అవీ, ఇవీ, అన్నీ
"మిగిలిన సరుకుల రేట్లు తగ్గించకుండా, కిలోరూపాయికి--అవీ ముక్కిపోయిన బియ్యం ఇస్తే యెవడికి కావాలి?" అంటూ టీవీల్లో చెరిగేస్తున్న ఆడవాళ్లకి సమాధానంగా, ఇప్పుడిస్తున్న కాస్త కందిపప్పూ వగైరాలతో ఓ ప్యాకేజీ గా ఓ కిలో చింతపండూ, ఓ కిలో వుప్పూ కూడా ఇస్తేబాగుంటుందనుకుంటున్నారట.
ఓ కిలో యెండు మిరపకాయలు కూడా.....అనుకొని, మళ్లీ దాని రేటు స్థిరంగా వుండదు....ములిగిపోతామేమో అని సందేహిస్తున్నారట! అయినా నెలకి కిలో చింతపండూ, కిలో వుప్పూ యేంచేసుకుంటారట?
యెలాగూ ఓ మంత్రిగారన్నట్టు, "వండిపెట్టే" పథకం గురించి ఆలోచిస్తే ఇంకా బాగుండునుకదా?
యెలాగూ రైతులకీ, మహిళలకీ "వడ్డీ లేని" ఋణాలు అంటున్నారాయె! అదేదో "వుచిత భోజన కూపన్లు" ఇచ్చేసి, వండి వార్చి, వొడ్డించేస్తే పోను కదా?
"అయ్యవారేం చేస్తున్నారు?" అంటే, "చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు!" అన్నట్టు, మంత్రి డీ ఎల్ రవింద్ర (వండిపెట్టే పథకం గురించి చెప్పినది కూడా ఈయనేననుకుంటా!), "వందల కోట్లు ఆసుపత్రులకి ఖర్చు పెట్టారు. డాక్టర్లు లేరు, మందులు లేవు! అలాంటి పరిస్థితుల్లో నాకు వైద్య ఆరోగ్య శాఖని నాకిచ్చారు! (2009 లోనే ఇచ్చారేమో!) అప్పటినుంచీ చేసిన తప్పులు ఇప్పుడు దిద్దుకుంటున్నాను. (కాబట్టి జనాలు నన్నేమీ అనొద్దు!) అన్నాడట.
బహుశా 2014 వరకూ పడుతుందేమో--ఆ తప్పులు దిద్దుకోడానికి--అప్పటివరకూ ఆ మంత్రి పదవీ, ఆ ప్రభుత్వమూ వుంటే.....!
డీ జీ సీ ఏ వాళ్లు, "విమాన చార్జీలు పెంచి వసూలు చేస్తే వూరుకోం" అని కళ్లెర్రజేశారట--మిగిలిన కంపెనీలని--కింగ్ ఫిషర్ సర్వీసులు రద్దవడంతో.
పాపం సంపన్న శ్రేణి వినియోగదారులమీదా, ప్రభుత్వ వున్నతోద్యోగులమీదా యెంత ప్రేమో వారికి!
ఓ ప్రక్క "తృటిలో తప్పిన" ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. గన్నవరం, రాజమండ్రి, విశాఖ లాంటి చోట్ల సరైన యేర్పాట్లే లేవు! గన్నవరం నుంచి సర్వీసు ప్రారంభించినరోజే, వాతావరణం బాగాలేక రద్దు చేశారు ఎయిర్ ఇండియాది! నిన్న ఓ విమానం, రెక్కకి పక్షి తగిలి, అద్దం పగిలిపోతే, అప్పటికే ల్యాండ్ అవడం వల్ల వూపిరి పీల్చుకొన్నారు! మొన్నెప్పుడో ఓ విమానమైతే తగలబడేపోయింది అక్కడెక్కడో. ఇవన్నీ వాళ్ల బాధ్యతలు కావన్నట్టు వాళ్లు పట్టించుకోరు!
"చికెన్" నారాయణ ఓ వజ్రం లాంటి మాటన్నాడు. మనపొరుగు రాష్ట్రం తమిళనాడులో "నాయకులు" జైళ్లకి వెళుతుంటే, మన రాష్ట్రంలో "అధికారులు" మాత్రమే వెళ్లడం మొదలెట్టారు--అని!
అవున్నిజమేకదా? అయినా, రాజకీయం కాకపోతే, ఆ తేడా యేమిటో ఆయనకి తెలీదనుకోవాలా?
ఆదికేశవుడూ, కృష్ణారావూ వుండగా, తి తి దే వారికి బంగారం రాగానే, పేపర్లో ప్రకటించేసేవారు. క్రొత్తవారు, రిస్కెందుకు అనుకున్నారేమో, ఇప్పుడు వొకేసారి, గత మూడు నెలలలో రూ.2.11 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు 'వితరణగా' అందాయి అని ప్రకటించారు. అదీ, ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్ నుంచి జూన్ వరకూ) అన్ని ఆలయాలకీ కలిపి అనీ, శ్రీవారికొక్కరికే ఆ సమయంలో రూ.1.53 కోట్ల బంగారం వచ్చింది అనీ, జువెలరీ విభాగం వారు లెఖ్ఖలు కట్టారట!
బెటర్ లేట్ దేన్ నెవర్ అన్నారు కదా? వాకే!