Monday, October 25, 2010

కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

చూశారా మన డీజీపీ యెంత గొప్ప డిఫెక్టివో--సారీ--డిటెక్టివో?

తూ ర క (తూటా రక్షణ కవచాలు) లని ప్రైవేటు గా అమ్ముకొనే ఆలోచన తోనే 'యెవరో' తరలించారు అని కనిపెట్టేశారు.

మనలాంటి వెర్రివాళ్లు ఇన్నాళ్లూ అవేవో "గొరక "ల్లాంటి చేపలేమో, కూరొండుకు తినేద్దామని యెవరో తరలించారేమో అనుకుంటున్నాము!

ఇప్పుడు వాటిని యెక్కడికి తరలించారో ఆ భవనం చిరునామా డోరు నెంబరు తో సహా కనిపెట్టేసి, అవి తరలించిన ఆటో డ్రైవరునీ, వాచ్ మన్ నీ అరెస్ట్ కూడా చేశారట.

ఇంకెవరినో సస్పెండు కూడా చేశారట. మరి అవి యెవరికి అమ్మడానికి తరలించారో అని 'విచారిస్తూనే' వుంటార్లెండి--మనకి చెప్పరు.

ట్వీటర్లూ--ఇదేదో బావుందని అస్తమానూ, కీబోర్డు చేతిలో వుందికదా అని, బోరవిరుచుకుని "ట్వీట్"లు వ్రాస్తే........?

ఒకాయన ఓ రాత్రి తన కారు స్వయంగా నడుపుకుంటూ వెళుతుంటే, ఘోర ప్రమాదం జరిగింది. కారు నుజ్జునుజ్జయిపోయింది. తేరుకొని, దెబ్బలూ గట్రాల సంగతి చూసుకొని, ఆనక బీమా కంపెనీకి సమాచారమిచ్చాడట. పోలీసుల దగ్గరనించి ఎఫ్ ఐ ఆర్ వచ్చాక, కంపెనీకి క్లెయిమ్ పంపించాడట, పరిహారం కోరుతూ.

3 రోజులు తిరక్కుండా, క్లెయిముని తిరస్కరించారట. కారణమేమిటీ అనడిగితే, "మద్యం మత్తులో కారు డ్రైవు చేశావు" అన్నారట. ఇదేమిటీ.....పోలీసు నివేదికల్లోగానీ, క్లెయిం దరఖాస్తులోగాని దీని ప్రస్తావన లేదే....అని ఆశ్చర్యపడి, లేచి, "మీకీ సమాచారం యెక్కడిది?" అంటూ నిలదీశాడట బీమా కంపెనీని.

వాళ్లు.....ప్రమాదం జరగడానికి అరగంట ముందు ఆయన ట్విట్టర్ లో "పార్టీ బాగా జరిగింది. చాలా మత్తుగా వుంది. కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికెళ్తున్నాను" అని వ్రాసిన "కొక్కిరింత" ఆయన ముఖాన కొట్టారట!

ఓ 75 వేలకి కాళ్లొచ్చాయట!

నిర్లక్ష్యంగా మోటారు సైకిల్ నడుపుతూ, ఇద్దరిని ఢీకొట్టినందుకు, సెలెబ్రిటీ జాన్ అబ్రహాం కి 15 రోజుల సాధారణ జైలూ, 1500 జరిమానా విధించారట! బెయిలు మీద విడుదలయ్యాడుటలెండి.

12-10-10 : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం, బిజాపూర్ జిల్లా పామేడు లో మార్కెట్ నుంచి తిరిగివస్తున్న కానిస్టేబుళ్లమీద పొంచివున్న మావిస్టులు కాల్పులు జరిపి, ఒకడు అక్కడే మరణించగా, రెండో అతన్ని వెంబడించి, కాల్చి, గొడ్డలితో నరికి చంపేశారట. ఇది పోలీసు స్టేషన్ సమీపం లోనేట. ఇందులో 15 మంది మావిస్టులు పాల్గొన్నారట.

14-10-2010 న పాకిస్థాన్ లో వుత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతాల్లో అమెరికా జరిపిన క్షిపణి దాడుల్లో 11 మంది తాలిబాన్లు హతమయ్యారట.  

Friday, October 22, 2010

కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ


మొన్నెప్పుడో తమిళనాడులో దొంగలబడి గురించి విన్నాం.

ఇప్పుడు "వుగ్రవాదులకి" అల్ ఖైదా "ఆన్ లైన్" లో పాఠాలు మొదలెట్టిందట. 74 పేజీల "ఇన్స్ పైర్" అనే ఇంగ్లీష్ పత్రికని నిర్వహిస్తోందట. దీనికి ముందుమాట--ఇంకెవరు--ఒసామా బిన్ లాడెన్ వ్రాస్తూ, "అమెరికన్లనీ, పాశ్చాత్యులనీ చంపడానికి 'వ్యక్తిగత జిహాద్ ' చేపట్టాలి" అని పిలుపునిచ్చాడట!

"అల్టిమేట్ మౌవింగ్ మెషీన్" పేరుతో చిట్కాలు బోధిస్తున్నారట. ట్రక్కులతో విధ్వంసం యెలా? మొదలైన పాఠాలు నేర్పుతున్నారట. వీటికన్నా, భోజనవేళ, రద్దీగా వున్న రెస్టారెంట్లలో జొరబడి, తుపాకులతో విచ్చలవిడిగా కాల్పులు జరపడం వుత్తమమైనది అని కూడా చెపుతున్నారట!

ఇలాంటి రాక్షసులకి ఇంకా ఈ భూమిమీద నూకలు యెన్నాళ్లు వున్నాయో కదా!

==> హైదరాబాదు ఔటర్ రింగురోడ్డుకి సంబంధించిన కార్యాలయంలోని భూసేకరణకి సంబంధించిన దస్త్ రాలు మాత్రమే ఓ అగ్ని ప్రమాదం లో "దగ్ధమయ్యాయట!"

