Thursday, April 1, 2010

సమాధులూ.....

"ఇదోరకం వేలం....."

కుక్క మనిషిని కరిస్తే, అది వార్త కాదు. అదే మనిషి కుక్కని కరిస్తే, అది వార్త!--ఇది శతాబ్దాలుగా వాడుకలో వున్న మాట.

ఈ మధ్య టి.నరసాపురం మండలం యేపుగుంట గ్రామం లో ఓ కోటిలింగం అనే ఆయనకి చెందిన కోడి పెట్ట 'కొక్కొరోకో!' అని కూస్తోందట. ఇదో వార్తే కదా.

ఆ మధ్య యేలూరులో అదేదో కట్టడానికి తవ్వుతుంటే, కొన్ని సమాధులు బయట పడ్డాయట. అవి మునుపు అక్కడ పనిచేసిన బ్రిటిష్ వాళ్ళవని నిర్ధారించారట. కొన్నాళ్ళకి పురావస్తుశాఖవారు వాటిని స్వాధీనం చేసుకున్నారట. మొన్న వాటిని 'చారిత్రక ప్రాధాన్యం ' వున్న సమాధులుగా పరిరక్షించడానికి నిధులు కూడా కేటాయించారట--కొన్ని కోట్లో, లక్షలో!

మరి ఆ మాటకొస్తే, అన్ని సమాధులూ చారిత్రక ప్రాధాన్యం వున్నవే కదా? బ్రిటిష్ వాళ్ళ సమాధులూ, కుతుబ్ షాహీ సమాధులూ వూడబొడిచిందేమిటి? అవేమైనా తాజ్ మహళ్ళా! పిరమిడ్లా! పోనీ వాటి మీద శిల్పకళా, చిత్రకళా వగైరా యేమైనా వున్నాయా? మరి వాటిని ప్రత్యేకం గా పరిరక్షించడం, కోట్లు కేటాయించడం యెందుకు--కూలగొట్టి పారెయ్యక! (అందులో 'నాకేంటి?' అనేవాళ్ళకోసమేమో!)

ఆ మధ్య, ఢిల్లీ లో యమునానది వొడ్డున మన మాజీ ప్రధానులకి వేలాది యెకరాలకి యెకరాల విస్తీర్ణం లో సమాధులూ, స్మారక స్థలాలూ నిర్మించేస్తుంటే, కొన్నాళ్ళకి ఢిల్లీ 'సమాధుల నగరం ' గా ప్రసిధ్ధి చెందే రోజు దగ్గర్లోనే వుందని కథనాలు పత్రికల్లో సంచలనం రేపాయి. (మన పీవీ నరసిం హా రావుకి అక్కడ అంత్యక్రియలు నిర్వహించకపోవడానికి ఇదే కారణం అన్న లెవెల్లో సంజాయిషీ ఇచ్చారు కొందరు అధికారులూ, కాంగీరేసులూ!)

మరి అమెరికాలో జార్జి వాషింగ్టన్ కీ, లింకన్ వగైరాలకీ ఇలా వందల వేల యెకరాల్లో సమాధులు నిర్మించిన దాఖలాలు లేవు. అలాగే బ్రిటన్ లో చర్చిల్, అట్లీల్లాంటివారికి కూడా.

అటు అరబ్బు దేశాల్లోనూ లేదు, ఫ్రాన్స్ లాంటి దేశాల్లోనూ లేదు. ఒక్క చైనాలో మాత్రం, మావో కి కట్టించారు.

మరి మన ప్రత్యేకత యేమిటి? (ఇంకేమిటి! అందులో 'నాకేంటి?' అనేవాళ్ళు కోకొల్లలుగా వుండడమే!)

పోనీ గాంధీ నెహ్రూలవరకూ ఫరవాలేదు--వాళ్ళు దేశనాయకులు అనుకుంటే. మరి వరసపెట్టి అందరికీ యెందుకో!

నన్నడిగితే, విగ్రహాలే కాదు, సమాధుల్నీ కూలగొట్టాలి.

No comments: