Thursday, April 16, 2009

‘బోఫోర్స్’

‘బోఫోర్స్’ ఆరోగ్యశ్రీ

మేం హైస్కూల్ లో 3ర్డ్ ఫారం చదువుతూండగా, మా కొత్త డ్రాయింగ్ మేష్టారు (మట్టా పురుషోత్తం గారు) చాలా శ్రమపడి, సర్వీసు వేడిచేసి కరిగించి అందులో నీలిమందు కలిపి, అందులో బ్రష్ ముంచి, అన్ని క్లాస్ రూముల్లోనూ నాలుగు గోడలమీదా సీలింగుకి ఓ మూడడుగుల క్రింద గీత గీసుకొని, ఆర్టిస్టిక్ గా కొన్ని మంచి కొటేషన్లు వ్రాశారు! వాటిల్లో ఒకటి “ఆరోగ్యమే మహా భాగ్యం”.

మేం వూరుకుంటామా! ఆ రాత మామూలుగా చెరగదు! ఒకరోజు పట్టుపట్టి, సాయంత్రం డ్రిల్లు పిరీయడ్ యెగ్గొట్టి, యెవరూ చూడకుండా, బెంచీ మీద బెంచీ వేసుకొని, పైకెక్కి, ఆ కొటేషన్ లోని ‘య’ ఒత్తు బ్లేడు తో గీకేశాం!
ఇంకేముంది? “ఆ రోగమే మహా భాగ్యం!”

(యెంత ప్రయత్నించినా దొంగలెవరూ దొరకలేదనుకోండి! ఆఖరికి స్కూలు అసెంబ్లీ లో హెడ్ మేష్టారు నవ్వుతూ ఆ సంగతి అనౌన్స్ చేశారు, మా పురుషొత్తం గారు కూడా హయిగా నవ్వేశారు!)

ఇదంతా యెందుకంటే, ‘బోఫోర్స్’ వారి ఆరోగ్యశ్రీ (బల్సారావారి దోమల క్రీం లాగ) గురించి మాట్లాడితే……గుర్తొచ్చాయి!

మాకు బాగా తెలిసినాయన, పాపం 75 యేళ్ళు—‘సయాటికా’ తో బాధపడుతున్నాడు—యేళ్ళతరబడి మందులు వాడు తున్నాడు—తెల్ల కార్డ్ వుంటేగాని ‘ఆ శ్రీ’ రాదనీ, తెల్ల కార్డ్ లు యెప్పుడిస్తారా అనీ యెదురు చూసి, యెట్టకేలకు ఎలక్షన్ ముందు ఓ తెల్ల కార్డ్ (ఓ మూదు వందలు ఖర్చు చేసి) ‘సంపాదించి’, ఆశగా హైదరాబాదు (నాలుగొందల పైచిలుకు బస్ టిక్కెట్టు పెట్టుకొని) వెళ్ళి, (స్థానిక ఎమ్మెల్యే చేత రికమండేషను లెటరు తీసుకొని) తీరా నింస్ కో మెడినోవాకో వెళ్ళి, ‘మీకు ఈ పధకం వర్తించదు’ అని చెప్పించుకొని, ఓ పదిహేనువందలు ఖర్చు పెట్టి టెస్ట్ లు చేయించుకొని, మందులు వ్రాయించుకొని వచ్చేసి, ‘ఆ డాక్టరు మాత్రం చాలా మంచి వాడండి! చాలా ఓపికగా చూశాడు! చక్కగా చెప్పాడు!’ అని మురిసిపోతున్నాడు!

(ఇంతకీ ‘ఆ శ్రీ’ గుండె జబ్బులకీ, కేన్సర్లకీ, ఎయిడ్స్ లకీ ఇలాంటివాటికే వర్తిస్తుందట! మరి ‘కార్పొరేట్లు’ వాటిల్లోనే లక్షలు సంపాదించుకోవచ్చు!)

నా స్వయం అనుభవం ఒకటి చదవండి!


కర్ణాటక రాష్ట్రం రాజధాని బెంగుళూరు లో మా అబ్బాయి వుంటున్నాడు. అక్కడ ఒక డాక్టరుని చూసుకున్నాము! ఆయన మా ఫామిలీ డాక్టర్ అయిపోయారన్న మాట.

మేము క్రితం వేసవి కాలం లో బెంగుళూరు లో ఒక నెల వున్నాము.

ఆ టైం లో జనరల్ చెకప్ కోసం ఆయన్ని సంప్రదిస్తే, ‘నేను డ్యూటీ లో వున్నాను, మీరు నేరుగా మా గవర్నమెంట్ ఆస్పత్రికి వచ్చెయ్యండి’ అన్నారు. (ఆయన ఉద్యోగం గవర్నమెంట్ ఆస్పత్రిలో).

మేం బెంగుళూరు కోట లో వున్న ప్రభుత్వాసుపత్రికి వెతుక్కుంటూ వెళ్ళాము.

చెపితే నమ్మరేమో! విశాలమైన ఆవరణలో, బహుళ అంతస్తుల భవనం (కేవలం ఔట్ పేషెంట్లకోసం!) ఇన్ పేషంట్లకోసం వేరే భవనం!

ఓ పీ లోకి ప్రవేశించగానే, రిసెప్షన్ లో ముగ్గురు నలుగురు వయో వృద్ధులు…..ఒక యువతి…లోపలకి వచ్చినవాళ్ళని పలకరించి, మనం తెల్లమొహం వేస్తే, ఇంగ్లీషులోనో, హిందీలోనో మాట్లాడి, మనని కావలసిన విభాగానికి పంపిస్తున్నారు!

మేం తిన్నగా మా డాక్టరుగారి విభాగానికి వెళ్ళిపోయాం! ఆయన మమ్మల్ని చూసి, చిరునవ్వుతో మా సమస్యల్ని విని, ‘మీరు కొన్ని టెస్ట్ లు చేయించుకోవాలి. తిన్నగా రిసెప్షన్ యెదురుగా వున్న కౌంటర్లలో యెదో ఒక దానిలో రిజిస్టర్ అయి రండి’ అన్నారు. నేను రిజిస్త్రేషన్ (మా ఆవిడ పేర) ఓ పది రూపాయలు కట్టి, చేయించాను. ఓ పాస్ బుక్ ఇచ్చారు! (వేరే ప్రశ్నలూ, ధృవీకరణలూ లేవు!). పాస్ బుక్ చూపించగానే మా డాక్టర్ ‘ఫలానా’ విభాగానికి వెళ్ళండి. ఎక్స్ రే తీయించుకు రండి’ అన్నారు!

పొలోమంటూ వెళ్ళాము. ఆ విభాగం లో ఓ కేబిన్ లో ఓ ప్రొఫెసరు! మిగిలినవాళ్ళంతా హౌస్ సర్జెన్లు! చిరునవ్వుతో మమ్మల్ని యెదుర్కొని, సమస్య అడిగి, ఎక్స్ రే టెక్నీషియన్ కి అప్పగించి, ‘ఓ పావు గంటలో ఎక్స్ రే వస్తుంది! మీరు ఈ పక్క రూము లో వేచి వుండండి! ఇక్కడ అన్నీ వుచితం! మీరేమీ యెవరికీ దుడ్లు ఇవ్వనక్కరలేదు! అని చెప్పి మరి పంపించారు!

ఇక నర్సులూ, ఆయాలూ, తోటీలూ కూడా సాక్షాత్తూ 'ఫ్లారెన్స్ నైటింగేళ్ళే!'

మేం ఈలోగా కొంచెం ఆకలి వేసినట్టనిపించి, ఆ భవనం వెనక్కి వెళ్ళేటప్పటికి అక్కడ స్టూడెంట్ డాక్టర్లూ, నర్సులూ సహకార పద్ధతిలో నడిపిస్తున్న ఫలహారశాలలో అమృతంలాంటి ఉపాహారాలు--అతి తక్కువ ఖర్చులో! అక్కడ మా పిల్లల వయసులో ఉన్న కాబోయే డాక్టర్లతో ముఖాముఖీ--వాళ్ళ అదృష్టానికి సంతోషం!

ఎక్స్ రే తేసుకొని, మా డాక్టరుని కలిస్తే, ఆయన మందులు వ్రాసి ఇచ్చాడు. తరవాత, నా ప్రాబ్లెం గురించి చెపుతే, మళ్ళీ నా పేరున ఓ పాస్ బుక్, టెస్ట్ లూ, ఎక్స్పర్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ల తో సంప్రతింపులు, మందులు వ్రాయించుకోవడం, మొత్తం ప్రక్రియ పూర్తయ్యే సరికి ఓ మూడు గంటలు పట్టింది!

కానీ—మేం చాలా సంతోషించాం! ఓ పది రూపాయలు కడితే, అన్ని టెస్టులూ ఫ్రీ—సంప్రదింపులు ఫ్రీ—ట్రీట్ మెంట్ ఫ్రీ—ఇంతకంటే యేమి కావాలి?

అప్పటికి శ్రీ యెడ్యూరప్ప గవర్నమెంట్ కూడా రాలేదు!

మరి యే గవర్నమెంట్ వుంటేనేం? ఆ సంస్థకి యెన్ని కోట్లు ఖర్చు పెడుతోంది? నిజంగా ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకొనే ప్రభుత్వం వుంటే ఇవన్నీ సాధ్యమే!

మరి ‘బోఫోర్స్’ ఆరోగ శ్రీ కే వోటేద్దామంటారా?

మీ ఇష్టం!

No comments: