Saturday, September 21, 2013

కబుర్లు - 101అవీ, ఇవీ, అన్నీ

దాదాపు సంవత్సరం అయిపోయింది బహిరంగంగా సణిగి.....కారణాలకేం......సవాలక్ష. ఇదిగో మళ్లీ ఇప్పుడు.

అర్థంలేని ఆథార్: మన ప్రభుత్వంలోని రా నా లు పార్లమెంటుతో యెలా ఆడుకుంటున్నారో చూస్తే, మన ఎం పీ లు--తమ జీతాలూ, ఇతర ఉపయోగాలూ, పెన్షన్లూ తప్ప--యేమి బావుకుంటున్నారా అనీ, వాళ్లకి వోట్లు వేసిన ప్రజల్ని యెంత వెర్రి వెధవలుగా జమకడుతున్నారో అనీ అనిపించడం లేదూ? 

ఒక్క ఆథార్ విషయం లోనే, మంత్రులు అనేకసార్లు "ఆథార్ ఒక గుర్తింపు సంఖ్య మాత్రమే" అనీ, "గ్యాస్ కనెక్షన్లకీ ఆథార్ కీ సంబంధం లేదు" అనీ, "ప్రభుత్వ పథకాలకీ ఆథార్ కీ సంబంధం లేదు" అనీ, "ఆహార భద్రతకి ఆథార్ లేనివాళ్లు కూడా అర్హులే" వగైరా సమాధానాలు--లిఖితపూర్వకంగా--ఇచ్చారు.

కానీ, జరుగుతున్నది? మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో, గ్యాస్ బుకింగ్ కి ఆథార్ లింకు పెట్టేశారు మొన్న ఏప్రియల్ నెల నుంచీ! మా జిల్లాతోపాటు, ఇంకొన్ని జిల్లాలని కూడా అక్టోబరు నెలనుంచీ గ్యాస్-ఆథార్ లింకు క్రిందికి తెస్తామని ప్రకటించారు. (దీనికో పదబంధం--ఆథార్ సీడింగ్--అంటూ తయారు చేశారు. అది వేరే ప్రహసనం). 

ఓ ప్రక్క జిల్లాలో ఇంకా అందరికీ ఆథార్ నెంబర్లు రాలేదనీ, కొన్ని లక్షల మందికి ఇంకా రావాలనీ, వాళ్లలో గ్యాస్ కనెక్షన్లు వున్నవాళ్లు కొన్ని లక్షలమంది అనీ, ఆథార్ వచ్చినవాళ్లలో సీడింగు కానివారు కొన్ని లక్షలు అనీ, ఈ లోగా ఓ 7న్నర లక్షల మందికి నమోదు చేసిన వివరాలు సాఫ్ట్ వేర్ లోపంతో మాయం అయ్యాయి అనీ, అది బాగు పడితే అందులో కొంతమందికి ఆథార్ వచ్చే అవకాశం వుండొచ్చు అనీ, అందరికీ ఆథార్ రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు అనీ, 'త్వరలో' శాశ్వత నమోదు కేంద్రాలు తెరుస్తాము అనీ--ఇలా వెర్రి మొర్రి ప్రకటనలు చేస్తూనే వున్నారు అధికారులు! 

సందట్లో సడేమియా లా, కొన్ని బ్యాంకులు గ్యాస్ కంపెనీలతో కుమ్మక్కు అయి, తమ వ్యాపారం పెంచుకొనే వ్యూహంలో భాగంగా, వినియోగదారుల వివరాలు సేకరించి, వారి పేర్లతో ఖాతాలు తెరిచేసి, అథార్ సీడింగ్ చేసేసి, ప్రభుత్వ సబ్సిడీని ఆ ఖాతాల్లో వేసేసుకున్నారట! పాపం జనాలు తమకు అదివరకే వున్న ఖాతాలకి సబ్సిడీ రాలేదే అని వెర్రి చూపులు చూస్తున్నారట. 

ఈ లోగా, మా జిల్లాలో లింకుని ఓ నెల ముందు నుంచే, అంటే సెప్టెంబరు నెలనుంచే, అని ప్రకటించి మొదలెట్టేశారు. ఇక జనాల పాట్లు ఆ పైవాడికే యెరుక! పైగా, ఇప్పటికే ఆరు సిలిండర్లు తీసేసుకుని వుంటారుకాబట్టి, మిగిలిన మూడూ "పూర్తి ధర" చెల్లించేసి కొనేసుకుంటే, ఆథార్ వచ్చేక యేకంగా మూడింటి సబ్సిడీ ఒకేసారి ఇచ్చేస్తారట! ".....తలకి రోకలి చుట్టడమొకటే తరవాయి" అన్నట్టు.

అసలు ఆథార్ ని ఇష్టం వచ్చినట్టు వాడుకోండి అని చమురు కంపెనీలకి యెవరు అధికారం ఇచ్చారు? ఈ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పగలిగిన--వెయ్యేళ్లు నంతో ర్థిల్లాలి అనుకొనే రా నా లు--యెవరైనా వున్నారా? 

ప్రజలలో యే వొక్కరైనా "నాకు ఆథార్ వల్ల ఇదివరకు లేని ఫలానా కొత్త ప్రయోజనం కలిగింది" అని గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా?

ఇంక మనం "ఈ ఆథార్ ని రద్దు చేసి, దాని వ్యవహారంలో ప్రభుత్వాలు యెంత ఖర్చు పెట్టాయి, అందులో యెన్ని లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి మొదలైన విషయాల్లో దర్యాప్తు చేయించి, బాధ్యులకి శిక్షలు పడేలా చేస్తాము" అని ప్రమాణం చేసే వాళ్లకే వోటు వేస్తాము అని వుద్యమం లేవతీస్తె తప్పేమైనా వుందంటారా?

ఇంక రాష్ట్రంలో వుద్యమాల విషయం యెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు తెలుగువాళ్లందరూ కలిసి, మదరాసునగరం (ఇప్పటి చెన్నై) రాజధానిగా, యానాం, బళ్లారి, హోస్పేట వగైరాలతో "విశాలాంధ్ర" కావాలని "ఎర్తు" పెడితే గానీ, పిచ్చిదంబరం లాంటి యూపీయే మంత్రులకి దిమ్మతిరిగి బొమ్మ గూట్లో పడదు అని నా వుద్దేశ్యం. మీరేమంటారు?

మొత్తానికి కొరకరాని కొయ్యగానే పదవీ విరమణ చేసేశారు దువ్వూరివారు. ఇంక జున్నుముక్క లాంటి "రాజన్" వచ్చారని సంతోషించినంతసేపు పట్టలేదు చాలామందికి. "ద్రవ్యోల్బణం" మాత్రమే బాగా దృష్టిలో వుంచుకొని, కీలక రేట్లు తగ్గించకుండా, రెపో రేటు పెంచుతూ, ప్రకటన చేసేశారు! పనిలో పనిగా, వ్యవస్థని ఆర్ బీ ఐ అదుపులో లేకుండా చేస్తున్న "లిక్విడిటీ అడ్జస్ట్ మెంట్ ఫెసిలిటీ"; "మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ" వగైరాలనీ, అసలు రిపాజిటరీనే రద్దు చెయ్యగలిగితే యెంతో సంతోషిస్తాను నేను!

ప్రస్తుతానికింతే.......

7 comments:

TVS SASTRY said...

Well said.It is a fact!

Anonymous said...

after a long time. welcome back

Ammanamanchi Krishna Sastry said...

డియర్ శాస్త్రిగారు!

చాలా సంతోషం.

ధన్యవాదాలు.

Ammanamanchi Krishna Sastry said...

డియర్ puranapandaphani!

సంతోషం.

మీ స్వాగతానికి ధన్యవాదాలు.

sri said...

sir....chaalaa kaalam taruvaata malli mi kotta post.....happy to read

sri said...

sir...konta kaalaniki gaali peelchadaniki kooda aadhaar number kaavaalani antaaremo ????

Ammanamanchi Krishna Sastry said...

డియర్!

అంత భయం అఖ్ఖర్లేదు. నిన్ననే ఓ మహానుభావుడు వేసిన కేసులో సుప్రీం కోర్టు మొట్టికాయ వేసింది ప్రభుత్వానికి!

ఇప్పుడు మళ్ళీ అప్పీలు చేస్తామంటున్నారు సిగ్గులేని ప్రభుత్వం వారు.

ఇంకో వె.ధ.వ (వెయ్యేళ్లు ధనంతో వర్ధిల్లాలి అనుకొనేవాడు) "ఆథార్ కావాలని అంటున్నవాళ్లు కేవలం ఆయా శాఖలే కానీ, ఆథార్ సంస్థ వాళ్లకి అలా అనమని చెప్పలేదు" అంటాడు! (మరి ఆ శాఖలకి యే వె.ధ.వ లు చెప్పారో?)

చూద్దాం!

ధన్యవాదాలు.