Monday, April 12, 2010

'మద్యం' దిన మార్తాండులు


మద్యో రక్షతి రక్షితః

కాంగీరేసులు పుట్టినప్పటి నుంచీ మేనిఫెస్టోలో, "దశలవారీ మద్య నిషేధానికి కట్టుబడి వున్నాం" అని వాగ్దానిస్తారు.

చంద్రబాబు టైములో ఏ పీ బెవరేజస్ కార్పొరేషన్ అని ఓ ప్రత్యేక కార్పొరేషన్ మద్యం సరఫరాని నియంత్రించేది.

రెడ్డిగారు వచ్చాక, దానికి గవర్నమెంటు డిపార్ట్ మెంటునే యేర్పాటు చేసి, డిస్టిలరీ డెవలప్ మెంట్ బోర్డ్ అని పేరు పెట్టి, అభివృధ్ధిని చూపించమన్నారు!

2004 లో మన రెడ్డిరాజుగారు పీఠమెక్కాక, దాదాపు 2006 వరకూ బెల్టు షాపులు వందల్లో వుండేవి. పైగా, మద్యం సీసాలని వాటిపై ముద్రించిన ఎం ఆర్ పీ కన్నా కొంత తక్కువకి, లేదా ఎం ఆర్ పీ తో సమానం గా అమ్మేవారట.

తరవాత, రోశయ్యగారి వసూళ్ళకోసం, బెల్టులు వేల సంఖ్యలోకి వెళ్ళిపోయాయి. ఎక్సైజ్ వారికి ప్రొత్సాహకాలు ఇవ్వడం మొదలయ్యింది.

సరే......వుదరపోషణార్థం బహూకృత వేషం అనుకున్నా, బెల్టులూ, బూట్లూ, టై లూ ఇబ్బడిముబ్బడిగా పెంచినా, ఆదాయం కోసం అని సరిపెట్టుకోవచ్చు! కానీ, ఎం ఆర్ పీ కన్నా 10 నించి 40 రూపాయలు యెక్కువకి అమ్మడం అప్పుడే మొదలయ్యిందట. మరి దీన్నేమనాలి? ఇది యెవరి బాగుకోసం వుద్దేశించినది?

ఓ ఐదారు నెలలు ఇలా యెక్కువ ధరలకి అమ్ముకున్నాక, కంపెనీ రేటుని ఈ యెక్కువ ధరదగ్గరే స్థిర పరచేందుకు కంపెనీలకి అనుమతిస్తున్నారట. మళ్ళీ షాపులవాళ్ళు కంపెనీ రేట్లమీద 10 నుంచి 40 రూపాయలు యెక్కువకి అమ్మడం మొదలెడుతున్నారట!

ఈ విషవలయానికి అంతం యెప్పుడు?

రెడ్డిగారి వారసత్వం పుచ్చుకున్న రోశయ్య తక్కువ తిన్నాడా?

ఓ పెద్దా చిన్నా కాని పట్టణం లో కనీసం 10 మద్యం షాపులు వుంటే, ఒక్కొక్క షాపూ ప్రతీ నెలా ఎక్సైజ్ సీ ఐ గారికి ఒకటో తారీకుకల్లా 'ఒక లక్ష ' ముట్ట చెపుతారట. అలా 10 షాపుల్నించీ పది లక్షలు! మరి ఆ పైవాళ్ళూ, క్రిందవాళ్ళ సంగతి తెలియదు.

(ఇదైనా, వ్యాపారులు జనాంతికం గా వెల్లడించిన నిజం!)

మరి వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట కాదూ?

ఈ మధ్య మా పక్క జిల్లాలో ఎక్సైజ్ శాఖ కమీషనరు ఐ యే ఎస్ అట. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి గా ఓ ఐ పీ ఎస్ వచ్చాడట. రాగానే, ఎం ఆర్ పీ కన్నా యెక్కువకి అమ్ముతున్న దుకాణాలపై దాడులు మొదలు పెట్టాడట.

ఇంకేముందీ! కమీషనరుగారు బహిరంగం గా ఈ ఐ పీ ఎస్ గారి దుమ్ము దులిపేసి, "యెట్టి పరిస్థితులలోనూ దుకాణాలపై దాడులకి దిగొద్దు" అని ఎన్ ఫోర్స్ మెంట్ వాళ్ళకీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకీ అనధికార వుత్తర్వులు జారీ చేశారట.

చూశారా! యెంత బాగుందో?

వినియోగదారుడు (వాడు మద్య వినియోగదారుడైనా సరే) నష్టపోకుండా, వ్యాపారులు అడ్డం గా బలవకుండా చేసే యంత్రాంగం యేర్పాటు చెయ్యలేదా--మన ప్రభుత్వం?

ఇకనైనా బుధ్ధి చెపుతారా వీళ్ళకి?


2 comments:

TM Raveendra said...

ప్రగతి పేరున రాజకీయం ఆట....మద్యం వేలం పాట
ప్రతి వూరునా రోజూ హేయం బ్రతుకు బాట

చిత్రమేమి? విచిత్రమేమి? ప్రజలకు మత్తు నేర్పిన ప్రభువులు వుండగా ?
చిద్ర మై...చితుకులై...చితికి చేరిన మత్తు బానిస బ్రతుకులు వుండవా?

గాంధీ వాదం తో కపట రాజకీయ పార్టీలు
బ్రాందీ వాసన తో రాత్రికి డిన్నర్ పార్టీలు

కాలేయల్ని కాల్చేసే, ఖలేజాని చీల్చేసే
ప్లీహాన్ని పిప్పి చేసే, పేగుల్ని పంచర్ చేసే

వీధికో బ్రాందీ షాపు… బోనస్ గ బెల్ట్ షాపులు
నిధుల కోసం విధులు మరచిన నిస్సిగ్గు నేతలు

కృష్ణశ్రీ said...

డియర్ TM Raveendra!

మీ కవితారూప ప్రశంస బాగుంది.

సంతోషం.

ధన్యవాదాలు.