Tuesday, November 24, 2009

చాదస్తాలు

యోగాలూ అవీ

15-11-2009 నాటి ఈనాడు ఆదివారం సంచికలో, 28వ పేజీలో ‘ఇప్పటికింకా మావయసు’ శీర్షిక క్రింద నలుగురు వృధ్ధుల గురించి ఫోటోలతో సహా ప్రచురించారు.

70 యేళ్ళ రాజోదేవీ లోహన్ అనేఆవిడకి, పెళ్ళైన 50 యేళ్ళ నించీ పిల్లలు లేకపోతే, ఢిల్లీలోని సంతాన సాఫల్య కేంద్రం సాయం తో ఇప్పుడు ‘తల్లి’ అయిందట.

తొంభైయేళ్ళ నానూరాం జోగీ మొన్నమొన్ననే నాలుగో భార్య ద్వారా మరో కూతుర్ని కన్నాడట! ఇంతకుముందు ఆయనకి 12 మంది కొడుకులూ, 9 మంది కూతుళ్ళూ వున్నారట. పైగా, వందేళ్ళొచ్చేవరకూ పిల్లల్ని కంటూనే వుంటానన్నాడట!

ఇక 80 యేళ్ళ వయసులో కూడా డిజైనర్ డ్రెస్సులూ అవీ వేసుకొని, ‘క్యాట్ వాక్’ చేస్తోందట ఒకావిడ. అంతేకాదు, ప్రపంచం లోనే అతిపెద్ద వయస్కురాలైన మోడల్ గా రికార్డులకి యెక్కిందట!

ఇక నాలుగో ఆయన (ఫోటోల్లోనూ, పేజీలోనూ ఈయనే మొదటివాడుగా ప్రచురింపబడ్డాడు—నేనే ఆఖరికి గెంటేశాను) 90 యేళ్ళ—ప్రపంచంలోనే అత్యంత వృధ్ధుడైన యోగా గురువుట. ఈయనపేరుమీద, ఆయన తరహా శిక్షణకి ‘అయ్యంగార్ యోగా’ అంటున్నారట. ఆయన వ్రాసిన పుస్తకం 18 భాషల్లోకి అనువాదం అయ్యిందట. ఇంకా, ఆయనవల్లే ‘అయ్యంగార్’ అనే పదం ఆక్స్ ఫర్డ్ డిక్ష్ నరీలో చోటుచేసుకొందట.

అదే కథనం లో భాగం గా, మహిళల్లో ఆ ఘనత వహించిన ఇంకో ఆవిడ గురించి వ్రాశారు—ఆవిడ వయసు 83 యేళ్ళట. ఇందులో కొసమెరుపేమిటంటే, ఆవిడదగ్గర శిక్షణ పొందినవాళ్ళు చాలామంది ‘యోగా ట్రైనర్లుగా’ ఉపాధి పొందుతున్నారట!

నా పాయింటేమిటంటే, మొదట చెప్పిన మూగ్గురికీ ఈ యోగాలూ అవీ తెలిసినట్టుగానీ, వాళ్ళు అవి సాధన చేసినట్టుగానీ, దాఖలాలు లేవు! (యెందుకంటే వాళ్ళలో కనీసం ఇద్దరు—మనదేశం లోని వాళ్ళు నిరక్షరాస్యులు!) పైగా, యోగా నేర్చుకున్నవాళ్ళు ‘ఉపాధి పొందడానికే’ దాన్ని వుపయోగించుకుంటున్నారు! అని.

మీరేమంటారు?


No comments: