Saturday, February 19, 2011

కబుర్లు - 31

అవీ, ఇవీ, అన్నీ

ముడిచమురు ధర బ్యారెల్ 100 డాలర్లకి మించినా, పెట్రోల్, డీజెల్ ధరల్ని పెంచే వుద్దేశ్యం ప్రభుత్వానికి లేదని జైపాల్ రెడ్డి ప్రకటించారు మొన్ననే. చమురు "మార్కెటింగ్" కంపెనీలు ఇప్పటికే రూ.80 వేల కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయి అనీ, త్వరలో అది లక్ష కోట్లకి చేరవచ్చనీ కూడా అన్నారట. గత జూన్ నెలలో నియంత్రణని యెత్తేశాక కేవలం 7 సార్లు మాత్రమే ధరలు పెంచాయిట. వచ్చే బడ్జెట్లో ముడిచమురు, "ఇతర వుత్పత్తుల"పై కస్టమ్‌స్, ఎక్సైజ్ సుంకాల్ని ఆర్థికమంత్రి తగ్గిస్తారని విశ్వసిస్తున్నారట ఆయన.

మొన్ననే రూ.4,442 కోట్లు సబ్సిడీ ఇచ్చాక, ఐ వో సీ రూ.1,635 కోట్ల లాభం ప్రకటించిందట. మరి వున్న నాలుగు కంపెనీలూ దాదాపు అదే స్థితిలో వుంటే, వాటి నష్టాలు మొత్తం ఓ 15 వేల కోట్లు దాటవు కదా? ఈ మోళీ లెఖ్ఖలేమిటో యే మణిశంకర్ అయ్యరైనా పరిశోధిస్తే బాగుండును.

అన్నట్టు, సుబ్రహ్మణ్యం స్వామికీ, మణిశంకర్ లాంటివాళ్లకే రహస్యాలు యెందుకు తెలుస్తున్నాయో? (ప్రభుత్వాల్లో పెద్దపదవుల్లో వున్న 'బుర్రోవాదులందరూ' అరవ్వాళ్ళే అవడంవల్లనేమో!)

ఆర్థిక మంత్రితో మొన్ననో సమావేశంలో, మణిశంకర్ దేశంలో అవినీతీ, ధరలూ పెరిగిపోవడం పై ఆందోళన వ్యక్తం చేశారట. 

మంత్రిగారేమో, "అకస్మాత్తుగానూ, ముందుగానే వూహించిన రీతిలోనూ, ధరల్లో చోటుచేసుకొనే మార్పులని యెదుర్కోడానికి ప్రామాణిక కార్యాచరణ విధానాలు అవసరం" అనీ, "ముందుగానే చర్యలు తీసుకొనేందుకు యంత్రాంగాన్ని యేర్పాటు చెయ్యాలి" అనీ పేర్కొన్నారట. మరి యేర్పాటు చెయ్యలసింది యెవరో? యే అమెరికా ఆర్థిక మంత్రో, వరల్డ్ బ్యాంకో కాదు కదా!

అక్రమ ఆయుధాల పుట్ట హైదరాబాదేనట. గ్యాంగ్ స్టర్ అజీజ్ రెడ్డి, విదేశాలనించి వాటిని తెప్పించి అమ్మేవాడట. సూరి హత్యకేసులో నిందితుడు భాను, ఉత్తరప్రదేశ్, బీహార్లనుంచి పిస్తోళ్లు, రివాల్వర్లు తెప్పించి, విక్రయించేవాడట.

మన రాజధానిలో వేల సంఖ్యలో అక్రమ ఆయుధాలుంటే పోలీసులు యేడాదిలో కేవలం 785 తుపాకులు, పిస్టళ్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నారట. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో 'అధికారికంగా' 10 వేల ఆయుధాలుంటే, అంతకు మూడు రెట్లు అక్రమ ఆయుధాలున్నట్లు అంచనాట.

రాజస్థాన్ లోని సరిహద్దు గ్రామాల్లో 'వారపు సంతల్లో' బహిరంగంగానే వీటిని విక్రయిస్తున్నారట. ఒక్కోటీ రూ.20 నుంచి రూ.30 వేలదాకా పలుకుతాయట. పాపం వాళ్లవీ 'పొట్టకూటికోసం వ్యాపారాలే' కదా!

ఇటలీ ప్రథాని సిల్వియో బెర్కుస్లోనీ, మైనర్ బాలిక రూబీకి డబ్బులిచ్చి, శృంగారంలో పాల్గొనడం, అధికార దుర్వినియోగం ఆరోపణలపై, ముగ్గురు మహిళా న్యాయమూర్తుల ముందు విచారణ జరగబోతోందట. 

మన ఇటాలియమ్మ వాళ్లని ఆదర్శంగా గ్రహిస్తుందేమో చూడాలి మనం.

1977 నాటికి, అంతర్వేది వెళితే, బిందెలతో మంచినీళ్లు పట్టుకెళ్లవలసి వచ్చేది. కానీ, అక్కడ 'కోకాకోలా' పుష్కలంగా దొరికేది! ప్రతీ చిన్న కొట్లో సైతం, కనీసం కొన్ని పదుల కేసులు వుండేవి ఆ సీసాలతో.

అలాంటిది, జార్జి ఫెర్నాండెజ్ "మీ ఫార్ములా యేదో మా ప్రభుత్వానికి చెపుతారా? వ్యాపారం యెత్తేసి వెళ్లిపోతారా?" అంటే, దేశం వదలి వెళ్లి పోయారు! మంత్రం వేసినట్టు ఆ సీసాలన్నీ వెంటనే మాయం అయ్యాయి దేశం లోంచి!

ఇప్పుడో వెబ్ సైట్, ఆ పానీయానికి అంత రుచి 'మెర్కండైజ్ 7ఎక్స్ ' అనే రహస్య పదార్థం తో వస్తుందనీ, దాని ఫార్ములాని కూడా ప్రకటించారట! యెంతవరకూ నిజమో మరి.

2 comments:

పానీపూరి123 said...

మీరు ఇలాంటి విషయాలు సుప్రీం/హై కోర్ట్ లకు లెటర్స్ రాయకపోయారా?

A K Sastry said...

డియర్ పానీపూరి123!

బాగుంది మీరు చెపుతున్నది--రాముడూ, కప్పా కథలాగ.

కనీసం ఓ దశాబ్దంగా పనిచేసిన సుప్రీం కోర్టు ప్రథాన న్యాయమూర్తులు, దాదాపు అందరూ అవినీతిపరులేననీ, హైకోర్టుల్లో అంకుల్ జడ్జ్ విధానాలు రాజ్యమేలుతున్నాయి అనీ, అవి పేరులో మాత్రమే వున్నతమైనవి అని వినడంలేదూ?

అయినా, ఈ కచేరీలన్నిటికన్నా "సుప్రీం" ఆమ్ అద్మీనే కదా? వాడికోసమే నా సణుగుడు!

ధన్యవాదాలు!