అవీ, ఇవీ, అన్నీ
మొన్ననే "అర్థంలేని ఆథార్" అంటూ సణిగాను. వెంటనే వార్త వచ్చింది. కర్ణాటక హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.ఎస్.పుట్టస్వామి సుప్రీం కోర్టులో వేసిన కేసులో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని "నిత్యావసరాలు వగైరాల విషయంలో ఆథార్ కోసం నిర్బంధించడం రాజ్యాంగానికి విరుధ్ధం" అనీ, ఆ కార్డు పొందాలా వద్దా అన్నది పౌరుల ఇష్టాయిష్టాలకి వదిలేయాలి అనీ ఆదేశించిందట.
లేకపోతే, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకి ఆథార్ లేకపోతే జీతాలు కూడా ఇవ్వమని, జనాలకి వివాహ ధృవీకరణ పత్రాలు ఇవ్వమనీ ప్రకటిస్తారా మహారాష్ట్ర ప్రభుత్వం!
ఇప్పటికి 50 వేల కోట్లు ఖర్చుపెట్టేశామని ప్రకటించారట కోర్టులో! (అది ఒక్క నందన్ నీలేకణి ఖర్చుపెట్టింది మాత్రమే. ఇంక రాష్ట్ర ప్రభుత్వాలూ, ప్రభుత్వ విభాగాలూ ఖర్చు పెట్టిందీ, ప్రైవేటువాళ్లు తిన్నదీ కలిపితే, కొన్ని లక్షల కోట్లు అవుతుంది.)
ఇక్కడ మా జిల్లాలో, కలెక్టరూ, బ్యాంకువాళ్లూ, గ్యాస్ డీలర్లూ గుండెలు గోకేసుకుంటూ, "ప్రతీ బ్యాంకులో సీడింగుకోసం ప్రత్యేక కౌంటర్లు యేర్పాటు చెయ్యాలి, యూఐడీ నెంబర్లు పొందడానికి వలసిన సమాచారం అప్ లోడ్ చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక లాగింగ్ వ్యవస్థ యేర్పాటు చెయ్యాలి" అంటూ చొక్కాలు చింపేసుకుంటున్నారు. మరెన్ని కోట్లు తగలేస్తారో!
ద్రవ్యోల్బణం దారి దానిదే, మన ప్రభుత్వాల దారి వాటిదే, మనదారి మనదే!
పండగలూ, పవిత్రమాసాలపేరుతో, విగ్రహాలకి శాకాంబరాలూ, ఖాద్య అభిషేకాలూ, కరెన్సీ అలంకరణలూ పేరుతో మరింతగా ద్రవ్యోల్బణం పెరగడం ఖాయం. ఈ మధ్య కొత్తగా 3 క్వింటాళ్ల 'పంచదార' అభిషేకాలు కూడా మొదలు పెట్టారు!
కేంద్ర వ్యవసాయ మంత్రేమో, ఇంకో మూడువారాల్లో ఉల్లిపాయల ధరలు తగ్గుతాయి అంటున్నాడు--కనీస యెగుమతి ధర టన్నుకి రూ.900/- కి పెంచేశాడుకాబట్టి ట. (అసలు యెగుమతి యెందుకు చేయ్యాలి అంటే, అదంతే అంటాడు. మిగిలిన వె.ధ.వ లు ప్రభుత్వం వుల్లిపాయలు అమ్ముకుంటోందా? అంటున్నారు!). తన లాబీలకోసం, మిల్లులనిండా చెక్కెర నిలవ వున్నా, దిగుమతి చేసుకోడం మానడు. యూపీయే వారు ఆయనని పీకలేరు మరి!
ఆర్బీఐ వాళ్లు కొన్ని సంవత్సరాలుగా "క్లీన్ నోట్ పోలసీ" పేరుతో, నోట్లకి చిల్లు పెట్టద్దు, పిన్నులు కొట్టద్దు, పేర్లూ అంకెలూ వ్రాయద్దు" అంటూ బ్యాంకులని వూదరకొడుతూనే వున్నారు (బ్యాంకు వుద్యోగులు నష్టపోతూనే వున్నారు). మొన్న మాత్రం ఇలా అలంకరణలకి కరెన్సీ వుపయోగించకుండా చూడాలి అని ప్రభుత్వాలకి ఓ ఆదేశం జారీ చేసి చేతులు దులుపుకున్నారు.
ఘనతవహించిన తి తి దే వారు బంగారు రేకులు తాపడం చేయించిన, 29 టన్నులు బరువైన రథం చేయించేశారట. (ఆ 29 లెఖ్ఖేమిటో.....పోనీలెండి....108 టన్నులో, 1080 కేజీలో అంటూ పవిత్ర లెఖ్ఖలు వల్లించలేదు!). బంగారం దిగుమతులు తగ్గమంటే యెలా తగ్గుతాయి?
పాత సీబీఐ జేడీ గారు పర్యటనలు చేసుకొంటూ, పాఠాలు చెపుతాను, గురుకుల పాఠశాల స్థాపిస్తాను వగైరా ప్రకటనలు చేస్తున్నాడు. వుద్యోగంలో యేపనీ అప్పచెప్పలేదేమో ప్రభుత్వం వారు.
ఇదివరకే చెప్పాను--అంతలా ఓవర్ యాక్షను చేసి, రాత్రీ పగలూ లేకుండా గుడ్డలూడాదీసుకున్నంత పని చేసి, దర్యాప్తులు చేసినా, వృషణాయాసం తప్ప, ఒరిగేదేమీ వుండదు అని. ఇప్పుడు లక్షకోట్లనుంచీ, కొన్ని పదుల డొల్ల కంపెనీలనుంచీ, 43 వేల కోట్లో యెంతో కీ, రెండు మూడు కంపెనీలకీ సీబీఐ పరిమితమయిపోయి సూత్రధారి విడుదలై పోయాడు బెయిల్ మీద. రేపు గాలి కూడా కర్ణాటక లో ఓ పార్టీ పెట్టి, వైకాపా ద్వారా రాయబారం నడిపిస్తే, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారేమో!
ఇలాంటి ప్రభుత్వోద్యోగులకి నా ప్రగాఢ సానుభూతి.
4 comments:
Well said.
డియర్ శాస్త్రిగారూ!
చాలా సంతోషం.
ధన్యవాదాలు.
Welcome Back Sir...
డియర్ Panipuri123!
మీ స్వాగతానికి చాలా సంతోషం.
ధన్యవాదాలు.
Post a Comment