‘లూజ్ టాక్’ అనే పిచ్చ వాగుడు!
దీనికి యేదో ఒక సమయంలో, యేదో ఒక సందర్భంలో, యేదో ఒక చోట, లోనుకానివాళ్ళు వుండరు! దీనికి అతీతులు కానివాళ్ళే అందరూ!
ఓ సినిమాలో ఓ హీరో తన బుర్రమీద చేత్తో కొట్టుకొని, ‘ఇక్కడ యేమనిపిస్తే అది చేస్తాను’ అనీ, నోటి మీద వేలు వేసుకొని, ‘ఇక్కడ యేం తోస్తే అది మాట్లాడతాను’ అనీ అంటాడు!
ఓ కమేడియన్, దాన్ని పేరడీ చేసి, తన మోకాలు చిప్పమీద కొట్టుకొని, ‘ఇక్కడ యేమనిపిస్తే అది చేస్తాను’ అనీ, తన పృష్ఠ భాగం చూపిస్తూ, ‘ఇక్కడ యేమి తోస్తే అది మాట్లాడతాను’ అనీ అంటాడు!
ఓ ముప్ఫైఅయిదేళ్ళ క్రితం, మా కొలీగ్ హుస్సేన్ అని వుండేవాడు. ‘మీ అయ్యప్పేమిటండీ! బొత్తిగా దొడ్డికి కూర్చున్నట్టు కూర్చుంటాడు?’ అనేవాడు!
ఇంతకుముందు కొంతమంది దగ్గర ఈ ప్రశ్న వేశాట్ట! వాళ్ళు, ‘అది ఫీఠం వేసుకొని కూర్చోవడమండి’ అని సమాధానం చెప్పారట!
మాది అరమరికలు లేని స్నేహం అవడంతో, మేం చాలా ఫ్రీగా మాట్లాడుకొనే వాళ్ళం! యెవరికైనా కోపం వచ్చినా, చివర్లో విడిపోయేముందు ‘నో హార్డ్ ఫీలింగ్స్ ప్లీజ్ ‘ అని చెప్పుకొనే వాళ్ళం!
బ్యాంకులో మా డ్యూటీ అయి పోయాక, కొలీగ్స్ నలుగురైదుగురం బద్రుద్దీన్ హోటల్ కి వెళ్ళి అక్కడ అద్భుతమైన టీ తాగి, పిచ్చాపాటీ మాట్లాడుకొని, అప్పుడు ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం!
మాకు ఆ హోటల్ లో ఆ టైముకి ఐదారుగురు కూర్చొనే ఒకే టేబులు ఖాళీ గా వుంచేవాడు బద్రుద్దీన్.
ఆ ప్రక్కనే గోడమీద, ‘లా ఇల్లాహ, ఇల్లిల్లాహు, మహమ్మదుర్రసూలిల్లాహి’ అనే ఉర్దూ లిపిలో వున్న ఫోటో, దాని ప్రక్కనే, మహమ్మదు ప్రవక్త (అ.స.అ) నగ్నంగా గొంతు కూర్చొని, భజన చేస్తున్నట్టు చేతులు పెట్టుకొన్న ఫోటో ఒకటి వుండేది!
ఆ వాక్యాన్ని నాకు సరిగ్గా పలకడం నేర్పించింది మా హుస్సేనే!
యెప్పుడైతే అయ్యప్ప ప్రసక్తి వచ్చిందో, నేనన్నాను “మీ మహమ్మదేమిటండీ! మరీ గుడ్డలు కూడా ఇప్పుకొని దొడ్డికి కూర్చొన్నాడు?” అని!
హుస్సేన్ మొహం లో కత్తివాటుకి నెత్తురు చుక్క లేదు! (మిగిలిన మా కొలీగ్స్ అందరూ హిందువులే మరి).
ముఖం కందగడ్డ అయిపోగా, చేతిలో సిగరెట్టుని ఒకే దమ్ములో పీల్చేసి, విసురుగా లేచి వెళ్ళి పోతుంటే, మేమందరమూ ఆయన వెనక పరుగు! మా వెనక్కాల హోటల్ సర్వర్ పరుగు—సార్! బిల్లు కట్టలేదు—అంటూ!
ఓ యభై అడుగులు విసురుగా నడిచి, సెంటర్లో ఆగి, వెనక్కి తిరిగి, వలవలా విలపించాడు మా హుస్సేన్—‘నన్ను క్షమించుండీ! నాకు కనువిప్పు అయ్యిందీ’ అంటూ!
ఇక మేం చేసేదేముందీ—‘బ్రదర్ హుస్సేన్! ప్లీజ్, ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్’ అనడంతప్ప!
ఇంకా ‘లూజ్ టాక్’ ల గురించి మరోసారి!
No comments:
Post a Comment