Tuesday, December 2, 2008

ఒకే దెబ్బకి........!


........రెండు దరిద్రాలు వదిలాయి!

'చెవుల్లో చెట్ల ' ఇంటెలిజెంట్ హోం మంత్రి ఇంటికి వెళ్ళాడు!
అసమర్థ విత్తమంత్రి శాఖ మారాడు!

ఈ కాంగీరేసు సంకీర్ణ ప్రభుత్వం ఆడుతున్న టెస్ట్ క్రికెట్లో, స్కోరు చెయ్యకుండా, ఔట్ అవకుండా జిడ్డు ఆడే మొదటి వికెట్--నట్వర్ సింగ్ యెప్పుడో పడిపోయాడు!

రెండోది 'శివరాజ్ పాటిల్ ' ఇప్పుడు పడ్డాడు!

మూడోవాడు--ప్రణవ్ ముఖర్జీ--బహుశా క్లీన్ బౌల్డ్ కావలసిందేనేమో!

నాలుగో వికెట్ సంగతి ఇంకా చెప్పలేము!

ఇక చిదంబరం సమర్థత గురించి, ఓ జోక్ గుర్తొస్తోంది!

ఆప్పటిదాకా 'ఆహార మంత్రి ' గా వున్న ఒకాయన రక్షణ మంత్రిగా మారాడట! పార్లమెంట్ లో 'ఇక యుద్ధాలు వుండవు ' అని గర్వంగా ప్రకటించాడట!

అప్పుడు ఇంకో కాంగీరేసు సభ్యుడు 'నిజం! నిజం!' అని అరిచాడట!

ఇంకో సభ్యుడు 'అంత గ్యారంటీ గా యెలా చెప్పగలరు?' అని అడిగారట!

అప్పుడు, శ్రీ వాజపేయీ జోక్యం చేసుకొని, 'యెందుకంటే, ఆయన ఆహార మంత్రిగా వుండగా, దేశంలో ఆహారం లేదు కాబట్టి!'

అని ముక్తాయించగానే, ఆ మంత్రీ, స్పీకరూ, ప్రథాని, సిబ్బందీ, ప్రెక్షకులూ తో సహా పగలబడి నవ్వారట!

అదీ సంగతి! చూద్దాం!

Thursday, November 27, 2008

తాజా స్థితి

సాయంత్రం 4.00 గంటలకి వార్త యేమిటంటే, ముంబాయి లోని ప్రసిద్ధ హోటళ్ళు తాజ్, ఒబెరాయ్, మారియట్ లు ఇంకా మండుతూ, అంతస్తులు పేలుతూనే వున్నాయని!

ఈ రోజు రాత్రి 8.00 గం. ల నించి ఇప్పటివరకూ, టీవీ రావటంలేదు! ఇదేమైనా యాదృఛ్ఛికమా, లేక సెన్సారా? అసలు దేశంలో 'ఇప్పుడు' యేమౌతోంది? అని నా వర్రీ!

మన కేంద్ర హోం మంత్రి

మన కేంద్ర హోం మంత్రి “ఇంటెలిజెన్స్”


“తీవ్రవాదులు ‘అణ్వాయుధాలతోనూ, జీవ, రసాయన ఆయుధాలతోను’ దాడి చేసే అవకాశం వుంది” అంటాడోరొజు!

(దొంగాణ్ణి పెళ్ళాం గట్టిగా పట్ట్లుకుంటే, మొగుడు అన్నాడట “ఒసే! వాడు దొంగాడే! చెయ్యి కొరుకుతాడేమో! జాగ్రత్త!” అన్నాడట! తరవాతేమయ్యిందో అందరికీ తెలుసు!)

మర్నాడు, మన్మోహన్సింగ్ ‘అలాంటిదేమీ లేదు! మనం అప్రమత్తంగా వున్నాం’ అంటాడు!

మళ్ళీ మర్నాడు హోం ‘నన్ను మిస్ కోట్ చేసారు’ అంటాడు! పైగా, 'పోటా' లాంటి చట్టాలు అవసరం లేదు—వున్న చట్టాలు చాలు అంటాడు!

ఆ మర్నాడు మన్మోహన్ ‘తీవ్ర వాదం పెరిగింది! దానికి అడ్డు కట్టవేయడానికి అందరూ పూనుకోవాలి’ అంటాడు!

“తీవ్రవాదానికి ‘మతం’ లేదు!” అంటుంది వాళ్ళ నాయకురాలు (సోనియా) నాగమ్మ!

చిన్న ఒకటి రెండు పిట్ట కథలు—

ఒకాయనకి యెవరో చెప్పారట—మేనమామ చెవుల్లో వెంట్రుకలుంటే, నీకు చాలా అదృష్టం! ఆని. వెంటనే మన వాడు తపస్సు చేశాడట—‘మా మేనమామ చెవుల్లో వెంట్రుకలు తక్షణం మొలవాలని! దేవుడు ప్రత్యక్షమై వరమిచ్చాడట—‘తథాస్తు’ అని! వెంటనే, వాడి మేనమామ చెవుల్లో ‘చెట్లు’ మొలిచాయాయట!

ఆ మేనమామ బాధ భరించలేక ‘ఒరే! సాక్షాత్తూ ఆ దేవుడే ప్రత్యక్షమైనప్పుడు నీ అసలు కోరికలు కోరుకొంటే అవే నిజమౌను గదా, ఇదేం వెర్రి కోరికరా?’ అని యేద్చాడట!

అలా మన కేంద్ర హోం మంత్రి గారి మేనల్లుడేమైనా………..! యేమో!

‘ఫాక్లాండ్ వార్’ లో తెగబడి గెలిచిన బ్రిటన్ ప్రథాని మార్గరెట్ థాచెర్ ని ‘ది లేడీ విత్ రియల్ బాల్స్’ అనే వారు!

మరి ఈ నాడు, మన హోం మంత్రిని “ది లేడీ విత్ రియల్ హెయిర్స్ ఆన్ హర్ ఇయర్స్” అనీ, మన్మోహన్ని “ది లేడీ విత్ రియల్ వైట్ బియర్డ్” అనీ మనం అనొచ్చా?

(నోట్ : నిన్న 26-11-2008 రాత్రి 10.00 గంటలకి మాటీవీ న్యూస్ చూసి, ఈ బ్లాగు పూర్తి చేసి, ‘హమ్మయ్య! ఈ రోజుకి నా దేశం, ప్రజలూ క్షేమం! యెక్కడో బ్యాంకాక్ లో విమానాశ్రయాన్ని వశం చేసుకొన్నారట! పాపం ప్రయాణికులు!’ అనుకొని, కంప్యూటరు, టీవీ ఆపేసి, నిద్రకి ఉపక్రమించాను. కాని—సరిగ్గా అదే సమయంలో తీవ్రవాదులు ముంబాయి నగరంలో విద్రోహ కాండ మొదలు పెట్టారని ఇవాళ (27-11-2008) ప్రొద్దున పేపర్లు చూసాకే తెలిసింది! మరి యెవరిని యేమనాలో మీరే అలోచించండి!)

Sunday, November 16, 2008

బానిస బుద్ధి

బానిస బుద్ధి

మొన్నపేపర్లో ఫోటో చూశారా?

14-11-2008 న ఢిల్లీలో—రాహుల్ గాంధీ బెలూన్లు యెగరేస్తుంటే వెనక్కాలే శివరాజ్ పాటిల్ కూడా బెలూన్లు పట్టుకుని!

మొన్న, బాంబు ప్రేలుళ్ళ తరవాత ఒక్కో ఛానెల్లో ఒక్కో సఫారీ సూట్ మార్చుకొని కనిపించాడని అంటే, నా డ్రెస్ నేను మార్చుకుంటే మీకేమిటి అనీ, నేనందంగా వుండద్దా? అనీ అన్నాడట!

అసలు ఆ చెవులమీద వెంట్రుకలు గొరిగిస్తేగానీ నువ్వు అందంగా కనిపించవు—అని యేవరూ చెప్పలేదేమో!

దానికన్నా ముందు బానిస బుద్ధి ఒదులుకుంటే, ఇంకా బాగుంటావు అని ఇంకెవరైనా చేపితే, ఇంకా బాగుండును!

14-11-2008 నే, శ్రీ అజిత్ కుమార్ పాంజా (సమాచారమో అదేదో మంత్రిగా పని చేశాడిదివరకు!) పరమపదించాడుట. ఈయన టైములోనే రేడియో, దూరదర్శన్ లని సర్వ నాశనం చేశాడంటారు!

అయినా చచ్చినవాడి కళ్ళెప్పుడూ, చేఱడేసే! వార్తలో ఆయనకి వాడిన విశేషణాలు—తృణమూల్ కాంగ్రెస్ నేత, కవీ, రచయితా, నటుడూ—ఇలా!

Wednesday, November 12, 2008

“మీసాలు”

తిరుపతి వేంకట కవులని యెవరో అడిగారట—‘అసలు మీకీ మీసాలు యెందుకండీ’ అని.

చెళ్ళపిళ్ళవారు వెంటనే ఓ పద్యం చెప్పారట—‘ఉభయ భాషలకు మేమె కవీశ్వరులమటంచు పెంచినారమీ మీసలు రెండు…………..(ఈ విద్యలో మమ్మల్ని ఓడించినవారి)……….కాల్మొక్కమే’ అంటూ!

అదీ పౌరుషమంటే! అదీ మీసమంటే!

‘రొయ్యకు లేవా తెగ బారెడు………..’ అన్నారు!

అయినా, ఏ కనుమూరి బాపిరజో తప్ప ఈ మధ్య తెలుగు వాళ్ళు మీసాలు పెంచదమే మానేశారు!

‘మీసాలకు సంపెంగ నూనె రాసుకోవడం’, ‘మీసాలమీద నిమ్మకాయల్ని నిలబెట్టడం’ ‘మీసాల్తొ టన్ను రాళ్ళెత్తడం’ ‘మీసాలకి తాళ్ళు కట్టుకొని విమానాలు లాగడం’—ఇలాంటివి మనం చూస్తూనే వున్నాం!

మరి మీసాల విలువ యేమిటి? యెంత?

Saturday, November 8, 2008

……..కోటీశ్వరులు!


మొన్న అక్టోబరు 30న రాత్రి ఏలూరులో బసచేసి, భోజనం చేసిన మన సీయంగారి ‘అభి-రుచి’ని అనుసరిస్తూ, ‘జిల్లా యంత్రాంగం’ వండించిన ‘మెనూ’ ఇది(ట).

1. చికెన్ కర్రీ (బోన్ లెస్)
2. మటన్ కర్రీ (బోన్ లెస్)
3. వైట్ ఫిష్ పులుసు
4. రొయ్య, జీడిపప్పు (ఫ్రై)
5. బొమ్మిడాయిల పులుసు
6. బెల్లం జున్ను
7. పంచదార జున్ను
8. పూతరేకులు (బెల్లమా పంచదారా లేక రెండూనా—తెలీదు)
9. పుల్కాలు
10. కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి
11. కాజూ పనీరు
12. పప్పూ టమాటా
13. గుత్తి వంకాయ కూర
14. దొండకాయ, జీడిపప్పు కూర
15. ఉలవ చారు
16. సాంబారు
17. కొబ్బరి అన్నం
18. అన్నం
19. పెరుగు
20. అప్పడం
21. ఫ్రూట్ సలాడ్
22. ‘వంటివి’

ఇక మెగా స్టారుగారు, తన ‘ప్రజా అంకిత’ అని పేరు పెట్టుకున్న యాత్రలో, ఆయన మెనూ….