వింతేమితంటే, పది ఇనుప బీరువాలు దస్త్ రాలతోసహా మసైపోతే, ప్రక్కనే చెక్కబల్లలపై వున్న దస్త్ రాలు భద్రంగా వున్నాయట. ఇంకా, కోర్టులలో కేసులు నడుస్తున్న భూముల గురించిన దస్త్రాలు మాత్రమే కాలిపోయాయట. 

కార్యాలయం లో యేడు విభాగాలు ఒకే హాలులో వుండి, అన్నింటికీ విద్యుత్ ఒకే బోర్డులోంచి వెళుతున్నా, ఒక ప్రాంతానికే మంటలు పరిమితమయ్యాయట. బోర్డులోని ఎం సీ బీ లు "ట్రిప్" అయి వున్నాయట!

వాటిలో చాలామటుకు "పని అయిపోయినవే" అనీ, ఇంకా పని కావలసినవి ఓ నలభై, యాభై వుండచ్చనీ, వాటిని పునర్నిర్మించడం, కలెక్టరేట్లలో వుండే కాపీల ఆధారం గా పునరుధ్ధరించడం తేలికే అని వుప కలెక్టరు సెలవిచ్చారట!

==>ఆ మధ్య తూ గో జి పర్యటనలో చంద్రబాబు వంతాడ గ్రామం లోని లీజుల వ్యవహారం గురించి వెళితే, అక్కడకి ముందే సాక్షి టీ వీ వ్యాన్ వెళ్లి, కొంతమందిని రెచ్చగొట్టి, పంపించడం, "వాళ్లలో" అని చెప్పి, లక్ష్మి అనే గిరిజన మహిళమీద ఆయన చేయి చేసుకున్నాడనీ, దౌర్జన్యం చేశాడనీ, ఓ చిన్న విజువల్ ని పదే పదే చూపించి గోల చేసింది.

దాంతో కాంగీ లు, ఛీఫ్ విప్ శైలజానాధ్ లాంటివాళ్లూ "ఆయన మానసిక వ్యాధితో వున్నాడు" అనేంతవరకూ వెళ్లారు. 

మరి తరవాత ఆ మహిళే జరిగింది చెప్పి, ప్రెస్ కౌన్సిల్ లో కూడా సాక్షి మీద ఫిర్యాదు చేసింది!

మరి మానసిక వ్యాధి గ్రస్తులెవరో?

==> తూ గో జి, కాట్రేని కోన లో, సాకా పాపారావు అనే వ్యక్తి, గల్ఫ్ లో పెద్ద వుద్యోగాలిప్పిస్తానని, నిరుద్యోగుల నించి 6.5 లక్షలు నొక్కేశాడట. అతన్నించి 37 మంది పాస్పోర్టులు స్వాధీనం చేసుకొని, పోలీసులు కోర్టులో హాజరుపరిచారట.

Tuesday, October 19, 2010

కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

వుత్తమ చిత్రం గా నంది అవార్డు తెచ్చుకున్న "సొంత ఊరు", వుత్తమ నటి తీర్థ, వుత్తమ సహయనటుడూ వుత్తమ మాటల రచయితా ఎల్ బీ శ్రీరాం--చదువుతుంటే ఈ సినిమా యెప్పుడు చూస్తానో అనిపించింది. తీర్థ కొత్త అమ్మాయి, ఎల్ బీ శ్రీరాం పాతవాడే అయినా, గెటప్ బాగుంది--పాత్రే కనబడేలా--వుచ్చారణా పధ్ధతి మార్చాడో లేదో. ప్రక్కనే తనికెళ్ల భరణిని చూస్తే మాత్రం, ఇలాంటి గుర్తు పట్టే ముఖాలని ఇలాంటి చిత్రాల్లో కూడా యెందుకు నటింపచేస్తున్నారో? అనిపించింది. అందరూ కొత్తవారితో తీస్తేనే ఇలాంటి చిత్రాలు బాగుంటాయి. తగిన నటులు దొరక్కపోరు....డబ్బులు యెలాగూ రావు అని ముందే తెలుసుగా? అదృష్టం కొద్దీ వస్తే ఇంకా మంచిది కదా?

దేశం లోని యేడు మెట్రో నగరాల్లో ఫ్లాట్ల అమ్మకాల్లో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలం లో 40% క్షీణత కలిగినట్టు ఆసోచాం సర్వే నివేదిక చెప్పిందట. దీనిక్కారణం వుక్కూ, సిమెంటూ వగైరాల పెరుగుదల వల్ల రెండు పడకగదుల ఫ్లాట్లు 30 నించి 45 లక్షల 'మేర' పెరగడమేనట.

వీళ్లు బయటపెట్టిన ఇంకో రహస్యం యేమిటంటే, స్పెక్యులేటర్లు భవిష్యత్ లాభార్జన వుద్దేశ్యం తో ముందస్తుగా వీటిని కొనేసి (బ్యాంకు అప్పులతోనేకదా!), కృత్రిమ కొరతలు సృష్టించి, రేట్లు పెంచి అమ్ముకుంటున్నారట!

స్థిరాస్థి రంగం లో అదే కాలం లో పెట్టుబడులు 37% పెరిగాయట. బ్యాంకులు 'టీజర్ రేట్లు ' కొనసాగించడం తో విక్రయాలు జోరందుకోవచ్చని ఆశాభావం వ్యక్త పరచిందట ఆ నివేదిక!

రాష్ట్రం లో 450 కోట్ల ఆథార్ వ్యవహారం లో "కుక్కతోక" ప్రజా పంపిణీ విభాగం లో ఓ పౌర సరఫరా అధికారి ఇష్టా రాజ్యం నడుస్తోందనీ, అప్పుడే కళ్లు బైర్లు కమ్మే అవినీతి జాడలు బయటపడుతున్నాయి అనీ వార్తలొచ్చాయి.

1993 ముంబాయి బాంబు ప్రేలుళ్ల కేసులో నిందితుడు ఇమ్రాన్ అనబడే సయ్యద్ ముసద్దీన్ ఖాద్రీ "యేడేళ్ల క్రితమే తాను హత్యచెయ్యబడ్డాను" అని పోలీసులని నమ్మిoచి, 2003 నించీ హైదరాబాదులోనే మకాం చేసి అనేక రకాల అత్తరు వ్యాపారాలు చేస్తున్నాడట! మళ్లీ ముంబాయి వుగ్రవాద నిరోధక దళం పోలీసులు వచ్చి సోదాలు చేసి, పట్టుకుంటే గానీ దొరకలేదుట! మన నిఘా వ్యవస్త యెంత బాగుందో!

తృటిలో తప్పిన......లు (రైళ్లు) :

13-10-2010 న కొచ్చి వ్యాలీ నుంచి హైదరాబాదు వెళ్తున్న 'శబరి' ఎక్స్ ప్రెస్ గుంటూరు జిల్లా బాపట్ల స్టేషను కి కిలో మీటరు ముందు "రెడ్" సిగ్నలు వేసివున్నప్పటికీ, డ్రైవర్లు పట్టించుకోకుండా బండిని స్టేషన్లోకి విజయవంతంగా తీసుకొచ్చేశారట! ఈ డ్రైవర్లని అక్కడ దింపేసి, తెనాలినుంచి వేరే డ్రైవర్లని రప్పించి, యెప్పుడో తీరికగా బండిని పంపించారట. ఈ డ్రైవర్లకి వైద్యపరీక్షలు నిర్వహింపచేసి, మద్యం మత్తులో వున్నారని తెలుసుకొని, సస్పెండు చేసి, అనంతరం "విచారిస్తున్నారు"ట.

18-10-2010 న విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రత్నాచల్ సూపార్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఏ సీ బోగీ క్రింద మంటలు వ్యాపిస్తే, తాడేపల్లిగూడెం లో 3 గంటలపాటు ఆపేసి, ఈ బోగీకి ప్రక్కనే వున్న సాధారణ బోగీలోంచి జనాలు దూకేసి, తొక్కిసలాడి, ఒకరు స్వల్పంగా గాయపడి, రైలు ఆగడం తో మంటలు ఆరిపోగా, యాక్సిల్ బాక్స్ పూర్తిగా కాలిపోయి, యేదో తంటాలు పడి, మళ్లీ ఆ.........లస్యంగా రైలుని పంపించారట. 

Friday, October 15, 2010

కబుర్లు

అవీ, ఇవీ.........!


కామన్వెల్త్ క్రీడలు ముగిశాయి. మనవాళ్లు పతకాలు శతకం దాటించి, రెండో స్థానం లోకి రావడం అత్యంత ముదావహం!

సమాప్తి వుత్సవాలు కూడా చాలా బాగున్నాయి. కానీ నాకు 2010 మంది పిల్లల చేత విన్యాసాలు చేయించి, వాళ్ల నెత్తిమీదనించి రంగులు గుమ్మరించి, మధ్యలో అశోక చక్రాన్ని వుంచి, దాని చుట్టూ "అక్కడక్కడా" కాషాయ, ఆకుపచ్చ రంగులని చల్లించడం--నచ్చలేదు.

వీటిని ఇంత విజయవంతం చెయ్యడానికి శ్రమించిన వారందరికీ "హ్యాట్స్ ఆఫ్!"

1986 లో, ఓ పోర్టబుల్ బ్లాక్ & వైట్ టీవీ కొనుక్కున్న తరవాత, ఒలింపిక్సేననుకుంటా--బ్యాంకుకి సెలవుపెట్టి మరీ చూశాను. మళ్లీ ఇన్నేళ్ల తరవాత (వుద్యోగం వదిలెయ్యడం వల్ల) అప్పట్లో లేని కొత్త కొత్త క్రీడలతోసహా చాలా వాటిని చూడగలిగాను. 

1982 లో రంగులతో ఆవిర్భవించిన మన దూరదర్శన్, అప్పటి నించీ పరిణతి చెందుతూ, ఇప్పుడు చక్కగా క్రీడలని 
చూపించగలగడం కూడా--చెప్పుకోతగ్గది. వారికి కూడా నా జోహార్లు! 

జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (JNNURM) క్రింద గుజరాత్ కి 7,998 కోట్లు ఇస్తే, ఆ రాష్త్రం కేంద్రప్రభుత్వం (అంటే.....తన) పేరు తలుచుకోడం గానీ, కనీసం ఆ పథకం గుర్తునైనా కనపడనివ్వడం లేదు అని భోరుమన్నాడట--ఓ యెలక్షను మీటింగులో మన జైపాల్ రెడ్డి!

అంటే--కృతఙ్ఞతా పూర్వకం గా యే రాష్ ట్రమైనా, 'కాంగ్రెస్ ని గెలిపించండి ' అని చెప్పాలా? అలా చెపుతారని ఆశించే నిధులిస్తోందా కేంద్రం? యేమో!

ఈ సంగతి విన్నారా

మన కలకత్తా హైకోర్టు ఇప్పటికీ "బ్రిటిష్ రాణి" అధీనం లోనే వుందట!

నిజమా?.......మనకు స్వతంత్రం వచ్చి.......? అని అడగకండి.

ఈ హైకోర్టుని--భారత ప్రభుత్వం యేర్పాటు చెయ్యలేదు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం కూడా యేర్పడలేదు.....బ్రిటిష్ రాణి వ్రాసిన "అధికారిక లేఖ" ప్రకారమే యేర్పడింది!

అందుకని, తాము కేంద్రీయ సమాచార సంఘం పరిధిలోకి రాము--అని ఆ కోర్టు ప్రజా సమాచార అధికరి ఇమ్రాన్ హఫీజ్ అనే ఆయన ఓ గొప్ప "లా పాయింటు" లేవనెత్తాడట.

