Wednesday, March 5, 2014

కబుర్లు - 112


అవీ, ఇవీ, అన్నీ

మొన్న తిరుమలలో జగన్‌ వ్యవహారం పై గవర్నర్ తి తి దే వాళ్ల నుంచి నివేదికలు కోరారట. మరి యేమి చర్యలు తీసుకుంటారో చూడాలి. రాజకీయ నాయకులెవరూ దానిగురించి మాట్లాడినట్టు లేదు. లేక అవన్నీ ప్రచురించవద్దని మీడియావాళ్లని యెవరైనా కోరారా?

యెట్టకేలకి ఎన్‌ డీ తివారీ--రోహిత్ తన కొడుకే అనీ, తనకీ ఉజ్వలా శర్మకే పుట్టాడనీ ఒప్పుకొని, గర్వంగా ప్రకటించేశాడు. పైగా, వారసుడిగా అతనికి అప్పగించడానికి తనదగ్గర యేమీ లేదు అని కూడా అన్నాట్ట. మరి ఇన్నాళ్లూ అన్ని వెధవ్వేషాలు వెయ్యడం యెందుకు, కోర్టులదీ, ప్రభుత్వాలదీ, ప్రజలదీ సమయమూ, ధనమూ వృధా యెందుకు చేశాడు అని అడక్కండి. ఇంకా ఆ వయసులో కూడా ఓట్లు దండుకొని, పదవుల్ని అంటిపెట్టుకొని, ప్రజా సేవ చేయద్దూ? ఒప్పేసుకొంటే ఓట్లు రావు కదా.  

వీడు మన గవర్నర్ గా రాజ్ భవన్లో రాసలీలలు కొనసాగిస్తూంటే పదవి పీకేశారనుకుంటా. చింత చచ్చినా పులుపు చావదు కదా?

కేంద్ర హోం మంత్రి చిండా, సారీ షిండే ఓ యేడాది క్రితం రాజ్యసభలో మహారాష్ట్ర లోని భండారాలో జరిగిన అత్యాచారం గురించి ప్రకటనచేస్తూ, ముగ్గురు మైనర్ బాధితురాళ్ల పేర్లూ ప్రకటించేశారట. తరువాత నాలిక్కొరుక్కొని, ఆ ప్రకటన వ్రాసిన రూపొందించిన అధికారులమీద దర్యాప్తు చెయ్యమని ఆదేశించారట. (అప్పటికి జరగవలసిన నష్టం యెలాగూ జరిగిపోయింది). 

ఇప్పుడు ఆ విచారణ సంగతి యేమయిందో చెప్పమని స హ దరఖాస్తు చేస్తే, బదులే లేదట. అప్పీళ్ల తరువాత సీ ఐ సీ విచారణ నిర్వహిస్తే, ఆ దర్యాప్తు తాలూకు దస్త్రమే కనపడ్డం లేదు పొమమ్మన్నారట సీ ఐ సీ వారిని! ఆయనక్కోపం వచ్చి, సంబంధించిన అధికారులకు షో కాజ్ నోటీసులు ఇప్పించారట. ఆ దస్త్రాలు యేమౌతాయో.....మళ్లీ స హ దరఖాస్తు చెయ్యాలేమో!

మొన్న ఓ అరవాయన ఇడ్లీలు కిలోల్లెక్కన అమ్ముతున్నాడని తెలిసింది కదా. ఇప్పుడు బెంగుళూరులో ఒకాయన (మయ్యాస్ సంస్థ అధిపతి సదానందమయ్య) ప్రపంచం లో మొదటిసారి చక్కిలాల తయారీ యంత్రం రూపకల్పన చేసి, గంటకి 4,500 చక్కిలాలు, తక్కువ నూనెతో తయారు చేసేస్తున్నాడట. ఇంకా చిత్రం యేమిటంటే, బియ్యాన్ని పిండి ఆడడం దగ్గరనుంచీ అన్నీ యంత్రమే చేసి, చక్కిలాలు బయటికి వచ్చేస్తున్నాయట. మిక్కిలి చక్కిలంగా లేదూ!

2005 కి ముందు వెలువడిన 500, 1000 రూపాయల నోట్లు ఈ సంవత్సరం  డిసెంబర్ నెలాఖరు వరకూ యే ఆంక్షలూ లేకుండా చెల్లుబాటు అవుతాయని ప్రకటించారు. ఈమధ్య ఒకాయన తన డబ్బు బ్యాంకుఖాతాలోడెపాజిట్ చేద్దామని వెళ్లి, చలాన్‌ వ్రాస్తూండగా, ఇంకొకతను వచ్చి, ఓ 500 నోటిచ్చి, వంద నోట్లు ఇవ్వండి, మీరు యెలాగూ బ్యాంకులో కట్టేసేవే కదా అనడిగితే, పోనీ పాపం అని ఇచ్చాడట. తీరా ఆ నోటు క్యాషియర్ కి ఇస్తే, మిషన్‌ లో వేసి, అది దొంగనోటు అని తేల్చారట! ఇచ్చినవాడు యెప్పుడో గాయబ్! ఇంతకీ్ ఆ నోటు మీదున్న సంవత్సరం 2012! మరి 2012 వరకూ వెలువడిన నోట్లని యెప్పుడు రద్దు చేస్తారో?

2 comments:

TVS SASTRY said...

తాజా విశేషాలతో చాలా బాగుంది. అభినందనలు శాస్త్రి గారు!

A K Sastry said...

డియర్ శాస్త్రిగారూ!

తాజా కబుర్లూ, సామాన్యంగా నలుగురూ దృష్టి పెట్టనివీ అందజేయాలనే నా తపన.

మీ అభినందనలకి చాలా సంతోషం.

ధన్యవాదాలు.