Sunday, December 2, 2012

కబుర్లు-97


అవీ, ఇవీ, అన్నీ  

ప్ర తె మ ల్లో “మేమూ పాల్గొన్నాం” అని అందరూ భావించేందుకు ఊరూ వాడా మీటింగులూ, వూరేగింపులూ పెట్టడానికి కొన్ని లక్షలో కోట్లో కేటాయించారనుకున్నాం కదా. ఇప్పుడు ఆ సభల నిర్వాహకులు వాళ్లకి వస్తున్న ప్రశ్నలు చూస్తూంటే, “మేం సరిగ్గా చెప్పలేకపోతున్నామా? మా తెలుగు సరిపోవడం లేదా?” వగైరా సందేహాలతో సతమతమౌతున్నారట. “ప్రతినిధులు” మాత్రమే తలా రూ.500/- చెల్లించాలనీ, కానివాళ్లు అఖ్ఖర్లేదు అనీ, (వాళ్లకీ వీళ్లకీ తేడా యేమిటో మాత్రం చెప్పడం లేదు!) ప్రతినిధులకి “మూడు పూటలా” భోజనాలు పెడతాము అనీ, స్థానిక హోటేళ్లలోనూ, తి తి దే వారి వసతి గృహాల్లోనూ వసతి సౌకర్యం—ఇద్దరూ, నలుగురూ, ఆరుగురూ, యెనిమిదిమందీ ఇలా పంచుకొనేలా—కల్పిస్తాము అనీ, వాటికి వేరే రూ.500/- నుంచి రూ.2,000/- వరకూ అద్దె చెల్లిస్తే చాలు అనీ ప్రకటించారు.

మన దువ్వూరివారికి పదవీ గండం పొంచి వున్నట్లనిపిస్తోంది. గౌరవ పిచ్చిదంబరం మాటలని యేమాత్రం చెవిని పెట్టడం లేదు. మొన్న కీలక రేట్లు తగ్గిస్తారని ఆశించారు. ఆ పని చెయ్యకపోవడంతో, “మేమే ఒంటరిగా చర్యలు తీసుకోగలం” అని మేకపోతు గాంభీర్యం ఒలకబోశారు. తరవాత “కొత్త ప్రైవేటు బ్యాంకులకి” లైసెన్సులు ఇవ్వాల్సిందే అన్నారు. ఈయనేమో అదేదో చట్టం చేస్తేగానీ కుదరదు అన్నాడు. మళ్లీ ఈయన ముందు లైసెన్సులు ఇచ్చేస్తే, యేడాదిలోగా తీరిగ్గా చట్టం చేసుకోవచ్చు కదా అన్నాడు. (ఈ లోపల యెన్ని చార్మినార్ బ్యాంకులూ, కృషి బ్యాంకులూ జనాలని ముంచాలో? అలాంటివాళ్లు యెందరు ఆయనమీద వత్తిడి  తెస్తున్నారో?)

అన్నట్టు ఫేస్ బుక్ లో వ్యాఖ్యల విషయమై ఇద్దరు అమ్మాయిలని అరెస్టు చేసిన ఇద్దరు పోలీసు “ఉన్నతాధికారులని” సస్పెండు చేశారట! వాళ్లని కస్టడీకి తరలించాలని ఆదేశించిన “మేజిస్ట్రేట్” మీద కూడా బదిలీ వేటుపడిందట. వాళ్లమీద “తప్పుడు సెక్షన్ల” క్రింద కేసులు పెట్టారని పోలీసులపై శాఖాపరమైన విచారణ కూడా మొదలెట్టారట. మరి ఆ సైనికుల మీద యెవరు చర్యలు తీసుకుంటారో?

రానురానూ వ్యవస్థలో ఒక నిబధ్ధత అనేది లేకుండా పోతోంది. ఇదివరకు న్యాయమూర్తులు వాళ్ల దగ్గర బంధువుల ఇళ్లలో శుభకార్యాలకి కూడా వెళ్లడానికి జంకేవారు. ఇప్పుడలా కాదు. అనేక సంస్థలచేత సన్మానాలూ, గుళ్లలో పూర్ణకుంభ స్వాగతాలూ, శేషవస్త్ర ప్రసాదస్వీకరణలూ వగైరాలతో పేపర్లలో ఫోటోలూ! ఇంక వున్నతాధికారులని చూడ్డానికి వెళ్లినప్పుడు ఒక్క నిమ్మకాయ మాత్రం సమర్పించేవారు. (బహుమతిగా ఫలం ఇచ్చినట్టూ, లంచం ఇచ్చినట్టు వుండకుండానూ). ఇప్పుడు పెద్ద పెద్ద బొకేలతో వెళ్లడం, వాళ్ల పదవీ స్వీకరణలకీ, పుట్టినరోజులకీ, బదిలీలకీ పేపర్లలో శుభాకాంక్షల ప్రకటనలూ! అదేదో పెద్ద తప్పని కాదుగానీ, యెంతో కొంత ప్రభావం వుంటుంది కదా?
   



No comments: