Saturday, January 18, 2014

కబుర్లు - 103



అవీ, ఇవీ, అన్నీ

సీ డబ్ల్యూ సీ సమావేశం అయిందట. మన తెలుగు అంజయ్యలని యెవర్నీ మాట్లాడనివ్వలేదట! యెన్నికల్లోపల ప్రథాని అభ్యర్థిని ప్రకటించడం వాళ్ల ఇంటావంటా లేదందట వాళ్లమ్మ. (క్రితం యెన్నికలముందు మన్మోహన్ పేరు ప్రకటించడం అప్పటి అవసరమే తప్ప, ఆచారం సృష్టించడానికి కాదట). నేను ఓ సైనికుణ్ని, అమ్మ యేమి చెయ్యమంటే అది చేస్తాను అన్నాడట పిల్లాడు.

అసలు అయితే గియితే రాబోయే యెన్నికల్లో వాళ్ల పార్టీ కి కొన్ని సీట్లయినా వస్తే, మిగిలిన చిన్నా చితకా పార్టీలతోనే సంకీర్ణం యేర్పాటు చేసే అవకాశం వస్తే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయితే, సీల్డ్ కవర్లోంచి వాడి పేరు బయటపడినప్పుడు కదా!

ఇంకా గొప్పగా--"మీ గిన్నెలో అన్నం అవుతా, మీ చేతుల్లో పుస్తకమవుతా, మీ నెత్తిమీద నీడనవుతా, ఆడపడుచులను ఆదుకొనే అన్ననవుతా, పార్టీని ముందుకు నడిపించే సేనాని అవుతా, మీరు చెప్పినట్టు వినే విధేయుడినవుతా.........." అంటూ డైలాగులు కొడుతుంటే, వాళ్లమ్మ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ, తెగ సంతోషించేసిందట! (ఇంకా నయం, మీనెత్తిమీద మారెమ్మనవుతా, మీ ప్రక్కలో పామునవుతా.....అనలేదు)

"మన్మోహన్ జీ! తొమ్మిది రాయితీ సిలిండర్లతో మేం వంట చెయ్యలేం. ఈ దేశ మహిళలు మరిన్ని కోరుకుంటున్నారు. ప్రతి కుటుంబానికి 12 సిలిండర్లు కావాలి. దయచేసి 'కోటా' పెంచండి!" అన్నాడట. (అసలు ఈ కోటా యెందుకు? రాహుల్ కీ, చిదంబరానికీ, షిండేకీ, అహ్మద్ పటేల్ కీ అందరికీ 12 సిలిండర్లు కావాలా? సామాన్యుడికి కావలసినది "ఆథార్" సంబంధంలేని సిలిండర్లు--ఆరైనా, తొమ్మిదైనా! సరిపోకపోతే, కట్టెలపొయ్యిలు యెలాగా వున్నాయి!)

"తెల్ల కార్డు వున్నవాళ్లకే రాయితీ సిలిండర్లు" అంటే, బంగ్లాదేశ్ వాళ్లకీ, పాకిస్థాన్ వాళ్లకీ అందరికీ ఇచ్చేసినా సబ్సిడీల్లో ఇంకా బోళ్లు మిగులుతుంది కదా? యెలాగూ ఆథార్ ఓ గుర్తింపు కార్డు మాత్రమే--పౌరసత్వ కార్డు కాదు అనేశారుగా!

అన్నట్టు, నందన్ నీలేకణి ఒచ్చే యెన్నికల్లో పోటీ చేస్తాడట!

వెనకటికొకాయన బాగా "డబ్బు చేసి" ఓ సొంత పార్టీ పెట్టి, యెన్నో సీట్లు గెలవలేక, డబ్బు ఖర్చైపోయి, కాటాకి వచ్చేసి, కాంగ్రెస్ ని "సామాజిక న్యాయం" మీరే చెయ్యాలని, ఓ మంత్రిపదవి సంపాదించి, మళ్లీ సంపాదించుకొంటున్నాడు.

ఇంక ఇప్పుడు, నీలేకణి ఆథార్ అంటూ ఓ 50 వేల కోట్లు ప్రభుత్వ ధనం విరజిమ్మి, మిగిలిన ప్రభుత్వాలచేత మరిన్ని వేల కోట్లు ఖర్చుపెట్టించి, ఇప్పుడు యెన్నికై యేమి సంపాదించుకోవాలనుకుంటున్నాడో!

వచ్చే యెన్నికల్లో యేపార్టీ అయినా "ఆథార్" కుంభకోణం మీద చర్య తీసుకుంటామని ప్రకటిస్తే, అధికారం లోకి రావడం చాలా వీజీ! పార్టీలు గమనిస్తున్నాయా?

ఢిల్లీలో అధికారంలోకి వచ్చాకగానీ అదేమిటో అనుభవంలోకి రాలేదు కేజ్రీ కి. అందరిలాగే "నాదగ్గరేమీ మంత్రదండం లేదు" అనేశాడు. మరి నువ్వేదో పొడిచేస్తావనే కదురా నీ చేతికి అధికారం అనే మంత్రదండం ఇచ్చాము "సార్లేక్" అని ఆమ్ ఆద్మీలు అడగద్దూ?

ప్రక్కలో పాముతో అధికారంలోకి వస్తున్నాము అని తెలిసీ, ప్రజా దర్బారు అంటూ బోర్లా పడి, గోడ యెక్కవలసి వచ్చింది! క్రొత్త అవినీతికేసులపై తప్ప, పాత కేసులని పట్టించుకోం అని ఓ సారి అన్నాడు. షీలా మీద యేవైనా ఆరోపణలు యెవరైనా చేస్తే, వాటి సంగతి ఆలోచిస్తాము అంటాడోసారి. 

బిన్నీ అయితే, కాంగ్రెస్ లోంచి వచ్చాడు, ఎం ఎల్ యే అయ్యాక యేవో కోరికలు తీరక యేదో మాట్లాడుతున్నాడు అంటున్నారు. మరి అనుపమ్ ఖేర్ యెందుకు మాట్లాడుతున్నట్టో!

మన సొంటికొమ్ము జేపీ వాళ్లతో చేరడానికి ఆరాటపడుతున్నాడు. వాళ్లేమో దూరం పెడుతున్నారు!

చూడాలి--యెన్నికల్లోపల మరెన్ని చిత్రాలు జరుగుతాయో!


2 comments:

hari.S.babu said...

నిజమే కేజ్రీవాల్ కాస్తా క్రేజీవాల్ అని పించుకుంటున్నాడు:-)

A K Sastry said...

Dear Hari Babu Suraneni!

నిజమే! పాపం అనుభవం లేదుకదా!

ధన్యవాదాలు.