Sunday, April 25, 2010

బండారం......


.....బయట పడింది

లేదా, బయట పెడతాను అని బెదిరిస్తారు--లలిత్ మోడీ లాంటి వాళ్ళు.

అసలు యెక్కడిదీ 'బండారం'?

'భాండాగారము'--అంటే, కుండలు నిక్షిప్తం చేసే చోటు.

అప్పట్లో లోహపాత్రలు లేవుకాబట్టి, కుండలలోనే నిలువ చేసేవారు సమస్త సంపదల్నీ--బంగారం వెండీ కావచ్చు, నెయ్యీ నూనీ కావచ్చు, పప్పులూ వుప్పులూ కావచ్చు, పుస్తకాలు కావచ్చు--యేమైనా. ఆ చోటునే ఫలనా 'భాండాగారం' అనేవారు.

అవసరాన్ని బట్టి, అవి నేలమాళిగల్లో కూడా వుండేవి. శత్రువుల నించి ప్రమాదం వుంటే, అవి రహస్య స్థావరాల్లో కూడా వుండేవి. అక్కడకి వెళ్ళడానికి పటాలూ (మేప్ లు), రహస్య కోడ్ లూ, కొండ గుర్తులూ యేర్పాటు చేసుకొనేవారు.

తరవాత్తరవాత, పాత్రలూ, పెట్టెలూ మారినా, పేరు మాత్రం భాండాగారం అనే స్థిరపడింది.

తంజావూరులో వున్న 'సరస్వతీ మహల్' అనేది ఓ పుస్తక భాండాగారం! (అక్కడ వున్న తాళపత్ర గ్రంధాలూ అవీ ప్రపంచం లో మరెక్కడా లేవంటారు.)

రహస్య గోపనం లో వున్న భాండాగారాన్ని, బయట పెట్టడమే--'బండారం బయట పెట్టడం'!

ఈ పదానికి అనేక రూపాంతరాలు--భండారం, బంగారం--ఇలా.

మన రాష్ట్రం లో మన ఆహార భాండాగారాలలో (ఎఫ్ సీ ఐ వాళ్ళ గోదాముల్లో) జరుగుతున్న 'బండారాన్ని' బయట పెట్టేవాళ్ళు యెవరూ కనపడటం లేదు!

మూడేళ్ళ క్రితం నాటి బియ్యమూ, రెండేళ్ళనించి యేడాది క్రితం నాటి గోధుమలూ నిండి వున్నాయట వాటిలో!

మూడేళ్ళు దాటిన వాటిని ముక్కిపోయాయని సముద్రం లో పారబోస్తారట.

ఇప్పుడు బియ్యం కొంటే, నిలవ చెయ్యడానికి జాగా లేదట! అందుకని కొనడం లేదట. మిల్లర్లనీ అమ్ముకోనివ్వడం లేదట. (ఇదో వంక! వాళ్ళకి)

మార్కెట్ లో బియ్యం ధర మాత్రం తగ్గదు! రేషన్ దుకాణాల్లో పంజాబు బియ్యాన్నే ఇస్తారు!

కీలకం యెక్కడుంది మరి?

రోశయ్యల్లోనా? అధికారుల్లోనా? జనాల్లోనా?

ఆలోచించండి.


No comments: