అవీ, ఇవీ, అన్నీ
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్--"Last resort for Government/Management scoundrels!"
ఓ వుద్యోగి, నీతిగా, నిజాయితీగా తన పని చేసుకొంటూ, పైవాడు అవినీతికో, ఇంకదేనికో వొడిగడుతున్నప్పుడు వాడికి అడ్డం పడుతూంటే, పైవాడు వీడిమీద ఓ చిన్న కేసేదో నమోదు చేసి, సీవీసీ కి రిఫర్ చేస్తాడు!
అక్కడున్నదీ విజిలెన్స్ ఇన్స్ పెక్టర్లూ, కమీషనర్లూ అందరూ వెధవలే! "నా చేతికొచ్చిన యేకేసులోనూ ముద్దాయి శిక్ష పడకుండా తప్పించుకొన్నది లేదు" అని బోరవిరుచుకొని తిరుగుతూంటారు వాళ్లు.
వీళ్లందరూ గురివెందలైతే, వాళ్ల ఛీఫ్ థామస్ సగానికి పైగా నలుపు వున్న పెద్ద గురివెంద!
వాడిని కాపాడుతున్నవాళ్లు పూర్తి నల్లగా వుండి, పైనెక్కడో కాస్త యెర్ర రంగున్న అతి పెద్ద గురివెందలు!
మొన్న, తన పదవికి రాజీనామా చేస్తానన్నాడట--థామస్.
మళ్లీ ఇవాళ, అబ్బే...అంటున్నాడు.
సీవీసీని నియమించడానికి యేర్పాటు చేసిన కమిటీలో, ప్రథాని, హోం మంత్రి, ప్రతిపక్ష నాయకుడు (రాలు) సభ్యులట. థామస్ అప్పటికే కేరళలో పామోలిన్ నూనె కుంభకోణం లో నిందితుడు, ముద్దాయి. తరవాత కేంద్ర టెలికాం కార్యదర్శిగా, 176000 కోట్ల కుంభకోణాన్ని మూసిపెట్టి, రాజాకి బాగా సహకరించాడు.
ఆయన 'నిష్కళంకుడూ, నిజాయితీపరుడూ' అంటూ సుప్రీం కోర్టులో కితాబిచ్చింది ప్రభుత్వం.
(సీవీసీ నియామకానికి 'నిష్కళంకుడూ, నిజాయితీపరుడూ' కావడం ఓ అర్హత కానేకాదు అన్నాడో వెధవ!)
ఆ సమయంలో ఆయన మీద కేసులు వున్న సంగతే మాకు తెలియదు అన్నారు సుప్రీం కోర్టులో! కేరళ ప్రభుత్వం ఆయనమీద విచారణకి అనుమతి ఇచ్చిన విషయమే తమకు తెలియదు అన్నారు.
క్రితం సెప్టెంబరులోనే, చిదంబరం, ఆయన ఆ అవినీతికేసులోంచి బయట పడ్డాడు అని సిగ్గులేకుండా అబధ్ధం యెందుకు ఆడాడో మరి?
2002 లోనే ఛార్జిషీటు నమోదైవున్న థామస్ ని, త్రిసభ్య సంఘంలో సభ్యురాలైన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ 'కూడదు' అంటున్నా, మిగిలిన ఇద్దరూ యెందుకు నియమించారో?
తనమీద కేసులనీ, టెలికాం కేసులనీ, తనే 'పర్యవేక్షించే' దుస్థితి ఆయనకి యెందుకు ప్రాప్తించిందో మరి!
అజీం ప్రేమ్‌జీ లాంటి వాళ్లో పధ్నాలుగు మంది ఇప్పుడు గొంతు చించుకుంటున్నారు--ఈ కాంగీలని రూపు మాపండి అని!
చూద్దాం!
