Thursday, September 23, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

సంగతి విన్నారా?

అరవ్వాళ్లెంతకైనా తగుదురు. 

మనం సినిమాల్లో, పిల్లల్ని యెత్తుకుపోయి, వాళ్ల కాళ్లనీ, చేతుల్నీ విరగ్గొట్టి, కళ్లు పొడిచేసి, వాళ్లని అడుక్కొనేవాళ్లలా తయారుచేసి, ఆ డబ్బులతో బాగుపడే విలన్లని చూశాం.

హాస్య సన్నివేశాల్లో, రక రకాల దొంగతనాలు చెయ్యడం లో శిక్షణ ఇచ్చే "దొంగల బడి" లని కూడా చూశాం.

సాక్షాత్తూ అలాంటి దొంగల బడే, తమిళనాడు లోని తిరుచ్చి సమీపం లో, రాంజీనగర్ ప్రాంతం లో నడపబడుతూందట! అందులో సీనియర్లు, కొత్తవాళ్లకి దొంగతనాలు చెయ్యడం లో మెళుకువలు నేర్పిస్తున్నారట! దాని ఫలితమే, మొన్న వైజాగ్ ఏక్సిస్ బ్యాంకు వద్ద 13.10 లక్షల చోరీ జరిగిందట!

వాళ్లు ఇతర రాష్ట్రాల్లో మాత్రమే దొంగతనాలు చేసి, రాంజీనగర్ ప్రాంతంలో మాత్రం, పెద్దమనుషులుగా చెలామణీ అవుతున్నారట.

సాక్షాత్తూ, విశాఖ పోలీసు కమీషనర్ పూర్ణ చందర్రావు దర్యాప్తులో ఈ విషయం బయటపడి, విస్మయం చెందారట!

అందానికి నేనూ, రాగానికి మాయప్పా అన్నట్టు, మళయాళ సోదరులేమీ తక్కువ తినలేదు.

ముథూట్ ఫైనాన్స్, మణుప్పురం గోల్డ్ పేర్లతో, గత సంవత్సరమున్నరగా, మన రాష్ట్రం లోని బంగారాన్ని దోచుకొంటున్నారు. ఈ కుంభకోణం యెప్పుడు "భడేల్" మంటుందో.....రిజర్వ్ బ్యాంకూ, ప్రభుత్వాలేమంటాయో......పైవాడికే యెరుక!

"తెలంగాణా వుద్యమంలో నేనూ, మా ముసల్దీ (భార్య) మాత్రమే పాల్గొంటామని, తనకేమీ రాజకీయ వాంఛలు లేవని, కే సీ ఆర్ పదేళ్ల క్రితం చెప్పాడు. ఇప్పుడు యెక్కడ చూసినా, వాళ్ల కుటుంబ సభ్యులే కనిపిస్తున్నారు--అని విమర్శించిందట--తెలుగుదేశం!

మొన్న, కర్ణాటక సంగీత విద్వాంసుడు అమ్మనమంచి బలరామ శాస్త్రి ని కంచి పీఠం ఆస్థాన విద్వాంసుడిగా నియమించిందట. ఈయన ఇంతవరకూ 1045 గాత్ర కచేరీలు చేశారట. తాడేపల్లి గూడెం లో అమ్మనమంచి సోదరులు నలుగురూ ప్రఖ్యాత విద్వాంసులే.

గొప్పగా చెప్పుకోవడమే గానీ, నాకు ఆయన తో యే చుట్టరికం వుందో ఆయనకీ తెలీదు, నాకూ తెలీదు. యెప్పుడో తీరిక దొరికినప్పుడు పరిశోధన ప్రారంభించాలి.

పీనాసైనా రోశయ్య గట్టోడని వొప్పుకుంటారా?

ఇప్పుడు మార్కెట్లో బియ్యం ధరలు బాగా తగ్గుతున్నాయట. ఇన్నాళ్లూ మిల్లర్లు, తమదగ్గర ధాన్యం, బియ్యం నిలవలు వుండిపోయాయనీ, వాటిని ఇతర రాష్ట్రాలకీ, దేశాలకీ, యెగుమతి చెయ్యడానికి అనుమతి ఇవ్వకపోతే, వచ్చే ఖరీఫ్ లో ధాన్యం యెలాగ కొంటాము అనీ బెదిరించీ, మొత్తుకొనీ, చివరికి కాళ్లా వేళ్లా పడ్డా, రోశయ్య "మీరు అరిచి గీపెట్టినా....ససేమిరా" అన్న లెవెల్లో, నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోయాడు.

ఇప్పుడు చచ్చినట్టు ఈ మిల్లర్లు ఆ బియ్యాన్ని, ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు--అందుకే ధరలు తగ్గుతున్నాయట!

కూడోస్ టూ రోశయ్య!

4 comments:

శరత్ కాలమ్ said...

కాస్త శ్రమ అనుకోకుండా ఆ దొంగలబడి అడ్రసు కనుక్కొని చెబుతారా? ఏం లేదూ, చిన్న పని వుంది - AP లో దానికో బ్రాంచి ఓపెన్ చేయిద్దామనీ.

amma odi said...

బాగున్నాయండి, మీ తాజా కబుర్లు!

A K Sastry said...

డియర్ శరత్ 'కాలమ్'!

టపాలో వ్రాసిన తిరుచ్చి సమీపం లోని రాంజీనగర్.....ఇంతకన్నా నాకింకేమీ తెలీదు--ఒట్టు. (లేకపోతే విశాఖ పోలీసుకనీషనర్ నా వెనక్కాల పడగలడు!)

ఆ చిరునామా మీరు యెందుకడిగారో మీరు నాకు చెప్పలేదు, నేను చదవలేదు.

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ AMMA ODI,

అస్తమానూ సణుగుడేమిటి అనుకుంటారని, కబుర్లు గా మార్చాను. నచ్చినందుకు సంతోషం.

ధన్యవాదాలు.

ఇదివరకు మీ టపాలమీద నా వ్యాఖ్య టపాకి ఓ లింకు ఇచ్చాను. బహుశా మీరు చూడలేదు. మళ్లీ ఇస్తున్నాను. ఓసారి చూడండి.

http://amtaryalu.blogspot.com/2010/08/5.html