అవీ, ఇవీ, అన్నీ
ప్ర తె మ ల సందర్భంగా, అన్ని జిల్లాల్లోనూ, మండలాల్లోనూ, "సభలు" చేసి, "దశదిశలా తెలుగు కీర్తి చాటాలి" అని యెలుగెత్తుతున్నారందరూ.
నిన్న మావూళ్లో సభలో ఒకాయన మీడియా చేస్తున్న కృషిని అందరూ గుర్తించాలనీ, తెలుగు వెలుగు కొని చదవాలనీ, వారు చేస్తున్న కృషి అమోఘమనీ--ఇలా చెప్పారు.
తీరా చూస్తే, ఆ సభకి సంబంధించిన వార్తలో, "శతావధాని తనదైన శైలిలో..........'హాస్యాస్పదంగా' వివరించారు అని వ్రాశారు!
తెలుగుని వుధ్ధరించకపోతే పోయె--అపభ్రంశాలతో దాన్ని ఖూనీ చెయ్యకుండా వుంటే చాలు మన ఘనతవహించిన మీడియా వాళ్లు.
హమ్మయ్య! కార్తీకం ముగిసింది. క్రితం సంవత్సరం వరకూ 'సహస్ర' తో సరిపెట్టిన భత్తులు, ఈ సారి 'లక్ష' సంఖ్యలో దీపాలు వెలిగించేశారు అనేక చోట్ల. (అయినా, పౌర్ణమి నాడు దీపాలెందుకో--అమావాస్యనాడు గానీ!)
మళ్లీ యేడు "పది లక్షల" దీపాలూ, ఇక ముందు "కోటి" కి చేరినా ఆశ్చర్యం లేదేమో!
ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి కొద్దిగా తక్కువగా మాత్రమే చేరిందట--అక్టోబరు నెలాఖరికి. ఆహార ద్రవ్యోల్బణం కూడా అలాగే వుందట. ఇంక కార్తీకాంతానికి యెంతకి పెరుగుతుందో? మళ్లీ యేడాదికి మూడంకెలకి కూడా చేరుతుందేమో--దువ్వూరి వారు ఆలస్యం చేస్తే!
"భేష్ దువ్వూరీ!" అన్నాడట ఆర్థిక వేత్త జగదీష్ భగవతి. ఆయన ప్రభుత్వ వొత్తిళ్లకి తలవొగ్గలేదు అనీ, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశారు అనీ, ఇంక వృధ్ధి గురించి కూడా పట్టించుకోవాలనీ అన్నారట. చివర అన్నదాన్నిబట్టి, ప్రభుత్వానికి వత్తాసు పలికినట్టు లేదూ?
ఆర్ బీ ఐ డిప్యూటీ గవర్నరు చక్రబర్తి, బ్యాంకుల్లో మొండి బాకీలు పెరగడానికి "కార్పొరేట్లదే బాధ్యత" అన్నారట. అసలు అన్నేసి వందల కోట్లు ఆ కార్పొరేట్లకి యెవరు యెలా ఇప్పించారో?
గుజరాత్ యెన్నికలు రేపనగా, వీరప్ప మొయిలీ, ఇకనుంచీ యేడాదికి 9 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించాం అని చెప్పి, ఎలక్షన్ కమీషన్ మొట్టగానే, "అబ్బే! నిర్ణయం ఇంకా తీసుకోలేదు" అని తప్పించుకుంటున్నాడు. మరి గుజరాత్ లో అందరూ వెర్రి వోటర్లే అనుకున్నాడేమో!
ఎఫ్ డీ ఐ ల విషయంలో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటుండగా, వాల్ మార్ట్ బాంబు పేల్చింది--మనదేశంలో వాళ్ల ప్రవేశం కోసం కొన్ని వందల కోట్లు లాబీయింగ్ కి (లంచాలకి) ఖర్చు చేశాము అని! ప్రభుత్వంవారు యెట్టకేలకి ఓ విశ్రాంత న్యాయ మూర్తి తో విచారణ చేయించడానికి ఒప్పుకున్నారట. నిజాలు బయటికి వచ్చేనా?
2 comments:
అంతేలెండి
డియర్ kastephale!
అంతేనంటారా? అంతేయేమో లెండి మరి!
ధన్యవాదాలు.
Post a Comment