"Power corrupts....and absolute power currupts absolutely" అని, అంత అధికారం కోసం ఎమర్జెన్సీ విధించింది ఇందిరాగాంధీ! (రాశ్శేఖర్రెడ్డి కూడా అనుభవించాడు అబ్సల్యూట్ పవర్!). సోనియా కూడా ప్రయత్నిస్తూంది......కానీ.....అప్పుడు ఒక్కడే హెచ్ ఆర్ ఖన్నా! ఇప్పుడనేకమంది!
అప్పట్లో, జాతీయ పత్రికల్ని కంట్రోలు చేస్తే సరిపోయేది! ఇప్పుడు అనేక మీడియాలు!
శ్రీకృష్ణదేవరాయలు భార్య, ఆపుకోలేక, తలుపు చెక్క ఆడిస్తే, తెనాలి రామలింగడు "కిర్రూ, పుర్రూ బాగానే కలిసిపోయాయి" అని వ్యాఖ్యానించి, మొగుడూ పెళ్లాలమధ్య తంపు పెట్టి, తిమ్మన చేత పారిజాతాపహరణం వ్రాయింపచేశాడు.
ఇప్పుడు అనేకమంది తెనాలి రామలింగళ్లు! కాంగీల వ్యవహారాలని లౌడ్ స్పీకర్లలో మరీ వినిపిస్తున్నారు!
అందుకే అంటున్నారు--"రాజ్యాంగాన్ని కాంగీ బారినుంచి కాపాడవలసిన అవసరం వచ్చింది! కాంగీలు తమ పార్టీని ఆ పార్టీనుంచి రక్షించుకొనే అవసరం వచ్చింది!" అని.
చూద్దాం, యేమి వెలగబెడతారో!
ఓ ఐదారేళ్లక్రితం, వుల్లిపాయలు నిలవ చెయ్యడానికి ప్రభుత్వం గోదాములు నిర్మించింది--కొన్ని కోట్లతో. అందులో వుల్లిపాయలు మాత్రమే పట్టే అరలు నిర్మించారట! ఇప్పుడు దాచడానికి వుల్లిపాయలు లేక, ఆ గోదాములు వెలతెల పోతున్నాయట!
ఇప్పుడు, జిల్లాకు 15 క్లస్టర్లు (ఒక్కో క్లస్టర్ లోనూ 10 యెకరాలతో) చొప్పున, నాలుగు జిల్లాల్లో, ఒక్కో క్లస్టర్ కీ 1.36 కోట్లతో--పందిళ్లూ, షేడ్ నెట్ లూ, విత్తనాలూ సరఫరా చేసి, టమోటా, వంకాయ, మిరపకాయ, క్యాప్సికం, క్యాబేజీ, కాకర, సొరకాయ, పొట్ల, బీరకాయలు ప్రథానంగా పండించేందుకు యేర్పాట్లు చేస్తున్నారట!
మొత్తం వ్యయం 82.99 కోట్లయితే, అందులో ప్రభుత్వం 42.48 కోట్లు సబ్సిడీ ఇస్తుందట. ఇప్పుడే 10.68 కోట్లు విడుదల చేసిందట.
అసలు ఈ కూరగాయలన్నీ ఇప్పుడు మన రాష్ట్రంలో పండడం లేదుకదా? అందుకే ఈ బృహత్ప్రణాళిక! బాగుంది కదూ?!
నాకర్థం కాని విషయం, యెప్పుడూ కొంతమంది వెధవలే యెందుకు ప్రణాళికలని రచిస్తారా? అని.
బెజవాడ కనకదుర్గ కొండమీద, ఓ ఐదంతస్తుల 'మల్లికార్జున మహా మండపం' నిర్మించాలనీ, ఆ మండపం పైన 'కార్ పార్కింగ్' యేర్పాటు చెయ్యాలనీ, ఇందుకు ఓ 20.50 కోట్లు ఖర్చు పెట్టాలనీ, 2008 లోనే నిర్ణయించారట! కొండ క్రిందనుంచి సరాసరి భవనం పైకే కార్లూ, స్కూటర్లూ వెళ్లిపోవాలట. ఇందుకోసం 'ర్యాంపుల' నిర్మాణానికి 11.4 కోట్లు కేటాయించారట. టెండర్లు కూడా ఖరారు అయ్యాయట!
కొత్త కమీషనరు రావడంతో, ఇవన్నీ ఆపెయ్యండి, తరవాత చూద్దాం అంటే, ఆపేశారట.
ఆలయం యెదురుగా రాజగోపురం లేకపోవడం ఓ పెద్ద లోటుగా భావించి, 92 అడుగుల యెత్తూ, 9 అంతస్థులూ తో గోపుర నిర్మాణానికి 9.8 కోట్లతో అంచనావేసి, టెండర్లు ఖరారు చేశారట.
చిత్రమేమిటంటే, మహా మండపం మధ్యనించీ గోపుర నిర్మాణం జరగాలట! (దాని చుట్టూ పార్కింగులన్నమాట!) ఒక్కో అంతస్థూ అమ్మవారి ఒక్కో రూపానికి ప్రతీకగా నిర్మించాలట. మండపం యెత్తుతోకలిపి, గోపురం యెత్తు చూస్తే, 155 అడుగులు వుంటుందట. (నగరం చుట్టుప్రక్కల యెక్కడనించి చూసినా గోపురం కనిపించాలనేది సెంటిమెంటుట!)
మళ్లీ, గోపురం యెత్తు 82, 72 అడుగులకి తగ్గించి, ప్రస్తుతం 55 అడుగులకి పరిమితం చెయ్యాలని కొంతమంది నిపుణుల సూచన ప్రకారం డిజైన్లు మారుస్తున్నారట. అంగట్లో అన్నీ వున్నా.....అన్నట్టు, "కమీషనరు నుంచి డిజైన్లకు ఆమోదం లభిస్తే, ఇంకెంత పని?" అంటున్నారట గుత్తేదారులు!
ప్రతీ సంవత్సరం కొండచరియలు విరిగిపడి ఘాట్ రోడ్డు కే అంతరాయం కలుగుతుంటే, కొండనాలుక్కి మందేస్తే....అన్నట్టు....అసలు కొండనే నాశనం చెయ్యరుకదా?!
చూద్దాం!
ఆహార ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగి, 15.57 శాతానికి చేరిందట. క్రితం యేడాదితో పోలిస్తే, కూరగాయలు 67.07 శాతం పెరిగితే, వుల్లిపాయలొక్కటీ 111.58 శాతం పెరిగాయట. పళ్లూ, పాలూ, ఇతర ప్రొటీన్ ఆహారాలూ.....అన్నీ పెరిగాయట.
వచ్చే మార్చికి అన్నీ నేలబారుకి వొచ్చేస్తాయటలెండి! అప్పటిదాక, యేదో చూస్తూ, నేలనాకుతూ వుండండి మరి.
.....సోనావాణె.....బలైపోయిన ఓ ఐ యే యెస్ అధికారి! కిరసనాయిలు కల్తీ చేస్తున్నవాళ్లని సెల్ ఫోన్ లో చిత్రించి, వెళుతుంటే, కిరసనాయిలే పోసి తగులబెట్టారట వాళ్లు ఆయన్ని!
మా మొవ్వ తిరుమల కృష్ణబాబు కూడా, అప్పుడెప్పుడో, కన్ను లొట్టబోగొట్టుకున్నాడలాగే!
లూధియానాలో, ఎక్సైజ్ పన్నుల విభాగం వారు, నకిలీ బిల్లులతో 30 ఆటోల్లో సరుకుల్ని తరలిస్తూండగా, అధికారి డీ ఎస్ గర్చా మొ. వారు వారిని ప్రశ్నించడంతో, వాళ్లు కర్రలూ, కత్తులతో వీళ్లపై దాడి చేసి, పాపం దొరికిన వాహన డ్రైవర్ని రైలు క్రిందకి తోసేశారట. పాపం అయన తృటిలో తప్పించుకున్నాట్టలెండి!
సర్వేజనాస్సుఖినోభవంతు....ఇంకేమంటాం?