Sunday, November 4, 2012

కబుర్లు-93




అవీ, ఇవీ, అన్నీ 



తెలుగు వెలుగు స్థాపించి, ఈనాడు చేస్తున్న తెలుగుభాషాభివృధ్ధి అభినందనీయం. 

కానీ, ఈనాడు పేపర్లో భాషాదోషాలు చూస్తే పంటి క్రింద రాయిలా బాధపడతాం. ఒక టైమ్స్ లోనో, హిందూలోనో యెక్కడోగానీ అప్పుతచ్చులు కనబడవు. మరి ఈనాడు జర్నలిజం స్కూల్లో భాషా దోషాల గురించి చెప్పరో యేమిటో.

చెప్పగా చెప్పగా, పదో వివాహాలూ, ముఫ్ఫై రెండో వివాహాలూ మానేసి, ఇప్పుడు చక్కగా ‘వివాహ 10వ…’ ఇలా వ్రాస్తూ, నమూనా ప్రకటన కూడా సవరించారు. సంతోషం.

మొన్న అదేదో స్కూల్లో పిల్లలని “సమైఖ్యాంధ్ర” అనే అక్షరాల ఆకారంలో నిలబెట్టి పేపర్లో ఫొటొ వేయించుకున్నారు. క్రింద వార్తలో కూడా అలాగే వ్రాశారు పేపరు వాళ్లు.  “సమైక్య” అనాలని ఆ స్కూలువాళ్లకీ తెలీదు, పేపరు వాళ్లకీ తెలీదనుకోవాలేమో. 

అలాగే, “అహర్నిసలు” (అహర్నిశలు); “అగ్రికీల” (అగ్ని కీల); “వర్ధాలు” (వ్యర్ధాలు) లాంటి మాటలతో వార్తలు రాస్తున్నారు. పైగా ఆ ప్రక్కనే “మాతృ భాషని కాపాడుకోవాలి” లాంటి ప్రబోధాలు.

ఇంక, గుళ్లలో వేదపండితులు లాంటి మాటలకితోడు, “అభిషేక పండితులు” లాంటి మాటలు పుట్టించారు. రేపు “అష్టోత్తర పండితులు”, “సహస్రనామ పండితులు”, “అర్చన పండితులు” కూడా పుట్టుకొస్తారేమో!

“టు మార్కెట్, టు మార్కెట్, టు బై ఎ ఫాట్ పిగ్” లాంటి రైమ్స్ కన్నా, “చేత వెన్నముద్ద” లాంటివి పిల్లలకి నేర్పించచ్చుకదా అని అమోఘమైన సలహా ఇచ్చాడొకాయన. 

నిజమేకదా. నన్నడిగితే, “పంచతంత్రం” చదివితేనే అసలు తెలుగంటే యేమిటో తెలుస్తుంది అంటాను నేను. 

“భలేవారే మీరు—బ్రహ్మ గురించి చెప్పాలంటే ‘నీళ్లలోంచి పుట్టిందాన్ని కుర్చీపీటగా కలవాడు ‘ (జలజాతాసనుడు) అని తెలుగులో అనాలంటారా మీరు?” అంటూ నవ్వుతాడు మా “పురాణపండితుడు” ఐన స్నేహితుడు!

ఈ మధ్య ఎందుకో “హేట్ ట్రిక్” మీద చర్చ వచ్చింది. యేదైనా ఓ కష్టమైన పనిని వరసగా మూడుసార్లు చెయ్యడం అనే అర్థంలో వాడుతూంటారు. 

ఈ మాట యెలా పుట్టింది అంటే, ఇంగ్లీషువాళ్లు తమ హేట్ ని గాల్లో యెగరేసి, అది మళ్లీ సరిగ్గా తమ తలమీద పడేలాగ చెయ్యడాన్ని ఓ ఆటగా చేసేవారు. మామూలుగా థీరీ ఆఫ్ ప్రాబబులిటీ ప్రకారం అలా మూడుసార్లు యెగరేస్తే ఓ రెండుసార్లు మాత్రమే సరిగ్గా పడడం గానీ, పడకపోవడం గానీ జరగాలి. 

అలా వరుసగా మూడుసార్లూ చెయ్యగలిగితే గొప్పే కదా? అదే హేట్ ట్రిక్! 
    

No comments: