Tuesday, December 7, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ!

ఇప్పటివరకూ మన ముక్కు--సారీ, ముఖ్యమంత్రి యేమేమి నిర్ణయాలు తీసుకున్నాడో గానీ, ఒకటిమాత్రం నాకు బాగా నచ్చేసింది. తనకి దండలూ, బొకేలూ, శాలువాలూ ఇవ్వడం మానేసి, అందుకు అయ్యే ఖర్చుని 'ముఖ్యమంత్రి సహాయనిధి' కి చెక్కుల రూపం లో ఇమ్మన్నాడట.

మొన్న ప్రభుత్వోద్యోగులు ఓ పాతికవేల చెక్కునిచ్చారట. ఒకాయన వినకుండా శాలువా కప్పబోతే, సున్నితంగా తిరస్కరించారట. బాగుంది కదూ!

మరి మొన్న 04-12-2010 నాడు, ఏపీజెన్‌కో వారు ఓ 25 లక్షలు మాత్రమే ముఖ్యమంత్రి సహాయనిధికి యిచ్చారట! యే ఖాతాలోంచి, యెందుకు, యిప్పుడే యిచ్చారో యెవరికైనా తెలుసా?

అన్నట్టు, యోగా గురు బాబా రాందేవ్ ఓ రెండేళ్లలో ఓ కొత్త రాజకీయ పార్టీ పెడతాను అని ప్రకటించాడు. అంటే......యెంత, యెలా సంపాదించాడో సంబంధితులు ఓ లుక్కేస్తే యెలా వుంటుందంటారు? అయినా మనకెందుకులెండి రాజకీయాలు.

మొన్న 03-10-2010 న భాజపా అధ్యక్షుడు నితిన్ గడ్కరీ కుమారుడి వివాహ రిసెప్షన్ యెంత వైభవంగా జరిగిందంటే, రాజకీయ, సినీరంగ ప్రముఖులు వేసుకొచ్చిన "ప్రత్యేక విమానాలతో" ఆరోజు రాత్రి నుంచి మరునాడు మధ్యాహ్నం వరకూ, గగనతలంలో ట్రాఫిక్ జామ్ ఐపోయి, సాధారణ విమానాలూ, ప్రయాణీకులూ ఇబ్బందులు పడ్డారట--ఆలస్యాలు అయిపోయి!

ఇక 04-10-2010 న సాయంత్రం యేర్పాటు చేసిన 'సాధారణ విందు' కు 2 లక్షల మందికి మాత్రమే యేర్పాట్లు చేశారట!

వాళ్ల పార్టీ మీటింగుని ఖరీదైన డేరాల్లో, పెద్దవాళ్లకి పెద్దవీ, చిన్నవాళ్లకి చిన్నవీ, ఏసీలతోనూ, లేకుండాను--ఇలా నిర్వహించి, ఇండీపాప్ సింగర్లా పాటలు పాడుతూ గెంతుతుంటే యేమిటో అనుకున్నాను! నిజంగా అసాధ్యుడే!

ఇక మొన్న 04-12-2010 న దుబాయి నుంచి పుణె వస్తున్న ఎయిరిండియా విమానం గాల్లో ఒక్కసారిగా 7 వేల అడుగుల మేర క్రిదకు పడిపోయిందట!

కారణం యేమిటనుకున్నారు? పైలెట్ స్నానాలగది లోకి వెళ్లినప్పుడు, కో-పైలెట్ 'తన సీటును ముందుకు జరిపే ప్రయత్నంలో' చెయ్యి ఓ మీటకి తగిలి, విమానం 26 డిగ్రీల కోణం లో వంగి క్రిందకి పడిపోతుంటే, పైలెట్ కాక్ పిట్లోకి వచ్చి దాన్ని నియంత్రించాడట!

ఇది అధికారికంగా డి జీ సీ యే చెప్పిన మాటే! ఆవిమానం లో 113 మంది ప్రయాణీకులు వున్నారట.

మరి ఆ కో-పైలెట్ కి ఇంతకు ముందు ఓ గాడిదనైనా నడిపిన అనుభవం వుందో లేదో! విమానంలో ముఖ్యమైన 'కంట్రోల్స్' అలా యేడుస్తున్నాయేమో!  

2 comments:

పానీపూరి123 said...

>పైలెట్ కాక్ పిట్లోకి వచ్చి దాన్ని నియంత్రించాడట!
ఇంతకూ ఆ పైలెట్‌కి ఆ రోజు వెళ్ళిన పని అయిందో లేదో?

A K Sastry said...

డియర్ పానీపూరి123!

మీరు సరదాకన్నా, మంచి టాపిక్ లేవనెత్తారు.

సాధారణంగా 'టెన్షన్' తో పని చేసే వుద్యోగులు 'రిలీవ్' అయ్యేది అక్కడే! అతి కష్టమ్మీద ఆపుకొంటూ, 'హమ్మయ్య! అంతా బాగానే వుంది' అనుకున్నప్పుడే వాళ్లు 'అక్కడికి' వెళ్లి, పనయ్యాక, 'హమ్మయ్య!' అనుకుంటారు.

ఆలోపల 'రివరీ' లోకి వెళ్లిపోయి, కొంత ఆలస్యం అవుతున్నా, ఆనందిస్తూనో, బాధపడుతూనో, బయటికి రారు. సరిగ్గా అలాంటప్పుడే ఏక్సిడెంట్లు జరుగుతూంటాయి--వాళ్ల ప్రమేయం లేకుండా!

ఆర్థర్ హెయిలీ 'ఎయిర్ క్రాఫ్ట్' నవల చదివే వుంటారు--పాపం ఆ ఏటీసీ మనసెంత క్షోభిస్తూవుంటుంది! దానికి కాంపెన్సేషన్ గా కొన్ని వందలమంది ప్రాణాలు నిలబెట్టి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు!

అవీ 'నిష్కామ కర్మలు' అంటే!

చాలా సంతోషం. ధన్యవాదాలు.