Wednesday, November 28, 2012

కబుర్లు - 96




అవీ, ఇవీ, అన్నీ

రాష్ట్రంలో కంప్యూటర్ల కొనుగోళ్లు వగైరాలమీద యే హైకోర్టు న్యాయమూర్తో, జేడీ లక్ష్మీ నారాయణో "సువో మోటో" గా విచారణ మొదలు పెడితే బాగుండును. 

అన్నిచోట్లా కంప్యూటర్లే, అన్నిటికీ "అనుసంధానాలే"!

ఎక్సైజు కంపు : రాష్ట్రం లో అన్ని ఎక్సైజు ఠాణాలూ, దుకాణాలూ కంప్యూటరీకరించి, అనుసంధిస్తారట

మొత్తం 346 ఎక్సైజు స్టేషన్లూ, డిపూటీ, సహాయ కమీషనర్ల కార్యాలయాలూ, 32 డిస్టిలరీలూ, 9 బ్రూవరీలూ, 6,596 మద్యం దుకాణాలూ--అన్నింటినీ "ఒకే సాఫ్ట్ వేర్" క్రింద అనుసంధానించి, "వినియోగదారులు" మోసపోకుండా చూస్తారట. 

వీళ్లు "వినియోగదారుల"నుంచే కాకుండా, ఉద్యోగార్థుల నుంచి కూడా ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు. మొన్న కానిస్టేబుళ్ల ఉద్యోగాలకి మొత్తం 2,606 ఉద్యోగాలకీ 4,36,488 మంది దరఖాస్తు చేశారట. దరఖాస్తుల ద్వారానే రూ. 2 కోట్ల "ఆదాయం" వచ్చిందట వాళ్లకి!

"మీ సేవ" : జిల్లాలో 274 కేంద్రాల్లో ఇప్పటివరకూ "అందిస్తున్న" 27 సేవలకి అదనంగా మరో 8 సేవలని కూడా అందించాలని నిర్ణయించారట! పురపాలక సంఘాల్లో ఇచ్చే జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీని కూడా "త్వరలో" నూ, తరవాత గ్రామ పంచాయతీల్లో ఇచ్చే వాటినికూడానూ అనుసంధిస్తారట. 

యేడిచేదాని మొగుడొస్తే నా మొగుడూ వస్తాడు అన్నట్టు, కొన్ని సేవలు వస్తే మిగిలినవి రాకపోతాయా అని యెదురు చూస్తున్నారు జనాలు.

ఇక దేశవ్యాప్తంగా, 9 వేల "గ్రంధాలయాల"ని మూడేళ్లలో "డిజిటల్" పరిజ్ఞానంతో అనుసంధించడానికి వెయ్యికోట్లతో "ప్రక్రియ" చేపట్టడానికి ప్రణాళికని ప్రణాళికా సంఘానికి నివేదించారట. 

మా నరసాపురం అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయ మూర్తి భరతలక్ష్మి, ఓ అద్భుతమైన తీర్పు ఇచ్చారు. 14 యేళ్ల బాలికని మోసగించి, ముంబాయి ప్రాంతానికి తీసుకెళ్లి, వ్యభిచార వృత్తిలో దించడానికి ప్రయత్నించినందుకూ, ఆమెని చిత్ర హింసలకి గురి చేసినందుకూ--ఇద్దరు స్త్రీలకి 17 యేళ్ల చొప్పునా, ఇంకో స్త్రీకి 14 యేళ్లూ జైలు శిక్ష విధించారట! (ఆఁ! పైకోర్టులు లేవా? అంటున్నారేమో వాళ్ళు!)

మా జిల్లా కలెక్టరుగారు, ఆవిడ సంతకం కోసం, ఓ బాధితుడికి అందించవలసిన ఓ రూ.21.24 ల చెక్కుని "క్రాస్" చెయ్యకుండా జారీకి ప్రయత్నించినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారట! ఇలా గతంలో యెన్ని చెక్కులు క్రాస్ చెయ్యకుండా ఆవిడ చేత సంతకాలు చేయించారో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఆర్వో ని ఆదేశించారట కూడా! 

హమ్మయ్య! కలెక్టరుగారికైనా "క్రాస్" అంటే యేమిటో తెలుసన్నమాట!





No comments: