Friday, November 16, 2012

కబుర్లు-95



అవీ, ఇవీ, అన్నీ
 
మొన్న వేలూరు దగ్గర అరియూరు లోని స్వర్ణ దేవాలయంలో భక్తులు 10,008 “నెయ్యి  దీపాలు” వెలిగించి, మొక్కులు తీర్చుకున్నారట. ఆందునిమిత్తం 5 టన్నుల నెయ్యి మాత్రమే వినియోగించారట.

మీసేవ” కేంద్రాల ద్వారా పలు రకాల సర్టిఫికెట్లు జారీ చెయ్యడానికి ఇప్పటికి 12 జిల్లాలను మాత్రం యెంపిక చేశారట. స్థిరాస్తి మీద ఈసీ లలో అమ్మకం, కొనుగోలు వగైరా వివరాలు ఈ యేడాది జూలై వరకే నమోదయ్యాయట. ఆ ఈసీ లుపట్టుకొని బ్యాంకులకి వెళితే, ఈ ఐదారు నెలల్లో యేమి లావాదేవీలు జరిగాయో అనే అనుమానం తో ఋణాలు మంజూరు చెయ్యడం లేదట. పోనీ సంబంధిత సబ్ రిజిస్ట్రారు కార్యాలయం లో తీసుకొందాం అంటే, దానికి ఫీజు మీసేవలోనే కట్టాలట. తీరా చేస్తే, ఈసీలకి బదులు తెల్లకాయితాలు వస్తున్నాయట. లేదా, ఆ సర్వే నెంబరు మొత్తానికి సంబంధించి కొన్ని వందల పేజీల వివరాలు వచ్చేస్తున్నాయట! భలే వెలుగుతున్నాయి కదూ మన కంప్యూటర్లు!

సైన్యానికీ, పోలీసులకీ యెంపిక కోసం కొన్ని కిలోమీటర్ల పరుగు పందాలు నిర్వహించడం, వాటిలో కొంతమంది చనిపోవడం గురించి ఇదివరకోసారి వ్రాశాను. ఒకాయన, “మరి దొంగలని పట్టుకోవాలంటే, ఆమాత్రం పరుగెత్తద్దా వాళ్లు?” అన్నాడు. అక్కడకి మన పోలీసులు అదేదో సినిమాలో తాడి మత్తయ్యలా “చేజ్” అంటూ దొంగల వెనకాల పరిగెత్తేస్తున్నట్టు

మరి రైల్వేలో గ్రూప్ డి యెంపికలకోసం పరుగు పోటీలెందుకో? దానికోసం పురుషులు 4 నిమిషాల 15 సెకన్లలో 1000 మీటర్లూ, స్త్రీలు 3 నిమిషాల 10 సెకెన్లలో 400 మీటర్లూ పరిగెడితేనే యెంపిక చేస్తారట! ఇంక రేపు బ్యాంకులు వగైరా వుద్యోగాలకి కూడా ఇలా పరుగు పోటీలు పెట్టేస్తారేమో!

ఈనాడువారు తెలుగుభాషతో ఇంకా గమ్మత్తులు చేస్తున్నారు. మనుషుల పేర్లూ వగైరాలముందు శ్రీ/శ్రీమతి/శ్రీయుతులు వగైరా గౌరవ వాచకాలు పెట్టడం యెప్పుడో మానేసి, కొన్ని లక్షలు ఖర్చు తగ్గించుకుంటున్నారు. సరే.

మొన్న ఒకాయన వ్రాసిన “మద్భవద్గీతామృత” గ్రంధాన్ని ఆవిష్కరించారట! (నిజంగా ఆ వ్రాసినాయనే శ్రీ పెట్టలేదేమో అనుకున్నాను.) ఆ వార్తలోనే, “……..మత్తిరుమల వెంకట…….ఆచార్యులను….ఘనంగా సన్మానించారు” అని వ్రాశారు! “మత్తిరుమల” అనే ఇంటిపేరు లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను. మన జర్నలిస్టులు తెలుగు ని యెంతబాగా వెలిగించేస్తున్నారో!

ఈ మధ్య కొన్ని సభలూ సమావేశాలు నిర్వహిస్తూ, వాటి ముందో తరవాతో “సాంస్కృతిక కార్యక్రమాలు” జరిపించేస్తున్నారు. వాటిలో మొన్నటివరకూ “సారొత్తారొత్తారా….” అనో, “కెవ్వ్ కేక…..” అనో, “మున్నీ బద్ నామ్…..” అనో, ఇప్పుడు “చాయ్…..గరం చాయ్…..” అనో డ్యాన్సులు చేయించేస్తున్నారు. వీటిని "సాంస్కృతిక కార్యక్రమాలు" అనాలంటే………??!!! 

ఇంకొంతమందైతే, చిన్నపిల్లలచేత కూచిపూడి—కుండమీదా, ఇత్తడి పళ్లెం మీదా, నెత్తిమీద చెంబులు ఒకదాని మీదొకటి పెట్టుకొనీ, చేతుల్లో జ్యోతులో, కొవ్వొత్తులో పెట్టుకొనీ—నృత్యాలు చేయిస్తున్నారు. 

నన్నడిగితే, తల్లిదండ్రులూ, టీచర్లూ ఇలాంటి వాటిని ప్రోత్సహించి వాళ్ల టేలంట్ వృధా కాకుండా చూస్తే మంచిది!

యేమంటారు?      

No comments: