అవీ, ఇవీ, అన్నీ
పాత "గులేబకావళి కథ" సినిమాలో, "దాని మొగుడు" అనేవాడు, "వాడి పెళ్లం" అనే ఆవిడతో లేచిపోయాడు అని, ఎన్ టీ ఆర్ మారువేషం లో వుండగా, "దానిమొగుడు, వాడి పెళ్లాంతో లేచిపోతే......." ఆంటూ ఓ డైలాగు వస్తుంది.
ఇప్పుడంతా---వాడి పెళ్లాం, దాని మొగుడు, వాడి కొడుకు, దాని కొడుకు, వాడి తమ్ముడు, వాడి మేనల్లుడు, వాడి మనవడు, వాడి బావమరిది, ఇలాగే......రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ కూడా.
(ఎలక్షన్ల గురించీ, రాజకీయాల గురించీ సణగడం శుధ్ధ వేస్ట్ అనుకునేవాణ్ని......వస్తున్న మార్పులు చూసి మళ్లీ సణగబుధ్ధేసింది మరి.)
తాజాగా పిచ్చిదంబరం, (తన కొడుకు కార్తి కి టికెట్ ఇచ్చినందువల్ల) యెన్నికల్లో పోటీ చేయబోను అని ప్రకటించేశాడు. ఎనిమిది సార్లు నెగ్గాను, పదిహేడేళ్లు గొప్ప గొప్ప శాఖలు మంత్రిగా వెలగబెట్టాను, 68 యేళ్లు వచ్చేశాయి, యువతకి అవకాశం అంటూ భగవద్గీతలు చెపుతున్నాడు. రాజకీయాల నుంచి తప్పుకొని, గాంధీ మార్గం (యే గాంధీ యో?!--మరి ఇన్నాళ్లూ ఆ మార్గం లో లేనట్టేనా?) పడతానని కూడా అన్నాడు. రాజకీయాల్లో 98 యేళ్లు వచ్చినా రిటైర్ మెంట్ ఉండదు అనీ, కనీసం 88 వచ్చేవరకూ అయినా గవర్నర్ పదవులూ అవీ గ్యారంటీ అనీ, దొడ్డిదారిని అధికారం చేపట్టే మార్గాలు చాలానే వున్నాయి అనీ చెప్పకనే చెపుతున్నట్టు లేవూ ఈ మాటలు?
ఇంకా యెన్నాళ్లు మన చెవుల్లో పువ్వులు పెడతాడో!
నందన్ నీలేకణి ఆస్థి రూ.7,700 కోట్ల పైమాటేనట, ఆయన అఫిడవిట్ ప్రకారం. (అందులో సింహ భాగం 'ఊరివెలుపల పాడు కోనేటి చెంత......'దాచిన బంగారం లాంటివేననుకోండి). జేబులోని రూ.200/- తో జీవితాన్ని ప్రారంభించి, ఇతరులతో కలిసి రూ.10,000/- తో ఇన్‌ఫోసిస్ స్థాపించి, ఈ స్థితికి వచ్చాడంటే, 'ఇండియా వెలుగుతోంది' కి మంచి ఉదాహరణ కదూ! (మన పిచ్చాళ్ళేమో అది నమ్మక తింగరాళ్లనందరినీ గెలిపించి, దేశాన్ని ఈ స్థితికి తెచ్చారు.) తనకి ఓ పదవి ఇచ్చినందుకే కాంగ్రెస్ తరఫున పోటీ చేసి కృతజ్ఞత చాటుకుంటున్నారు. ఈయనకి ఓ 10 కోట్లో, 100 కోట్లో పారేసి నెగ్గడం కష్టం కాకపోవచ్చు. కానీ ఓటర్లు ఆలోచించ వలసింది--ఈయన చిల్లర డబ్బులకోసం కక్కుర్తి పడడు 'కాబట్టి సేవ చేస్తాడా' లేక ఆ కోట్లని 'లక్ష కోట్లు' చేసేలా 'దండుకుంటాడా' అని.
ఓ ప్రక్క బర్దన్ మూడో కూటమి విషయం లో చింతిస్తున్నా, కారత్ మాత్రం, ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వం స్థాపిస్తాం అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు! ప్రాప్త కాలజ్ఞత కూడా లేదు సీ పీ ఎం వాళ్లకి.
మన తెలుగు తేజం డా. ఆర్. సత్యనారాయణ "గీతమ్" లో పరిశోధనలు చేసి, కృత్రిమ కోడి మాంసం తయారు చేసే విధానం కనిపెట్టాడట. ఓ కోడి కండ సేకరిస్తే, టన్నులకి టన్నులు మాంసం తయారు చేసేసుకోవచ్చుట. కోళ్ల కి శుభవార్తే. జీవహింస తగ్గే ఛాన్‌స్ వుంది కాబట్టి, ప్రపంచానికీ శుభవార్తే.
కానీ, కండల సేకరణ యెలా చేస్తారో అని ఓ సందేహం.
చికెన్ అనగానే మన నారాయణ గుర్తొస్తాడు. తెలంగాణాలో కాంగ్రెస్, తెరాస, సీపీఐ కలిసి పోటీ చేస్తేనే ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి అనీ, అలా నెరవేరకపోతే ఆరు నెలల్లోనే ఉద్యమాలు మొదలవుతాయి అనీ హెచ్చరించారు. (పాపం ఈయన జీవితం లో సగభాగం చికెన్ తిని నిద్రపోవడానికీ, మిగతా సగం ఉద్యమాలకే అంకితం అయిపోయాయి. ధన్యజీవి.)
ఓ ప్రక్క ఎం జే అక్బర్ లాంటివాళ్లు బీజేపీ లో చేరిపోతుంటే, అసదుద్దీన్ 'పవన్ కళ్యాణ్ సినిమాలు హైదరాబాదులో యెలా రిలీజ్ అవుతాయో చూస్తాం' అంటున్నాడు. పాపం హైదరాబాదు వాళ్ళందరూ చిన్నపిల్లలు కదా? వాళ్లకి ఓటు హక్కే లేదేమో!
ఇంక, పిల్ల నాయకుడు రాహుల్ పై, మృత్యు చుంబనం విషయం లో (ఓ ఆవిడని ముద్దుపెట్టుకొన్నందుకు ఆవిడ భర్త ఆవిడని హత్య చెయ్యడం పై) కేసు నమోదుచేశారట. మరి యెప్పటికి, యే శిక్ష పడుతుందో!