అవీ, ఇవీ, అన్నీ
"ఆండిముత్తు రాజా"....ఇంత సత్యసంధుడని యెవరూ అనుకోలేదు! ఆయన చెప్పినవన్నీ 'సత్యాలే' అని ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి.
మొన్న ఆగస్ట్ 24న ఆయన కోర్టులో యేమన్నాడో చదవండి--"2జీ స్పెక్ ట్రం ద్వారా ప్రభుత్వానికి యెలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ విషయాన్ని ఋజువు చేసేందుకు ప్రథాని మన్మోహన్ సింగ్, అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం, ప్రస్తుత టెలికం మంత్రి కపిల్ సిబల్ లను విచారించాలి.....నష్టం వాటిల్లలేదని ప్రథాని, ప్రస్తుత టెలికం మంత్రి పార్లమెంటులోనే ప్రకటించారు. వాళ్లని విచారిస్తే, నష్టం వాటిల్లలేదు అని ఋజువు అవుతుంది. అప్పుడు నామీద కేసేలేదు!" అన్నారు!
ఇప్పుడు వరుసగా బయటికి వస్తున్న "నోట్"లూ, లేఖలూ వగైరాల వల్ల, అంతా ప్రథానికీ, చిదంబరం కీ, ప్రణోబ్ కీ, తెలిసే జరిగింది అని నిరూపితమవుతోంది.
(ఇవి బయటపడడం కూడా స హ చట్టం వల్లేనట! జనలోక్ పాల్ అంటేనే ఈ మంత్రులందరూ యెందుకు వుచ్చలుపోసుకొంటున్నారో అర్థం అవుతోంది కదా?)
బుకాయింపుల పర్వం బాగానే సాగుతోంది. "మా అతివిలువైన సహచరుడు" ని అరెస్టు చెయ్యక్కర్లేదు, విచారించక్కర్లేదు అంటాడొకడు. మా నోట్ గురించి, 'నిపుణుల అభిప్రాయం' తీసుకున్నాకే మాట్లాడతానంటాడు పైగా!
నికమ్మా ప్రథాని అయితే, ఆయనమీద నాకు పూర్తి నమ్మకం వుంది అంటాడు....యెవడడిగాడనో! కాయితాలమీద వున్న విషయం గురించి మాట్లాడమన్నారుగానీ, నీకు యెవరిమీద నమ్మకాలున్నాయి అనడిగారా?
సంకీర్ణధర్మం పేర, అందర్నీ వీలైనంత దోచుకోడానికి చూసీ చూడనట్టు వ్యవహరించడం అనే నేరం చేశారాలేదా? అనడుగుతున్నారు! కరుణానిధికి, "మా తమిళనాడు మంత్రులెవరూ (యేపార్టీ వాళ్లయినా) రాజీనామా చెయ్యాల్సిన అవసరం లేదు. చెయ్యరు." అనే ధైర్యం వాడికి యెలా వచ్చింది?
"ప్రతిపక్షం మధ్యంతర యెన్నికలు రుద్దడానికి ప్రయత్నిస్తోంది(ట)!" వొద్దుబా....బూ! యే యెన్నికలూ వద్దు...మంత్రులందరూ జైళ్లలో కూచున్నా; ఆఫీసులకి రాకుండానే జీతాలు తీసుకుంటున్నా, పరిపాలనంటూ లేకపోయినా, రైళ్లూ బస్సులూ నడవకపోయినా, యెవరెలా పోయినా, యెన్నికలు మాత్రం వద్దు! మీ కుర్చీలు మీరు వదలొద్దు. అంతే!
ఒక్క నోటీసుతో, దిమ్మతిరిగి పట్టపగలే చుక్కలు కనిపించి, లిఖితపూర్వకంగా క్షమాపణ అడిగాడట--అన్నా హజరేని 'నువ్వు నిలువెల్లా అవినీతిపరుడివి ' అని దూషించిన మనీష్ తివారీ అనే ఓ కాంగీ అధికార ప్రతినిధి! చిరునవ్వుతో క్షమించేశాడట అన్నా! ఇంకెవరెవరు యేమేమి అంటారో చూడాలి.
సినిమాలో తప్ప బయట యెక్కడా వినిపించని పాటలు వున్నట్టు, యెవరూ పట్టించుకోని వార్తలు కొన్ని వుంటాయి--అవి యెంత ముఖ్యమైనవైనా!
ప్రభుత్వం వివిధ సందర్భాల్లో "స్వాధీనం చేసుకున్న ఆయుధాలు" గత పాతికేళ్లలో, 750 మంది "ఎం పీ" లు "కొనుక్కొన్నారు"ట! (ఇది కూడా స హ చట్టం క్రింద ప్రభుత్వం వెల్లడిచేసిన రహస్యమేనట!)
అలాంటి ఆయుధాలని, "సిట్టింగు" ఎంపీలకు మాత్రమే, మొదట అడిగినవారికి మొదట ప్రాతిపదికన "విక్రయించవచ్చు" అని రూలట!
అలా కొనుక్కున్నవాళ్ల లిస్టులో కొన్ని పేర్లు చూడండి.....యూపీ ముఖ్యమంత్రి మాయావతి; కాంగీ నేత జనార్దన్ ద్వివేది; భాజపా నాయకుడు షానవాజ్ హుస్సేన్; కేంద్ర మంత్రులు జయంతీ నటరాజన్; ప్రణీత్ కౌర్; విన్సెంట్ పాలా; మాజీ యెన్నికల ప్రధానాధికారి ఎమ్మెస్ గిల్; ప్రస్తుత సీ ఎం లు భూపీందర్ సింగ్ హుడా; శివరాజ్ సింగ్ చౌహాన్; ఇంకా నాయకులు జగదీష్ టైట్లర్; వీకే మల్ హోత్రా; మదన్ లాల్ ఖురానా; సజ్జన్ కుమార్; సీపీయెం సీనియర్ నేత సుభాషిణీ ఆలీ; ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీలు అతీక్ అహ్మద్; సురేష్ కల్మాడీ; బాబూభాయ్ కటారాలు కూడా అలా కొనుక్కొన్నారట!
మరి వీళ్లకి ప్రజలడబ్బు తగలేసి జడ్ కేటగరీ; జడ్ ప్లస్; జడ్ ప్లస్ ప్లస్ అంటూ భద్రత కల్పించడం యెందుకో?
పోనీ ఆ విషయం ప్రక్కన పెట్టినా; వాళ్లలో యెంతమంది మళ్లీ ఆ ఆయుధాలని ఇతరులకి యెన్ని లక్షలకి విక్రయించారో; ప్రస్తుతం అవి యెవరిదగ్గర వున్నాయో, వాటికి లైసెన్స్ లు వున్నయోలేదో, మళ్లీ అవి యెప్పుడైనా స్వాధీనం అయ్యాయేమో--ఇలాంటి సమాచారం కోసం యెవరైనా ఇంకో స హ దరఖాస్తు చేశారంటారా? చేసే వుంటారు.....!
ప్రథాన యెన్నికల కమీషనరుగా ఎస్ వై ఖురేషీ నియామకమే తప్పుడు వ్యవహారం అన్నారందరూ.
ఇప్పుడు వాడేమంటున్నాడో చూడండి.....హజారే అన్నట్టు ఎంపీల రీకాల్ భారత్ లాంటి పెద్ద దేశం లో ఆచరణ సాధ్యం కాదుట. వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారవుతుందిట. అనేక సమస్యలకి దారి తీస్తుందిట. అలాగే, అభ్యర్థులందరినీ తిరస్కరిస్తున్నాం అని బ్యాలెట్లో ఆప్షన్ ఇస్తే కూడా బోళ్లు సమస్యలు వచ్చేస్తాయట.
ఒకవేళ వోటర్లందరూ అందరు అభ్యర్ధులనీ తిరస్కరిస్తే, యేం చెయ్యాలి అనే సమస్య వస్తుందిట! ఇంటింటికీ తిరిగి చేసే ప్రచారం కూడా మంచిది కాదుట!
పెద్ద దేశం అని యెన్నికలు నిర్వహించడమే మానేస్తామా? వీడి సందేహాలకి చిన్నపిల్లాడు కూడా సమాధానాలు చెప్పగలడు. అయినా సమస్య వచ్చినప్పుడు యేంచెయ్యాలో ఆలోచించచ్చుగా? ముందునుంచీ అన్నీ వ్యతిరేకించడం యెందుకు? "అమ్మ చెప్పిందీ......" గనుకా?
సకలజనుల సమ్మెవల్ల యెవరికైనా యేదైనా మేలు జరిగిందో లేదోగానీ, పరోక్షంగా కొందరికి మేలు జరిగిందేమో అనిపిస్తూంది! యెందుకంటే, "ఏపీబీసీఎల్" డిపోల నుంచి దుకాణాలకి మద్యం సరఫరా నిలిచిపోయిందట! మొత్తం 38 డిపోలుంటే, అందులో 17 తెలంగాణాలో వున్నాయట! అవి మూతపడడంతో, ప్రక్క జిల్లాల నుంచి యెలాగోలా తెప్పించి సరఫరా చేసినా, యేమాత్రం సరిపోవడం లేదట! ఇంక అది కూడా సాధ్యం కాకపోవడంతో, "ప్రభుత్వానికి కోట్లలో నష్టం వస్తూంది....."అనిమాత్రమే....చింతిస్తున్నారట ప్రభుత్వం వారు!
మొన్న జేపీ ఢిల్లీలో అదేదో సంఘం ముందు తన అభిప్రాయాలు వెల్లడించాక, తను చెప్పిన విషయాలు మీడియాకి వెల్లడిస్తే, ఆయన చెప్పిన వాటితోపాటు, "జనలోక్ పాల్" ఓ రాజ్యాంగేతర శక్తి అవుతుంది అనికూడా అన్నాడు అని రిపోర్టు చేశారు--ఈనాడుతో సహా! నిన్న ఆయన నేను అనని మాటలని మీడియా వాళ్లు కావాలనే ప్రచారం చేశారు అన్నాడు! నమ్ముదాం మరి.
వీళ్లకి పదవులివ్వడమే దండగ అనుకొంటే, ప్రతీ వూళ్లోనూ వాళ్లకి సన్మానాలూ, పేపర్లో శుభాకాంక్షల ప్రకటనలూ, కత్తో, గదో, కిరీటమో, యెద్దుకొమ్ములో బహూకరించడాలూ.....ఇవన్నీ అవసరమా??
యేమంటారు?