ఉదయం అల్పాహారంగా—రెండు ఇడ్లీ, లేదా రెండు దోశెలు
అదనంగా పండ్ల ముక్కలు, కాఫీ

మధ్యాహ్న భోజనం (సాయంత్రం 4 కి)—వివిధ రకాల పప్పు ధాన్యాలూ బియ్యంతో
చేసిన జావ, ఉడికించిన కూరగాయ ముక్కలు
ఆకు కూరలతో భోజనం.
—అడపాదడపా—కొద్దిగా—చికెన్!
—దీనికి, పెఱుగు అదనం!

రాత్రి భోజనం కూడ, పగలు లాగే—పెఱుగుబదులు మజ్జిగ వుంటుంది.

ఇక, తనతో వచ్చే మిగిలిన వాళ్ళకోసం—ఓ ‘వెయ్యి’ మందికి ప్రతిరోజూ భోజనం వండుతున్నారట!

వీళ్ళ మెనూ యేమిటట?

ఉదయం—‘తప్పనిసరిగా’ ఇడ్లీతోపాటు, పొంగల్, వడ, ఉప్మా వంటి అల్పాహారం.

మధ్యాహ్నం—బిర్యానీలాంటి ఏదో ఒక అన్నం, కూర, పెఱుగు, అరటి పండు, రెండు
కోడి గ్రుడ్లు.

రాత్రి భోజనంలోకి—గ్రుడ్లబదులుగా, ఎదో ఒక మాంసాహారం.

వీటికి అవుతున్న సంబారాలు—రోజూ 300 కేజీల బియ్యం; 160 కేజీల కూరగాయలు; 160
కేజీల పెఱుగు; ‘టీ’ కోసం 50 లీటర్ల పాలు, 120 కేజీల
చికెన్ గాని, మటన్ గాని; చేపలైతే, 175 కేజీలు—ఇవి(ట)!

{ప్రజల దృష్టిలో—మెగాస్టార్ శత కోటీశ్వరుడైతే, సీయం సహస్రకోటీశ్వరుడు! అయినా సీయంగారికి ‘జిల్లా యంత్రాంగం’ ఒక రోజుకి—యేర్పాట్లు చేస్తూంటే, (ప్రతీ రోజూ ఏదో జిల్లానో, రాష్ట్రనో యంత్రాంగం చేస్టూనే వుండాలిగా--అంటారా? నన్నడగకండి!) మెగాస్టార్ కి యెవరు! ఆయన సొంత డబ్బేనంటారా? ఏమో!} మా చిన్నప్పుడు ‘స్టార్లు’ సినిమాకి తీసుకునే పారితోషికం 50% వైట్, 50% బ్లేక్ అని చెప్పుకునేవారు. ఈ రోజుల్లో, వైటే కొన్ని కోట్లు అంటుంటే, ఇక బ్లేక్ 25% + 75% ఉండదంటారా?)

అసలు మెగాస్టార్ తిరుపతి మీటింగులో ఆయన ఆవేశం చూసి, అభిమానుల్ని ‘రేపటినుంచే మీరందరూ కదలండి’ అంటూంటే, ‘ఠాగూర్’ లాగానో, ‘స్టాలిన్’ లాగానో అంటాడేమో, ‘అవినీతిమీద సమరం ప్రకటించండి…..అవినీతిపరులని పట్టించండి’ అని నినదిస్తాడేమో అని చాలా మంది యెదురు చూసారు—కాని—అబ్బే!

పార్టీ ప్రకటించక ముందు, చాలా మంది, పార్టీ పెట్టగానే, “నేను అవినీతి వంటి జాడ్యాలకి వ్యతిరేకం గా ‘లోక్ సత్తా’ పార్టితో కలిసి పోరాడతా’—అని ఆంటాడేమో అని అనుకున్నారు!

కానీ, దాసర్లూ, జోగయ్యలూ పడనివ్వలేదని వినికిడి!

నీరు పల్లమెరుగు………….! అదీసంగతి!

Sunday, November 2, 2008

……..అవునా! నిజమేనా?

1) మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలన రావడానికి ముఖ్య కారణం మన ‘ఛత్రపతి శివాజీ’ అంటే నమ్ముతారా?

2) ఆలెగ్జాండరుతో సంధి చేసుకుని, మన దేశంలోకి ఆహ్వానించిన తక్షశిల రాజు ‘అంభి’ తరవాత, దేశానికి అంత ద్రోహం చేసిన వ్యక్తి మన దేవెగౌడ అంటే నమ్ముతారా?

Tuesday, October 14, 2008

మన 'ఇంటెలిజెన్స్ '



ప్రపంచంలోకెల్లా 'అత్యుత్తమమైన ' ఇంటెలిజెన్స్ యంత్రాంగం మనదేనంటే, మీరేమంటారు?

'అతిశయోక్తి కి ఉదాహరణ ' -- అనా?

'ఈ శతాబ్దపు గొప్ప జోక్ ' -- అనా?

'అబ్బ! మీరు మరీనూ' -- అనా?

'నీ మెదడుకూడా వాళ్ళలాగే పుఱ్ఱెలోకాక ఇంకెక్కడో వుందా' -- అనా?

మీరేమన్నా, నేను ఆశ్చర్యపోను! ఎందుకంటే, అది జగమెరిగన సత్యం! (ఒక్క మన గవర్నమెంటోళ్ళకి తప్ప).

ఏది? పై స్టేట్ మెంటు కి నిజం పూర్తి వ్యతిరేకమని!

లేక పోతే, ఎంత పెద్ద సిటీలోనైనా, ఎక్కడ, ఏ మూల, ఏ వీధిలో, ఏ ఇంట్లో ఏమి జరగినా, అది బహిరంగ రహస్యమే! కాని పక్కవాళ్ళు పట్టించుకోరంతే! చిన్న పట్టణాల్లోనూ, పల్లెల్లోనూ అయితే ఇంకా బాగానే పట్టించుకుంటున్నారు. మరి అలాంటప్పుడు, ఏమాత్రం కళ్ళూ, ముక్కూ, చెవులూ వున్న యంత్రాంగానికైనా ఈ బహిరంగ రహస్యాలు తెలియవంటే మనమేమనుకోవాలి?

తీవ్రవాదులూ, నక్సలైట్లూ, మవోయిష్టులూ, ఎలక్ట్రానిక్ మీడియాకి మెసేజ్ లు పంపిస్తు వుంటారు! విలేఖరులు వాళ్ళని ఇంటర్వ్యూలు కూడా చేస్తూ వుంటారు! వీరప్పన్ ని సహితం, ఇంటర్వ్యూలు చేసి ఫొటోలతొ సహా ప్రచురించేవారు! (కాని వారి ప్రొఫెషనల్ ఎథిక్స్ పాటించి పోలీసులక్కాని, ఇతరులక్కాని వాళ్ళ అచూకీని చెప్పేవారు కాదు! అది వేరే సంగతి.)

మరి మహా పేరుగొప్ప ఇంటలిగెన్స్ వారు చెయ్యవలసిన పని, అలాంటి రహస్యాలని తెలుసుకోవడమే కదా! మరి ఓపెన్ సీక్రెట్లు కూడా తెలుసుకోలేని ఇంటలిజెన్స్ ఉంటే యేం, ఊడితే యేం!

మరి ఇప్పటికైనా దాన్ని సంస్కరిస్తాయా మన గవర్నమెంటులు? చూద్దాం!

Sunday, July 20, 2008

ద్రవ్యోల్బణం

అనగానగా అప్పుడెప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం డిల్లీలో రాజ్యమేలుతుండగా, ద్రవ్యోల్బణం రెండంకెలలో వుండేదట! అప్పుడు విత్తమంత్రి శ్రీ మన్మోహన్ సింగు గారూ, వాణిజ్య మంత్రి శ్రీ చిదంబరం గారూ, ప్రణాళికా సంఘానికో దేనికో, మాంటేక్ సింగ్ అహ్లువాలియా గారూ .........వుండేవారట!

