Friday, December 7, 2012

కబుర్లు - 98అవీ, ఇవీ, అన్నీ

ఇంకో "అనుసంధానం"--ప గో జి లో 16 పోలీసు సర్కిళ్లూ, 63 స్టేషన్లూ వున్నాయట. వందలాది ఫిర్యాదుదారులున్నా కేసులు నమోదు అవుతున్నవి చాలా తక్కువట. అందుకని, జిల్లాలోని పోలీసు స్టేషన్ల వివరాలను కంప్యూటర్లో "క్రోడీకరించి", ఆన్ లైన్ కి అనుసంధానం చేసి, దాన్ని "జీ పీ ఆర్ ఎస్" కి అనుసంధానం చేస్తారట. ఇంక 100 కి డయల్ చేస్తే చాలు అక్కడే ఫిర్యాదు నమోదు చేసేస్తారట. 

ఇప్పుడు సాధారణ ఫిర్యాదులు ఓ కంట్రోల్ రూము లోనూ, మరో కంట్రోల్ రూము సీ సీ ఎస్ లోనూ, పట్టణాల్లో సబ్ కంట్రోల్ రూములూ--వేర్వేరు నెంబర్లతో పనిచేస్తూండడంతో బాధితులకి చాలా ఇబ్బంది కలుగుతోందట.

100 కి డయల్ చేస్తే అది నేరుగా ఎస్పీ కార్యాలయంలోని ఒక గదిలో కంట్రోల్ రూముకి వెళ్లి, అక్కడే కేసు నమోదుచేసి, నెంబరు కూడా ఇచ్చేస్తారట. ఆ నెంబరు తీసుకొని, దగ్గరలోని స్టేషనుకి వెళితే, రసీదుతో పాటు ఎఫ్ ఐ ఆర్ కాపీ కూడా ఇచ్చేస్తారట. (దీంతో, "కేసురాయడానికి అవసరమైన స్టేషనరీ అనధికారంగా కొనుగోలు చేసే బాధ" తప్పడం, దళారులపై ఆథారపడకుండా వుండడం జరుగుతాయట.)

ఇంకా అధికారులకి మొత్తం 85 వాహనాలు వున్నాయిగానీ, యేదెక్కడుందో యెవరికీ తెలియదట. ఇప్పుడు వాటికి ప్రత్యేక పరికరాలని అమర్చి, యే వాహనంలో యెవరు యెక్కడున్నారో యెప్పటికప్పుడు తెలుసుకోవచ్చట.

(శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలున్నాయంటారు కదా.)

ముందు ప్రయోగాత్మకంగా ఒక మండలం లో ప్రవేశపెట్టి, త్వరలో జిల్లా అంతా విస్తరిస్తారట.   ఇంకేం మరి! "అనుసంధానాల" పేరుచెప్పి, అరచేతిలో స్వర్గాలు చూపిస్తున్నారు. కొన్నాళ్లలో మనదేశం పూర్తిగా "ఉటోపియా" గా మారిపోతుందేమో! యేమో--గుర్రమెగరావచ్చు.....అన్నట్టు.

మావూరు (నరసాపురం) లో వీధి విద్యుత్ దీపాలని "అనుసంధానం" చేస్తారట--ఆటోమేషన్ ట్రాకింగ్ పధ్ధతి ద్వారా, ఆన్ లైన్ విధానం లో. మొన్నీమధ్య తెనాలి లో అలా చేశారట. ఈ విధానంతో ఆఫీసులో కూర్చొనే, యెక్కడైనా వీధి దీపాలు వెలిగించడం, ఆర్పడం, వెలగనివాటిని కనిపెట్టి బాగు చేయించడం వగైరాలు చెయ్యచ్చట. మరి అదికాస్తా పడుక్కుంటే యెలాగో వాళ్లు వివరించడం లేదు.

రేపు జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా 51 జిల్లాల్లోనూ, రాష్ట్రంలో 5 జిల్లాల్లోనూ "నగదు బదిలీ" ప్రారంభించేస్తారట.

దీనిలో భాగంగా ప్రస్తుతానికి ఉపకారవేతనాలూ, పించన్లూ మాత్రం బదిలీ చేస్తారట. త్వరలో రేషను సరుకుల దగ్గరనించి యెరువులూ వగైరాలన్నిటికీ నగదు బదిలీ (సబ్సిడీ మొత్తం యెంతైతే అంత) బదిలీ చేసేస్తారట. 

అధికారులేమో ఇంకా అథార్ సంఖ్య జారీనే పూర్తికాలేదు, అందరికీ బ్యాంకు ఖాతాలే లేవు, పైగా ఇప్పటివరకూ అధికారికంగా సమాచారమేలేదు అంటూ వాపోతున్నారట

యేదైతేనేం, ఇది ప్రవేశపెడుతున్నది వోట్లకోసమేకదా? అంటున్నారు ప్రతిపక్షాలు. పీ డీ ఎస్ ని నాశనం చెయ్యడానికీ, ఆ వంకని సబ్సిడీలు తగ్గించి డబ్బులు మిగిల్చుకోడానికే అని కమ్యూనిస్టులంటున్నారు.

అసలు ఈ నగదు బదిలీ యే ప్రాతిపదిక మీద చేస్తారు? ఉదాహరణకి ఒక్కో తెల్లకార్డు మీదా 20 కిలోలు బియ్యం ఇస్తున్నారనుకుందాం. లబ్ధిదారులు చెల్లించవలసినది రూ.20/- మాత్రమే కదా? బియ్యం సరఫరా రేటు కిలోకి రూ.15/- అనుకుందాం. అప్పుడు 'సబ్సిడీ' 20 X 14 = రూ.280/- అవుతుంది. తీరా ఆ సొమ్ముని వాళ్ల ఖాతాలకి బదిలీ చేసేశాక, వాళ్లు అసలు బియ్యమే కొనకపోతే? ఆ 280 వేరే ఖర్చు పెట్టేసుకుంటే?

బ్యాంకులెక్కడో వుంటాయి. పింఛనుదారుడు యెక్కడో వుంటాడు. అందుకని, బ్యాంకునుంచి పింఛనుమొత్తం తీసుకొని లబ్ధిదారుడికి అందించడానికి యెవర్నో నియమిస్తారట! నీ యెడం చెయ్యి తియ్యి, నా పురచెయ్యి పెడతానన్నట్టులేదూ!

అయినా ఇలాంటి సందేహాలు మనలాంటి సామాన్యుల చిన్ని బుర్రలకి వస్తాయిగానీ, ఆ మేధావులకి రాకపోవడం సహజమే కదా!

రాష్ట్ర పోలీసులకి తీవ్రవాదులని యెదుర్కోడానికి వీలుగా, వీపుకి తగిలించుకునే "జెట్ ప్యాక్" లు కొంటారట. ఒక్కోదాని ఖరీదూ రూ.58 లక్షలు మాత్రమేనట. అందుకని ప్రస్తుతానికో నాలుగు మాత్రమే కొంటారట. వాటిని యెవరైనా వీపుకి తగిలించుకొని, ఓ మీట నొక్కితే, దాంతో పాటు గాలిలో యెగిరి పోతారట. 

మరి వాటి "నిర్వహణకి" యెంతవుతుందో? ఆఫీసుల్లో వుండే నిప్పు ఆర్పే యంత్రాలకి, గుర్రం గుడ్డిదైనా దాణా తప్పదన్నట్టు, అవెప్పుడూ అవసరం రాకపోయినా, నిర్ణీత సమయానికల్లా వాటిలోని ఇంధనాన్ని మారుస్తూ వుంటారు. ఇంకా వాటిని ఉపయోగించడానికి శిక్షణా వగైరాలూ--ఇలాంటివి నిర్వహణ ఖర్చులంటే.     

యెవరైనా తీవ్రవాదులు ఒక ఇంట్లో వుంటే, ఇప్పుడైతే లోపలికి వెళ్లడానికి ప్రయత్నించే పోలీసులని వాళ్లు కాల్చేస్తున్నారట. పోనీ హెలికాప్టరు లో మిద్దెమీద దింపుదామనుకొంటే, చుట్టుప్రక్కల భవనాలవల్ల కుదరడం లేదట. కుదిరినా, వాళ్లనీ దుండగులు కాల్చేస్తున్నారట. 

ఇప్పుడు ఈ జెట్ ప్యాక్ తగిలించుకొని గాల్లో యెగురుకుంటూ వెళితే పాపం వాళ్లని కాల్చరేమో ఆ తీవ్రవాదులు!

ఇలాంటి అవిడియాలు ఇచ్చిన "ఐడియాల్రావు" కి కనీసం ఓ పద్మశ్రీ అయినా పారేస్తారేమో చూడాలి.


   

3 comments:

kastephale said...

all gimmicks for votes only

kastephale said...

all gimmicks for votes only

Ammanamanchi Krishna Sastry said...


డియర్ kastephale!

వాళ్లేం గిమ్మిక్కులు చేసుకొన్నా ఫరవాలేదు గానీ, దేశాన్ని నాశనం చేస్తున్నారే!

ధన్యవాదాలు.