అప్పటి ప్రథాన సమచార కమీషనర్ వజహత్ హబీబుల్లా, "మరి మీకు జీతాలు ఆ రాణి ఇవ్వడంలేదు కదా? భారత సంచిత నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది కదా?" అంటే, చచ్చినట్టు అంగీకరించారుట!

రైళ్లు--

09-10-2010 న ఈస్టుకోస్టు డివిజన్ నించి కొండపల్లి కి బొగ్గును తీసుకెళుతున్న గూడ్స్ రైలు యేలూరులో ఆగి వుండగా, బ్రేకు నించి 6వ వ్యాగన్ లో పొగలు వచ్చాయట. గమనించకుండా రైలు వెళ్లిపోయి వుంటే, గాలికి మంటలు చెలరేగి, బొగ్గు అంతా దగ్ధం అయ్యేదేమో అని గార్డు చెప్పారట.

అదే రోజున--బీహారులోని ఖతియార్ జిల్లలో ఖైరా లో ఓ ఆటో రైల్వేగేటు దాటుతూండగా, 100 కి మీ స్పీడులో వస్తున్న గౌహతి-న్యూ ఢిల్లీ రాజధాని ఢీకొట్టడం తో, ఓ చిన్నారి, ఇద్దరు మహిళలతో సహా 8 మంది మృతి చెంది, దేహాలు చెల్లా చెదరుగా ట్రాక్ పై పడ్డాయట. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయట. మమతాదీ బాధిత 'కుటుంబాలకి ' 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారట! 

Wednesday, October 13, 2010

కబుర్లు




అవీ, ఇవీ, అన్నీ


"మమతాదీ చెప్పిందీ......"--యెదురెదురుగా వస్తున్న రైళ్లు 'ఒకే పట్టాలపై' రాకుండా నిరోధించే పరికరం 'సిధ్ధం' అయిందనీ, దీంతోపాటు 'అత్యాధునిక ' సిగ్నలింగ్ వ్యవస్థని త్వరలో ప్రవేశ పెట్టబోతున్నాము అనీ!

(ఇంతకు ముందు మంత్రులు వీటి పై దృష్టి పెట్టక పోవడం వల్లనే పాత 'మౌలిక వసతులతో' అయినా 'సమర్థవంతం గా' నెట్టుకు వస్తున్నాము--అని కూడా అందట! ఇంకా, వచ్చే రెండేళ్లలో రైల్వేలు 'స్వయం సమృధ్ధిని ' సాధిస్తాయట! ఈ లోపల యెలక్షన్లేమీ లేవే?)

ఓ ముఫై మూడేళ్ల క్రితం, మధు దండావతే గారు 'సామాన్యుల సీట్లకి ' కూడా, కుషన్లు వేయించి పుణ్యం కట్టుకున్న తరవాత, రైల్వేలలో యేమైనా 'అభివృధ్ధి ' జరిగిందా? అప్పటినించీ యెన్ని "యాంటీ కోలిజన్ డివైసెస్" గురించీ, "అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థల" గురించీ యెన్ని ప్రకటనలు వెలువడలేదు? యెన్ని కోట్లు ఖర్చు పెట్టారు? 

అంతకు ముందు క్రిందికి వాలే సిగ్నల్ "రెక్కలని" దుండగులు బలవంతం గా క్రిందికి వాల్చేస్తున్నారనీ, అందుకని రెక్కలని "పైకి" లేపే వ్యవస్థని ప్రవేశపెట్టామనీ, సిబ్బంది అందరికీ "వాకీ టాకీ" లని ఇచ్చామనీ, ఓ లైన్లో యేదైనా రైలు ఆగి వుంటే, వచ్చే రైలు "ఆటోమేటిగ్గా" లూపు లైన్లోకి వెళ్ళే వ్యవస్థని ప్రవేశపెట్టామనీ--ఇలా యెన్ని చూడలేదు?
  
ఇదివరకు, విజయవాడ స్టేషన్ లో 5, 6 & 7 ప్లాట్ ఫారాలమీదకే ముఖ్యమైన "పెద్ద" రైళ్లన్నీ వచ్చేవి--20 నిమిషాల నుంచీ 30 నిమిషాల వరకూ ఆగేవి! ఇంక 1, 2, 3, 4 ప్లాట్ ఫారారాలమీద ఆగే చిన్నా చితకా ఎక్స్ ప్రెస్ లూ, ప్యాసింజరులూ ఆగే టైము దైవాధీనం! 

అందరూ 5, 6 ప్లాట్ ఫారాలమీదున్న క్యాంటీన్ కి వెళ్ళి, పొగలు కక్కుతున్న ఇడ్లీ, వడా, దోశా, వుప్మా, వెజిటబుల్ పలావ్ వగైరా లని తృప్తి తీరా తిని, పార్సెళ్లు కట్టించుకొని తమవాళ్లకి తీసుకెళ్లే వారు! ప్రయాణం ఆలస్యమయ్యిందని యెవరూ యేడిచేవారు కాదు! (నాన్-వెజ్ రెస్టారెంటు కూడా వుండేది)

ఇప్పుడు 5, 6 ల్లో ఆ క్యాంటీను వుందో లేదో గానీ, తినడానికీ, పార్సెళ్లకీ అంత టైము వుండటం లేదు--'దురంతో' లు వగైరా పుణ్యమా అని. ఇక 1 నుంచి 4 లో, అర్థ రాత్రి కూడా, యెప్పుడో మధ్యాహ్నం వేసిన ఇడ్లీలూ, దోశలూ, వడలతో సరిపెట్టుకోవలసి వస్తోంది--అది కూడా తక్కువ టైములో 'సాహసం' చెయ్యగల వాళ్లకే!

మమతాదీ! మరింకేం? 22వ శతాబ్దం లోకి వెళ్లిపోదామా?

"మన దేశం.......విప్లవంలో.....ముందడుగు....! (ట)"

రాష్ట్రం లో 6 వేల పంచాయితీలు వచ్చే 6 నెలల్లో "ఈ-పంచాయితీ"లుగా మారబోతున్నాయట! ప్రతీ పంచాయతీనీ "ఆన్ లైన్" చేసి, "ఇంటర్ నెట్" సౌకర్యం కల్పిస్తారట! కేంద్రం ఇందుకు ముందుకు వచ్చిందట!

మరింకేం? ప్రభుత్వమూ--గుత్తేదారులూ--సలహాదారులూ--టెండర్లూ--కోట్ల కోట్లూ--మమూలే!

ఇంతకీ "బొచ్చె" వారూ--మనకేటి?

రాష్ట్రం లో మొత్తం 3800 జూనియర్ కళాశాలలు వుంటే, అందులో ప్రభుత్వ జూనియర్ కళాశాల (ప్ర జూ క) లు 804 ట. వీటికి బోధనా సిబ్బంది 12 వేల మంది వుండాల్సి వస్తే, వున్నది 5,700 మందేనుట.

అందుకేనేమో--వాటిల్లో ఈ యేడాది "ఒక్క విద్యార్థీ చేరని" సెక్షన్లు 321 అయితే, పది మంది లోపు చేరినవి 100 సెక్షన్లట!

మరి లెఖ్ఖలెలా సరిపెడతారో!

Monday, October 11, 2010

కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

విన్నారా?

చిలుకూరు బాలాజీని "సాఫ్ట్ వేర్" బాలాజీ అనీ, "వీసా" బాలాజీ అని అంటున్నారు.

ఈ ఆలయ ధర్మకర్త దీన్ని దేవాదాయ శాఖకి ఛస్తే అప్పగించనని కచ్చేరీ (కోర్ట్) లలో దెబ్బలాడుతున్నాడు. యెందుకివ్వాలి? డాలర్ల పంట పండుతుంటే--అని కొంతమంది అంటారు.

ఒకవేళ అప్పగిస్తే, స్వామి మహిమలన్నీ గల్లంతవుతాయని ఆయన నమ్మకమేమో--అని కొంతమంది అంటారు.

చెన్నైలో అన్నానగర్ లో "క్రికెట్ " గణేశుడి గుడి వుందట. క్రికెట్ పాడ్లూ గట్రా కట్టుకున్న 10 తలల వినాయకుడి విగ్రహానికి చెరో వైపూ, బౌలర్ వినాయకుడూ, బ్యాటర్ వినాయకుడూ వున్న విగ్రహాన్ని పూజిస్తారట--క్రికెట్ లో భారత్ విజయం కోసం!

కర్ణాటక లోని వుత్తర కన్నడ జిల్లాలో రెండు వందలేళ్లనాటి "ఖప్రీ " ఆలయం లో అదే పేరుతో వున్న దేవుడికి, 'నాలుగు పెగ్గుల నాటు సారా, సిగరెట్లూ' నైవేద్యం పెడితే చాలు--అంతా ఆయనే చూసుకుంటాడట.

జం షెడ్ పూర్ లోని కల్లూ బాగన్ లో ఓ దర్గాలో "మిస్కిన్ షా" కి ఓ దరఖాస్తిచ్చేస్తే, అంతా ఆయనే చూసుకుంటాడని 1930 నించీ నమ్మకమట. అక్కడున్న రావి, మర్రి చెట్లకి అర్జీలు వ్రేళ్లాడుతుంటాయట.

అరుణాచల్ ప్రదేశ్ లోని సేల పాస్ దగ్గర ఒకప్పటి సైనికుడూ, 1962 చైనా యుధ్ధం లో వీరోచితం గా పోరాడిన "జస్వంత్ సింగ్ రావత్" కి జస్వంత్ బాబా పేరుతో గుడి కట్టారట. ఈ బాబాకి "సమోసా" నైవేద్యం పెట్టి, యుధ్ధానికి వెళితే విజయం వరిస్తుందట!

(పైవన్నీ ఈనాడు ఆదివారం లో వచ్చినవే!--అన్నట్టు ఈనాడు వారు తమ నమూనా ప్రకటన--5వ వివాహ....నుంచి "5వ" ని తొలగించారు! సంతోషం)

మొన్న 03-10-2010 న యేలూరులో నిర్వహించిన ఎస్ కే డీ ఆర్ అర్థ శహస్రాబ్ది పట్టాభిషేకాల్లో, ఆచార్య కొలకలూరి ఇనాక్ "తెలుగంటే, తేనెజల్లులు కురిపించే మేఘం" అన్నారట.

సహస్రావధాని కడిమెళ్లవారు మాట్లాడుతూ--రాజ రాజ నరేంద్రుడి పట్టాభిషేకమై 1000 యేళ్లు అయిన సందర్భం లో ప్రభుత్వం మహోత్సవాలు నిర్వహించాలి--అన్నారట!

గీతా రెడ్డి కి వినిపించిందో, లేదో?

నేనిదివరకే అన్నాను--ఇక్ష్వాకుల దగ్గరనించీ, శాతవాహనుల దగ్గరనించీ, చేర, చోళ, పాండ్య, పల్లవ రాజులందరికీ ఇలాంటి (చివర సున్నాలు వచ్చే 'అబ్దుల ') వుత్సవాలు నిర్వహిస్తారా? అని.

చేస్తే మంచిదే కదా--జనాలకి కోట్లే కోట్లు!

"తృటిలో తప్పిన"......లు

రైళ్లు :

మొన్న 05-10-2010 న సికింద్రాబాద్-గుంటూరుల మధ్య నడిచే "గోల్కొండ" ఎక్స్ ప్రెస్ లో, బ్రేక్ బైండింగ్ జామ్ కావడం వల్ల పొగలొచ్చి, వరంగల్-చింతపల్లి ల మధ్య కాసేపు ఆగిపోతే, భీతిల్లిన ప్రయాణీకులు దిగిపోయి, పరుగులు పెట్టారట. మరమ్మత్తులయ్యాక, ఓ పావుగంట తరవాత మళ్లీ బయలుదేరిందట.

చింతపల్లి స్టేషన్ ఇంకా రాకుండానే, యే సీ బోగీ క్రింద వుండే డైనమో బెల్ట్ తెగిపోవడం తో, మరోసారి నిలిచిపోయిందట. మరెప్పుడు బయలుదేరిందో తెలీదు.

విమానాలు :

మొన్న 02-10-2010 న ఎయిరిండియా కి చెందిన కొచ్చి-కొజికోడ్-రియాధ్ విమానం కొజికోడ్ నించి బయలుదేరిన అరగంట తరవాత కేబిన్ లోంచి పొగరావడం గమనించిన పైలట్ అప్రమత్తమై, కొచ్చిలో దింపి, అందులో వున్న 197 మంది ప్రయాణికులనీ, 12 మంది సిబ్బందినీ క్షేమం గా ఖాళీ చేయించి, మరో విమానం లో వాళ్లని రియాధ్ పంపించారట.


Saturday, October 9, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

ఎల్ టీ టీ ఈ పోయిన్నప్పటినించీ చిదంబరం నోరు బాగా పెగులుతోంది.

వుగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఈస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (SIMI), ఆర్ ఎస్ ఎస్ "ఒక్కలాంటివే" అన్నాడట.

(ఈయన వివిధ శాఖల మంత్రి గా యెన్ని కోట్లు సంపాదించాడో యెవరైనా ఓ కమీషను వేసి, బయటపెడితే బాగుండును!)

తందాన తాన అంటూ దిగ్విజయ్ సింగ్, అందులో తప్పేమీ లేదు అన్నాడట.

మరి ఆర్ ఎస్ ఎస్ వాళ్లు యెక్కడ టిఫిన్ బాక్స్ బాంబులూ, ప్రెషర్ కుక్కర్ బాంబులూ పెట్టారో, యెక్కడ ఆత్మాహుతి దాడులు చేశారో వివరిస్తే బాగుండేది వీళ్లు.

ఆర్ ఎస్ ఎస్ చాలా గొప్పది కాకపోవచ్చు, కానీ అనేముందు మనం యేమంటున్నామో అలోచించాలా వద్దా?

రాష్ట్ర ప్రభుత్వ వున్నత పాఠశాలల్లో కంప్యూటర్ విధ్య 2008 లో 5000, ఈ యేడాది జూలై లో 1300 పాఠ శాలల్లో సుమారు 500 కోట్ల తో శ్రీకారం చుట్టారట. ఇందులో 25% నిధులు రాష్ట్ర ప్రభుత్వం, మిగతా కేంద్రం భరిస్తాయట. ఒక్కో జిల్లాలో 180 నించి 300 లోపు పాఠశాలల్లో ఈ పథకం అమలవుతోందట.

ఇక పాత ప్రభుత్వం--గుత్తేదారులూ కథ మామూలే. దాదాపు అన్ని జిల్లాలలో ఈ పథకం 'పడకేసిందట '.

శ్రీకాకుళం జిల్లాలో 175 పాఠశాలల్లో వొక్కోదాంట్లో కనీసం వుండవలసిన 11 కంప్యూటర్లలో వొక్కటీ లేదట.

నెల్లూరు జిల్లలో 34 పాఠశాలల్లో కంప్యూటర్లు యెప్పుడో మొరాయించాయట.

6300 పాఠశాలల్లో కంప్యూటర్ విద్య కొనసాగుతుండగా, 5253 పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్లు సమకూర్చామనీ, వీటిలో 4564 స్కూళ్లలో మాత్రమే "ఇంటర్నెట్" సదుపాయాన్నీ కల్పించినట్టూ డీ యీ వో లు చెపుతున్నారట--కానీ వాస్తవ పరిస్థితి వేరట!

కొన్ని చోట్ల కంప్యూటర్లని స్థానికులు సొంత అవసరాలకి వాడుకుంటున్నట్టు ఆకస్మిక తనిఖీల్లో బయట పడిందట.

కొసమెరుపేమిటంటే, విద్యార్థులు యెంత పరిఙ్ఞానం సంపాదించారో సంవత్సరాంతం లో 'అంచనా వేసే' వ్యవస్థే విద్యా శాఖలో లేదట!

కంప్యూటర్ పథకాలూ--వర్థిల్లండి.

'వుపాధి ' పథకం ప్రారంభించినప్పటి నించీ ఇప్పటికి 13000 కోట్లు ఖర్చు చేశారట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో 7.80 లక్షల కుటుంబాలకి 100 రోజుల పని కల్పించారట.

డిసెంబరు నుంచి బయోమెట్రిక్ విధానం లో కోటి మందికి "స్మార్ట్ కార్డులు" జారీ చేసి, అక్రమాలు 'పూర్తి స్థాయిలో' అరికడతారట.

UNESCO వారు మన హైదరబాదులోని "చౌమొహల్లా పేలస్" కి 'ఆసియా పసిఫిక్ హెరిటేజ్ మెరిట్ అవార్డ్' ఇచ్చారట.

ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడ్డ కట్టడాలని బాగా సం రక్షించిన సందర్భం లో ఈ అవార్డు ఇస్తారట.

ఈ భవనం క్రమం గా పాడయిపోతే, నిజాం ప్రతినిధి బర్కత్ ఆలీ ఖాన్ ముకర్రం జా కుటుంబీకులు ఐదేళ్లపాటు మరమ్మతులు నిర్వహింపచేసి, ప్రజల సందర్శనకి యేర్పాట్లు చేశారట.

ఇక్కడి ప్రథాన ద్వారం పై కనిపించే "కిల్వత్ క్లాక్" అనే గడియారం 250 యెళ్లనించీ టిక్ టిక్ అంటూనే వుందట!

ఇలాంటివి--నిజమైన పురాతత్వ సంపదలంటే!

Saturday, October 2, 2010

పాత (తాజా) కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ


మణి శంకర్ అయ్యరొకడు--కేంద్ర ప్రభుత్వానికీ, కాంగ్రెస్ కీ విలన్ అయిపోయాడు. (ఇదివరకు సుబ్రహ్మణ్యం స్వామి అని ఓ ఐరన్ లెగ్గుండేవాడు--ఇప్పుడూ వున్నాడేమో తెలీదు--ఈయన కూడా అలాంటి ప్రణాళికలేమైనా వేసుకున్నాడేమో తెలియదు).

"స్టాక్ మార్కెట్లు బాగుంటే, అంతా బాగున్నట్టేనా?" అని ప్రశ్నించాడు మొన్న. ఇంకా, వీటికి ప్రభుత్వ సంపూర్ణ మద్దతు లభిస్తోందనీ, వాటి బాగే సామాన్యుడి బాగు అన్నట్టు ప్రవర్తిస్తోంది అనీ, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం లేని సొమ్ముని మార్కెట్లో పెట్టేందుకు అనుమతిస్తున్నారనీ, మన స్టాక్ మార్కెట్లో 44 శాతం ఇలా "మారిషస్" నించి వచ్చినవే అని కూడా అన్నారు.

సత్వర వృధ్ధి ఫలాలన్నీ "ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చెయ్యడానికే" అనీ, వీటివల్ల ఆదాయం పెరగబోవడం లేదు అని కూడా అన్నారు.

మరి ప్రభుత్వమేమీ మాట్లాడడం లేదు--సెన్సెక్స్ 20 వేల పాయింట్ల చుట్టూనే తిరుగుతోంది!

నమ్ముతారా? మన 77 మంది కేంద్ర మంత్రుల్లో 26 మందికి స్వంత వాహనాలే లేవుట!

స.హ. దరఖాస్తుతో, సుభాష్ చంద్ర అగర్వాల్ అనే ఆయన ప్రథాని కార్యాలయం నించి ఈ వివరాలు రాబట్టాడట.

కార్లు వున్నవారిలో కూడా కొంతమందివి పాత డొక్కు కార్లేనట!

సుశీల్ షిండే 37 యేళ్ల వయసున్న పాత ఫియెట్ లోనే తిరుగుతున్నారట! (15 యేళ్లు దాటితే మళ్లీ లైఫ్ టాక్స్ కట్టాలనీ, 20 యేళ్లు దాటిన కార్లు ఇక తిరగకూడదు అనీ వినిపిస్తున్న రూల్స్ ఈయనకి వర్తించవేమో).

ఎం ఎస్ గిల్ పాతికేళ్ల నాటి ఓక్స్ వాగన్ జెట్టానీ; కమల్ నాథ్ పాత అంబాసిడర్నీ; సీ పీ జోషీ పదిహేనేళ్ల పాతదైన ప్రీమియర్ పద్మిని నీ; వయలార్ రవి 18 యేళ్ల వయసున్న ఫియట్ నీ; ప్రకాశ్ జైస్వాల్ 14 యేళ్లనాటి మారుతీ ఎస్టీం నీ మాత్రమే వాడుతున్నారట. నమోనారాయణ్ మీనా పేరున ఒక్క ద్విచక్ర వాహనం మాత్రమే వుందట.

కోటీశ్వరులూ, రాజకీయాల్లో చక్రాలూ, మలుపులూ తిప్పేవాళ్లూ, శరద్ పవార్, ఆనంద్ శర్మ, ఎ రాజా, విలాస్ రావ్ దేశ్ముఖ్ లకి అసలు వాహనాలే లేవట!

పాపం మన వోట్లమీదే బతుకుతున్నారుగా మరి!

మొన్ననే రోశయ్య రాష్ట్ర కొత్త పర్యాటక విధానాన్ని ప్రకటించారట.

సాగర్ వద్ద "అతి పెద్దదయిన" ఆధునిక వుద్యాన వనాన్ని నిర్మిస్తారట! ఇది మైసూరులోని బృందావన్ గార్డెన్స్, బెంగళూరు లాల్ బాగ్ తరహాలో వుంటుందట!

అయ్యా! యెవరైనా ఆ రెండు గార్డెన్లనీ ఒక్కసారైనా పూర్తిగా చూశారా? రెండోసారి యెప్పుడైనా వెళ్లారా? 

భార్యా, పిల్లలూ, బంధువులతో అంతదూరాలు నడవలేక, అవన్నీ చూడకుండా వుండలేక, ఒకవేళ యెవరికైనా చూపించాల్సి వస్తే, మీరు అలా వెళ్లి రండి, మేమిక్కడే వుంటాము అని గేటు ప్రక్కనే సెటిలయ్యే లోకల్ వాళ్లలా, మీరెప్పుడూ అనుభవించలేదా?

పర్యాటకానికి అవసరమనుకుంటే, ఇప్పుడు వున్నవాటికి పరిసరాలు కాస్త శుభ్రం గా వుంచి, మూత్రశాలలూ అవీ కట్టిస్తే చాలు--పర్యాటకం వర్థిల్లుతుంది! యెందుకీ అనవసర ఖర్చులు? (రోశయ్యగారూ....చక్రం అడ్డు వెయ్యండి మరి)

మంగళంపల్లి బాలమురళీ కృష్ణకి  "  భారత రత్న" ఇవ్వాలి అనీ, దాని కోసం తాను ఇప్పటికే మాట్లాడుతున్నాను అనీ సుబ్బురామి రెడ్డి ప్రకటించాడు మొన్నో సభలో! నేనే మంగళంపల్లి అయితే......థూ!

అన్నట్టు, మొన్న రాష్ట్రపతి విమానం 3 నిమిషాలపాటు రాడార్ లో కనపడలేదనుకున్నాం కదా--'సంబంధాలు తెగిపోలేదు ' అని విమానయాన శాఖ ప్రకటించింది ఆ మర్నాడే. ఒక మానిటర్ పనిచెయ్యకుండా ఆగిపోవడంతో వేరే మానిటర్ కి అనుసంధానం చేశాము అనీ, 3 నిమిషాల్లో మొదటి మానిటర్ బాగుకూడా అయ్యింది అనీ వెల్లడించారు! (వూహించుకోండి యేమి జరిగిందో)

24-09-2010 న ప.బెంగాల్, మిడ్నపూర్ జిల్లాలో ఓ మిగ్ 27 విమానం మంటల్లో చిక్కుకొని కూలిపోయిందట. పైలట్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడట. 1962 చైనా యుధ్ధం సమయంలో మనం అడిగితే, 1965 పాకిస్థాన్ యుధ్ధం నాటికనుకుంటా, రష్యా మనకి సరఫరా చేసిందీ మిగ్ లని. పాక్ వాళ్ల అమెరికన్ Gnat లకీ, మన మిగ్ లకీ ఘోర యుధ్ధాలు జరిగాయి 1965 లో.

మనం ఇప్పటికీ ఆ మిగ్ లని శిక్షణ వగైరాలకోసం వాడుతున్నాము. కొన్ని విధిలిఖితాలు తప్పవు మరి--ప్రస్తుత ముసలి బ్రహ్మని వదిలించుకొని, కొత్తవాణ్ని తెచ్చుకొనేవరకూ!

యేమంటారు?

Friday, October 1, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

ఆలస్యం అయితే అయ్యిందిగానీ, బంగారం లాంటి తీర్పు వచ్చింది అలహాబాదు హైకోర్టు ధర్మాసనం నించి! ఇంతకన్నా యెవరూ గొప్పగా తీర్పు చెప్పలేరు--అనవసర రాధ్ధాంతాలకి తావులేకుండా!

ముస్లిం సున్నీ వక్ఫ్ బోర్డ్ మాత్రం, దాదాపు వాళ్లు లేవనెత్తిన ప్రతీ విషయాన్నీ, ముగ్గురు న్యాయమూర్తులూ
కొట్టేసినా, "  అంతా నాకే కావాలి "   అని సుప్రీం కోర్టుకి వెళ్లడానికి ఆలోచిస్తామంటోంది!

వీళ్లని చూసి, హిందూ మహాసభ కూడా, అదే ఆలోచనని వెళ్లగక్కింది!

సుప్రీం కోర్టు వీళ్ల అప్పీళ్లని మొదట్లోనే కొట్టేస్తుందని ఆశిద్దాం!

తీర్పు ముఖ్యాంశాలని చదవాలంటే.......www.rjbm.nic.in కి వెళ్లండి.

సెప్టెంబర్ 18 నాటికి ఆహార ద్రవ్యోల్బణం 16.44 శాతానికి చేరిందట. ఇంకా అసలు పండగలు దసరా, దీపావళీ ముందే వున్నాయి! అప్పటికి 30 శాతానికి చేరినా ఆశ్చర్యపోనక్కరలేదు!

బియ్యం రేట్లు తగ్గిపోతున్నాయని, మిల్లర్లు మళ్లీ మంత్రాంగం చేస్తున్నారట--సంబంధిత శాఖ ద్వారా సిఫార్సు చేయించుకొని, ముఖ్యమంత్రిని కలవడానికి సిధ్ధం గా వున్నారట--బియ్యాన్ని యేజిల్లాలో అయినా ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు--అనే ప్రతిపాదన తో! (ఆ వంకన ఇతర రాష్ట్రాలకీ, దేశాలకీ ముసుగుల్లో అమ్మేసుకోవచ్చు అని వాళ్లల్లోనే కొంతమంది సంబరపడుతున్నారు! రోశయ్యా......వులకొద్దు, పలకొద్దు!)

ఆరు బ్యాంకులు తమ బేస్ రేటుని పెంచాయట--ఓ అర శాతం! మిగిలిన బ్యాంకులూ పెంచడానికి సిధ్ధం గా వున్నాయి. 

వాటితోపాటే ప్రత్యేక స్కీముల కింద డిపాజిట్ల మీద వడ్డీ రేట్లూ పెరుగుతాయి! ఋణాలమీద "టీజర్" రేట్లు డిసెంబరు నెలాఖరు దాకా కొనసాగవచ్చంటున్నారు. ఇదంతా యెంతసేపు--మళ్లీ రిజర్వ్ బ్యాంకు 'తగ్గించండి, తగ్గించండి ' అనేంతవరకూ!

"  తృటిలో.........."--రంగారెడ్డి జిల్లా, బషీరాబాద్ మండలం, మంతట్టి రైల్వే స్టేషన్ లో, గురువారం (30-09-2010) న రాత్రి 7-30 కి గోరఖ్ పూర్ నించి సికిందరాబాదు వెళ్తున్న ఎక్స్ ప్రెస్సూ, హైదరాబాదు నించి వాడీ వెళ్తున్న ప్యాసింజరూ, ఒకే పట్టాలపై, యెదురెదురుగా వచ్చేశాయట! పాపం ఆ డ్రైవర్లే జాగ్రత్తపడి, గుద్దుకోకుండా ఆపేశారట! రెండు రైళ్లలోనూ కొన్ని వందలమంది ప్రయాణిస్తున్నారట! 

ఒకవేళ డ్రైవర్లకి సాధ్యం కాకపోయి వుంటే!!!???...............గాడ్ ఓన్లీ హెల్ప్డ్ డ్! రైల్వే అధికారులు "విచారించడం" మొదలెట్టారట. మమతాదీ--యెన్నికోట్లు కేటాయించిందో--రైల్వే భద్రతకి!--అవేమౌతున్నాయో!

అవండీ సంగతులు.