లజ్జారహిత మంత్రిణి
- 150 మంది మృతి చెందిన ఙ్ఞానేశ్వరీ ఎక్స్ ప్రెస్ ప్రమాదం "సర్కారు అంటే గిట్టనివారు పన్నిన కుట్ర"ట.
- 63 మంది అశువులుబాసిన వనాంచల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం వెనుక రైల్వేలని "బదనామ్ చెయ్యాలనుకుంటున్న వర్గాల ప్రమేయం వుందని" అనుమానం ట.
- ఢిల్లీ స్టేషన్ లో, రైలు వస్తూందనగా, ప్లాట్ ఫామ్ మార్చామని ప్రకటించి, అందరూ మెట్లెక్కుతుండగా, మళ్లీ అది తప్పు అనీ, ఇదివరకు అనౌన్స్ చేసిన ప్లాట్ ఫామ్ మీదకే వస్తుందనీ చెప్పడం తో, తొక్కిసలాటలో అనేక మంది గాయ పడ్డారు, ఇద్దరు మరణించారు. "తప్పంతా జనాలదే! బుధ్ధిలేకుండా అలా పరుగులు పెట్టడం యేమిటి" అని ఈసడించారట.
ఇవన్నీ యెవరు అన్నారు? ఇంకెవరు--మమతాదీ నే!
రైల్వేలలో 89,000 వుద్యోగాలు కొన్ని యేళ్ళుగా ఖాళీగా వున్నాయట.
అందులో 20,000 వుద్యోగాలు "రైల్వే భద్రత, రక్షణ"లకి సంబంధించినవేనట.
26,000 డ్రైవర్ పోస్టులు ఖాళీగా వున్నాయట. 7 గంటలు మాత్రమే పనిచెయ్యవలసిన డ్రైవర్లు, పది పదిహేను గంటలు
పనిచేస్తున్నారట!
రైలు మొత్తానికి ఒకే టీ టీ ఈ తో నడుస్తున్న రైళ్ళు చాలా వున్నాయట.
బ్రిటీష్ వాళ్ళు నిర్మించిన రైలు మార్గం 52,000 కి. మీ. లైతే, స్వతంత్రం వచ్చాక 63 యేళ్ళలో కొత్తగా నిర్మించింది కేవలం 12,000 కి. మీ. కూడా లేదట.
ఇక "తృటిలో" తప్పిన ప్రమాదాల గురించి, రోజుకి రెండో మూడో వింటూనే వున్నాము.
ఇక ఇప్పుడు, ముఖ్యమైన స్టేషన్లలో ఒక్కోటీ 70 లక్షలు ఖర్చయ్యే "ఎస్కలేటర్లు" నిర్మిస్తారట! (మెట్లెక్కుతూనే
తోసుకొనే ప్రయాణీకులు ఎస్కలేటర్లు యెక్కడం లో యెన్ని ప్రమాదాలకి గురవుతారో!)
ఆ మాత్రం ఖర్చుతో ఒక్కో ప్లాట్ ఫామ్ మీదా అటు రెండూ, ఇటు రెండూ లిఫ్టులే యేర్పాటు చెయ్యవచ్చు! పైగా సురక్షితం గా వుంటాయి.
(తిరుపతిలోని శ్రీనివాసం గెస్ట్ హౌస్ లో వున్నాయి ఇలా లిఫ్ట్ లు. అక్కడ అనేక అంతస్తులు వున్నాయి. మరి ప్లాట్ ఫామ్ మీదైతే, ఒక్క అంతస్తే కదా?)
మరి ఈ స్కీమే యెందుకంటే, వేరే అడగాలా--కోట్లు నొక్కెయ్యడానికని తెలియడం లేదూ!
రైల్వే శాఖ వెబ్ సైట్ లో కూడా, ఈ-టిక్కెట్లని అమ్ముతారట--ఐ ఆర్ సీ టీ సీ గుత్తాధిపత్యాన్ని నివారించడానికి! (ఇక రెంటికీ చెడ్డ రేవళ్లవుతారేమో అమాయక ప్రయాణీకులు!)
ఇదివరకే ఓసారి వ్రాశాను--ఇంకా రైళ్లలో గమ్యం చేరగలుగుతున్నారంటే, నిబధ్ధతతో వుద్యోగాలు చేస్తున్న
కొన్నివేల--గ్యాంగ్ మెన్ లూ, పాయింట్ మెన్ లూ, సిగ్నల్ మెన్ లూ వగైరాల వల్లే గానీ, ఇలాంటి 'మమత 'ల వల్ల కాదు అని.
ఇలాంటివాళ్ళని మంత్రివర్గం లో వుంచి, మేపుతున్న ఖర్మ మన కేంద్ర సర్కారుది!
హేపీ జర్నీ!
7 comments:
చాలా బాగా చెప్పారు
1993 వరకు మీ నరసాపురంకి స్టీమ్ ఇంజిన్లు నడిచేవని విన్నాను. ఇతర రూట్లలో స్టీమ్ ఇంజిన్లని ఆపేసిన తరువాతే నరసాపురం లైన్ లో స్టీమ్ ఇంజిన్లు ఆపేశారని తెలిసింది. మన రైల్వే వారు అంత స్లో. మా శ్రీకాకుళం జిల్లా నౌపడ గ్రామం నుంచి ఒరిస్సాలోని గుణుపురం వరకు ఒక న్యారో గేజ్ లైన్ ఉంది. 1993 వరకు ఆ లైన్లో స్టీమ్ ఇంజిన్లు నడిపేవారు. ఆ లైన్ పొడవు 91 కిలో మీటర్లు. అప్పట్లో నౌపడ నుంచి గుణుపురంకి న్యారో గేజ్ బండి మీద వెళ్లడానికి 5 గంటలు పట్టేది. అయినా ఆ బండి జనంతో రద్దీగా ఉండేది. ఆ బండిలో TTE ఉండేవాడు కాదు. జనం టికెట్లు లేకుండా ఎక్కేవారు. 1989లో ఆ లైన్ కి నష్టాలు వస్తున్నాయని చెప్పి ఆ లైన్ ని ఎత్తివెయ్యాలనుకున్నారు. ఆ లైన్ వెనుకబడిన గిరిజన గ్రామాల మీదుగా వెళ్తుంది. ఆ లైన్ ని ఎత్తివేస్తే గిరిజన గ్రామాలకి నష్టం అని గిరిజనులు గొడవ చేశారు. 1998లో ఆ లైన్ ని బ్రాడ్ గేజ్ గా మార్చాలని నిర్ణయించారు. ఇప్పుడు నౌపడ నుంచి పరలాకిమిడి వరకు లైన్ ని బ్రాడ్ గేజ్ గా మార్చారు. ఆ లైన్ లో నౌపడా, టెక్కలి స్టేషన్లు తప్ప మిగితా స్టేషన్లన్నీ గిరిజన ప్రాంతంలోనే ఉన్నాయి. ఆ మధ్య రిమోట్ ఏరియా సంపర్క్ యోజనా పేరుతో మారుమూల ప్రాంతాలకి రైల్వే లైన్లు వేస్తామని చెప్పిన రైల్వే శాఖ ఇప్పుడు కూడా వెనుకబడిన ప్రాంతాలని నిర్లక్ష్యం చేస్తోంది. గూడ్స్ ట్రాఫిక్ వచ్చే చోట్ల మాత్రమే కొత్త లైన్లు వేస్తోంది. మన ఆంధ్ర ప్రదేశ్ లో కొవ్వూరు - భద్రాచలం రోడ్ లైన్ కొరకు రెండు సార్లు సర్వేలు జరిగాయి. రెండు సార్లు ప్రొపోజల్ ని గాలికి వదిలేశారు. గుంటూరు - బీబీనగర్ లైన్ విద్యుతీకరణ ప్రొపోజల్ ని కూడా గాలికి వదిలేశారు. సికందరాబాద్ - వాడి (కర్నాటక) విద్యుతీకరణ ప్రొపోజల్ ఎంత వరకు వచ్చిందో తెలియదు. ఒరిస్సాలో కూడా ఇలాగే జైపూర్ - కొత్తమేట, తాల్చేర్ - బరంపురం రైల్వే లైన్ల ప్రొపోజల్స్ గాలికి వదిలేశారు. ప్రొపోజల్స్ తయారు చెయ్యడం, తరువాత చెత్త బుట్టలో వేసెయ్యడం రైల్వేవాళ్లకి మామూలే.
డియర్ సురేష్ బాబు!
సంతోషం!
ధన్యవాదాలు.
డియర్ Praveen Sarma!
మీరు వ్రాసిన వివరాలు యదార్థాలే.
ఇక నేరోగేజి రైలు టెక్కలి స్టేషన్ లో బయలుదేరాక, ఎన్ హెచ్ 5 ని దాటుతుంది. అక్కడ ఓ గేటుండేది. ప్రయాణీకులు స్టేషన్ దాకా వెళ్ళకుండా, ఆ గేట్ దగ్గర రైలు తో సమం గా పరుగెట్టి, అందులో యెక్కేసేవారు. చాలా సార్లు చూశాం.
ధన్యవాదాలు.
సురేష్ గారు. మీ అనంతపురం జిల్లాలో కొన్ని గ్రామాల వారికి ట్రైన్ ఎలా ఉంటుందో తెలియదని విన్నాను. గుంతకల్ -బెంగళూరు,ధర్మవరం - పాకాల, బళ్లారి - రాయదుర్గం లైన్లు ఒకప్పుడు మీటర్ గేజ్ లైన్లు. రాయదుర్గం లైన్ లో ఒకటి రెండు ట్రైన్లు మాత్రమే నడిచేవి అని విన్నాను.రాయదుర్గం లైన్ ని బ్రాడ్ గేజ్ గా మార్చి దాన్ని కర్నాటకలోని చిక్కజాజూరు వరకు పొడిగించారు. అయినా రాయదుర్గం ప్రాంతంలోని కొన్ని గ్రామాల వారికి ట్రైన్ ఎలా ఉంటుందో తెలియదని "వార్త" దిన పత్రికలో వార్త వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని ముమ్మిడివరం ప్రాంతంలోని గ్రామాల వారికి కూడా ట్రైన్ ఎలా ఉంటుందో తెలియదు. ముమ్మిడివరం గిరిజన ప్రాంతం కాదు. అయినా అది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గా వెనుకబడిన ప్రాంతం.
కృష్ణశ్రీ గారు. నౌపడ-గుణుపురం లైన్ ని బ్రాడ్ గేజ్ గా మార్చాలనే ప్రొపోజల్ 1950 నుంచి ఉంది. రైల్వే బోర్డ్ 1998లో బ్రాడ్ గేజ్ ప్రొపోజల్ ని అప్రూవ్ చేసింది. ఒరిస్సాలోని గజపతి జిల్లాలో మా బంధువుల గ్రామాలు న్యారో గేజ్ లైన్ కి దగ్గరలోనే ఉన్నాయి. పెద్ద బండి (బ్రాడ్ గేజ్ ట్రైన్) ఎప్పుడు వస్తుంది అని మా చిన్నప్పుడు కూడా మాట్లాడుకునేవారు.
నేను రెండు సార్లు జన్మభూమి ఎక్స్ప్రెస్ AC చైర్ కార్ లో ప్రయాణించాను. ఆ బండిలో AC చైర్ కారే చెత్తగా ఉంది. ఇక సెకండ్ క్లాస్ పెట్టెలు ఎంత చెత్తగా ఉంటాయో ఊహించడం కష్టం కాదు. పగటిపూట ప్రయాణానికి 2 టయర్ లేదా 3 టయర్ AC ఎందుకని చైర్ కార్ లో ప్రయాణించాను. కోణార్క్ ఎక్స్ప్రెస్ లో మాత్రం పెట్టెలు బాగుంటాయి. అవి సెంట్రల్ రైల్వేవాళ్లవి కదా.
Post a Comment