీ అనేకమంది "రిజిస్ట్రార్లు" చెపుతున్నారట.

కొన్ని వందలో యెన్నో కోట్లు ఖర్చుపెట్టి నిర్వహించిన "జన గణన" అంతా తప్పుల తడకేనట! వుదాహరణకి కొవ్వూరు మండలం లో గత పదేళ్లలో పెరిగిన జనాభా "ముగ్గురే"నట!

ఈ లెఖ్ఖలకోసం అప్పుడెప్పుడో మా యింటికి వచ్చి, ఓ చిన్న స్లిప్ ఇచ్చి వెళ్లారు యెవరో. తరవాత ఇప్పటివరకూ "జనాభా లెఖ్ఖలవాళ్లు" యెవరూ మా యింటికి రాలేదు! ఇప్పటికీ జనాభా లెఖ్ఖల్లో నేను లేను అని నా అనుమానం. ఇంతకన్నా ఋజువేమి కవాలి.......అవి తప్పుడు తడకలని చెప్పడానికి?

Saturday, April 2, 2011

కబుర్లు - 37

పిలుపులు

పిలుపుల్లో చాలా రకాలున్నాయి. పెళ్లి పిలుపులూ వగైరా మీ అందరికీ తెలుసు. ఇక నేను వ్రాసే పిలుపులేమిటంటే, నాయకులు తమ అనుచరులకో, మండల, రాష్ట్ర, జాతీయ జనాలకో ఇచ్చే పిలుపులు.

ఈ మధ్య ఇలాంటి పిలుపులు యెక్కువైపోయాయి. ప్రతీవాడూ పిలుపిచ్చేవాడే (అనుసరించేవాళ్లే తక్కువ!).

ఈ విషయంలో, (నేను చాలా గొప్ప గొప్ప ప్రయోగాలు చేశాను. కొత్త కొత్త రాగాలు కనిపెట్టాను, కట్టాను.....అని చెప్పడం లేదండోయ్!) అగ్రగణ్యుడు మన 'నికమ్మా' ప్రథాని. 

యే విషయం తీసుకోండి--"మా మంత్రికి లేఖ వ్రాశాను"; "అధికారులకి చెప్పాను"; "ప్రభుత్వం ఇలా చెయ్యాలని ఆదేశించాను"; "ప్రభుత్వం ఇలా అమలు పరచాలి" (అక్కడికి తానేదో ప్రతిపక్ష నాయకుడో, పొరుగుదేశపు ప్రథానో, గ్రహాంతరవాసో అన్నట్టు)--ఇలా పిలుపులిస్తూ పోతారు.

మొన్నటికి మొన్న, "మీ ప్రమాణాలు మెరుగుపరచుకోండి" అని మన భద్రతా దళాలకి 'పిలుపునిచ్చారు!'. "వుగ్రవాదులు పోరాట వ్యూహాల్లో సైన్యం తరహాలో సామర్థ్యాలను సంతరించుకుంటున్నారు" కాబట్టి, మీరుకూడా అలా సంతరించుకోవాలి! అన్నారట.

మనక్కావలసింది ఇలా పిలుపులిచ్చే ప్రథానులేనా? పిలుపు ప్రకారం ఆచరించి చూపెట్టిన లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్లా? ఇంకా, "ఇలా చెయ్యకపోతే, మీ తోలు తీస్తాం" అనే గడాఫీల్లాంటివాళ్లా?

ఆలోచించండి!

అన్నట్టు మన ప్రథాని తన నీలం రంగు పగిడీతో తప్ప ఇంతవరకూ యెవరికీ కనిపించలేదు. ఇప్పుడు 'మొహాలీ' లో చాలా మందిలాగా అదేదో మూడు రంగుల పగిడీ ధరించి కాసేపు టీవీల్లో కనిపించారు. నిజంగా చాలా అపురూప దృశ్యం!