2జీ....3జీ లూ....ఇతర కబుర్లూ
ఇన్నాళ్లూ, అందరికీ తెలుస్తున్న విషయమేకదా, మనం ప్రత్యేకంగా వ్రాసేది యేముందిలే అని నేను 2జీ కుంభకోణం మీద టపా వ్రాయలేదు.
మొన్న వెంకయ్యనాయుడన్నాడు 'కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వమూ ఇప్పుడు 3జీ మీద నడుస్తోంది' అని. అదేమైనా కొత్త స్కామా అని అడిగిన పాత్రికేయులకి, '3జీ అంటే....., సోనియా జీ, మన్మోహన్ జీ, రాహుల్ జీ' అని చమత్కరించాడు--రామాయణాన్ని మూడు ముక్కల్లో 'కట్టె, కొట్టె, తెచ్చె ' అని చెప్పినట్టు!.
శీతాకాల సమావేశాలని స్థంభింపచేశాయి విపక్షాలన్నీ--జేపీసీ వెయ్యాల్సిందే అంటూ. ప్రభుత్వం ససేమిరా అంటే, బడ్జెట్ సమావేశాలనికూడా....అని హెచ్చరించాయి.
సమావేశాలు జరిగే రోజుల్లో, ఎంపీలకి రోజుకి రూ.2,000/- ఇస్తారట--భత్యంగా--అవి జరిగినా, జరగకపోయినా, వాళ్లు వెళ్లినా, వెళ్లకపోయినా! (ఇది వాళ్ల జీతాలకీ, ఇతర 'వుచిత' ఫోన్లూ, కార్లూ, విమాన, మొదటి తరగతి ఏసీ ప్రయాణాలు...ఇంకా చాలా లిస్టు వుంది లెండి....అన్నిటికీ అతిరిక్తంగా.)
సమావేశాలు జరగడంలేదు కాబట్టి, తమ పార్టీ ఎంపీలెవరూ ఆ భత్యాన్ని తీసుకోవద్దు అని ఆర్డరేసిందట--మహా త్యాగమయి--ఇటాలియమ్మ--మహా అయితే, రోజుకి ఓ ఐదు లక్షలో యెంతో మిగిలేను ప్రభుత్వానికి!! (యెంతమంది అది పాటించారో యెవరూ చెప్పలేదు.)
అసలు విషయానికొస్తే, రూ.1,76,000/- కోట్లు అంటే, గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లనీ, నిజంగా జరిగిన ఖర్చు ఓ 80 వేల కోట్లనీ అనుకున్నా, రెండు సంవత్సరాల మన రాష్ట్ర బడ్జెట్ కి సమానం!
ఈ కుంభకోణం జరిగిన విధానంబెట్టిదనిన....అని మొదలెట్టడం అనవసరం....అందరికీ తెలుసు.
ఇప్పుడు జరుగుతున్న చర్చేమిటంటే, జేపీసీ వెయ్యడానికి వాళ్లకేమిటీ అభ్యంతరం? అని.
మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. మన్మోహన్, తనకి పీయేసీ ముందు హాజరవడానికి అభ్యంతరం లేదు అని ప్రకటించడం, పీయేసీ ఛెయిర్మన్ ఎం ఎం జోషీ 'బ్లాక్ షీప్' గా మారి, లోపాయకారీ అంగీకారానికి వచ్చాడు అనీ.....ఇలా..... (తన రాజకీయాలు తనకి వుండొచ్చుగానీ, పార్టీకీ, దేశానికీ అంత ద్రోహం చేస్తాడు మురళీ మనోహర్....అంటే నమ్మేవాళ్లెవరు?!)
ఇంకా, ప్రథాని యేమిటీ.....జేపీసి ప్రశ్నించడం యేమిటీ...? అని ఓకటీ!
యేం? ఇతర దేశాల్లో అధ్యక్షులూ, ప్రథానులూ, కమిటీల ముందు నిలబడి, జైలు శిక్షలు అనుభవించగాలేనిది, మన ప్రథాని యెక్కడనించో దిగి వచ్చాడా?
అసలు రహస్యం 4జీ ల వెనక్కాల వుంది.
ఈ 4జీ లెవరు?
ఓ ఎంపీకో, రోశయ్య సహా, సీనియర్ నాయకుడికో (మూడు కోతులు--ముగ్గురు మూర్ఖులు--కేకే, వీహెచ్, జీవీ (కాకా)ల సహితంగా) సోనియాతో అపాయింట్మెంట్ కావాలి అంటే, వెంఠనే యేర్పాటు చెయ్యగల అతి కొద్ది మందిలో ఒకడు 'సురారె' అనేవాడు మన రాష్ట్రం లోనే వున్నాడు.
తన అనుచరులందరూ మొత్తం గుడిని ఆక్రమించుకోగా, స్వయంగా తిరుపతి వెంకన్న గర్భగుడిలోకి అపాయింట్మెంట్ లేకుండా, జొరబడిపోయి, అక్కడి వాళ్లని బయటికి తగిలేసి, తన 'ధ్యానం' పూర్తయ్యేవరకూ యెవరూ లోపలికి రావడాని వీల్లేదని తలుపులు మూసుకొని, భక్త కన్నప్పలో రావుగోపాలరావు లెవెల్లో, స్వామితో యేకాంతంగా మాట్లాడి, సరైన సమాధానం వచ్చాకే బయటికి వచ్చేవాడికి, సోనియా ఓ లెఖ్ఖా?
2004 నించీ ఇలా 'కోట్లతో కొట్టే' వైయెస్, 'ఆదర్శ్' చవాన్, ఆండిముత్తు రాజా, మధు కోడాల్లాంటివాళ్లని ఇబ్బడిముబ్బడిగా పెంచి పోషిస్తూ, వేల కోట్లు దండుకొంటూ, నా చేతులు 'క్లీన్‌గా వున్నాయి' అని మన్మోహన్ని చూపించమంటూ, వెనుక నాటకమాడుతున్న ఇటాలియమ్మ నాటకం బయటపడిపోదూ--జేపీసీ వేస్తే?! అసలే బీహార్లోనూ అక్కడా తల బొప్పికట్టిందాయే!
అదీ అసలు సంగతి!
ఇక, రేపణ్నుంచీ మన తెలంగాణా ఎంపీలందరూ 'ఆమరణ' నిరాహర దీక్షలు చెయ్యాలనుకుంటున్నారట. దీన్ని కాస్త విస్తరించి, "యూపీయే" ఎంపీలందరూ 'జేపీసీ వెయ్యడానికి వీల్లేదు' అని ఆమరణాలు చేసి, ఢిల్లీలో పీవీ నరసింహారావుకి మొదట్లో యెన్నెకరాలు కేటాయించాలనుకున్నారో (అసలు ఢిల్లీ పేరే 'శ్మశానాల నగరం') అన్నిటిల్లోనూ సామూహిక అంత్యక్రియలు జరిపించుకుంటే, దేశానికి దరిద్రం వదిలిపోను!
జగన్ ఓ పదిహేనుకోట్లో యెంతో ఖర్చుపెట్టి, రీసెర్చిలు చేయిస్తున్నాడట--సీ ఎం కావడానికి. దీన్నే అంటారు....స్వర్గానికెగరగలిగుండీ, వుట్టితో సరిపెట్టుకోవడం అని.
కాబట్టి, నా మాట విని, హస్తినాపురి దారిబట్టి, మీ నాన్న మేట్లయిన కేవీపీ, సురారె, లరాగో లవాంటివాళ్ల ఇంటర్వ్యూ సంపాదించి, మన 'ఇటలీ దరిద్రాన్ని' వదిలించమని ప్రార్థించవయ్యా! అని సలహాకృతుడవుతున్నాడు!.
ఇవాళ మన రాష్ట్రం లోని ప్రతీవాడు అంటున్నాడు, "ఇవాళేమి చూశావు....డిసెంబరు 31 నాడు చూడాలి నా......." అని.
నా 'శృంగార...' లోని 'ఓ పొడవు జోకు' కీ, వీళ్ల మాటలకీ యేమైనా తేడా వుందా?
ఆలోచించండి!