మళ్ళీ ఇప్పుడు వారు ముగ్గురి హయాంలోనే ద్రవ్యోల్బణం 12 శాతానికి దగ్గర్లో వుంది!
30 ఏళ్ళ క్రితం ప్రజలు మరిచిపోయిన "ప్రత్యేక తెలంగాణ" మళ్ళీ 2004 యెన్నికల ముందు ప్రత్యక్షమయింది!
ప్రజలు ఎప్పుడో చూసిన మతకలహాలు మళ్ళీ కనిపిస్తున్నాయి!
ఈ దరిద్రాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు ప్రత్యక్షం అవుతాయి?
అలాగే, అయోధ్య అంశాన్ని ప్రధానిగా దేవె గౌడ పార్లమెంటులొ ప్రస్తావించే వరకూ అందరూ మరిచి పోయారు!

మధ్యలో అప్పుడప్పుడూ నేను బతికే వున్నానంటూ, వీపీసింగు గారు వెనుకబడిన వర్గాలకి రిజర్వేషనులు అంటూ కందిరీగల తుట్టె మీద ఓ రాయి వేస్తూ వుంటారు.

వెంటనే, అర్జున్ సింగ్ గారు ఓ చిన్న బిల్లు తయారు చెసేస్తూ వుంటారు!
చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే శివరాజ్ పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ లాంటివాళ్ళు!
పీవీ నరసిం హారావు నుంచి సూట్కేసులు అందుకున్నందుకు శిక్ష పడిన, మళ్ళీ ఎంపీలైన వాళ్ళు, మళ్ళీ సూట్కేసులకీ, మంత్రి పదవులకీ సిద్ధం!

న్యాయస్థానాలచే తప్పుపట్టబడిన వాళ్ళు, కీలక రాజ్యాంగ పదవుల్లో!
ద్రవ్యోల్బణానికీ, మార్కెట్లకీ సంబంధించిన విషయాల్లో మాత్రం 'మూడు కోతుల ' సూత్రాన్ని పాటించే రిజర్వ్ బాంక్ గవర్నర్!

వీళ్ళందరికీ ఓ చేటపెయ్య--సోనియా గాంధీ!

ఇవన్నీ చూస్తుంటే 'బిషప్ హ్యాటో' చేసిన పని గుర్తు రావడంలేదూ?
వాడు ముష్టి వాళ్ళని చేసినట్టు ఈ గాంగునందరినీ ఎవరైనా చేస్తే సంతోషించే వాళ్ళలొ మొదటివాణ్ణి నేనే!

Thursday, July 17, 2008


గడ్డి తినే బుధ్ధి



చారిత్రాత్మక తప్పిదాలు చెయ్యడంలో ఆరితేరిన C.P.I (M) పార్టీకి చెందిన శ్రీ ఇంద్రజిత్ గుప్తా గారు లోక్ సభ స్పీకరుగా యెన్నికయ్యాక, ఇక ఏ పార్టీకి చెందినవారు కారట. వారి పార్టీ రాజీనామా చెయ్యమంటే అది చెల్లదట. ఆయన అసలు బాధంతా రేపు పార్టీ విప్ ప్రకారం ప్రభుత్వం ప్రవేశ పెట్టే విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వెయ్యాలనేనట! సరే, ఒప్పుకుందాం!


మరి B.J.P తో 'కలిసి ' ఎలా ఓటు చేస్తాను అంటాడేమిటి? మిగిలిన పార్టీల గొడవ నీకెందుకయ్యా? నీ పార్టీ పెద్దలు ఎలా చెపితే అలా వింటావా? లేక నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? అన్నదే పాయింటు. అంతేగాని, ఇవేమి వంకలు? మీ పార్టీ బుఱ్ఱ గొరిగించుకోమంటే, బుధ్ధిగా గొరిగించుకుంటావా? ఫలానా పార్టీ వాడు బుఱ్ఱ గొరిగించుకుంటాడుట. వాడితో 'కలిసి ' నేను ఎలా గొరిగించుకుంటాను అంటావా!


ఇది భలే బాగుందయ్యా!


రేపు విశ్వాస తీర్మానం మీద ఓటింగులో రెండువైపులా సమంగా వస్తే, అప్పుడు? నీ నిర్ణయాత్మక (deciding) ఓటు ఏం చేస్తావు? ప్రభుత్వానికి ఓటు వేసి, 'అంతరాత్మ ప్రబోధం ప్రకారం వేసేనంటావా?' లేక "ఫలానా పార్టీ అనుకూలంగా వేసింది. దాంతో 'కలిసి ' ఎలా వేస్తాను?" అంటావా?


అసలు నీకు మళ్ళీ ఎన్నీకల్లో పోటీ చేసే చాన్స్ వస్తుందంటావా? వస్తే మీ మాజీ పార్టీ నుంచా? లేక కాంగ్రెస్ నుంచా? లేకపొతే ఏకంగా రాష్ట్రపతి ఛాన్స్ కొట్టెయ్యచ్చు అని కలగంటున్నావా? ఎవరి చెవుల్లో పువ్వులు పెడదామనుకుంటున్నావూ?


తేల్చి చెబితే బాగుంటుంది! మరెప్పుడు చెబుతావు?


సామాన్యుడు ఎదురు చూస్తూన్నాడు మరి!

Tuesday, July 15, 2008

"కప్పల తక్కెడ"



మళ్ళీ భారత పార్లమెంటు కప్పల తక్కెడ అయిపోయింది! 'అణు ఒప్పందం' వ్యతిరేకిస్తూ లెఫ్ట్ పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ఉపసం హరించడంతో పార్లమెంటులో మెజారిటీ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఒక పక్క మేకపొతు గాంభీర్యాన్ని ప్రదర్సిస్తూనే మరో పక్క బుట్టలో కట్టలు పెట్టుకొని, చిన్న పార్టీల సభ్యుల వెనకాల తన చాణక్య మంత్రుల్ని తోలి, కట్టల్ని తీసుకొని బుట్టలో పడండి అని బతిమాలమంటోంది(ట)! బుట్టల్లోని కట్టల విలువ 35 కోట్లట!
మరి కప్పల తక్కెడ కాకేమవుతుంది?

రేప్పొద్దున్న పార్లమెంటులో బలం సరిపొతే, అలాంటి వాళ్ళకి మంత్రి పదవులిస్తే (కట్టలే కాకుండా, బుట్టలో పడడానికి అవి కూడా ఇస్తామని చెప్పంటున్నారట) వాళ్ళు అనతి కాలంలో ఇంకెన్ని కోట్లు సంపాదిస్తారో!

మరి సామాన్యుణ్ణి ఆ భగవంతుడైనా రక్షిస్తాడో లేదో!

Thursday, June 26, 2008

"ఓ సామాన్యుడి సణుగుడు"

..........బిన్ లాడెన్" కాదండోయ్!


పై టైటిల్ని సంక్షిప్తీకరించా! అంతే!

అసలు "అవీ.....ఇవీ.....అన్నీ" అని పెడదామనుకున్నా. కానీ ఈ శీర్షికన ఓ పెద్దాయన ముందెప్పుడో పత్రికల్లో రాసేసిన గుర్తు!

పోనీ అని "సామాన్యుని సణుగుడు" అని పెడదామన్నా, అదీ ఇంకెవరో వాడేశారు!

సరే.....అసలు 'ఉచ్చిష్టం' కానిదేముంది? అని..... (బాణోచ్చిష్టం జగత్సర్వం కదా!) .....ఈ టైటిల్ ఖరారు చేసుకున్నా!