Monday, November 12, 2012

కబుర్లు-94



అవీ, ఇవీ, అన్నీ

మౌలానా అబుల్ కలాం అజాద్ అని ఓ గొప్ప దేశ భక్తుడు వుండేవాడు. స్వతంత్ర పోరాట సేనానీ…..వగైరా. (ఆయన తనను తాను మైనారిటీని అని యెప్పుడూ చెప్పుకోలేదు). 

ఈయనొకడుండేవాడని క్రితం సంవత్సరం ఈ రోజుకి కూడా యెవరికీ జ్ఙాపకం లేదు. హఠాత్తుగా మొన్న గుర్తొచ్చి, ఇప్పుడు ఆయన 124వ జయంతి జరిపించారు. పనిలో పనిగా దాన్నే ‘మైనారిటీ దినోత్సవం’ అనో యేదో అన్నారు.

గత కొన్ని వారాలుగానో, నెలలు గానో భాగ్యనగరంలో హిందూ దేవాలయాలమీద—కనీసం 12 నుంచి 18 మీద—దాడులు జరిగాయట. కొన్నింటిమీద రాళ్లు రువ్వడం, కొన్నింటిని ధ్వంసం చెయ్యడం, కొన్నింట్లో విగ్రహాల ఆభరణాలనీ విలువైన వస్తువులని దొంగిలించడం వగైరా. 

అయినా మతసామరస్యం వెల్లివిరుస్తోంది. కలహాలు రాలేదు.

మరి ఎ ఐ ఎం ఐ ఎం (మజ్లిస్) పార్టీ ప్రభుత్వానికి మద్దతు వుపసం హరించుకోవాలని ఆలోచిస్తోందని తెలియగానే, ఆజాద్ గారు గుర్తొచ్చాడు!

యేమిటో ఈ రాజకీయాలు!

ఆకాశ్ టేబ్లెట్లని రాష్ట్రపతి ఆవిష్కరించారు. (ఇవి జ్వరం వస్తే వేసుకొనే టేబ్లెట్లు కాదు. ప్రభుత్వాల అవినీతి జ్వరాలని పెంచేవి). వీటిని ప్రభుత్వం ఒక్కోటీ రూ.2,263/- లకి ‘డాటావిండ్’ సంస్థ నుంచి కొనుగోలు చేస్తోందట. విద్యార్థులకి ఒక్కోటీ రూ.1,130/- లకే అందిస్తోందట. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాయితీ ఇస్తే, (అంటే మిగతా రూ.1,133/- లనీ అవి భరిస్తే) పూర్తిగా ‘వుచితంగా’ వాటిని అందిస్తారట. 

దేశంలోని “22 కోట్లమంది” విద్యార్థులకి వచ్చే ఐదేళ్లలో అందరికీ ‘అందిస్తారు ’ట. (22 కోట్లూ X 2,263 = ?) 

సోమవారం ఒక్కరోజే 20 వేల టేబ్లెట్లని విద్యార్థులకి అందించనున్నారట. (20,000 X 2,263 = ?)

అన్ని రాష్ట్రాల్లోనూ ఈ వ్యవహారం నడుస్తూందట. 

కృషి బాగుంది కదూ?

మనలో చాలామంది ఈ మెయిల్ మెస్సేజ్ వ్రాశాక, క్రింద “అత్యవసరం అయితేనే దీని ప్రింట్ తీసుకోండి. దానిద్వారా (కాగితాల అవసరాన్నీ, వాటికి అవసరమయ్యే చెట్లని నరకడాన్నీ, నివారించి) పర్యావరణాన్ని కాపాడడానికి తోడ్పడండి” అని వ్రాస్తూ వుంటారు. అంత చక్కటి అవగాహన వుందని నిరూపించుకుంటున్నందుకు అందరూ సంతోషిస్తున్నారు. 

ప్రభుత్వాలు కూడా, ఓ ముఫ్ఫై నలభై యేళ్ల క్రితమే, వంటచెరకు కోసం కట్టెలు కొట్టడం మానెయ్యమనీ, వాటి బదులు పొగలేని పొయ్యిలూ వగైరా వాడండి అనీ ప్రచారం చేసుకొంటూ, ఇప్పటికి దాదాపు అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి, బోళ్లు చెట్లని కాపాడేశారు!

ఇప్పుడు మళ్లీ మొదటి గడిలోకే పంపిస్తున్నారు! 

ప గో జి లోనే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలే మొత్తం 9 వుంటే, వాటిలోని సుమారు 5,400 మంది విద్యార్థినీ విద్యార్థులకి వుదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం వండించాలంటే, ఒక్కో పాఠశాలకీ నెలకి ఓ 70 గ్యాస్ సిలిండర్లు ఖర్చు అవుతాయట. (మొత్తం 9 X 70 = ?).  

వండి వడ్డించేవాళ్లకి ఒకో విద్యార్థికీ రూ.2.55 పైసలు ఇస్తున్నారట. దాంట్లోనే గ్యాస్ ఖర్చులు కూడా భరించాలట. 

ఇప్పుడు రెండు నెలలకి ఒకటే సిలిండరు సబ్సిడీ పై ఇస్తాము అంటే, మిగిలిన వాటిని యెక్కువధరకి కొనలేక, ఇప్పుడు మళ్లీ కట్టెల పొయ్యిలూ, గాడి పొయ్యిలూ మీద వంటలు మొదలు పెట్టేరుట. 

హౌరా! యెంతటి ప్రగతి! యెంతటి పర్యావరణ ప్రేమ!

రేపు దీపావళికి షిరిడీలో 30 సెకన్లలో లక్ష నూనెదీపాలు వెలిగించడానికి సుమారు “2,500 లీటర్ల” నూనెని వినియోగిస్తారట! (ఇదంతా గిన్నిస్ రికార్డుకోసమట).  

మరి దీపావళికి మిగిలిన గుళ్లలోనూ, కార్తీక మాసం పూర్తయ్యేసరికి మొత్తం—యెన్ని వేల లీటర్ల నూనె వినియోగమవుతుందో, యెన్ని “రికార్డులు” బ్రద్దలవుతాయో, నూనెల ధరలు యెంత పెరుగుతాయో

యెంతమందికి యెన్ని (పర్సులు) “బ్రద్దలవుతాయో!” వాటికేమయినా “రికార్డు” వుందో లేదో మరి!

మన పత్రికలవాళ్లు భలే గమ్మత్తులు చేస్తూంటారొకోసారి. మొన్న మా జిల్లా ఈనాడు పేపర్లో రెండువార్తలకి సమాన ప్రాముఖ్యం ఇస్తూ, ప్రక్క ప్రక్కనే దాదాపు ఒకే సైజు శీర్షికలతో ఇలా వ్రాశారు—“పరామర్శలతో ఒరిగేదేమీ లేదు” అనీ; “మూర్తి రాజుకు ఎస్పీ పరామర్శ”—అనీ. 

అదేమిటీ? పాపం స్వాతంత్ర్య సమరయోధుడూ, ప్రముఖ గాంధేయవాదీ, మూర్తిరాజుగారిని పరామర్శిస్తే, యెవరికి కష్టం కలిగిందీ? అనుకుంటూ ఇంకో వార్త చదివితే, ఓ భాజపా నాయకుడు “వరదల వల్ల నష్టపోయిన వాళ్లకి, ప్రభుత్వ పరామర్శలతో ఒరిగేదేమీ లేదు” అన్నారు—అని!

అదీ సంగతి.

అన్నట్టు రాబోయే ప్ర తె మ లో “ఉరుదూ ముషాయిరా” జరిపిస్తారట. ఇంకా ఇతరభాషలవాళ్లనీ పిలిచి వాళ్ల భాషల అభివృధ్ధి గురించి కూడా మాట్లాడతారట.

ఇంకా, గ్రామ, మండల, రెవెన్యూ డివిజన్, జిల్లా—ఇలా అన్ని స్థాయుల్లోనూ వూరేగింపులూ గట్రా జరపడానికీ, “మేముకూడా ప్ర తె మ ల్లో పాల్గుంటున్నాం!” అనే భావన ప్రజల్లో కలిగేలా కార్యక్రమాలని నిర్వహించడానికి జిల్లాకో 20 లక్షలు మాత్రమే కేటాయిస్తున్నారట! (బలై పోయేది పాపం స్కూళ్ల పిల్లలే కదా?!) 

యెంత చక్కని భాషాభివృధ్ధి కృషో కదా?
    
నిన్న ఆదివారం హైదరాబాద్ జవహర్ బాల భవన్ లో ‘జాతీయ విద్యా దినోత్సవం ’ జరపడానికి మంత్రిగారొస్తున్నారంటే, స్కూలు పిల్లలెవరూ రాలేదట! అప్పటికప్పుడు అధికారులు స్కూళ్లకి ఫోన్లు చేసి, విద్యార్థులని వున్నవాళ్లని వున్నట్టు అక్కడికి తరలించమని ఆర్డర్లు వేశారట. 

తీరా అక్కడికి వచ్చిన పిల్లల్లో ఓ రెండువందలమందిని యూనిఫారాలో, పాదరక్షలో లేవని గెంటేశారట

(అప్పటికే హాలు నిండిపోయినందున కొంతమందిని గెంటెయ్యడం నిజమే గానీ, యూనిఫారాల గురించి కాదు అన్నారట అధికారులు!) 

యే రాయైతేనేం? వూడింది విద్యార్థుల పళ్లే కదా? 

పోనిద్దురూ!   
 

7 comments:

Anonymous said...

మన వాళ్ళు శరీరాన్ని కష్టపెట్టకుండా guiness record లోకి ఎక్కడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు .

మాగంటి వంశీ మోహన్ said...

haha...this is a "killer" post, how ever you may take it......love it....

Anonymous said...

This post is like 2012 Deepavali Cracker.

A K Sastry said...


మొదటి అన్నోన్!

వాళ్ల శరీరం కష్టపడకపోయినా, జనాల బుర్రలు వాయిస్తే యెలా?

A K Sastry said...


డియర్ వంశీ!

నచ్చినందుకు సంతోషం.

ధన్యవాదాలు.

A K Sastry said...


రెండో అన్నోన్!

దీపావళి టపాసు ముందే పేలిందంటారా?

ధన్యవాదాలు.

A K Sastry said...


డియర్ తెలుగు వారి బ్లాగులు!

మంచి కృషే చేస్తున్నారు. సంతోషం.

నా ఈ బ్లాగునేకాకుండా నా బ్లాగు లిస్ట్ లోని అన్నింటినీ నిరభ్యంతరంగా ఆ సముదాయం లో జతపరచవచ్చు.

ధన్యవాదాలు.